Harish Rao tanniru
-
దిక్సూచిగా సిద్దిపేట
సిద్దిపేటఅర్బన్: రాష్ట్రంలో ఇంటింటికి తాగునీరు అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి సిద్దిపేటలోనే పునాది పడిందని, ఐటీ టవర్ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుందని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఐటీ టవర్ ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. సిద్దిపేటలో అభివృద్ధి ఒరవడి 1980 దశకంలో కేసీఆర్ నాయకత్వంలో మొదలైందన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీరు అందించేందుకు లోయర్ మానేర్ డ్యాం నుంచి ఇర్కోడ్ గుట్టపై ట్యాంకు కట్టి నీళ్లు తెచ్చారని, దీని స్ఫూర్తిగా భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారని, దళిత చైతన్య జ్యోతి నుంచి దళిత బంధు పుట్టిందని కొనియాడారు. రూ.80 కోట్లతో వాటర్ రింగ్ మెయిన్ ఏర్పాటు చేసుకున్నామని, అంతర్గత సీసీ రోడ్డ నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేశామన్నారు. మందపల్లిలో 400 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు, ఆటోనగర్ ఏర్పాటుతో యువతకు ఉపాధి కలుగుతుందన్నారు. వర్గల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఐటీ టవర్‌తో జిల్లా ఖ్యాతి పెరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల యువతకు ఉపాధి కల్పించేందుకు ఐటీ టవర్లను విస్తరిస్తామని పేర్కొన్నారు. టాస్క్ సెంటర్‌తో నిరుద్యోగ యువతకు శిక్షణ అందిస్తారని తెలిపారు. కేసీఆర్ బాటలో.. సిద్దిపేటలో ఐటీ టవర్ ప్రారంభం కలగా ఉందని, సిద్దిపేటలో అభివృద్ధికి కేసీఆర్ ఎప్పుడో పునాది వేశారని, దానిని నేను కొనసాగిస్తున్నానని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ ప్రణాళికలు, కలలను నిజం చేసే అదృష్టం దక్కిందని అన్నారు. ఐటీ టవర్‌ను ప్రారంభించిన అనంతరం 17 కంపెనీలు రిక్రూట్ చేసుకున్న ఉద్యోగులతో మంత్రులు ముచ్చటించారు. ఐటీ టవర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ తన పాటలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సతీశ్‌కుమార్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఫారూఖ్ హుస్సేన్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎండీ నర్సింహారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. -
మధ్యతరహా ప్రాజెక్టుకు.. మరమ్మతులు ఎప్పుడో?
మంగపేట: మండల పరిధిలోని నర్సింహాసాగర్ వద్ద మల్లూరువాగుపై నిర్మించిన మల్లూరు మధ్యతరహా ప్రాజెక్టు మరమ్మతు పనులు ఇంకెప్పుడు చేస్తారని ప్రాజెక్టు ఆయకట్టు రైతులు అధికారులను, పాలకులను ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు బాగోగులు చూడాల్సిన అధికారులు చుట్టపు చూపులా వచ్చి వెళ్తున్నారే తప్పా శ్రద్ధ చూపడం లేదని మండిపడుతున్నారు. 26 అడుగుల నీటిమట్టం సామర్థ్యంతో 1976లో అప్పటి సీఎం జలగం వెంగళరావు ప్రాజెక్టును ప్రారంభించారు. 1980లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాగా ఆయకట్టు భూములకు సాగునీటిని వదిలారు. నర్సింహాసాగర్, పూరేడుపల్లి, శనిగకుంట, మల్లూరు, వాగొడ్డుగూడెం, రమణక్కపేట, చుంచుపల్లి వరకు 17 కిలోమీటర్ల కుడి కాల్వ ద్వారా సుమారు 4,300 ఎకరాలు, బాలన్నగూడెం, తిమ్మంపేట, మంగపేట, చెరుపల్లి తదితర గ్రామాల వరకు 8 కిలోమీటర్ల ఎడమ కాల్వ ద్వారా 3,500 ఎకరాల ఆయకట్టు భూములకు రెండు పంటలకు సాగునీరు అందాల్సి ఉంది. 27 ఏళ్ల నుంచి ప్రాజెక్టు నిర్వహణపై సంబంధిత ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో లేకపోవడం ప్రాజెక్టు అభివృద్ధిపై పాలకులు అంతగా శ్రద్ధ చూపకపోవడంతో నిరాదరణకు గురైంది. 2007లో అప్పటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి పుణ్యమా అంటూ ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.16 కోట్ల జపాన్(జైకా) నిధులు మంజూరు అయ్యాయి. పనులపై పర్యవేక్షణ లేకపోవడంతో అసంపూర్తిగా చేసి కోట్ల రూపాయల నిధులను కాంట్రాక్టర్లు, అధికారులు కాజేశారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కుడి ఎడమ కాల్వల తూములకు ఏర్పడిన లీకేజీలకు మరమ్మతుల పేరుతో నాయకులు, అధికారులు కుమ్మకై ్క లక్షల రూపాయలు కాజేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అభివృద్ధిని మరిచి సంబురాలు తెలంగాణ స్వరాష్ట్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా అధికారులు, పాలకులు ప్రాజెక్టు అభివృద్ధిని మరిచి సంబురాలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని రైతులు వాపోతున్నారు. 2015లో అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, మంత్రి చందూలాల్ ప్రాజెక్టును సందర్శించారు. వెంటనే ప్రాజెక్టు అభివృద్ధికి, కుడి, ఎడమ కాల్వలు, తూముల నిర్మాణం ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు ఎస్టిమేట్ నివేదిక తయారు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. హామీ ఇచ్చి ఎనిమిదేళ్లు గడిచినా అతీగత లేదు. ఇప్పుడేమో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా చెరువుల పండుగలో భాగంగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టని ప్రాజెక్టులో నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని రైతులు వాపోతున్నారు. అధికారుల తీరు రైతులకు శాపం ప్రాజెక్టుపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ప్రభుత్వం పట్టిచుకోక పోవడం తమకు శాపంగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. తూముల లీకేజీల పనులు వేసవి కాలంలో చేపట్టాల్సి ఉండగా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వర్షాకాలంలో ప్రాజెక్టులోకి నీరు చేరిన తరువాత కొందరు స్థానికులతో సంబంధిత అధికారులు కుమ్మక్కై నాసిరకంగా మరమ్మతులు చేపట్టడంతో యథావిథిగా లీకేజీలు ఏర్పడి నీరు వృథాగా పోతుందని రైతులు వాపోతున్నారు. కాల్వల్లో షిల్టు పేరుకుపోయి సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం చెరువు కట్టపై చెట్లను తొలిగించక పోవడంతో కట్టపై నుంచి నడిచి వెళ్లే వీలులేకుండా మారింది. చెరువు మత్తడి వద్ద గైడ్ వాల్స్ కోతకు గురై ధ్వంసమయ్యాయి. అపరాన్ రాళ్లు తేలి కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మత్తడి నుంచి వరద నీరు భారీ స్థాయిలో ప్రవహిస్తే మత్తడికే ప్రమాదం పొంచి ఉందని రైతులు వాపోతున్నారు. -
'ఆయనేమో తడిబట్టలతో తిరుగుతాడు.. వీళ్లేమో కోర్టుకు.. ఎందుకంత భయం?'
సాక్షి, హైదరాబాద్: ఫాంహౌస్ కేసులో విచారణను ఆపాలంటూ బీజేపీ కోర్టులో పిటిషన్ ఎందుకేసిందో చెప్పాలని మంత్రి హరీష్‌రావు కోరారు. తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడేమో మాకు దొరికిన వాళ్ళు ఎవరో తెలియదంటూ తడిబట్టలతో తిరుగుతారు. కానీ వాళ్ల పార్టీ ప్రధాన కార్యదర్శి సిట్‌ని నిలిపివేయాలని కోర్టులో పిటిషన్ వేస్తారని ఎద్దేవా చేశారు. మీకు సంబంధం లేకపోతే కోర్టుకు ఎందుకు వెళ్ళారు? మీకెందుకంత భయం? అంటూ ప్రశ్నించారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ, తెలంగాణలో విఫల ప్రయత్నం చేసిందన్నారు. అయితే ఇక్కడ బీజేపీ పరిస్థితి కుడితిలో పడిన ఎలక మాదిరిగా తయారైందన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బీజేపీ దొంగలు అడ్డంగా దొరికిపోవడంతో జాతీయ స్థాయిలో ఆ పార్టీ పరువు పోయిందన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీ నేతలు గందరగోళంలో ఉన్నారని తెలిపారు. బీజేపీ నేతలు చెంపలు వేసుకుని తప్పు ఒప్పుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు. 'మరోవైపు గవర్నర్ కూడా ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై మాట్లాడుతున్నారు. రాహుల్‌పై పోటీ చేసిన తుషార్ గురించి మేం చెప్పాం. కానీ గవర్నర్ మాత్రం తన ఏడీసీ తుషార్ గురించి మాట్లాడారు. గవర్నర్ హుందాగా ఉండాలి. గవర్నర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు' అని మంత్రి హరీష్ రావు అన్నారు. చదవండి: (పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు) -
హరీశ్ చొరవతో ఆ 9 మంది జీవితాలు మారాయి
సాక్షి, సిద్దిపేట: ఆరోగ్యంగా ఉండే గొర్రెలు, పొట్టేళ్లు, కోళ్లను కొని, పశువైద్యుడి చేత పరీక్షలు చేయిస్తారు. ఆయన ఓకే అంటే.. హలాల్ చేయిస్తారు. ఆపై మాంసం నుంచి బోన్స్ వేరుచేసి శుద్ధిచేస్తారు. మాంసాన్ని చిన్నచిన్న ముక్కలుచేసి ఉప్పు, కారం, అవసరమైన ఇతర మసాలా దినుసుల్ని దట్టించి.. ఇలా ఒక్కరోజే వంద కిలోల మాంసంతో అవలీలగా పచ్చడి పెట్టేస్తారు. దీని ప్యాకింగ్‌లో అనుసరించే పద్ధతులతో 3 నెలలైనా రుచిలో తేడారాదు. ఇదంతా చేసేది ఇర్కోడ్ మహిళా సమాఖ్యలోని 9మంది మహిళలు. మాంసంతో పచ్చళ్లు, స్నాక్స్ తయారీలో చేయితిరిగిన వీరు.. స్టార్ హోటళ్ల చెఫ్‌లకు ఏమాత్రం తీసిపోరు. ఈ ఫేమస్ సిద్దిపేట పచ్చళ్లు వెనుక కథ తెలుసుకోవాలంటే.. ఓ ఏడాది వెనక్కి వెళ్లాల్సిందే.. చలో మరి.. జీవితాలు మారాయిలా.. సిద్దిపేట జిల్లా ఇర్కోడ్ మహిళా సమాఖ్యలోని 20 మంది మహిళలు ఏడాది క్రితం మంత్రి హరీశ్‌రావును కలిశారు. ‘బీడీలు చుడుతూ, కూలీ పనులకు వెళ్తూ రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా పూట గడవట్లేదు. వంటలు బాగా వచ్చు. ఊరగాయలు బాగా పెడతాం. ఏదైనా ఉపాధి చూపించండి’ అని వేడుకున్నారు. ‘ఊరగాయలు అన్నిచోట్లా దొరుకుతున్నాయి.మాంసంతో పచ్చళ్లు, వంటకాలు చేయడం నేర్చుకుంటానంటే శిక్షణనిప్పిస్తా.. మీరు నిలదొక్కుకునే వరకు ఆర్థిక ప్రోత్సాహమిస్తా.. సరేనా?’ అన్నారు మంత్రి. చివరకు వారిలో 9మందే మిగిలారు. వీరంతా మంత్రి సూచనతో హైదరాబాద్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మీట్ (ఎన్ఆర్సీఎం)లో నెలపాటు మాంసాహార ఉత్పత్తుల తయారీలో శిక్షణ పొందారు. యూనిట్‌ను ప్రారంభించడానికి ప్రభుత్వం ఆర్థిక మద్దతుకు తోడు ఇర్కోడ్ సర్పంచ్ రూ.2 లక్షలు పెట్టుబడిగా సమకూర్చారు. మాంసం పచ్చళ్ల తయారీలో వీరి ప్రతిభను చూసిన ఎన్ఆర్సీఎం.. రూ.2 లక్షల విలువచేసే అధునాత కుకింగ్ మెషీన్లు అందించింది. అలా మొదలైంది.. తమకున్న వంటల పరిజ్ఞానానికి తోడు హైదరాబాద్‌లో పొందిన శిక్షణతో ‘సిద్దిపేట పచ్చళ్లు’ బ్రాండ్‌తో గతేడాది ఫిబ్రవరిలో మాంసం పచ్చళ్ల తయారీ ప్రారంభమైంది. మొదట చుట్టుపక్కల గ్రామాల్లోనే విక్రయాలు సాగాయి. డిమాండ్ పెరగడంతో.. పచ్చళ్లతో పాటు వీరు తయారుచేసే మాంసం స్నాక్స్ కూడలి ప్రాంతాల్లో విక్రయించడానికి వీలుగా రూ.10 లక్షల విలువైన ‘మీట్ ఆన్ వీల్స్’ మొబైల్ వాహనాన్ని మంత్రి హరీశ్‌రావు సమకూర్చారు. సిద్దిపేట మోడల్ రైతుబజార్లో వీరి ఉత్పత్తుల విక్రయ స్టాల్ ఏర్పాటైంది. అయితే, ప్రారంభమైన నెలకే కరోనా దెబ్బకు యూనిట్ మూతపడింది. తిరిగి ఈ ఏడాది గడిచిన మూడు నెలలుగా యూనిట్ నడుస్తోంది. మొత్తం నాలుగు నెలల్లో రూ.20 లక్షల మేరకు విక్రయాలు సాగించి ‘సిద్దిపేట మటన్, చికెన్ పచ్చడి’ రుచేంటో చూపించారీ మహిళలు. అంతా వాట్సాప్ ద్వారానే.. మాంసం పచ్చళ్లకు మంచి పేరొచ్చినా.. మార్కెటింగ్ సమస్యగా మారింది. దీంతో వీరంతా వాట్సాప్ గ్రూపుల్లో, స్టేటస్లు పెట్టడం ద్వారా తమ ఉత్పత్తుల ఖ్యాతిని ఎల్లలు దాటించారు. కేవలం వాట్సాప్ ద్వారానే రూ.20 లక్షల విలువైన ఉత్పత్తులను విక్రయించారు. సిద్దిపేటతో పాటు కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల తదితర జిల్లాల నుంచి ఎడారి దేశాలకు వలస వెళ్లిన వారు తమ వారి ద్వారా పచ్చళ్లను తెప్పించుకోవడంతో వీరి ఉత్పత్తులకు గల్ఫ్ దేశాలు ప్రధాన మార్కెట్‌గా మారాయి. అలాగే, అమెరికా ఇతర దేశాల్లో స్థిరపడిన తమ పిల్లలకు ఇక్కడి వారు పచ్చళ్లను పంపసాగారు. ప్రస్తుతం ఆన్లైన్ అమ్మకాల కోసం గూగుల్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ‘హాట్..హాట్’గా అమ్మకాలు వీరు తయారుచేసే 230 గ్రాముల మటన్ పచ్చడి రూ.300, చికెన్ పచ్చడి రూ.230, స్నాక్స్ 100 గ్రాములు రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. వీరు తయారుచేసే చికెన్ నగిడ్స్, పకోడీ, సమోసా, రోల్స్, ఎన్రోబెడ్ ఎగ్ వంటివి రోజూ సాయంత్రం కాగానే సిద్దిపేటలో హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. సిద్దిపేటతో పాటు హైదరాబాద్‌లో జరిగే పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఈ స్నాక్స్ భారీగా సరఫరా అవుతున్నాయి. ఇంకా వీరు తయారుచేసే కాకరకాయ, చింతకాయ, టమాటా, మిరపపండ్ల పచ్చళ్లకూ వడిమాండ్ ఉంది. హైదరాబాద్‌లోని పేరొందిన స్వీట్స్ సంస్థ.. ఇక్కడ తయారైన చింతకాయ పచ్చడిని ల్యాబ్‌లో పరీక్షించుకుని, నాణ్యమైనదని తేలడంతో క్వింటాళ్ల కొద్దీ ఆర్డర్ ఇచ్చింది. -
గుడ్‌న్యూస్: హైదరాబాద్‌లో ఆస్ట్రేలియా ఎంబసీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఆస్ట్రేలియా ఎంబసీని ఏర్పాటు చేసేందుకు పరిస్థితులు అనువుగా ఉన్నాయని, ఈ అంశాన్ని పరిశీలిస్తామని ఆ దేశ హైకమిషనర్ బారీ వో ఫారెల్ తెలిపారు. ఆర్థికమంత్రి హరీశ్‌రావుతో బుధవారం హైదరాబాద్‌లో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. చర్చల్లో భాగంగా దేశంలో కొత్తగా ఆస్ట్రేలియా రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటే హైదరాబాద్‌ను పరిగణనలోకి తీసుకోవాలన్న హరీశ్ విజ్ఞప్తికి ఫారెల్ సానుకూలంగా స్పందించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కోవిడ్ నుంచి త్వరగా కోలుకుందని, టూరిజం, హాస్పిటాలిటీ రంగాలు పుంజుకుంటున్నాయని హైకమిషనర్‌కు వివరించారు. సోలార్‌పవర్ లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. 24 గంటల విద్యుత్, వ్యవసాయం, సాగునీటి రంగాలపై అంశాలను ఫారెల్ అడిగి తెలుసుకున్నారు. -
ఉద్యమ స్ఫూర్తి కలకాలం నిలవాలి: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కలకాలం నిలవా లని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. టీఆర్ఎస్ 18వ ఆవిర్భా వ దినోత్సవాన్ని పురస్కరించుకొని ట్విట్టర్లో శనివారం ఆయన సీఎం కేసీఆర్, పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమ దీప్తి నిరంతరం వెలుగొందాలని పిలుపునిచ్చారు. -
ఐబీలో కొత్తడివిజన్
ఖమ్మం అర్బన్: జిల్లాలో సత్తుపల్లి కేంద్రంగా ఇరిగేషన్ (ఐబీ)లో కొత్త డివిజన్ ఏర్పాటు దాదాపు ఖరారైంది. ఇందుకు భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శనివారం అమోద ముద్ర వేసినట్లు తెలిసింది. డివి జన్ ఏర్పాటుపై రెండు రోజుల్లో ప్రభుత్వ జీవో జారీ కానున్నట్లు సమాచారం. జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పరిపాలన పరంగా ప్రతి జిల్లాలో సర్కిల్ కార్యాలయం ఉండాలనే ఆలోచనతో ఖమ్మంలో 10 నెలలు క్రితం ఐబీ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో సబ్ డివిజన్ హద్దులు మార్చడంతో పాటు, నియోజకవర్గానికి ఒక సబ్ డివిజన్ ఉండేలా ఇరిగేషన్లో పునర్విభజన చేశారు. భద్రాచలంలో ఉన్న డివిజన్ కార్యాలయం కూడా సత్యనారాయణపురంగా మార్పు చేశారు. తాజాగా ఇప్పటి వరకు ఖమ్మం డివిజన్ పరిధిలోని సత్తుపల్లి పరి సర ప్రాంతాలు, కొన్ని సబ్ డివిజన్లను కలపనున్నారు. పరిపాలనపరం గా మరింత చేరువ కావడంతో పాటు, భారీ విస్తీర్ణంతో ఉన్న ఖమ్మం డివిజన్‌ను విడదీసి సత్తుపల్లి కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటుకు రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలకంగా వ్యవహరించి మంజూరు చేయించినట్లు ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. సత్తుపల్లి డివిజన్‌తో పాటు కొత్తగా పెనుబల్లి సబ్‌డివిజన్ ఏర్పాటకు కూడా మంత్రి ఆమోదం తెలిపినట్లు తెలిసింది. సత్తుపల్లి డివిజన్ పరిధిలోకి సత్తుపల్లి సబ్ డివిజన్, కొత్తగా ఏర్పా టు కానున్న పెనుబల్లి సబ్‌డివిజన్, అశ్వారావుపేట సబ్ డివిజన్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఆర్అండ్బీ డివిజన్‌ను కూడా సత్తుపల్లిలోనే ఇటీవలనే ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇరిగేషన్ డివిజన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ రావడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది.