ఐటీ అ‘ద్వితీయం’ | Telangana IT Hub In Towns | Sakshi
Sakshi News home page

Telangana IT News: ఐటీ అ‘ద్వితీయం’

Published Sun, Jan 2 2022 2:49 AM | Last Updated on Sun, Jan 2 2022 7:48 AM

Telangana IT Hub In Towns - Sakshi

రాష్ట్రంలో ఐటీ ఉద్యోగమంటేనే కేరాఫ్‌ హైదరాబాద్‌.. బడా కంపెనీల్లో ఉద్యోగమంటే ఎవరైనా రాజధాని బాట పట్టాల్సిందే. కానీ ఇప్పుడా లెక్క మారుతోంది. ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో ఐటీ హబ్‌ల ఏర్పాటుతో చదువుకున్న చోటికి, కుటుంబానికి దగ్గరగా ఉంటూనే ఐటీ ఉద్యోగం చేసే అవకాశం వస్తోంది. స్థానిక యువతలో నైపుణ్యాలకు గుర్తింపు, వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐటీ హబ్‌లు జిల్లాల్లోని యువత కలలను నెరవేరుస్తున్నాయి. 

సాక్షి, హైదరాబాద్‌: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాలకు విస్తరించే వ్యూహాన్ని ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది. హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించడం ద్వారా.. వచ్చే రెండేళ్లలో 25 వేల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం పట్టణాల్లో ఐటీహబ్‌ల కార్యకలాపాలు మొదలయ్యాయి.

నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఐటీ టవర్ల నిర్మాణం ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది మార్చిలోగా ఈ రెండింటిని ప్రారంభించేందుకు ఐటీశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇక సిద్దిపేటలో ఐటీహబ్‌ నిర్మాణ దశలో ఉండగా.. తాజాగా నల్లగొండ ఐటీ టవర్‌కు మంత్రి కె.తారక రామారావు శంకుస్థాపన చేశారు. త్వరలోనే తృతీయశ్రేణి పట్టణాలైన రామగుండం, వనపర్తిలలో ఐటీ హబ్‌ల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 


ఖమ్మంలోని ఐటీ హబ్‌ 

జిల్లాల్లోని ఐటీ హబ్‌లకు బడా కంపెనీలు 
ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. దీనితో పెద్ద కంపెనీలకు అవసరమైన ప్లగ్‌ అండ్‌ ప్లే సౌకర్యాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 2016లో తొలిదశ కింద ఏర్పాటైన వరంగల్‌ ఐటీ హబ్‌లో టెక్‌ మహీంద్రా, సైయంట్‌ వంటి మల్టీనేషనల్‌ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఐటీ కార్యకలపాలతోపాటు ఇంక్యుబేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేశాయి.

కరీంనగర్‌ ఐటీ హబ్‌లో ఐటీ కంపెనీలతో పాటు ‘టాస్క్‌’ రీజనల్‌ కార్యాలయం కూడా ఏర్పాటైంది. వీటితోపాటు ఖమ్మం ఐటీ హబ్‌లో కలిపి సుమారు 3వేల మంది ఉపాధి పొందుతుండగా.. సీటింగ్‌ కెపాసిటీకి మించి కంపెనీల నుంచి డిమాండ్‌ ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే రెండోదశ టవర్ల నిర్మాణం కోసం ఐటీశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మహబూబ్‌నగర్, సిద్దిపేట, నిజామాబాద్‌ ఐటీ టవర్లతోపాటు నల్లగొండ ఐటీ టవర్‌ ప్రారంభమైతే మరో 4,200 సీటింగ్‌ కెపాసిటీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 


వరంగల్‌లోని ఐటీ హబ్‌లో టెక్‌ మహీంద్రా కార్యాలయం

నైపుణ్య శిక్షణ, ఆవిష్కరణల కేంద్రాలుగా.. 
ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో ఏర్పాటవుతున్న ఐటీ హబ్‌లను కేవలం ఉద్యోగ కల్పన కేంద్రాలుగానే కాకుండా.. నైపుణ్య శిక్షణ, ఆవిష్కరణల కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ఐటీశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా స్థానిక యువతకు ‘టాస్క్‌’ ద్వారా నైపుణ్య శిక్షణ ఇస్తోంది. ఇప్పటికే గ్రామస్థాయిలో ఆవిష్కరణలను గుర్తించి ప్రోత్సహించేందుకు టీఎస్‌ఐఐసీ ద్వారా ఐటీశాఖ పలు కార్యక్రమాలు చేపట్టింది. మరోవైపు టీహబ్, వీహబ్‌ ద్వారా స్టార్టప్‌ల వాతావరణాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ఐటీ హబ్‌లను కేంద్రంగా చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.


నిజామాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్‌ భవనం 

రాష్ట్రవ్యాప్తంగా ఐటీ ఉద్యోగావకాశాలు 
రాష్ట్రంలో ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లలో ఐటీ హబ్‌ లు ప్రారంభించాం. నిజామాబాద్, మహబూబ్‌నగర్‌ ఐటీ హబ్‌లు త్వరలోకి అందుబాటులోకి వస్తాయి. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతకు కూడా ఐటీ రంగంలో అవకాశాలు అందుబాటులోకి రావాల్సిన అవసరాన్ని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర అవతరణ సమయంలోనే నొక్కిచెప్పారు. ఆ దిశలోనే ఈ చర్యలు చేపడుతున్నాం. తెలంగాణ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లోనే కాదు పరిశ్రమలు, ఐటీ రంగాల్లోనూ అద్భుతంగా పురోగమిస్తోంది.    
– కె.తారక రామారావు, ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి 

ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో ఐటీ అభివృద్ధి 
భవిష్యత్తులో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో గత ఏడాది 12శాతంగా నమోదైన ఐటీ రంగం వృద్ధి.. ఈసారి 16 శాతానికి చేరుకునే అవకాశముంది. కోవిడ్‌ పరిస్థితుల మూలంగా హైబ్రిడ్‌ పనివిధానంలో చాలా మంది ఉద్యోగులు తమ స్వస్థలాల నుంచి పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల నుంచే పనిచేసేందుకు ఉద్యోగులు మొగ్గు చూపే అవకాశం ఉన్నందున.. ఆయా చోట్ల ఐటీ హబ్‌లకు ఉజ్వల భవిష్యత్తు ఖాయం. 


– భరణి అరోల్, అధ్యక్షుడు, హైసియా

ప్రభుత్వ చర్యలతో ఊతం 
రాష్ట్రంలోని సానుకూల వాతావరణం, ఐటీ విస్తరణకు ప్రభు త్వం చేపడుతున్న చర్యలు మా వంటి సంస్థలకు ఊతంగా నిలుస్తున్నాయి. కరీంనగర్‌ కేం ద్రంగా మేం ప్రారంభించిన సంస్థలో 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఐటీ హబ్‌లతోపాటు లాజిస్టిక్స్‌కు పెద్దపీట వేస్తుండటంతో ఎక్కడి నుంచైనా కార్యకలాపాలు నిర్వహించే వెసులుబాటు లభించింది. ఐటీని ద్వితీయశ్రేణి పట్టణాలకు విస్తరిం చడం ద్వారా స్థానికంగా నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అందుబాటులోకి రావడంతోపాటు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలు లభిస్తున్నాయి.    


– మనోజ్‌ శశిధర్, సహస్ర సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్, కరీంనగర్‌ 

సొంత జిల్లాలో ఐటీ ఉద్యోగం.. 
ఖమ్మంలో ఐటీ హబ్‌ ఏర్పాటుతో సొంత జిల్లాలోనే ఉద్యోగం పొందే అవకాశం దక్కింది. నేను చదువుకున్న కాలేజీలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా ఐటీ హబ్‌లో ఉద్యోగం సాధించాను. టెక్నోజన్‌ కంపెనీలో జావా ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌గా పనిచేస్తున్నా. ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చింది. కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉంటూ.. నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాను. 


– మారేపల్లి కౌశిక్‌ శర్మ, ఐటీ ఉద్యోగి, టెక్నోజన్, గార్ల, ఖమ్మం జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement