అసెంబ్లీలో మోదీ క్లిప్పింగ్ చూపిస్తూ మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కంటే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మెరుగైన అభివృద్ధి జరుగుతున్నట్టు నిరూపిస్తే తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పురపాలక, ఐటీశాఖల మంత్రి కె. తారక రామారావు సవాల్ చేశారు. ఔటర్ రింగ్‌రోడ్డు లీజులో అవినీతి జరిగిందంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. శాసనసభ వానాకాల సమావేశాల్లో భాగంగా శనివారం ‘రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పల్లె ప్రగతి– పట్టణ ప్రగతి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు– సాధించిన ఫలితాలు’అంశంపై లఘు చర్చ జరిగింది.
ఈ సందర్భంగా పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై కేటీఆర్ సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. తాను చెబుతున్నవి తప్పు అయితే వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించాలని, లేదంటే కాంగ్రెస్‌కు డిపాజిట్లు రాకుండా ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డిలపై ఘాటుగా విమర్శలు చేశారు. కేటీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
తెలంగాణలో ఉన్నదంతా సంక్షేమమే..
‘‘రాష్ట్ర బడ్జెట్ అంటే విపక్షాలకు జమాఖర్చుల లెక్క మాత్రమే. బీఆర్‌ఎస్‌కు ఇది రాష్ట్ర ప్రజల జీవనరేఖ. తెలంగాణ నమూనా అంటే సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి. ఇక్కడ సంక్షేమమే తప్ప సంక్షోభం లేదు. దేశంలో ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణలో ఉంది. వరి ఉత్పత్తిలో, తలసరి ఆదాయంలో దేశంలో టాప్. 24 గంటల ఉచిత విద్యుత్, ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి, రైతులకు జీవితబీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
ఐటీ ఉద్యోగాలు అత్యధికంగా కల్పించిన రాష్ట్రం తెలంగాణ. ఇది మా పనితనం. ప్రతిపక్ష నేతల్లా మేం ఊక దంపుడు ఉపన్యాసాలు చెప్పం. భట్టి విక్రమార్క, రఘునందన్‌రావులకు సవాల్ చేస్తున్నా. నేను చెప్పింది తప్పయితే.. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే మెరుగ్గా అభివృద్ధి ఉందని రుజువు చేస్తే.. రేపు పొద్దున్నే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా..
తెలంగాణ ఎవరో ఇస్తే వచ్చింది కాదు
తెలంగాణ ఇచ్చింది మేమేనని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. కంటెంట్ లేని కాంగ్రెస్‌కు, కమిట్‌మెంట్ ఉన్న కేసీఆర్‌కు పోలికనా? 1968లో 370 మంది ఉద్యమకారులను కాల్చి చంపిందెవరు? 1971లో 11 మంది ఎంపీలను గెలిపించినా వారి ఆశయాలను తుంగలో తొక్కి కాంగ్రెస్‌లో కలిసిపోయింది వాస్తవం కాదా? 2004లో మాటిచ్చి 2014 దాకా 1000 మందిని చంపింది కాంగ్రెస్ వారు కాదా? ఇవాళ మళ్లీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.
వెయ్యి మందిని పొట్టన పెట్టుకున్న బలిదేవత సోనియా అని రేవంత్‌రెడ్డి అన్నమాటలు మరిచిపోయారా? కర్ణాటకలో గెలిచారని తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయింది. నలుగురు నాయకులు కలసి కూర్చుని మాట్లాడలేని వాళ్లు.. 4 కోట్ల మందిని పాలిస్తారంటే నమ్మాలా? కాంగ్రెస్‌కు నాయకుల్లేక పక్క పార్టీల నుంచి నాయకులను తెచ్చుకున్నారు. మేం ప్రధాని మోదీకే భయపడలేదు. ఇక్కడ వీళ్లకు భయపడతామా?
ప్రజలతో బీఆర్‌ఎస్‌ది పేగు బంధం
తెలంగాణ కవి అలిశెట్టి ప్రభాకర్ తన కవితలో ‘‘జాగ్రత్త.. ప్రతి ఓటు మీ పచ్చి నెత్తుటి మాంసపు ముద్ద.. చూస్తూ చూస్తూ వేయకు గద్దకు. ఓటు కేవలం కాగితం మీద గుర్తు కాదు.. మీ జీవితం..’’అని చెప్పారు. ప్రజలు తప్పుడు నిర్ణయం తీసుకుంటే గందరగోళంలో పడతారు. తెలంగాణ ప్రజలతో బీఆర్‌ఎస్‌ది పేగుబంధం. తుచ్చ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ఐదు దశాబ్దాల పాలనను, నాటి అంధకారాన్ని గుర్తుకు తెచ్చుకోండి..’’అని కేటీఆర్ పేర్కొన్నారు.
నోటికి వచ్చినట్టు మాట్లాడితే అంతు చూస్తాం!
ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ప్రాజెక్టు (టీవోటీ)ను ఐఆర్‌బీ సంస్థకు కట్టబెట్టడాన్ని తప్పుపడుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘‘ఒకాయన (రేవంత్‌రెడ్డి) బయట ఉండి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఆ ప్రభావం భట్టి మీద పడినట్టు ఉంది. ఐఆర్‌బీ సంస్థ దివాలా తీసిందంటూ ఏదేదో మాట్లాడారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, కర్ణాటకలలోనూ పలు టోల్స్ నిర్వహణ కాంట్రాక్టులను ఆ సంస్థ పొందింది. మహారాష్ట్రలో కూడా ఇచ్చారు.
ఇక్కడ కూడా జాతీయ రహదారుల సంస్థ నిబంధనలకు అనుగుణంగా టెండర్ నిర్వహించి లీజుకు ఇవ్వడం జరిగింది. ఆయన (రేవంత్) ఎందుకు ఈ సంస్థ గురించి మాట్లాడారో, దానికి కారణమేంటో మాకు తెలుసు. ఆర్‌టీఐ (సమాచార హక్కు) అంటే కొందరికి ‘రూట్ టు ఇన్‌కం’గా మారిపోయింది. రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై ఐఆర్‌బీ సంస్థ వెయ్యికోట్ల పరువు నష్టం దావా వేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ కూడా కేసు పెట్టారు. రేవంత్ అంతు చూస్తాం’’అని కేటీఆర్ పేర్కొన్నారు.
కోనరావుపేటనా.. కోనసీమనా?
ఇటీవల దర్శకుడు వెల్దంటి వేణు బలగం సినిమాను సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట గ్రామంలో తీశారు. ఆ సినిమా చూసి మా కుటుంబసభ్యులే ఇది కోనరావుపేటనా? కోనసీమనా? అని ఆశ్చర్యపోయారు. తెలంగాణలోని ఏ పల్లెకు వెళ్లినా ఇప్పుడు ఇదే పరిస్థితి. రివర్స్ మైగ్రేషన్ చూస్తున్నాం ఇప్పుడు. హైదరాబాద్ అభివృద్ధిని, భూముల విలువను పొరుగు రాష్ట్ర నేతలు గుర్తించారు. వారికి అర్థమైన విషయాలు విపక్షాలకు అర్థం కావట్లేదు.
Comments
Please login to add a commentAdd a comment