IT Towers
-
ఐటీ కాంతుల్లేని దివిటీ.. పల్లి!
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మహబూబ్‌నగర్ శివారు దివిటిపల్లిలో ఏడాదిన్నర క్రితం నిర్మించిన ఐటీ టవర్ ప్రస్తుతం నామమాత్రంగా కొనసాగుతోంది. దీనికి రూ.కోట్లు వెచ్చించి.. స్థానికులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా ఆశించిన ఫలితాలు దక్కడం లేదు.. దీనికి ప్రధాన కార ణం ఐటీ కంపెనీలు ఇక్కడికి రాకపోవడమేనని తెలుస్తోంది.. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ‘సాక్షి’బృందం గురువారం ఐటీ టవర్‌కు వెళ్లగా వివిధ అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్‌హెచ్–44కు అతి సమీపంలో ఉన్నా.. జాతీయ రహదారి (ఎన్‌హెచ్–44)కి అతి సమీపంలోని దివిటిపల్లిలో ఐజీ గ్రీన్ కారిడార్ కోసం 2019లోనే 377 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఇందులో సుమారు రూ.50 కోట్లతో నాలుగు ఎకరాలలో (జీ ప్లస్4) ఐటీ టవర్‌కు తెలంగాణ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఆధ్వర్యంలో అంకురార్పణ జరిగింది. ఇందులో మొత్తం లక్ష చదరపుటడుగుల విస్తీర్ణంలో.. నాలుగు అంతస్తుల భవనాన్ని అన్ని హంగులతో అత్యాధునిక పద్ధతిలో నిర్మించారు. ఒక్కొక్క అంతస్తులో 25 వేల చదరపు అడుగుల స్థలాన్ని ఎనిమిది ఐటీ కంపెనీల చొప్పున ఉండేలా వదిలారు. దీనికి 2023 మే 6న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. అప్పటి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. ఇక్కడ మొత్తం 32 ఐటీ కంపెనీల కోసం అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. ఎన్‌హెచ్–44 చేరడానికి ప్రత్యేక రోడ్డుతో పాటు 24 గంటల ఇంటర్నెట్, విద్యుత్ సరఫరా, తాగునీటి సౌకర్యం ఉంది.ఈ భవనం చుట్టూ లాన్లో పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం.. ఆపై వాహనాల పార్కింగ్ కోసం విశాల స్థలం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా క్యాంటీన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రారంభంలో తొమ్మిది ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సుమారు 300 మంది ఉద్యోగులు పనిచేసేవారు. అందరినీ శిక్షణ పేరిట నెలకు రూ.15 వేలనుంచి రూ.20 వేల వరకు ఆయా సంస్థల నిర్వాహకులు నియమించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కంపెనీలు వెనక్కి.. గత ఏడాది డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ఏడు కంపెనీలు ఎలాంటి కారణాలు చెప్పకుండానే ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలిపోయాయి. వీటిలో జువెన్ టెక్నాలజీ, హెచ్ఆర్ఎస్, ఇ–గ్రోవ్ సిస్టమ్స్, ఇంటిట్యూస్, ఫోర్ ఓక్స్, ఐటీవర్షన్–360, అర్పాన్ టెక్ ఉన్నాయి. ఇప్పుడు కేవలం రెండు ఐటీ సంస్థలు మాత్రమే ఉండగా 44 మంది ఉద్యోగులే మి గిలారు. వీటిలో గ్లోబల్ లాజిక్ (రెండో అంతస్తు) సంస్థను అప్పట్లో 75 మంది ఉద్యోగులతో ప్రారంభించారు. ఇక్కడ ప్రస్తుతం 18 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో సంస్థ ముల్లర్ డాట్ కనెక్ట్ పేరిట మూడో అంతస్తులో 26 మంది ఉద్యోగులతో కొనసాగుతోంది. వీరందరూ జిల్లాకేంద్రంతో పాటు జడ్చర్ల పట్టణంలో నివసిస్తూ.. ఆయా కంపెనీలు ఏర్పాటు చేసిన క్యాబ్‌లలో ఐటీ టవర్‌కు వచ్చి పనిచేసి వెళ్తున్నారు. తమ కంపెనీ ఉద్యోగులు, ఉత్పత్తులపై ‘సాక్షి’ బృందానికి వివరించేందుకు నిర్వాహకులు నిరాకరించడం గమనార్హం. లోపలికి ఎవరికీ ప్రవేశం లేదని వారు చెప్పుకొచ్చారు. కనీసం ఉద్యోగుల ఫోన్ నంబర్లు అయినా ఇవ్వలేదు. -
అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్
మలక్‌పేట: బీఆర్ఎస్ స్టీరింగ్ సీఎం కేసీఆర్ చేతిలోనే ఉందని, ఎంఐఎం స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలోనే ఉందని.. కానీ బీజేపీ స్టీరింగ్ మాత్రం వ్యాపారవేత్త అదానీ చేతిలో ఉందని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు విమర్శించారు. ప్రధాని మోదీ చేతుల్లో ఏమీ లేదని, అదానీ చెప్పినట్టే నడుచుకుంటున్నారని ఆరోపించారు. మలక్‌పేట ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఐటెక్ న్యూక్లియస్ ఐటీ టవర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలాతో కలసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. మలక్‌పేటలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఐటీ టవర్‌ను నిర్మించనున్నామని, దీనితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇందులో తొలి విడతగా 10.35 ఎకరాల్లో రూ.1,032 కోట్లతో 21 అంతస్తులతో 15లక్షల చదరపు అడుగుల ఐటీ టవర్ నిర్మిస్తున్నామన్నారు. ఒకప్పుడు మలక్‌పేట అంటే టీవీ టవర్ గుర్తుకువచ్చేదని.. ఇప్పుడు ఐటీ టవర్ ఐకాన్ మారుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకెళ్తోందని, వరుసగా రెండేళ్లపాటు బెంగళూరు కంటే అధికంగా ఐటీ ఉద్యోగాలను కల్పిస్తోందని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం, హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నాయన్నారు. గణేశ్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ముస్లింలు మిలాద్ ఉన్ నబీ ఊరేగింపును వాయిదా వేసుకున్నారని.. హైదరాబాద్‌కే ప్రత్యేకమైన గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి అద్దం పట్టారని పేర్కొన్నారు. కాగా.. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన సారథ్యంలో తెలంగాణ, హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందాయని ఎంపీ అసదుద్దీన్ చెప్పారు. -
