సాక్షి, హైదరాబాద్: పురపోరు తారస్థాయికి చేరుకుంది. ఆధిక్యత కోసం అధికారపక్షం.. అస్తిత్వం కోసం విపక్షం ‘బస్తీ మే సవాల్’ అంటున్నాయి. మరో వారంలో రాజకీయ పార్టీల భవితవ్యం తేల్చనున్న మున్సి‘పోల్స్’ను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. శాసనసభ నుంచి స్థానికం వరకు ప్రతి ఎన్నికల్లోనూ అఖండ విజయం సాధించిన ‘కారు’.. పురపోరులోనూ అదే స్పీడు కొనసాగించేందుకు వ్యూహాలకు పదునుపెట్టింది. కాంగ్రెస్, బీజేపీలకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా.. పట్టణ సంస్థల్లో పైచేయి సాధించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.
కారు.. అదే జోరు
మున్సిపాలిటీ చేజారితే.. మంత్రి పదవి ఊడుతుందని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన హెచ్చరికను విశ్లేషిస్తే.. ఈ ఎన్నికలను గులాబీ నాయకత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో అర్థమవుతోంది. శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చావుదెబ్బ తీసినప్పటికీ, ఇటీవల వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయాల ప్రభావం ఇక్కడ కనిపించకుండా పకడ్బందీగా ప్రణాళికను అమలు చేస్తోంది. హస్తం పార్టీ కోలుకోకుండా.. స్థానిక నాయకత్వానికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమైన గులాబీ దళపతి కేసీఆర్.. వివిధ మార్గాల నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న సమాచారాన్ని పంచుకున్నారు. ప్రత్యర్థుల బలాలు, బలహీనతలను విశ్లేషించుకుంటూ ప్రచారపర్వాన్ని సాగించాలని మార్గనిర్దేశం చేశారు.
ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక మంత్రి కేటీఆర్ రోజూ పురపోరులో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పార్టీలో పోటీ తీవ్రంగా ఉండడంతో భారీ సంఖ్యలో తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినా..ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అసంతృప్తులను తెలంగాణ భవన్‌కు పిలిపించి సముదాయించే ప్రయత్నం చేశారు. ఇందులో చాలామంది దారిలోకి వచ్చినా.. అక్కడక్కడా బరిలో నిలిచిన కొంతమందిని కూడా తటస్తులను చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ప్రచారపర్వంలోనూ కొత్త పుంతలు తొక్కేలా ఈసారి సోషల్ మీడియాను విరివిగా వినియోగించుకునేలా పార్టీ శ్రేణులకు శిక్షణ ఇచ్చారు. టెలికాన్ఫరెన్స్‌లు, సమీక్ష సమావేశాలతో నిత్యం మున్సిపోల్స్‌ను సమీక్షిస్తున్న ఆయన.. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మంగా తీసుకోవడానికి మరో కారణం ఉంది. పురపాలకశాఖకు తానే ప్రాతినిధ్యం వహిస్తున్నందున.. ఇందులో విజయబావుటా ఎగురవేయడం ద్వారా పార్టీని తిరుగులేని దిశకు చేర్చాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పురపోరులో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది.
కాంగ్రెస్‌కు జీవన్మరణం
వరుస పరాజయాల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో ఓటమిపాలైతే.. ఓటమి సంపూర్ణమవుతుంది. శాసనసభ మొదలు పంచాయతీ ఎన్నికల వరకు వరుస ఓటములతో చావుదెబ్బతిన్న ఆ పార్టీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య. ఎమ్మెల్యేలు కాస్తా చేజారి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో విజయం అనివార్యం. పురపాలికల్లో సగం సీట్లను సాధించడం.. ఆ పార్టీకి కనీస రాజకీయ అవసరం. పట్టణ ఓటర్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే అంచనా ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపోల్స్‌లో కోలుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, జీవన్‌రెడ్డి ఈ ఎన్నికల్లో సత్తా చాటేలా వ్యూహాలను ఖరారు చేస్తున్నారు.
గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చేతిలో భంగపడ్డ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్‌కు పట్టు నిలుపుకోవడం వ్యక్తిగతంగా, రాజకీయంగా అగ్నిపరీక్ష. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మూడు నెలల క్రితమే ఓ కమిటీని కూడా వేసిన కాంగ్రెస్ అధిష్టానం.. పలు దఫాలుగా సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసింది. ఇప్పటికే కామన్ మేనిఫెస్టోను కూడా ప్రకటించిన ఆ పార్టీ.. ఆస్తిపన్ను రద్దు, 100 గజాల ఇళ్ల స్థలం, యువతకు జిమ్‌లు, గ్రంథాలయాలతో పట్టణ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మున్సిపాలిటీల్లో విస్తృతంగా పర్యటిస్తూ పదేపదే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. ఇవేగాకుండా ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియాను విరివిగా వినియోగించుకుంటూ విద్యావంతులైన పట్టణ ఓటర్లకు పార్టీ వాణిని వినిపిస్తోంది.
కమల వికాసమా..విలాపమా!
శాసనసభ ఎన్నికల్లో చావుదెబ్బతిన్నా.. పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించడం ద్వారా టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యర్థి అని చెప్పుకుంటున్న భారతీయ జనతాపార్టీకి మున్సిపోల్స్ సవాల్‌గా మారాయి. గులాబీ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ.. అడుగంటిపోయిన టీడీపీలో మిగిలిన నేతలను చేర్చుకోవడం ద్వారా బలీయంగా మారామని ప్రచారం చేసిన ఆ పార్టీ పురపాలికల్లో అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టలేక చతికిలపడింది. బీ ఫారాల మొదలు.. ఉపసంహరణల వరకు అసంతృప్తులు, రాజీనామాలతో నెట్టుకొస్తున్న ఆ పార్టీ నాయకత్వానికి కాస్తోకూస్తో పట్టున్న పట్టణాల్లోనూ అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. పౌరసత్వం చట్టం గట్టెక్కిస్తుందని, వలస నేతలతో పార్టీకి ఊపిరివస్తుందని అంచనా వేస్తున్న ఆ పార్టీ ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలపై గంపెడాశలు పెట్టుకుంది.
అక్కడక్కడా ఫలితాలు వచ్చినా.. పురపాలికలు దక్కించుకునే స్థాయిలో స్థానాలు రావడం అనుమానంగానే కనిపిస్తోంది. అయితే, అధినాయకత్వం ప్రచారపర్వంలో ఏ మాత్రం వెనుకడుగు వేయడంలేదు. ప్రతి మున్సిపాలిటీకి ఓ బాధ్యుడిని నియమించి ప్రచారసరళిని నిశితంగా విశ్లేషిస్తోంది. అన్ని పార్టీలకంటే ముందే కొన్ని నగర, పురపాలక సంస్థల మేయర్/చైర్మన్ అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. ఇక, ఎంఐఎం కూడా మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి పూర్వ జిల్లాల పరిధిలోని పలు మున్సిపాలిటీల్లో స్వతంత్రంగా బరిలోకి దిగి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది.
బస్తీ మే సవాల్
Published Sun, Jan 19 2020 2:34 AM | Last Updated on Sun, Jan 19 2020 2:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment