ఎన్నికల శంఖారావం సభలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి, మెదక్: కార్యకర్తలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాను, వారికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఆదివారం నర్సాపూర్‌లో జరిగిన బీఆర్‌ఎస్ ఎన్నికల శంఖారావం సభకు స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అధ్యక్షత వహించగా మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. టికెట్ ఎవరికి వచ్చినా పార్టీ నిర్ణయించిన అభ్యర్థి సునీతారెడ్డిని గెలిపించేందుకు అందరూ కష్టపడి పని చేయాలని, ఎలాంటి అపోహలకు పోవద్దని ఆయన కార్యకర్తలకు సూచించారు.
వారంతా సునీతారెడ్డిని గెలిపిస్తే తాను మదన్‌రెడ్డిని ఎంపీగా గెలిపించే బాధ్యతలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. సునీతారెడ్డిని గెలిపిస్తే ఏడాదికి మూడు కోట్ల నిధులు వస్తాయని, మదన్‌రెడ్డికి ఎంపీ అవకాశం వస్తే ఏడాదికి మరో రూ.ఐదు కోట్ల ఎంపీల్యాడ్స్ ఉంటాయని అప్పుడు అభివృద్ధికి డోకా ఉండదని మంత్రి హరీశ్ చెప్పారు. అనంతరం అమలు చేస్తున్న పథకాలతో పాటు కొత్తగా మేనిఫెస్టోలో ప్రవేశ పెట్టిన వంటగ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ, పెంచిన పింఛన్, సౌభాగ్యలక్ష్మి, సన్న బియ్యం పంపిణీ, బీమా పథకాల గురించి మంత్రి వివరించారు.
కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్యపు ప్రచారాలను నమ్మవద్దని, బీఆర్‌ఎస్ చేసే అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి నమ్మాలని ఆయన కోరారు. సమావేశంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర కార్మిక బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్‌చార్జి వెంకటరాంరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. కాగా మంత్రి హరీశ్‌రావును యాదవ సంఘం నాయకులు గొర్రె పిల్లతో సన్మానించారు.
ఇవి చదవండి: 'కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి..' : ఎంపీ బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment