ఆ పార్టీ మాయమాటలు నమ్మొద్దు! : మంత్రి హరీశ్‌రావు | - | Sakshi
Sakshi News home page

ఆ పార్టీ మాయమాటలు నమ్మొద్దు! : మంత్రి హరీశ్‌రావు

Published Sat, Nov 11 2023 4:26 AM | Last Updated on Sat, Nov 11 2023 12:40 PM

- - Sakshi

మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

సాక్షి, మెదక్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉందని, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆగమవుతారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం నర్సాపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతారెడ్డి మంత్రి హరీశ్‌రావుతో కలిసి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసేందుకు భారీ ర్యాలీతో వెళ్లారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అంటే వంచన.. మోసమని, కేసీఆర్‌ అంటే నమ్మకం అని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌కు ఓటేస్తే రాష్ట్రం ఆగమైతదని, ఆ పార్టీ నాయకులు మాయ మాటలు చెప్తారని విమర్శించారు. కాంగ్రెస్‌ వస్తే కరెంట్‌ కట్‌ అవుతుందని విమర్శించారు. కొడంగల్‌లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని గతంలో చెప్పిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. 2018లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుంటే తాను గడ్డం తీసుకోనని ఆ పార్టీ నాయకుడు ఉత్తంకుమార్‌రెడ్డి ప్రకటించి మాట తప్పారని విమర్శించారు. మాట తప్పే నాయకులు కావాలా మాట మీద ఉండే కేసీఆర్‌ అవసరమా ఆలోచించాలని కోరారు.

రేవంత్‌రెడ్డి పట్టపగలు రూ.50లక్షలు లంచం ఇస్తూ దొరికారని ఆరోపించారు. రైతులను కేసీఆర్‌ రాజులుగా చేస్తే రైతు బంధు బిచ్చమేసినట్లుగా ఉందని రేవంత్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఉత్తదేనని, కేసీఆర్‌ మాట మీద ఉంటారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ డకౌట్‌ అవుతుందని, కాంగ్రెస్‌ రనౌట్‌ అవుతుందని, కేసీఆర్‌ సెంచరీ చేస్తారని హరీశ్‌ జోస్యం చెప్పారు.

నర్సాపూర్‌ను మరింత అభివృద్ధి చేస్తాం!
నర్సాపూర్‌ను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతులు ఈలవేస్తే కొండపోచమ్మ గేట్లు ఎత్తి నీళ్లు అందిస్తున్నారని, హల్దీవాగు నిండటంతో ఎకరం పొలం ఎండటం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీతారెడ్డి మంత్రిగా పనిచేశారని, ఆమెను గెలిపిస్తే నర్సాపూర్‌ అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ నర్సాపూర్‌ వచ్చినప్పుడు పట్టణ అభివృద్ధికి రూ.65 కోట్లు విడుదల చేశారని గుర్తుచేస్తూ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి ఇంతవరకు గ్రామ పంచాయతీ వార్డు మెంబరుగా గెలవలేదని, ఆయన ఏమి చేస్తారని ప్రశ్నించారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు, నాయకులు సమష్టిగా సునీతారెడ్డి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. నర్సాపూర్‌లో సునీతారెడ్డిని గెలిపిస్తే అక్కడ కేసీఆర్‌ సీఎం అవుతారన్నారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని ఎంపీగా పోటీ చేయిస్తామని చెప్పారు.

సునీతారెడ్డిని 60 వేల మెజారిటీతో గెలిపించే బాధ్యత మదన్‌రెడ్డితో పాటు నియోజకవర్గంలోని కార్యకర్తలదన్నారు. అలాగే ఎంపీ ఎన్నికల్లో నర్సాపూర్‌లో లక్ష మెజార్టీ తేవాల్సిన బాధ్యత సునీతారెడ్డిపై ఉంటుందన్నారు. తాను సిద్దిపేటలో లక్ష మెజార్టీ ఇస్తానని ప్రకటించారు. అనంతరం సునీతారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం సేవ చేస్తానన్నారు. ర్యాలీలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర కార్మిక బోర్డు చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ఇవి చదవండి: కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్లే.. : ఎంపీ బండి సంజయ్‌కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement