సాక్షి, సిద్దిపేట: ఆరోగ్యంగా ఉండే గొర్రెలు, పొట్టేళ్లు, కోళ్లను కొని, పశువైద్యుడి చేత పరీక్షలు చేయిస్తారు. ఆయన ఓకే అంటే.. హలాల్ చేయిస్తారు. ఆపై మాంసం నుంచి బోన్స్ వేరుచేసి శుద్ధిచేస్తారు. మాంసాన్ని చిన్నచిన్న ముక్కలుచేసి ఉప్పు, కారం, అవసరమైన ఇతర మసాలా దినుసుల్ని దట్టించి.. ఇలా ఒక్కరోజే వంద కిలోల మాంసంతో అవలీలగా పచ్చడి పెట్టేస్తారు. దీని ప్యాకింగ్‌లో అనుసరించే పద్ధతులతో 3 నెలలైనా రుచిలో తేడారాదు. ఇదంతా చేసేది ఇర్కోడ్ మహిళా సమాఖ్యలోని 9మంది మహిళలు. మాంసంతో పచ్చళ్లు, స్నాక్స్ తయారీలో చేయితిరిగిన వీరు.. స్టార్ హోటళ్ల చెఫ్‌లకు ఏమాత్రం తీసిపోరు. ఈ ఫేమస్ సిద్దిపేట పచ్చళ్లు వెనుక కథ తెలుసుకోవాలంటే.. ఓ ఏడాది వెనక్కి వెళ్లాల్సిందే.. చలో మరి..
జీవితాలు మారాయిలా..
సిద్దిపేట జిల్లా ఇర్కోడ్ మహిళా సమాఖ్యలోని 20 మంది మహిళలు ఏడాది క్రితం మంత్రి హరీశ్‌రావును కలిశారు. ‘బీడీలు చుడుతూ, కూలీ పనులకు వెళ్తూ రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా పూట గడవట్లేదు. వంటలు బాగా వచ్చు. ఊరగాయలు బాగా పెడతాం. ఏదైనా ఉపాధి చూపించండి’ అని వేడుకున్నారు.
‘ఊరగాయలు అన్నిచోట్లా దొరుకుతున్నాయి.మాంసంతో పచ్చళ్లు, వంటకాలు చేయడం నేర్చుకుంటానంటే శిక్షణనిప్పిస్తా.. మీరు నిలదొక్కుకునే వరకు ఆర్థిక ప్రోత్సాహమిస్తా.. సరేనా?’ అన్నారు మంత్రి. చివరకు వారిలో 9మందే మిగిలారు. వీరంతా మంత్రి సూచనతో హైదరాబాద్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మీట్ (ఎన్‌ఆర్‌సీఎం)లో నెలపాటు మాంసాహార ఉత్పత్తుల తయారీలో శిక్షణ పొందారు. యూనిట్‌ను ప్రారంభించడానికి ప్రభుత్వం ఆర్థిక మద్దతుకు తోడు ఇర్కోడ్ సర్పంచ్ రూ.2 లక్షలు పెట్టుబడిగా సమకూర్చారు. మాంసం పచ్చళ్ల తయారీలో వీరి ప్రతిభను చూసిన ఎన్‌ఆర్‌సీఎం.. రూ.2 లక్షల విలువచేసే అధునాత కుకింగ్ మెషీన్లు అందించింది.
అలా మొదలైంది..
తమకున్న వంటల పరిజ్ఞానానికి తోడు హైదరాబాద్‌లో పొందిన శిక్షణతో ‘సిద్దిపేట పచ్చళ్లు’ బ్రాండ్‌తో గతేడాది ఫిబ్రవరిలో మాంసం పచ్చళ్ల తయారీ ప్రారంభమైంది. మొదట చుట్టుపక్కల గ్రామాల్లోనే విక్రయాలు సాగాయి. డిమాండ్ పెరగడంతో.. పచ్చళ్లతో పాటు వీరు తయారుచేసే మాంసం స్నాక్స్ కూడలి ప్రాంతాల్లో విక్రయించడానికి వీలుగా రూ.10 లక్షల విలువైన ‘మీట్ ఆన్ వీల్స్’ మొబైల్ వాహనాన్ని మంత్రి హరీశ్‌రావు సమకూర్చారు. సిద్దిపేట మోడల్ రైతుబజార్‌లో వీరి ఉత్పత్తుల విక్రయ స్టాల్ ఏర్పాటైంది. అయితే, ప్రారంభమైన నెలకే కరోనా దెబ్బకు యూనిట్ మూతపడింది. తిరిగి ఈ ఏడాది గడిచిన మూడు నెలలుగా యూనిట్ నడుస్తోంది. మొత్తం నాలుగు నెలల్లో రూ.20 లక్షల మేరకు విక్రయాలు సాగించి ‘సిద్దిపేట మటన్, చికెన్ పచ్చడి’ రుచేంటో చూపించారీ మహిళలు.
అంతా వాట్సాప్ ద్వారానే..
మాంసం పచ్చళ్లకు మంచి పేరొచ్చినా.. మార్కెటింగ్ సమస్యగా మారింది. దీంతో వీరంతా వాట్సాప్ గ్రూపుల్లో, స్టేటస్‌లు పెట్టడం ద్వారా తమ ఉత్పత్తుల ఖ్యాతిని ఎల్లలు దాటించారు. కేవలం వాట్సాప్ ద్వారానే రూ.20 లక్షల విలువైన ఉత్పత్తులను విక్రయించారు. సిద్దిపేటతో పాటు కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల తదితర జిల్లాల నుంచి ఎడారి దేశాలకు వలస వెళ్లిన వారు తమ వారి ద్వారా పచ్చళ్లను తెప్పించుకోవడంతో వీరి ఉత్పత్తులకు గల్ఫ్ దేశాలు ప్రధాన మార్కెట్‌గా మారాయి. అలాగే, అమెరికా ఇతర దేశాల్లో స్థిరపడిన తమ పిల్లలకు ఇక్కడి వారు పచ్చళ్లను పంపసాగారు. ప్రస్తుతం ఆన్‌లైన్ అమ్మకాల కోసం గూగుల్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి.
‘హాట్..హాట్’గా అమ్మకాలు
వీరు తయారుచేసే 230 గ్రాముల మటన్ పచ్చడి రూ.300, చికెన్ పచ్చడి రూ.230, స్నాక్స్ 100 గ్రాములు రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. వీరు తయారుచేసే చికెన్ నగిడ్స్, పకోడీ, సమోసా, రోల్స్, ఎన్రోబెడ్ ఎగ్ వంటివి రోజూ సాయంత్రం కాగానే సిద్దిపేటలో హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. సిద్దిపేటతో పాటు హైదరాబాద్‌లో జరిగే పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఈ స్నాక్స్ భారీగా సరఫరా అవుతున్నాయి. ఇంకా వీరు తయారుచేసే కాకరకాయ, చింతకాయ, టమాటా, మిరపపండ్ల పచ్చళ్లకూ వడిమాండ్ ఉంది. హైదరాబాద్‌లోని పేరొందిన స్వీట్స్ సంస్థ.. ఇక్కడ తయారైన చింతకాయ పచ్చడిని ల్యాబ్‌లో పరీక్షించుకుని, నాణ్యమైనదని తేలడంతో క్వింటాళ్ల కొద్దీ ఆర్డర్ ఇచ్చింది.
బ్రాండ్ లోకల్.. ‘ఇర్కోడ్’ మాంసం పచ్చళ్లు గ్లోబల్..
Published Sun, Apr 4 2021 8:16 AM | Last Updated on Sun, Apr 4 2021 10:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment