
యూనిఫామ్‌లో మార్పులు
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న యూనిఫామ్‌లో మార్పులు చేశారు. 6 నుంచి 12 తరగతి వరకు బాలబాలికలకు ఒకే విధంగా ఉండేలా మార్పు చేయనున్నారు. ముఖ్యంగా ఎదిగే బాలికలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా తయారు చేయనున్నారు. గతంలో విద్యా సంవత్సరం సగం ముగిసే వరకు యూనిఫామ్‌లు కుట్టుడం కొనసాగేది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఈసారి మాత్రం విద్యా సంవత్సరం ప్రారంభంలోగానే యూనిఫామ్‌లు అందేలా పక్కాగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
పరిశీలన బాధ్యతలు ఎంఈఓలకు..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే యూనిఫామ్‌ల క్లాత్ తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టెస్కో) సరఫరా అందిస్తుంది. జిల్లాకు చేరిన యూనిఫామ్‌ల క్లాత్‌ను పరిశీలించి, భద్రపర్చే బాధ్యతలను సంబంధిత ఎంఈవోలకు అప్పగించారు. ప్రస్తుతం ఒక జతకు సంబంధించిన క్లాత్ మాత్రమే వచ్చింది. వాటిని స్వయం సహాయక సంఘాల సభ్యులతో కుట్టించేలా కార్యాచరణ రూపొందించారు. ఎంఈఓల పర్యవేక్షణలో డీఆర్‌డీఏ, అర్బన్, మెప్మా, టీఎల్‌ఎఫ్ మహిళా సంఘాల సభ్యులకు క్లాత్ అందజేశారు. ఒక్కో జత కుట్టడానికి రూ.75 చొప్పున చెల్లించనున్నారని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
యూనిఫామ్‌లో చేసిన మార్పులు
ఈ విద్యాసంవత్సరంలో అందించే యూనిఫామ్‌లలో స్వల్ప మార్పులు చేశారు. చొక్కాలు, లాంగ్ గౌన్‌లకు పట్టీలు, భుజాలపై కప్స్ వంటివి లేకుండా సాధారణ యూనిఫామ్‌గా డిజైన్ చేశారు. బాలురకు ఆరు నుంచి 12 తరగతి వరకు నిక్కర్లు కాకుండా ప్యాంట్లు అందించాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి నెక్కర్లకు మాత్రమే వస్త్రం జిల్లాకు చేరింది.
జిల్లాలో 932 పాఠశాలలు
జిల్లాలో ప్రభుత్వ, యూపీఎస్, పీఎస్, కేజీబీవీ, జెడ్పీ, ఎయిడెడ్, యూఆర్‌ఎస్, టీఎస్‌ఆర్‌ఈఐఎస్, మోడల్ స్కూళ్లు మొత్తం 932 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో బాలికలు 37,742 మంది, బాలురు 36,523 మంది ఉన్నారు. స్కూళ్లలో 1 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్‌లు అందించనున్నారు.
ఎంఈఓల పర్యవేక్షణలో పనులు
మహిళా సంఘాల సభ్యులకు కుట్టే బాధ్యత
బడిబాటకు ముందే పాఠశాలలకు చేరేలా ప్రణాళిక
బడిబాటకు ముందే..
మే నెలాఖరులోగా యూనిఫామ్‌లు పూర్తి చేసి బడిబాటకు ముందే పాఠశాలలకు చేరేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇప్పటి వరకు జిల్లాకు చేరిన యూనిఫామ్ క్లాత్‌ను ఎంఈఓల పర్యవేక్షణలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల సమన్వయంతో స్వయం సహాయక సంఘాల సభ్యులతో కుట్టించడం జరుగుతుంది. కొత్త దుస్తుల్లో పిల్లలు విద్యాసంవత్సరం ప్రారంభానికి తరగతులకు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించాం.
– రాధాకిషన్, డీఈఓ, మెదక్

యూనిఫామ్‌లో మార్పులు