పర్వం
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. మల్లికార్జున స్వామి ఆయన సతీమణులు లింగ బలిజల ఆడబిడ్డ అయిన బలిజ మేడలమ్మ, యాదవుల ఆడబిడ్డ అయిన గొల్లకేతమ్మలు నిత్యం పూజలందుకుంటున్నారు. ప్రతీ యేడాది మూడు నెలల పాటు జాతర జరుగుతుంది. రెండు పద్దతుల్లో స్వామి వారికి కళ్యాణం నిర్వహిస్తారు.
మార్గశిర మాసం చివరి ఆదివారం వీరశైవ ఆగమ పద్దతి ప్రకారం స్వామి వారి కళ్యాణం, మహాశివరాత్రి సందర్బంగా యాదవ సాంప్రదాయం ప్రకారం స్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నారు. జనవరి 19 నుంచి మార్చి 24వ తేదీ వరకు తెలుగురాష్ట్రాలతో పాటు ఒడిశా, చత్తీస్çగడ్, కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. పది ఆదివారాలు జాతర వారాలుగా నిర్వహిస్తారు. ఇదే విధంగా తెలంగాణలో ఐనవోలు, ఓదెలలో సైతం ఇదే విధంగా పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకోవడం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ.
కొమురవెల్లి మల్లన్నకు ప్రకృతి సిద్దమైన ఐదు రంగులను ఉపయోగించి పట్నం వేస్తారు. ఇందుకోసం పసుపు, కుంకుమ, గులాబీరంగు(బుక్క గులాల్), ఆకుపచ్చ పొడి (తంగేడు, చిక్కుడు ఆకులను ఎండబెట్టి పొడి చేస్తారు) తెల్ల పిండి (బియ్యం పిండి)ని వాడుతారు. పట్నాలు వేసేందుకు పసుపు, కుంకుమ, భక్తులు బస చేసిన ప్రాంతాల్లో వేసేది చిలక పట్నం. ఆలయంలోని గంగిరేణి చెట్టు వద్ద వేసేది నజర్ పట్నం. ఆలయం లోపల వేసేది ముఖ మండప పట్నం.
మల్లన్నకు ప్రతి ఏడాది లేదా రెండు లేదా మూడేండ్లకు ఒకసారి పట్నాలు వేసి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. మహాశివరాత్రి సందర్బంగా కొమురవెల్లిలోని తోట బావి దగ్గర పెద్ద పట్నం వేస్తారు. ఈ పెద్ద పట్నం 41 వరుసలతో దాదాపు 50 గజాల్లో వేస్తారు. జానపద రూపాల్లో ఒగ్గు పూజారులు కథను చెబుతూ పట్నం వేస్తారు. పట్నంలోకి మల్లికార్జునుడిని ఆహ్వానించి కల్యాణం చేసి తమ కోరికలను విన్నవించుకుంటారు. నుదుటిన బండారి పెట్టి కంకణాలు కట్టి ఒగ్గు పూజా కతువు నిర్వహిస్తారు. అలాగే స్వామివారి చరిత్రను సైతం వివరిస్తుంటారు. కొందరు ఇంటి వద్ద సైతం మల్లన్న పట్నాలు వేసి ఓ పండుగ లాగ బంధువులను పిలిచి చేస్తారు.
పట్నంలో ఒకే కొమ్ము ఉన్న శూలం
పెద్ద పట్నం వేసే ముందు ఒగ్గు పూజారులు తమ ఆచారం ప్రకారం గర్భాలయంలోని మూల విరాట్‌కు పట్టువస్త్రాలను సమర్పిస్తారు. స్వామివారిని పల్లకిలో ఊరేగింపుగా తీసుకువెళ్లి, కోనేట్లో స్నానం ఆచరింపజేస్తారు. పట్నం వేసే ప్రదేశంలో సుంకు పట్టిన తర్వాత, గొంగళిలో బియ్యం పోసి మైలపోలు తీస్తారు. స్వామివారు ధరించే ఒకటే కొమ్ము ఉన్న శూలం (ఒరగొమ్ము), డమరుకాన్ని నెలకొల్పుతారు. పసుపు, కుంకుమ, తెల్ల పిండి, సునేరు, పచ్చ రంగులను ప్రమథ గణాలుగా సమ్మిళితం చేసి, నిమ్మకాయతో చిత్ర కన్ను నెలకొల్పి శివలింగాన్ని చిత్రిస్తారు. రకరకాల డిజైన్లతో సర్వాంగ సుందరంగా పట్నాన్ని తీర్చిదిద్దుతారు.
పట్నం దాటడం....
ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను తీసుకొని పట్నం పై పెట్టి పూజారులు పూజలు నిర్వహిస్తారు. తర్వాత.. శివసత్తులు పట్నం దాటుతారు.. ఈ వేడుకను చూసేందుకు, పట్నం ముగ్గుపొడిని సేకరించుకొనేందుకు భక్తులు పోటీ పడతారు. ఈ ముగ్గును పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. పట్నాల మొక్కుల తర్వాత భక్తులు అగ్ని గుండాల కార్యక్రమంలో నిప్పుల మీద నడుస్తారు. అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు.
– గజవెల్లి షణ్ముఖ రాజు
సాక్షి, సిద్ధిపేట
Comments
Please login to add a commentAdd a comment