KTR Opens IT Tower In Nizamabad: నిజామాబాద్‌లో ఐటీ టవర్స్, న్యాక్ భవనం ప్రారంభించిన కేటీఆర్ (ఫొటోలు)
-
దిక్సూచిగా సిద్దిపేట
సిద్దిపేటఅర్బన్: రాష్ట్రంలో ఇంటింటికి తాగునీరు అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి సిద్దిపేటలోనే పునాది పడిందని, ఐటీ టవర్ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుందని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఐటీ టవర్ ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. సిద్దిపేటలో అభివృద్ధి ఒరవడి 1980 దశకంలో కేసీఆర్ నాయకత్వంలో మొదలైందన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీరు అందించేందుకు లోయర్ మానేర్ డ్యాం నుంచి ఇర్కోడ్ గుట్టపై ట్యాంకు కట్టి నీళ్లు తెచ్చారని, దీని స్ఫూర్తిగా భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారని, దళిత చైతన్య జ్యోతి నుంచి దళిత బంధు పుట్టిందని కొనియాడారు. రూ.80 కోట్లతో వాటర్ రింగ్ మెయిన్ ఏర్పాటు చేసుకున్నామని, అంతర్గత సీసీ రోడ్డ నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేశామన్నారు. మందపల్లిలో 400 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు, ఆటోనగర్ ఏర్పాటుతో యువతకు ఉపాధి కలుగుతుందన్నారు. వర్గల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఐటీ టవర్‌తో జిల్లా ఖ్యాతి పెరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల యువతకు ఉపాధి కల్పించేందుకు ఐటీ టవర్లను విస్తరిస్తామని పేర్కొన్నారు. టాస్క్ సెంటర్‌తో నిరుద్యోగ యువతకు శిక్షణ అందిస్తారని తెలిపారు. కేసీఆర్ బాటలో.. సిద్దిపేటలో ఐటీ టవర్ ప్రారంభం కలగా ఉందని, సిద్దిపేటలో అభివృద్ధికి కేసీఆర్ ఎప్పుడో పునాది వేశారని, దానిని నేను కొనసాగిస్తున్నానని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ ప్రణాళికలు, కలలను నిజం చేసే అదృష్టం దక్కిందని అన్నారు. ఐటీ టవర్‌ను ప్రారంభించిన అనంతరం 17 కంపెనీలు రిక్రూట్ చేసుకున్న ఉద్యోగులతో మంత్రులు ముచ్చటించారు. ఐటీ టవర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ తన పాటలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సతీశ్‌కుమార్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఫారూఖ్ హుస్సేన్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎండీ నర్సింహారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. -
మోడల్ అంటే తెలంగాణ
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ మోడల్ అంటే.. సమగ్ర, సమ్మిళిత, సమీకృత, సమతుల్య అభివృద్ధి అని పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. వ్యవసాయం, ఐటీ పరిశ్రమలు, హరితహారంలో రాష్ట్రం దూసుకుపోతోందన్నారు. హరితహారంతో పచ్చదనాన్ని 7.7 శాతానికి పెంచామని, రూ.2.41 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులతో అగ్రభాగాన ఉన్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐటీ ఉద్యోగులు 3.23 లక్షలుండగా, ఇప్పుడు 9.05 లక్షల మంది ఉన్నారన్నారు. 142 కోట్ల భారత్‌లో కేంద్రం 0.5 శాతం (59 లక్షలు)ఉద్యోగాలు మాత్రమే కల్పిస్తోందని, రాష్ట్రంలో 6.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. కేటీఆర్ గురువారం సిద్దిపేటలో ఐటీ టవర్, స్లాటర్‌హౌస్, వాటర్ రింగ్‌మెన్ ప్రారంభోత్సవం, కప్పలకుంట చెరువు సుందరీకరణ పనులకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో తెలంగాణకు అవార్డులు వస్తున్నాయని, 3 శాతం గ్రామీణ జనాభా ఉన్న రాష్ట్రం దేశంలో 30 శాతం అవార్డులను దక్కించుకుందని చెప్పారు. చాలామంది సిద్దిపేట మీద ప్రత్యేక ప్రేమ ఎందుకని అడుగుతున్నారని, సిద్దిపేట తెలంగాణకు నాయకుడితోపాటు తెలంగాణకు జన్మనిచ్చిందని చెప్పారు. ఇక్కడ కేసీఆర్ పుట్టకపోతే, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలు అవకాశం ఇవ్వకపోతే టీఆర్ఎస్ పుట్టేదా, తెలంగాణ వచ్చేదా? అని అన్నారు. చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే.. అని కేసీఆర్ గుండె లోతు నుంచి వచ్చిన మాట అని గుర్తు చేశారు. మిషన్ భగీరథ, హరితహారం, దళితబంధుకు పునాది పడిన గడ్డ సిద్దిపేట అని, మిషన్ భగీరథను కేంద్రం కాపీ కొట్టి హర్ ఘర్ జల్‌గా అమలు చేస్తోందన్నారు. స్వచ్ఛ బడి స్ఫూర్తితో పాత జిల్లా కేంద్రాల్లో మున్సిపల్ ఆధ్వర్యంలో స్వచ్ఛ బడి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. బావ కాబట్టి అప్పుడప్పుడు ఏడిపిస్తా.. ‘సిరిసిల్లకు వెళ్లినప్పుడల్లా సిద్దిపేటకు రాగానే ఫోన్ చేసి బావా మళ్లీ ఏదో కొత్తది కట్టినవ్ అంటాను. ఇంత పెద్ద రోడ్లు వేశావ్ అంటా. అరెయ్ మళ్లీ వెళ్లినప్పుడు కళ్లు మూసుకొని పో.. ప్రతీసారి వెళ్లినప్పుడు ఇలా ఫోన్ చేస్తున్నావు అంటడు. సిరిసిల్లకు పోయేటప్పుడు వచ్చేటప్పుడు బావ కాబట్టి అప్పుడప్పుడు ఏడిపిస్తా. ప్రతీ నియోజకవర్గం సిద్దిపేటలాగా మారినప్పుడే బంగారు తెలంగాణ, బంగారు భారతదేశం అవుతుంది’అని కేటీఆర్ అన్నారు. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ, రాష్ట్రానికి సిద్దిపేట దిక్సూచి అని కొనియాడారు. ఆనాడు కేసీఆర్ అభివృద్ధిని ప్రారంభిస్తే దాన్ని నాలుగింతలు పైకి తీసుకెళ్లిన నాయకుడు హరీశ్‌రావు అని చెప్పక తప్పదన్నారు. ఈసారి 1.50 లక్షల మెజార్టీతో హరీశ్‌ను గెలిపించి, కేసీఆర్‌కు హ్యాట్రిక్ గెలుపు, ఆశీర్వాదం ఇవ్వాలని ప్రజలను కోరారు. తిట్టినవారే శభాష్ అంటున్నారు: మంత్రి హరీశ్‌రావు తెలంగాణ వస్తే మత కలహాలు, కరెంట్, సాగు, తాగు నీరు ఉండవని తిట్టినవారే ఇప్పుడు శభాష్ అంటున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అస్సాంలో విద్యుత్ కొరత ఉందని స్వయంగా మంత్రినే విద్యుత్ వినియోగం తక్కువ చేయాలని చెప్పారని, ప్రధాని సొంత రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించారని గుర్తుచేశారు. ప్రపంచంలో ఉండే ఐటీ కంపెనీలన్నింటినీ హైదరాబాద్‌కు తెచ్చి కేటీఆర్ యువతకు ఉపాధిని కల్పిస్తున్నారని కొనియాడారు. కేటీఆర్ ఐటీలో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్ స్థాయికి తీసుకువెళ్లారన్నారు. కేటీఆర్ లాంటి ఐటీ మంత్రి కావాలని ఇతర రాష్ట్రాల్లో యువత ట్విట్టర్ వేదికగా కోరుతున్నారని చెప్పారు. సిద్దిపేటలో కేసీఆర్ బలమైన పునాది వేశారని దాని కొనసాగింపుగానే తాను చేస్తున్నా అన్నారు. మరోసారి సీఎం కేసీఆర్‌ని గెలిపించి హ్యాట్రిక్ అందించాలని ప్రజలను కోరారు. కాగా, సిద్దిపేట ఐటీ హబ్ పర్యావరణహితంగా ఉండటంతో ఐజీబీసీ వారు గోల్డ్ రేటింగ్ ప్లేట్‌ను మంత్రి కేటీఆర్, హరీశ్‌రావుకు అందించారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మెన్ బాలమల్లు, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
ఐటీ అ‘ద్వితీయం’
రాష్ట్రంలో ఐటీ ఉద్యోగమంటేనే కేరాఫ్ హైదరాబాద్.. బడా కంపెనీల్లో ఉద్యోగమంటే ఎవరైనా రాజధాని బాట పట్టాల్సిందే. కానీ ఇప్పుడా లెక్క మారుతోంది. ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో ఐటీ హబ్‌ల ఏర్పాటుతో చదువుకున్న చోటికి, కుటుంబానికి దగ్గరగా ఉంటూనే ఐటీ ఉద్యోగం చేసే అవకాశం వస్తోంది. స్థానిక యువతలో నైపుణ్యాలకు గుర్తింపు, వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐటీ హబ్‌లు జిల్లాల్లోని యువత కలలను నెరవేరుస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాలకు విస్తరించే వ్యూహాన్ని ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది. హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించడం ద్వారా.. వచ్చే రెండేళ్లలో 25 వేల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం పట్టణాల్లో ఐటీహబ్‌ల కార్యకలాపాలు మొదలయ్యాయి. నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఐటీ టవర్ల నిర్మాణం ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది మార్చిలోగా ఈ రెండింటిని ప్రారంభించేందుకు ఐటీశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇక సిద్దిపేటలో ఐటీహబ్ నిర్మాణ దశలో ఉండగా.. తాజాగా నల్లగొండ ఐటీ టవర్‌కు మంత్రి కె.తారక రామారావు శంకుస్థాపన చేశారు. త్వరలోనే తృతీయశ్రేణి పట్టణాలైన రామగుండం, వనపర్తిలలో ఐటీ హబ్‌ల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఖమ్మంలోని ఐటీ హబ్ జిల్లాల్లోని ఐటీ హబ్‌లకు బడా కంపెనీలు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. దీనితో పెద్ద కంపెనీలకు అవసరమైన ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 2016లో తొలిదశ కింద ఏర్పాటైన వరంగల్ ఐటీ హబ్‌లో టెక్ మహీంద్రా, సైయంట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఐటీ కార్యకలపాలతోపాటు ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. కరీంనగర్ ఐటీ హబ్‌లో ఐటీ కంపెనీలతో పాటు ‘టాస్క్’ రీజనల్ కార్యాలయం కూడా ఏర్పాటైంది. వీటితోపాటు ఖమ్మం ఐటీ హబ్‌లో కలిపి సుమారు 3వేల మంది ఉపాధి పొందుతుండగా.. సీటింగ్ కెపాసిటీకి మించి కంపెనీల నుంచి డిమాండ్ ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే రెండోదశ టవర్ల నిర్మాణం కోసం ఐటీశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మహబూబ్‌నగర్, సిద్దిపేట, నిజామాబాద్ ఐటీ టవర్లతోపాటు నల్లగొండ ఐటీ టవర్ ప్రారంభమైతే మరో 4,200 సీటింగ్ కెపాసిటీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వరంగల్‌లోని ఐటీ హబ్‌లో టెక్ మహీంద్రా కార్యాలయం నైపుణ్య శిక్షణ, ఆవిష్కరణల కేంద్రాలుగా.. ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో ఏర్పాటవుతున్న ఐటీ హబ్‌లను కేవలం ఉద్యోగ కల్పన కేంద్రాలుగానే కాకుండా.. నైపుణ్య శిక్షణ, ఆవిష్కరణల కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ఐటీశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా స్థానిక యువతకు ‘టాస్క్’ ద్వారా నైపుణ్య శిక్షణ ఇస్తోంది. ఇప్పటికే గ్రామస్థాయిలో ఆవిష్కరణలను గుర్తించి ప్రోత్సహించేందుకు టీఎస్ఐఐసీ ద్వారా ఐటీశాఖ పలు కార్యక్రమాలు చేపట్టింది. మరోవైపు టీహబ్, వీహబ్ ద్వారా స్టార్టప్‌ల వాతావరణాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ఐటీ హబ్‌లను కేంద్రంగా చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. నిజామాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్ భవనం రాష్ట్రవ్యాప్తంగా ఐటీ ఉద్యోగావకాశాలు రాష్ట్రంలో ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లలో ఐటీ హబ్ లు ప్రారంభించాం. నిజామాబాద్, మహబూబ్‌నగర్ ఐటీ హబ్‌లు త్వరలోకి అందుబాటులోకి వస్తాయి. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతకు కూడా ఐటీ రంగంలో అవకాశాలు అందుబాటులోకి రావాల్సిన అవసరాన్ని సీఎం కేసీఆర్ రాష్ట్ర అవతరణ సమయంలోనే నొక్కిచెప్పారు. ఆ దిశలోనే ఈ చర్యలు చేపడుతున్నాం. తెలంగాణ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లోనే కాదు పరిశ్రమలు, ఐటీ రంగాల్లోనూ అద్భుతంగా పురోగమిస్తోంది. – కె.తారక రామారావు, ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో ఐటీ అభివృద్ధి భవిష్యత్తులో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో గత ఏడాది 12శాతంగా నమోదైన ఐటీ రంగం వృద్ధి.. ఈసారి 16 శాతానికి చేరుకునే అవకాశముంది. కోవిడ్ పరిస్థితుల మూలంగా హైబ్రిడ్ పనివిధానంలో చాలా మంది ఉద్యోగులు తమ స్వస్థలాల నుంచి పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల నుంచే పనిచేసేందుకు ఉద్యోగులు మొగ్గు చూపే అవకాశం ఉన్నందున.. ఆయా చోట్ల ఐటీ హబ్‌లకు ఉజ్వల భవిష్యత్తు ఖాయం. – భరణి అరోల్, అధ్యక్షుడు, హైసియా ప్రభుత్వ చర్యలతో ఊతం రాష్ట్రంలోని సానుకూల వాతావరణం, ఐటీ విస్తరణకు ప్రభు త్వం చేపడుతున్న చర్యలు మా వంటి సంస్థలకు ఊతంగా నిలుస్తున్నాయి. కరీంనగర్ కేం ద్రంగా మేం ప్రారంభించిన సంస్థలో 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఐటీ హబ్‌లతోపాటు లాజిస్టిక్స్‌కు పెద్దపీట వేస్తుండటంతో ఎక్కడి నుంచైనా కార్యకలాపాలు నిర్వహించే వెసులుబాటు లభించింది. ఐటీని ద్వితీయశ్రేణి పట్టణాలకు విస్తరిం చడం ద్వారా స్థానికంగా నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అందుబాటులోకి రావడంతోపాటు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలు లభిస్తున్నాయి. – మనోజ్ శశిధర్, సహస్ర సాఫ్ట్వేర్ సర్వీసెస్, కరీంనగర్ సొంత జిల్లాలో ఐటీ ఉద్యోగం.. ఖమ్మంలో ఐటీ హబ్ ఏర్పాటుతో సొంత జిల్లాలోనే ఉద్యోగం పొందే అవకాశం దక్కింది. నేను చదువుకున్న కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఐటీ హబ్‌లో ఉద్యోగం సాధించాను. టెక్నోజన్ కంపెనీలో జావా ఫుల్‌స్టాక్ డెవలపర్‌గా పనిచేస్తున్నా. ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చింది. కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉంటూ.. నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాను. – మారేపల్లి కౌశిక్ శర్మ, ఐటీ ఉద్యోగి, టెక్నోజన్, గార్ల, ఖమ్మం జిల్లా -
ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నిర్వచనం క్రమంగా మారుతోందని.. ఐటీ అంటే ఇంటెలిజెంట్ టెక్నాలజీ అని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అభివర్ణించారు. మంగళవారం కరీంనగర్లో అర్బన్ మిషన్ భగీరథ కింద రూ.110 కోట్లతో చేపట్టిన ‘ప్రతిరోజూ తాగునీటి సరఫరా’పథకాన్ని, ఎల్ఎండీ సమీపంలో నిర్మించిన ఐటీ టవర్‌ను మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఐటీ కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నైపుణ్యం ఒకరి సొత్తు కాదని ద్వితీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఎంతో నైపుణ్యం ఉన్న మేధావులు వస్తున్నారని తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాస్తా ఇంటెలిజెంట్ టెక్నాలజీగా మారడంతో నైపుణ్యం గల వారందరికీ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే వరంగల్‌లో ఐటీ సెంటర్‌ను ప్రారంభించామని, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద ఐటీ టవర్‌కు కరీంనగర్ కేంద్ర స్థానం అయిందని పేర్కొన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. ఒకప్పుడు రూ.56 వేల కోట్ల ఐటీ ఎగుమతులు ఉండేవని, ప్రసుత్తం రూ.1.28 లక్షల కోట్లకు పెంచినట్లు పేర్కొన్నారు. స్థానికులకే ఉద్యోగావకాశాలు ద్వితీయ శ్రేణి పట్టణాలు, నగరాల్లో విద్యను అభ్యసిస్తున్న వారు ఉద్యోగాల కోసం ఇతర పట్టణాలకు వలస పోకుండా, స్థానికంగా ఐటీ ఉద్యోగాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ తెలిపారు. కరీంనగర్ చుట్టు పక్కన ఉన్నత విద్యను అభ్యసించిన వారికి ఇక్కడి ఐటీ టవర్‌లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన నైపుణ్యాన్ని మార్చుకుంటూ వెళ్లాలని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తే వారికి ప్రభుత్వం తరఫున రాయితీలు కల్పిస్తామని తెలిపారు. కరీంనగర్లో మరో ఐటీ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని కేటీఆర్ తెలిపారు. కాగా, కరీంనగర్ ఐటీ సెంటర్లో ఏర్పాటు చేసిన టాస్క్ సెంటర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ప్రస్తుతం కరీంనగర్ ఐటీ కంపెనీలో 432 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించగా.. వారికి మంగళవారం నియామక పత్రా లు కేటీఆర్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, కలెక్టర్ శశాంక తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా కేటీఆర్ కేబుల్ బ్రిడ్జిని పరిశీలించారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించనున్నట్లు చెప్పారు. -
నేనూ కరీంనగర్‌లోనే చదువుకున్నా: కేటీఆర్
సాక్షి, కరీంనగర్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో టాలెంట్ కేవలం హైదరాబాద్, బెంగుళూర్, ఢిల్లీ లాంటి నగరాల విద్యార్థులకే సొంతం కాదని ఐటీ శాక మంత్రి కేటీఆర్ అన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో, నగరాల్లోని నైపుణ్యవంతులైన యువత ఇతర నగరాలకు వలస పోవాల్సి వస్తోందని, ఐటీ నిర్వచనం మార్చాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు.. ఇంటెలిజెన్స్ టెక్నాలజీగా మార్చాలని చెప్పారు. కరీంనగర్లో మంగళవారం ఆయన ఐటీ టవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను కరీంనగర్ లోనే చదువుకున్నా.. అప్పటికీ, ఇప్పటికీ ఈ నగరం ఎంతో అభివృద్ధి సాధించింది. ఐటీ టవర్ ప్రారంభం రోజునే 432 మంది యువతకు ఉద్యోగాలు రావడం సంతోషం. తెలంగాణ వచ్చిన కొత్తలో 56 వేల కోట్ల ఐటీ ఎగుమతులు ఉండేవి. ఐటీ రంగం పురోగతి ఆగకూడదన్న ఆలోచనతో రెట్టింపు స్పీడ్ కావాలన్న లక్ష్యం పెట్టుకున్నాం. అనుకున్నట్లుగానే ఇప్పుడు లక్షా 28 వేల కోట్లకు తెలంగాణ ఐటీ ఎగుమతులు చేరుకున్నాయి. ప్రభుత్వం కేవలం ఐటీ రంగానికి ప్రేరణగా ఉంటుంది... చేసేదంతా ప్రయివేటు రంగమే ’అని కేటీఆర్ పేర్కొన్నారు. అద్దెలు లేకండా చూస్తాం ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్నో విజయాలు సాధించవచ్చని కేటీఆర్ అన్నారు. తెలివైన యువతీ, యువకులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఎన్నో అద్భుత విజయాలు సాధిస్తున్నారని తెలిపారు. స్థానిక యువతలో టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మనిషి జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కరించే ఐటీ సొల్యూషన్స్ రావాల్సి ఉందని ఆకాక్షించారు. కోవిడ్ సంక్షోభం కారణంగా ఐటీ టవర్లోని స్టార్టప్‌లకు జనవరి వరకు ఎలాంటి అద్దె లేకుండా చూస్తామని చెప్పారు. మరో ఐటీ టవర్ కూడా నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కరీంనగర్ నుంచి వెళ్లి విదేశాల్లో ఐటీ సంస్థలు నడుపుతున్న ఎన్నారైలు కరీంనగర్ ఐటీ టవర్‌లో కూడా సంస్థలు స్థాపించాలని పిలుపునిచ్చారు. వరంగల్‌లో టెక్ మహీంద్రలాంటి సంస్థలు వచ్చాయని కేటీఆర్ గుర్తు చేశారు. కరీంనగర్లో ఐటీ రంగం మరింత వృద్ధి చెంది వేలాది మందికి ఉపాధి కల్పించే కేంద్రంగా మారాలని అన్నారు. Live: Minister @KTRTRS inaugurating the IT Tower in Karimnagar. https://t.co/JxHKECGQXo — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 21, 2020 -
కరీంనగర్ ఐటీ టవర్ రెడీ
సాక్షి, హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్లను నిర్మిస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) ఆధ్వ ర్యంలో వీటి నిర్మాణం కొనసాగుతోంది. ఇందులో భాగంగా కరీంనగర్ పట్టణ శివారులో నిర్మించిన ఐటీ టవర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు మంగళవారం ప్రారం భిస్తారు. ఇప్పటికే వరంగల్‌లో మడికొండ మొదటి దశ ఐటీ టవర్‌తో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణం పూర్తయింది. టెక్ మహీంద్ర వంటి దిగ్గజ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారం భించగా, రెండో దశ ఐటీ టవర్ నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. కరీంనగర్, నిజామా బాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రా ల్లోనూ రూ.25 కోట్ల చొప్పున వ్యయంతో ఐటీ టవర్ల నిర్మాణం కొనసాగుతోంది. మహబూబ్ నగర్లో నిర్మాణ పనులు ప్రాథమిక దశలో ఉండగా నిజామాబాద్, ఖమ్మంలో పనులు చివరి దశలో ఉన్నాయి. 70 వేల చదరపు అడుగుల్లో ఐటీ టవర్ రూ.25 కోట్ల వ్యయంతో 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఐదంతస్తుల్లో నిర్మించిన కరీంనగర్ ఐటీ టవర్ నిర్మాణ పనులు గతేడాది చివరిలోనే పూర్తయ్యాయి. గతేడాది డిసెంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో దీని ప్రారంభానికి ముహూర్తం నిర్ణయించినా మున్సిపల్ ఎన్నికల కోడ్ మూలంగా వాయిదా పడింది. కరీంనగర్ ఐటీ టవర్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభిం చేందుకు 26 కంపెనీలు ప్రభుత్వాన్ని సంప్రదించగా, 15 కంపెనీలకు ఆఫీస్ స్పేస్ కేటాయించారు. ఇందులో ప్రస్తుతం 12 కంపెనీలు కార్య కలాపాలు ప్రారంభిస్తుండగా 400 మంది యువ తకు ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. భవిష్య త్తులో కరీంనగర్ ఐటీ టవర్ ద్వారా దాదాపు 3,600 మందికి ఉపాధి దక్కనుంది. కాగా, ప్రస్తుతం 60 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో ఐటీ టవర్ ప్రారంభమవుతున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ ‘సాక్షి’కి తెలిపారు. ఇతర ఐటీ టవర్ల పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్ మంగళవారం జరిగే కార్యక్రమంలో పూర్తి వివరాలు వెల్లడిస్తారన్నారు. ఐటీ టవర్ ప్రత్యేకతలివే – ఐదంతస్తుల్లో నిర్మించిన ఐటీ టవర్‌లో 12 చదరపు అడుగులు సెల్లార్ కాగా, మరో 60 వేల అడుగులు ఆఫీసు స్పేస్‌కు కేటాయిస్తారు. – గ్రౌండ్ ఫ్లోర్లో శిక్షణ కేంద్రం, మొదటి అంతస్తులో కార్యాలయం, రెండు, ఐదో అంతస్తుల్లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తారు. – మూడు, నాలుగో అంతస్తులను హెచ్‌సీఎల్ వంటి దిగ్గజ కంపెనీలకు భవిష్యత్తులో కేటాయిస్తారు. -
కరీంనగర్ వాళ్లకే 80 శాతం ఉద్యోగాలు
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. ఐటీ టవర్‌ను ప్రారంభిస్తారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఉద్యోగావకాశాలు పెంచుతారనే నమ్మకం ఉన్న కంపెనీలకే ఈ ఐటీ టవర్‌లో అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ... అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే జిల్లాలో ఐటీ టవర్‌ను నిర్మించామన్నారు. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగితో పోలిస్తే కరీంనగర్ ఐటీ ఉద్యోగికి రూ.30 వేలు జీవన వ్యయం ఆదా అవుతుందన్నారు. కరీంనగర్ వాళ్లకే 80 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. మొత్తం 3000 నుంచి 3600 మందికి ఇక్కడ ఉపాధి లభిస్తుందని తెలిపారు. తొలి రోజునే దాదాపు 400 మంది ఉద్యోగులు కరీంనగర్ ఐటీ టవర్‌లో పని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కేసీఆర్ ఉండగా.. గల్ఫ్ ఎందుకు దండగ ఐటీ టవర్‌వల్ల మల్టీ నేషనల్ కంపెనీలు జిల్లాకు తరలివస్తాయని ఆశిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 26 కంపెనీలు మమ్మల్ని సంప్రదించాయని, 15 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. హై ఫ్రీక్వెన్సీ ఇంటర్నెట్, నిరంతర విద్యుత్, పవర్ బ్యాక్ అప్ జనరేటర్ సెంట్రలైజ్డ్ ఏసీ వంటి అధునాతన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కంపెనీలకు ఇన్సెంటివ్‌లు ఇస్తున్నామన్నారు. మరో టవర్ కోసం 3 ఎకరాలు సిద్ధంగా ఉంచామని తెలిపారు. ‘కేసీఆర్ ఉండగా.. గల్ఫ్ ఎందుకు దండగ’ అన్న నినాదంతో పని చేస్తున్నామని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. (ఎక్కడ కన్నీళ్లు ఉంటే అక్కడ నేనుంటా..!) -
కరీంనగర్లో ఐటీ టవర్ సిద్ధం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌కు మణిహారంగా మారుతున్న ఐటీటవర్ నిర్మాణ పనులు పూర్తయి, ఈనెల 30న ప్రారంభించనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఐటీ టవర్ తుదిదశ పనులను శుక్రవారం పరిశీలించారు. ఐదో అంతస్తు వరకు పూర్తిచేసిన పనులను చూసి, అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ లక్ష్యానికి అనుగుణంగా, కరీంనగర్లో ఐటీటవర్ ఏర్పాటు చేశారన్నారు. స్థానికయువత ఇతర ప్రాంతాలకు వలసవెళ్లకుండా ఇంటి నుంచే ఐటీ జాబ్‌లు చేసుకునే అవకాశం ఉందన్నారు. చిన్నచిన్న పనులు మిగిలి ఉన్నాయని, ఈనెల 28 వరకు పూర్తి చేస్తామన్నారు. ఈ టవర్ తన పూర్తి కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత రెండోఐటీ టవర్ ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్ హమీ ఇచ్చారని, ఇతర దేశాల నుంచి వచ్చే కంపెనీల డిమాండ్‌ను బట్టి మరో టవర్ నిర్మించడానికి చర్యలు చేపడుతామని తెలిపారు. రెండో అతిపెద్ద ఐటీ టవర్ మూడెకరాల స్థలంలో 7అంతస్తులతో తెలంగాణలోనే ఇది రెండో అతిపెద్ద టవర్ అని మంత్రి తెలిపారు. రెండు సెల్లార్లు, మొదటి అంతస్తులో రిసెప్షన్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, క్యాంటిన్, రెండోఅంతస్తు నుంచి ఏడోఅంతస్తు వరకు కార్యాలయం కోసం నిర్మించామన్నారు. ప్రతిషిప్ట్లో 12వందల చొప్పున 3600మంది ఉద్యోగం చేసేలా సౌకర్యాలు కల్పించామన్నారు. 60నుంచి 70కార్లు పార్కింగ్ చేయడానికి భవనంలోనే ఏర్పాట్లున్నాయని తెలిపారు. ఇప్పటికే 11కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని, మరో మూడు కంపెనీలతో రెండురోజుల్లోనే ఒప్పందం చేసుకుంటామన్నారు. సాధ్యమైనంత వరకు 80శాతం స్థానికులకే ఉద్యోగఅవకాశం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 30న ఘనంగా ప్రారంభం ఈనెల 30న ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, ఇతర నాయకులను ఆహ్వానిస్తున్నట్లు గంగుల కమలాకర్ తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, నాయకులు కట్ల సతీష్, ఎడ్ల అశోక్, డిండిగాల మహేశ్, చల్లా హరిశంకర్, కల్వకుంట్ల ప్రమోద్‌రావు, సంపత్‌రావు, అజిత్‌రావు పాల్గొన్నారు. -
దసరాకు ‘ఐటీ టవర్’
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ యువత కలలు సాకారం కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో నిర్మాణం చేసిన ఐటీ టవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 8న విజయదశమి(దసరా) రోజు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభించేందుకు టవర్‌ను సిద్ధం చేస్తున్నారు. ముహూర్తం నాటికి మూడు ఫ్లోర్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పనుల్లో వేగం పెంచారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లోయర్ మానేరు డ్యాం సమీపంలో రూ.30 కోట్ల నిధులతో జీ+5 అంతస్తులతో 65 వేల చదరపు అడుగుల వైశాల్యంలో రూపుదిద్దుకుంటున్న ఐటీ టవర్ కరీంనగర్‌కు ఐకాన్‌గా మారనుంది. ప్రపంచం ఐటీ వైపు పరుగుతీస్తున్న సమయంలో నిర్మాణం పూర్తిచేసుకుంటున్న ఐటీటవర్ కరీంనగర్‌ను ప్రపంచపటంలో నిలపనుంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండవ స్థానం కరీంనగర్ ఐటీ టవర్‌కు దక్కనుంది. 2018 జనవరి 8న శంకుస్థాపన జరిగిన రోజే 11 కంపెనీలు ఎంవోయూ చేసుకున్నాయి. ఇతర దేశాల్లో స్థిరపడ్డ తెలంగాణకు చెందిన ఐటీ కంపెనీలు ఐటీ టవర్ ప్రారంభం రోజే కంపెనీలను స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ కంపెనీల స్థాపన ద్వారా సుమారు 1200 మంది స్థానిక యువతకు ఉద్యోగాలు లభించే సువర్ణావకాశం ఉంది. అతిపెద్ద వనరుగా ఉన్న యువత మెట్రో నగరాలకు వలస వెళ్లే అవసరం లేకుండా ఆ స్థాయి ఐటీ ఉద్యోగాన్ని స్థానికంగానే ఉంటూ చేసుకునేందుకు చక్కటి అవకాశం దక్కనుంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ మన ప్రాంతంలో ప్రారంభమవడమే కాకుండా ఉద్యోగార్థులకు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్(టాస్క్) ద్వారా ప్రపంచస్థాయి శిక్షణతో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఐటీతో మన యువత ప్రపంచంతో పోటీ పడేందుకు కరీంనగర్ కేరాఫ్‌గా మారనుంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది... ఐటీ కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకూడదనే ఉద్దేశంతో... జిల్లా కేంద్రాల్లో కూడా ఐటీని నెలకొల్పాలనే ప్రభుత్వ సంకల్పం అభివృద్ధి వికేంద్రీకరణకు దోహదపడుతుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం ఎల్ఎండీ సమీపంలో నిర్మాణం జరుగుతున్న ఐటీ టవర్ పనులను టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహరెడ్డితో కలిసి పరిశీలించారు. దసరాకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు టవర్‌ను సిద్ధం చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద ఐటీ.. – టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహరెడ్డిరాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత అతిపెద్ద ఐటీ టవర్‌ను కరీంనగర్లో స్థాపించడం జరుగుతుందని తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహరెడ్డి అన్నారు. కంపెనీలను స్థాపించే వారికి పవర్‌టారిఫ్, బ్రాండ్‌బాండ్ నెట్‌వర్క్‌లో రాయితీలను, అదనపు ప్రోత్సాహకాలను కూడా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుగ్గిళ్లపు రమేశ్, కట్ల సతీష్, బోనాల శ్రీకాంత్, ఆర్కిటెక్చర్ చేతనాజైన్, కాంట్రాక్టర్ సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని భూముల్లో... ఐటీ వ్యాపారం
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుంచి తీసుకున్న భూములతో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనుందని ‘సాక్షి’ తొలి నుంచి చెబుతున్న అంశాలు కార్యరూపం దాలుస్తున్నాయి. రాజధాని భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంతోపాటు పలు వాణిజ్య, వాణిజ్యేతర కార్యకలాపాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రుల కోసం అమరావతిలో ఐటీ టవర్ నిర్మాణం చేపట్టి దాన్ని విక్రయించడం ద్వారా వ్యాపారం చేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ఐటీ టవర్‌కు ఇటీవలే సీఎం చంద్రబాబు అట్టహాసంగా శంకుస్థాపన చేయడం తెలిసిందే. రాజధానిలో ఐటీ టవర్ నిర్మాణం ద్వారా రూ.90 కోట్ల లాభాన్ని ఆర్జించాలని సీఆర్డీఏ ప్రణాళిక రూపొందించింది. దీన్ని ఇటీవల సీఎం అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశం అమోదించింది. అమెరికాలోని తెలుగువారికి చెందిన 45 ఐటీ కంపెనీలు అమరావతికి వచ్చేందుకు ఆసక్తి చూపాయని, దీనికి సంబంధించి కంపెనీల ప్రతినిధులు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి మధ్య సంతకాలు కూడా జరిగాయని సీఆర్డీఏ పేర్కొంది. 10 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం... అమరావతిలో పది లక్షల చదరపు అడుగుల్లో ఐటీ టవర్ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏకు సూచించింది. 5.5 ఎకరాల్లో ఐటీ టవర్ నిర్మాణం చేపట్టనుంది. ప్లగ్ అండ్ ప్లే ఐటీ ఆఫీసెస్, ఐటీ మౌలిక వసతులను సంయుక్తంగా వినియోగించుకోవడం, బ్రాడ్‌బాండ్ కనెక్టివిటీ, నిరంతర విద్యుత్, ఐటీ కార్యాలయాలకు ఉద్యోగులు నడిచి వెళ్లి వచ్చేలా ఏర్పాట్లు, సరసమైన ధరలకు గృహాలు, సోషల్, రిక్రియేషన్ సౌకర్యాలు కల్పించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ఐటీ కంపెనీలకు విక్రయం, దీర్ఘకాలిక లీజు ఐటీ టవర్‌లోకి 45 ఐటీ, ఐటీ అనుబంధ కంపెనీలు రావడం ద్వారా 8,000 మందికి ఉద్యోగాలతో పాటు ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని సీఆర్డీఏ పేర్కొంది. ఐటీ టవర్ రెండు దశల్లో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. నిర్మాణం పూర్తయిన తరువాత ఐటీ కంపెనీలకు స్పేస్‌ను విక్రయించడం, దీర్ఘకాలిక లీజుకు ఇవ్వాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ఐటీ టవర్ నిర్మించి విక్రయించడం ద్వారా రూ.90.64 కోట్ల లాభాన్ని ఆర్జించనున్నట్లు సీఆర్డీఏ పేర్కొంది. -
రాజధానిలో ఐటీ టవర్
సాక్షి, అమరావతి : రాజధాని పరిధిలోని శాఖమూరు ప్రాంతంలో ప్రతిపాదిత ఐటీ సిటీలో ఐటీ టవర్ నిర్మించాలని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రుల కోసం అమరావతిలో ఈ టవర్ నిర్మాణం చేపట్టాలని ఆ సంస్థ భావిస్తోంది. ఇందుకు అవసరమైన అనుమతులు కూడా వచ్చినట్లు సమాచారం. అమెరికాలోని తెలుగు వారికి చెందిన 45 ఐటీ కంపెనీలు అమరావతికి వచ్చేందుకు సుముఖత వ్యక్తంచేశాయని, ఇందుకు సంబంధించి ఆ కంపెనీల ప్రతినిధులు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి మధ్య సంతకాలు కూడా జరిగాయని సీఆర్డీఏ పేర్కొంది. 10లక్షల చదరపు అడుగుల్లో.. కాగా, అమరావతిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో.. రూ.284కోట్ల నిర్మాణ వ్యయం అంచనాతో పది లక్షల చదరపు అడుగుల్లో ఐటీ టవర్ నిర్మిస్తారు. దీంతో ప్లగ్ అండ్ ప్లే ఐటీ సంస్థలు ఐటీ మౌలిక వసతులను సంయుక్తం గా వినియోగించుకోవడం, బ్రాడ్‌బాండ్ కనెక్టివిటీ, నిరంతరం విద్యుత్ సరఫరా, ఐటీ ఆఫీసులకు ఉద్యోగులు నడిచి వెళ్లి వచ్చేలా అందుబాటు ధరల్లో గృహాలు, సోషల్ రిక్రియేషన్ సౌకర్యాలు కల్పించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ఐటీ టవర్‌లోకి 45 ఐటీ కంపెనీలతో పాటు వాటి అనుబంధ కంపెనీలు రావ డం ద్వారా 8000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని, దాంతోపాటు ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని సీఆర్డీఏ పేర్కొంది. తొలుత ఐదు లక్షల చదరపు అడుగుల్లో, ఆ తర్వాత మరో 5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించాలని నిర్ణయించారు. వీటి నిర్మాణం పూర్తయ్యాక ఐటీ స్పేస్‌ను విక్రయించడం, దీర్ఘకాలిక లీజుకూ ఇస్తారు. దీని ద్వారా సీఆర్డీఏకు రూ.90. 64 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. రైతుల నుంచి భూములు తీసుకుని వ్యాపార ధోరణి అవలంబిస్తున్న సీఆర్డీఏ తీరుపై విమర్శలు వస్తున్నాయి. -
ఆంధ్రప్రదేశ్‌కి ఆ ప్రతిపాదన లేదు : కేంద్ర మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ : కర్నూలులో కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్ ఏర్పాటు ప్రతిపాదన లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సీఆర్ చౌదరీ బుధవారం తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్ (సీఈజెడ్) ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిందని విజయసాయి రెడ్డి తెలిపారు. సీఈజెడ్ ఏర్పాటులో కేంద్రం చేపట్టిన చర్యలేమిటో తెలపాలని సంబంధిత మంత్రిని ఆయన కోరగా..ప్రస్తుతానికి సీఈజడ్ ఏర్పాటు ప్రతిపాదనేదీ లేదని మంత్రి స్పష్టం చేశారు. ఐటీ టవర్‌కూ మొండిచేయే..! రాష్ట్రంలో ఎగుమతుల ప్రోత్సాహానికి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా విశాఖ జిల్లా దువ్వాడలోని స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్)లో ఐటీ టవర్ నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని సీఆర్ చౌదరీ వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతిని మాత్రం వెల్లడించలేదు. ఏ మేరకు నిధుల కేటాయింపులు జరిగాయన్న విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి సమాధానం దాటవేశారు. -
కరీంనగర్లో ఐటీ టవర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పుణే వంటి నగరాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమ ఇప్పుడు కరీంనగర్‌కూ వస్తోంది. ఇప్పటికే స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకుని దేశంలోని 100 నగరాల సరసన నిలిచిన కరీంనగర్ ఇప్పుడు ఐటీ పరిశ్రమల ఏర్పాటుతో ప్రపంచస్థాయి గుర్తింపును అందుకోనుంది. ప్రతిపాదిత ఐటీ టవర్ నిర్మాణం పూర్తయితే కరీంనగర్‌కు మహర్దశ పట్టనుంది. ద్వితీయ శ్రేణి నగరమైన కరీంనగర్ ఐటీతో కొత్త ఖ్యాతి సంపాదించుకోనుంది. మంత్రి కేటీఆర్‌చే శంకుస్థాపన.. 50 వేల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మాణం తలపెట్టిన ఐటీ టవర్‌కు సోమవారం ఉదయం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడే భారీ బ హిరంగ సభ నిర్వహించనున్నారు. నగరంలోని అన్ని డివిజన్ల కార్పొరేటర్లతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్‌లు సమావేశమై ప్రజ లను పెద్ద సంఖ్యలో తరలించే బాధ్యతలను అప్పగించారు. అదే విధంగా కళాశాలల విద్యార్థులను కూడా పెద్ద సంఖ్యలో బహిరంగ సభకు తరలించి విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీ హబ్‌గా ఏర్పాటు... ప్రధాన నగరాలకే పరిమితమైన ఐటీ సెక్టార్‌ను ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విస్తరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నగరాన్ని ఐటీ హబ్‌గా మార్చేందుకు ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. 9 నెలల్లో దీనిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఐటీ టవర్‌లో 10కి పైగా అమెరికా, ఆస్ట్రేలియాలకు చెందిన బడా కంపెనీల శాఖలను ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా రాయితీలు ఇవ్వనున్నారు. ఉత్తర తెలంగాణ నిరుద్యోగులకు ఐటీ ఉద్యోగాలే లక్ష్యంగా ఏర్పాటుచేస్తున్న ఈ ఐటీ టవర్స్‌తో సుమారు 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఉత్తర తెలంగాణ కేంద్ర బిందువు... ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువుగా ఉన్న కరీంనగర్ విద్య, వైద్యం, ప్రాజెక్టుల రంగాల్లో దూసుకుపోతోంది. మానేరు డ్యామ్ ఒడ్డున ప్రకృతి ఒడిలో ప్రశాంత వాతావరణంలో బైపాస్ రోడ్డును ఆనుకొని 3 ఎకరాల స్థలాన్ని ఐటీ టవర్‌కు కేటాయించారు. రూ.25 కోట్లతో జీ+5 అంతస్తులతో భవనాన్ని నిర్మించేందుకు డిజైన్లు సిద్ధం చేశారు. టవర్ నిర్మాణానికి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) టెండర్ల ప్రక్రియను పూర్తిచేసింది. హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టు ఎజెన్సీకి పనులు అప్పగించారు. 50 వేల చదరపు అడుగుల వైశాల్యంతో అత్యాధునిక హంగులతో భవన నిర్మాణం పూర్తయితే ప్లగ్ అండ్ ప్లే విధానంతో నిరంతర విద్యుత్ సరఫరా, హైరేంజ్ వైఫై సేవలు, ఇతర సౌకర్యాలన్నీ కల్పించనున్నారు. పెద్ద ఐటీ కంపెనీలను ఆకర్షించేలా రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని సౌకర్యాలతో నిర్మాణం చేయనున్నారు. -
కరీంనగర్లో రూ.25 కోట్లతో ఐటీ టవర్స్
కరీంనగర్ రూరల్: కరీంనగర్ జిల్లాలో ఐటీ టవర్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ బి.వినోద్‌కుమార్ తెలిపారు. సోమవారం కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ఐటీ టవర్‌ను ఏర్పాటు చేసేందుకు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రూ.25 కోట్లను మంజూరు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాలకు పరిమితమైన ఐటీ కంపెనీలన్ని కరీంనగర్‌లోని ఐటీ టవర్స్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని యువతకు శిక్షణ ఇవ్వడంతోపాటు ఉపాధి కల్పిస్తాయని తెలిపారు. జిల్లాల పునర్విభజనతో కరీంనగర్‌కు ప్రాధాన్యం తగ్గలేదని, భవిష్యత్తులో వైద్య, విద్యరంగాల్లో తెలంగాణలోనే ముందంజలో ఉంటుందన్నారు.