సాక్షి, సిద్దిపేట: తెలంగాణ మోడల్ అంటే.. సమగ్ర, సమ్మిళిత, సమీకృత, సమతుల్య అభివృద్ధి అని పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. వ్యవసాయం, ఐటీ పరిశ్రమలు, హరితహారంలో రాష్ట్రం దూసుకుపోతోందన్నారు. హరితహారంతో పచ్చదనాన్ని 7.7 శాతానికి పెంచామని, రూ.2.41 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులతో అగ్రభాగాన ఉన్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐటీ ఉద్యోగులు 3.23 లక్షలుండగా, ఇప్పుడు 9.05 లక్షల మంది ఉన్నారన్నారు.
142 కోట్ల భారత్‌లో కేంద్రం 0.5 శాతం (59 లక్షలు)ఉద్యోగాలు మాత్రమే కల్పిస్తోందని, రాష్ట్రంలో 6.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. కేటీఆర్ గురువారం సిద్దిపేటలో ఐటీ టవర్, స్లాటర్‌హౌస్, వాటర్ రింగ్‌మెన్ ప్రారంభోత్సవం, కప్పలకుంట చెరువు సుందరీకరణ పనులకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో తెలంగాణకు అవార్డులు వస్తున్నాయని, 3 శాతం గ్రామీణ జనాభా ఉన్న రాష్ట్రం దేశంలో 30 శాతం అవార్డులను దక్కించుకుందని చెప్పారు.
చాలామంది సిద్దిపేట మీద ప్రత్యేక ప్రేమ ఎందుకని అడుగుతున్నారని, సిద్దిపేట తెలంగాణకు నాయకుడితోపాటు తెలంగాణకు జన్మనిచ్చిందని చెప్పారు. ఇక్కడ కేసీఆర్ పుట్టకపోతే, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలు అవకాశం ఇవ్వకపోతే టీఆర్‌ఎస్ పుట్టేదా, తెలంగాణ వచ్చేదా? అని అన్నారు. చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే.. అని కేసీఆర్ గుండె లోతు నుంచి వచ్చిన మాట అని గుర్తు చేశారు. మిషన్ భగీరథ, హరితహారం, దళితబంధుకు పునాది పడిన గడ్డ సిద్దిపేట అని, మిషన్ భగీరథను కేంద్రం కాపీ కొట్టి హర్ ఘర్ జల్‌గా అమలు చేస్తోందన్నారు. స్వచ్ఛ బడి స్ఫూర్తితో పాత జిల్లా కేంద్రాల్లో మున్సిపల్ ఆధ్వర్యంలో స్వచ్ఛ బడి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
బావ కాబట్టి అప్పుడప్పుడు ఏడిపిస్తా..
‘సిరిసిల్లకు వెళ్లినప్పుడల్లా సిద్దిపేటకు రాగానే ఫోన్ చేసి బావా మళ్లీ ఏదో కొత్తది కట్టినవ్ అంటాను. ఇంత పెద్ద రోడ్లు వేశావ్ అంటా. అరెయ్ మళ్లీ వెళ్లినప్పుడు కళ్లు మూసుకొని పో.. ప్రతీసారి వెళ్లినప్పుడు ఇలా ఫోన్ చేస్తున్నావు అంటడు. సిరిసిల్లకు పోయేటప్పుడు వచ్చేటప్పుడు బావ కాబట్టి అప్పుడప్పుడు ఏడిపిస్తా.
ప్రతీ నియోజకవర్గం సిద్దిపేటలాగా మారినప్పుడే బంగారు తెలంగాణ, బంగారు భారతదేశం అవుతుంది’అని కేటీఆర్ అన్నారు. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ, రాష్ట్రానికి సిద్దిపేట దిక్సూచి అని కొనియాడారు. ఆనాడు కేసీఆర్ అభివృద్ధిని ప్రారంభిస్తే దాన్ని నాలుగింతలు పైకి తీసుకెళ్లిన నాయకుడు హరీశ్‌రావు అని చెప్పక తప్పదన్నారు. ఈసారి 1.50 లక్షల మెజార్టీతో హరీశ్‌ను గెలిపించి, కేసీఆర్‌కు హ్యాట్రిక్ గెలుపు, ఆశీర్వాదం ఇవ్వాలని ప్రజలను కోరారు.
తిట్టినవారే శభాష్ అంటున్నారు: మంత్రి హరీశ్‌రావు
తెలంగాణ వస్తే మత కలహాలు, కరెంట్, సాగు, తాగు నీరు ఉండవని తిట్టినవారే ఇప్పుడు శభాష్ అంటున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అస్సాంలో విద్యుత్ కొరత ఉందని స్వయంగా మంత్రినే విద్యుత్ వినియోగం తక్కువ చేయాలని చెప్పారని, ప్రధాని సొంత రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించారని గుర్తుచేశారు. ప్రపంచంలో ఉండే ఐటీ కంపెనీలన్నింటినీ హైదరాబాద్‌కు తెచ్చి కేటీఆర్ యువతకు ఉపాధిని కల్పిస్తున్నారని కొనియాడారు.
కేటీఆర్ ఐటీలో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్ స్థాయికి తీసుకువెళ్లారన్నారు. కేటీఆర్ లాంటి ఐటీ మంత్రి కావాలని ఇతర రాష్ట్రాల్లో యువత ట్విట్టర్ వేదికగా కోరుతున్నారని చెప్పారు. సిద్దిపేటలో కేసీఆర్ బలమైన పునాది వేశారని దాని కొనసాగింపుగానే తాను చేస్తున్నా అన్నారు. మరోసారి సీఎం కేసీఆర్‌ని గెలిపించి హ్యాట్రిక్ అందించాలని ప్రజలను కోరారు. కాగా, సిద్దిపేట ఐటీ హబ్ పర్యావరణహితంగా ఉండటంతో ఐజీబీసీ వారు గోల్డ్ రేటింగ్ ప్లేట్‌ను మంత్రి కేటీఆర్, హరీశ్‌రావుకు అందించారు. కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ చైర్మెన్ బాలమల్లు, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment