సిద్దిపేటఅర్బన్: రాష్ట్రంలో ఇంటింటికి తాగునీరు అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి సిద్దిపేటలోనే పునాది పడిందని, ఐటీ టవర్ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుందని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఐటీ టవర్ ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. సిద్దిపేటలో అభివృద్ధి ఒరవడి 1980 దశకంలో కేసీఆర్ నాయకత్వంలో మొదలైందన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీరు అందించేందుకు లోయర్ మానేర్ డ్యాం నుంచి ఇర్కోడ్ గుట్టపై ట్యాంకు కట్టి నీళ్లు తెచ్చారని, దీని స్ఫూర్తిగా భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారని, దళిత చైతన్య జ్యోతి నుంచి దళిత బంధు పుట్టిందని కొనియాడారు.
రూ.80 కోట్లతో వాటర్ రింగ్ మెయిన్ ఏర్పాటు చేసుకున్నామని, అంతర్గత సీసీ రోడ్డ నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేశామన్నారు. మందపల్లిలో 400 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు, ఆటోనగర్ ఏర్పాటుతో యువతకు ఉపాధి కలుగుతుందన్నారు. వర్గల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఐటీ టవర్‌తో జిల్లా ఖ్యాతి పెరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల యువతకు ఉపాధి కల్పించేందుకు ఐటీ టవర్‌లను విస్తరిస్తామని పేర్కొన్నారు. టాస్క్ సెంటర్‌తో నిరుద్యోగ యువతకు శిక్షణ అందిస్తారని తెలిపారు.
కేసీఆర్ బాటలో..
సిద్దిపేటలో ఐటీ టవర్ ప్రారంభం కలగా ఉందని, సిద్దిపేటలో అభివృద్ధికి కేసీఆర్ ఎప్పుడో పునాది వేశారని, దానిని నేను కొనసాగిస్తున్నానని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ ప్రణాళికలు, కలలను నిజం చేసే అదృష్టం దక్కిందని అన్నారు. ఐటీ టవర్‌ను ప్రారంభించిన అనంతరం 17 కంపెనీలు రిక్రూట్ చేసుకున్న ఉద్యోగులతో మంత్రులు ముచ్చటించారు.
ఐటీ టవర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ తన పాటలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సతీశ్‌కుమార్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఫారూఖ్ హుస్సేన్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎండీ నర్సింహారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment