బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్న నాయకులు
సాక్షి, మెదక్: కాంగ్రెస్ పార్టీ ఎన్ని ట్రిక్కులు చేసినా రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ హ్యాట్రిక్ తప్పదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం ఆయన మండల పరిధిలోని లక్ష్మీనగర్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికలు మన భవిష్యత్‌కు ముఖ్యమైనవని, అందరూ కలసి పనిచేయాలన్నారు. ప్రతిపక్షాలు ఎన్నో జిమ్మిక్కులు చేస్తాయని ఆగం కావొద్దన్నారు.
హైదరాబాద్ నుంచి బెంజి కారుల్లో వచ్చే వారు మెదక్ ప్రజల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతారా అంటూ ప్రశ్నించారు. రైతుబంధు భిక్షం వేస్తున్నామన్న రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని, మోసపోతే గోస పడతామన్నారు. పద్మాదేవెందర్‌రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఎల్లాపూర్ మాజీ సర్పంచ్ బేగరి యాదయ్య, 4వ వార్డు సభ్యుడు పుట్టి నర్సింలు, ఇతర నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు.
మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ తాగునీరు!
నార్సింగ్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. పుష్కలంగా పంటలు పండుతున్నాయన్నారు. కాళేశ్వరం లేకపోతే 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట తెలంగాణలో పండేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మెదక్ బీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, నార్సింగ్ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్యాలయాల తరలింపు ఉత్తిమాటే..
బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మండల పరిధిలోని కూచన్‌పల్లిలో ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రైతులకు మేలు జరిగేలా బీఆర్‌ఎస్ మేనిఫెస్టో రూపొందించామన్నారు. మెదక్ నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారన్న ఆరోపణలు సరికాదన్నారు. మరో నాలుగు కార్యాలయాలను తీసుకువస్తాం తప్ప ఇక్కడి నుంచి కార్యాలయాలను తరలించడం లేదన్నారు. సమావేశంలో మెదక్ బీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇవి చదవండి: 'పొరపాటు చేస్తే పదవికే ఎసరు?' తస్మాత్ జాగ్రత్త..!
Comments
Please login to add a commentAdd a comment