సాక్షి, మెదక్: ఎన్నికల నేపథ్యంలో జిలాల్లో ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తమకు ఓట్లు వేసి గెలిపిస్తే ఏం చేస్తాం అని చెప్పడం వదిలేసి వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్ మెదక్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ గ్రామాలకు వెళ్లినప్పుడు గతంలో వ్యక్తిగత విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియక ప్రజల్లో అయోమయ పరిస్థితి నెలకొంది.
రోహిత్ 25 ఏళ్ల పిల్లగాడు..
బీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో రెండు సార్లు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలిపిస్తే చేసిందేమి లేదని ఎద్దేవా చేస్తున్నారు. అప్పుడు ఏమి చేయంది ఇప్పుడు మళ్లీ వచ్చి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని విమర్శిస్తున్నారు.
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజల తాగునీటి ఇబ్బందులు పట్టించుకోలే గానీ, నేడు ఊర్లలో బోర్లు వేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మెదక్ నియోజకవర్గం తనకు సెట్ కాదని ఇక్కడి నుంచి మల్కాజ్‌గిరి వెళ్లి పదేళ్లపాటు మెదక్ ముఖం చూడని హన్మంతరావు, ఇప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసం మళ్లీ మెదక్‌లో తిరుగుతున్నారని విమర్శిస్తున్నారు. ఎద్దు, ఎవుసం అంటే తెలియని రోహిత్‌రావు, 25 ఏళ్ల పిల్లగాడు గెలిస్తే ఏమి చేస్తాడు అని ఓటర్లను ఆలోచింపజేస్తున్నారు. రోహిత్‌ను గెలిపిస్తే మెదక్ నియయోజకవర్గం మళ్లీ ఆగమైంతుందంటున్నారు.
పదేళ్లు పద్మాదేవేందర్‌రెడ్డి ఏం చేశారు?
కాంగ్రెస్ అభ్యర్థి మైనపల్లి రోహిత్ రావు ప్రచారంలో మాట్లాడుతూ.. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్ ను ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నిస్తున్నారు. నియోజక వర్గంలో పెండింగ్ పనులు, నెరవేరని హామీలపై ప్రశ్నలు వేస్తూ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలకు సవాల్ విసురుతున్నారు. నియోజకవర్గ రైతాంగానికి ప్రధాన ఆదరువైన ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు విషయంలో పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబడుతున్నారు.
ఆనకట్ట ఎత్తు ఎక్కడ పెంచారో 48 గంటల్లో వచ్చి చూయించాలని మంత్రి, ఎమ్మెల్యేలకు రోహిత్‌రావు సవాల్ విసిరారు. అలాగే, మెదక్ మండలంలోని మంబోజిపల్లిలో చారిత్రక నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని మాటిచ్చిన సీఎం కేసీఆర్ 10 ఏళ్లు గడుస్తున్నా.. ఎందుకు తెరిపించలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని పద్మాదేవేందర్ రెడ్డి పట్టించుకోకపోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ఏడుపాయల, చర్చి, పోచారం ప్రాజెక్ట్ ప్రాంతాలను కలిసి టూరిజం సర్క్యూట్ చేస్తామంటూ ఏళ్లుగా మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఇలా ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ప్రజలకు ఏం అభివృద్ధి చేస్తారో చెప్పకుండా మాటకు మాట అన్నట్లుగా దూషించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి: జిల్లా కాంగ్రెస్‌లో కల్లోలం! ఇటు రాజీనామాలు.. అటు హెచ్చరికలు!
Comments
Please login to add a commentAdd a comment