![Sakshi Special Story About Jadala Ramalingeswara Swamy Temple](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/jadala.jpg.webp?itok=Ksb_rJRK)
మన గుడి... మన ఉత్సవం
తెలంగాణలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ప్రత్యేకమైనది నల్లగొండ జిల్లా చెరువుగట్టులోని పార్వతీ సమేత జడల రామలింగేశ్వరాలయం. పరమ పవిత్ర క్షేత్రంగా భక్తుల నీరాజనాలందుకుంటోంది. ఇక్కడి శివుడికి మొక్కితే ఎలాంటి బాధలైనా పోయి, ఆరోగ్యంప్రాప్తిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ క్షేత్రాన్ని ఆరోగ్యక్షేత్రంగా పిలుస్తారు. 3, 5, 7, 9, 11 అమావాస్య రాత్రులు ఈ క్షేత్రంలో స్వామివారి సన్నిధిలో నిద్రిస్తే చీడపీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
అందుకే ఇక్కడ అమావాస్య సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి క్షేత్రం ఇటీవలే బ్రహ్మోత్సవాలను పూర్తి చేసుకుంది. ప్రతి ఏటా మాఘ శుద్ధ పంచమి నాటి నుంచి ఆరు రోజులపాటు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో శివసత్తులు ఇక్కడకు చేరుకుంటారు. అగ్ని గుండాలు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణ. రథ సప్తమి శివ కళ్యాణానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. లోక కల్యాణార్థం పరశురాముడు 108 క్షేత్రాల్లో స్వయంగా ప్రతిష్టించిన శివలింగాలలో ఇది చివరిదిగా ప్రతీతి. పశ్చిమాభిముఖంతో శివుడు కొలువై ఉండడం ఈ క్షేత్రం ప్రత్యేకత.
పూర్వం హైహయ వంశ మూల పురుషుడు, కార్తవీర్జార్జునుడు వేటకోసం దండకారణ్యానికి వెళతాడు. అవిశ్రాంతంగా వేటాడిన పిదప బడలికకు గురైన చక్రవర్తి సపరివారంగా సమీపంలోని జమదగ్ని ఆశ్రమానికి వెళతాడు. అప్పుడు జమదగ్ని మహర్షి తన దగ్గరున్న కామధేనువు సహాయంతో అందరికి భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ ధేనువు మహత్తును మహర్షి దగ్గర అడిగి తెలుసుకున్న కార్తవీర్యార్జునుడు తనకు ఆ ధేనువును ఇవ్వాలని అడుగుతాడు. అందుకు మహర్షి తిరస్కరించడంతో కోపోద్రిక్తుడైన కార్తవీర్యార్జునుడు, జమదగ్నిని సంహరించి కామధేనువును తీసుకువెళతాడు.
ఆ సమయంలో బయటకు వెళ్లి వచ్చిన పరశురాముడు జరిగిన విషయం తెలుసుకొని తన తండ్రిని చంపిన కార్తవీర్యార్జునుని పరశువు (గొడ్డలి) తో సంహరిస్తాడు. అంతేకాదు రాజులపై కోపంతో భూప్రదక్షిణం చేసి క్షత్రియ సంహారం చేస్తాడు. అనంతరం పాప పరిహారార్థం దేశం నలుమూలలా 108 శివలింగాలను ప్రతిష్టించి, ఒక్కొక్క లింగం చెంత వేల సంవత్సరాలు తపస్సు చేసి, ఆ తపోఫలాన్ని ఆ క్షేత్రానికి ధారపోసి మానవ కల్యాణానికి పాటుపడతాడు.
అలా చివరగా ప్రతిష్టించిన 108వ శివ లింగం వద్ద ఎంత తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో, కోపగించుకున్న పరశురాముడు తన గడ్డలితో శివలింగం ఊర్ధ్వభాగంపై ఒక దెబ్బ వేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఇంతకాలం నువ్వు తపస్సు చేసిన ప్రాంతం, ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతుందని, కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులను అనుగ్రహి స్తుంటానని చెబుతారు. అనంతరం పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతి పొంది శివైక్యం పొందారని స్థల పురాణం చెబుతోంది.
మూడు గుండ్ల ఆకర్షణ
ఆలయం పక్కనే మూడు గుండ్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. వాటిల్లో మొదటి రెండింటినీ ఎక్కి మూడో దాన్ని చేరితే అక్కడ ఓ శివలింగం దర్శనమిస్తుంది. అయితే ఈ రాళ్లను ఎక్కేదారి క్లిష్టంగా ఉంటుంది. రాయి నుంచి రాయిని చేరే మధ్యలో ఉండే సందు చాలా ఇరుకుగా ఒక బక్కపల్చటి మనిషి అతి కష్టం మీద దాటే దారిలా కనిపిస్తుంది. ఎంత శరీరం ఉన్నవారైనా శివ నామస్మరణచేస్తూ వెళితే అందులోనుంచి అవతలికి సులభంగా చేరగలగటం శివుని మహిమకు తార్కాణంగా చెబుతారు. అయితే ప్రసుత్తం మూడు గుండ్లపైకి అందరూ వెళ్లి దర్శనం చేసుకునేందుకు ఇనప మెట్లను ఇరువైపులా ఏర్పాటు చేశారు.
ఎల్లమ్మకు బోనాలు
కొండపైకి కాలినడకన వెళ్లవచ్చు. మెట్లదారిలో వెళ్లే భక్తులు కాలబైరవుని దర్శనం చేసుకుంటారు. అనంతరం కోనేరుకు చేరుకొని స్నానం చేసి భక్తులు ముడుపుల గట్టు వద్దకు వెళ్లి అక్కడి చెట్టుకింద చెక్కతో చేసిన స్వామి పాదుకలను తమ శరీరం మీద ఉంచుకుని మొక్కుతారు. అనంతరం రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ఆంజనేయుడు, ఎల్లమ్మ, పరశురాములని దర్శించుకుంటారు. ఇక్కడ ఎల్లమ్మ దేవతకు బోనం తయారు చేసి నైవేద్యం సమర్పిస్తారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. శివశక్తులు నాట్యాలు చేస్తుంటారు.అనంతరం భక్తులు గట్టు కింద ఉన్న పార్వతీ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. కోరికలు నెరవేరిన వారు పల్లకి సేవ, వాహన సేవ, కోడెలు కడతారు. త్వరలో శివరాత్రికి ఇక్కడ జరగనున్న విశేష పూజలకు ముస్తాబవుతోంది ఆలయం.
ఆ పేరెలా వచ్చిందంటే...
రామలింగేశ్వరుని ఊర్ధ్వభాగాన పరశురాముడు గండ్ర గొడ్డలితో దెబ్బవేసిన చోట జడల వంటి రేఖలు ఉండటం వల్ల స్వామిని జడల రామలింగేశ్వరస్వామి అంటారు. చెరువు గట్టున ఉండటంతో చెరువుగట్టు జడల రామలింగేశ్వరాలయం అంటారు. కొండ దిగువన పార్వతీదేవి కొలువై ఉండటంతో పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంగా ప్రసిద్ధి కెక్కింది. కొండపై జడల రామలింగేశ్వరునికి 12వ శతాబ్దానికి చెందిన కాకతీయ గణపతిదేవ చక్రవర్తి గుహాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో తొలి ఏకాదశినాడు, కార్తీక సోమవారాల్లో, పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాలలో కడువైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. అలాగే ప్రతి ఏటా అమావాస్యనాడు అన్నదానం చేస్తాం.
– పోతలపాటి రామలింగేశ్వర శర్మ, ప్రధాన అర్చకులు
– చింతకింది గణేష్,
సాక్షి ప్రతినిధి, నల్లగొండ
Comments
Please login to add a commentAdd a comment