komuravelli mallanna
-
మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
కొమురవెల్లి(సిద్దిపేట): దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం గణపతిపూజ, స్వస్తివాచనం, రుద్రహోమం, అష్టోత్తర శతకళషాభిషేకం, అన్నపూజ, సహస్త్ర బిల్వార్చణ మొదలగు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ దంపతులు హాజరై రుద్రహోమం, విశేష అభిషేక అర్చన నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్గీస భిక్షపతి, ఈవో బాలాజీ, ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, ఏఈవోలు అంజయ్య, శ్రీనివాస్, పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్, ఆలయ ధర్మకర్తలు సౌజన్య, గిరిధర్, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొమురవెల్లి మల్లన్న జాతర
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో మల్లన్న జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. స్వామి వారి కల్యాణంతో మూడు నెలలపాటు జరిగే జాతరకు అంకురార్పణ జరగనుంది. ఈనెల 18న ప్రారంభమై మార్చి 20తో ముగుస్తుంది. మూడు నెలలపాటు బ్రహ్మో త్సవాలు జరిగే ఏకైక శైవక్షేత్రంగా కొమురవెల్లి ప్రసిద్ధి గాంచింది. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. నేటి కల్యాణానికి మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించనున్నారు. -
కొమురెల్లి మల్లన్నకు 6.5 కిలోల బంగారు కిరీటం
సాక్షి, సిద్దిపేట: కోర మీసాల కొమురెల్లి మల్లన్న ఇక స్వర్ణ కిరీటంతో దర్శనమివ్వనున్నారు. రూ.4 కోట్లు ఖర్చు చేసి 6.5కిలోల బంగారంతో కిరీటం తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. మంత్రులు తన్నీరు హరీశ్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వరంగల్ జోన్ ఉప కమిషనర్ శ్రీకాంత్ రావు, ఆలయ ఈఓ బాలాజీలు హైదరాబాద్‌లో మంగళవారం సమావేశమయ్యారు. భక్తులు కానుకల రూపంలో అందించిన బంగారం, ఎస్బీఐ బాండ్ల ద్వారా వచ్చిన బంగారంతో కిరీటం తయారు చేయించేందుకు నిర్ణయించారు. దాని నమూనాను ఆవిష్కరించారు. కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధికి సీఎం నేతృత్వంలో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని మంత్రులు తెలిపారు. -
కొమురవెల్లి మల్లన్న జాతర ప్రారంభం
కొమురవెల్లి(సిద్దిపేట): సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు(జాతర) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్నం వారంగా పిలిచే మొదటి ఆదివారం వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. గంగరేణిచెట్టు వద్ద పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు స్వామివారికి బోనాలు సమర్పించారు. కాగా, కరోనా మళ్లీ తీవ్రమైన నేపథ్యంలో ఈసారి భక్తుల రాక తగ్గింది. చిరుజల్లుల కారణంగా ఆలయ పరిసరాలు చిత్తడిగా మారాయి. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సోమవారం నిర్వహించే అగ్నిగుండాలు, పెద్దపట్నంను ఆలయ అధికారులు రద్దు చేశారు. -
కొమురవెల్లి ఆలయ సిబ్బంది చేతివాటం
సిద్దిపేట: ఓ భక్తురాలు హుండీలో వేసిన కానుక హుండీ లెక్కింపులో కనిపించలేదు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో చోటుచేసుకుంది. ఆలయ హుండీ లెక్కింపు నేపథ్యంలో సీసీ కెమెరాల ఫుటేజీని అధికారులు, ఆలయ కమిటీ చైర్మన్ శనివారం పరిశీలించారు. అయితే, హుండీలో ఓ భక్తురాలు మంగళసూత్రాన్ని హుండీలో వేస్తున్నట్లు సీసీ కెమెరాల పుటేజీలో కనిపించగా లెక్కింపులో మాత్రం ఆ మంగళసూత్రం కనిపించకుండాపోయింది. దీనిపై ఆలయ ఈవో రామకృష్ణారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి సిబ్బందికి మెమో జారీ చేస్తున్నట్లు తెలిపారు. -
మల్లన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన కేసీఆర్
వరంగల్: వరంగల్ జిల్లా చెర్యాల మండలం కొమరవెల్లి మల్లిఖార్జున స్వామి కల్యాణం ఆదివారం అంగరంగవైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కొమరవెల్లి మల్లన్నకు ప్రభుత్వం తరుపున ఆయన పట్టు వస్త్రాలతోపాటు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు హాజరయ్యారు. అలాగే కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం కేసీఆర్ కొమరవెల్లి వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు ఉదయం హెలికాప్టర్ లో కొమరవెల్లి చేరుకున్నారు. కేసీఆర్ కు పార్టీ నేతలు, నాయకులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.