![KTR Says Local Un Employers Will Benefit By It Center In Karimnagar - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/22/KTR.jpg.webp?itok=Cu-D2Nsl)
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నిర్వచనం క్రమంగా మారుతోందని.. ఐటీ అంటే ఇంటెలిజెంట్ టెక్నాలజీ అని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అభివర్ణించారు. మంగళవారం కరీంనగర్‌లో అర్బన్ మిషన్ భగీరథ కింద రూ.110 కోట్లతో చేపట్టిన ‘ప్రతిరోజూ తాగునీటి సరఫరా’పథకాన్ని, ఎల్‌ఎండీ సమీపంలో నిర్మించిన ఐటీ టవర్‌ను మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఐటీ కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నైపుణ్యం ఒకరి సొత్తు కాదని ద్వితీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఎంతో నైపుణ్యం ఉన్న మేధావులు వస్తున్నారని తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాస్తా ఇంటెలిజెంట్ టెక్నాలజీగా మారడంతో నైపుణ్యం గల వారందరికీ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.
తెలంగాణలో కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే వరంగల్‌లో ఐటీ సెంటర్‌ను ప్రారంభించామని, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద ఐటీ టవర్‌కు కరీంనగర్ కేంద్ర స్థానం అయిందని పేర్కొన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. ఒకప్పుడు రూ.56 వేల కోట్ల ఐటీ ఎగుమతులు ఉండేవని, ప్రసుత్తం రూ.1.28 లక్షల కోట్లకు పెంచినట్లు పేర్కొన్నారు.
స్థానికులకే ఉద్యోగావకాశాలు
ద్వితీయ శ్రేణి పట్టణాలు, నగరాల్లో విద్యను అభ్యసిస్తున్న వారు ఉద్యోగాల కోసం ఇతర పట్టణాలకు వలస పోకుండా, స్థానికంగా ఐటీ ఉద్యోగాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ తెలిపారు. కరీంనగర్ చుట్టు పక్కన ఉన్నత విద్యను అభ్యసించిన వారికి ఇక్కడి ఐటీ టవర్‌లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన నైపుణ్యాన్ని మార్చుకుంటూ వెళ్లాలని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తే వారికి ప్రభుత్వం తరఫున రాయితీలు కల్పిస్తామని తెలిపారు.
కరీంనగర్‌లో మరో ఐటీ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని కేటీఆర్ తెలిపారు. కాగా, కరీంనగర్ ఐటీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన టాస్క్ సెంటర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ప్రస్తుతం కరీంనగర్ ఐటీ కంపెనీలో 432 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించగా.. వారికి మంగళవారం నియామక పత్రా లు కేటీఆర్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, కలెక్టర్ శశాంక తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా కేటీఆర్ కేబుల్ బ్రిడ్జిని పరిశీలించారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment