Ramalinga Swami
-
పరశురామ ప్రతిష్ఠిత.. జడల రామలింగేశ్వరుడు
తెలంగాణలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ప్రత్యేకమైనది నల్లగొండ జిల్లా చెరువుగట్టులోని పార్వతీ సమేత జడల రామలింగేశ్వరాలయం. పరమ పవిత్ర క్షేత్రంగా భక్తుల నీరాజనాలందుకుంటోంది. ఇక్కడి శివుడికి మొక్కితే ఎలాంటి బాధలైనా పోయి, ఆరోగ్యంప్రాప్తిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ క్షేత్రాన్ని ఆరోగ్యక్షేత్రంగా పిలుస్తారు. 3, 5, 7, 9, 11 అమావాస్య రాత్రులు ఈ క్షేత్రంలో స్వామివారి సన్నిధిలో నిద్రిస్తే చీడపీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ అమావాస్య సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి క్షేత్రం ఇటీవలే బ్రహ్మోత్సవాలను పూర్తి చేసుకుంది. ప్రతి ఏటా మాఘ శుద్ధ పంచమి నాటి నుంచి ఆరు రోజులపాటు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో శివసత్తులు ఇక్కడకు చేరుకుంటారు. అగ్ని గుండాలు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణ. రథ సప్తమి శివ కళ్యాణానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. లోక కల్యాణార్థం పరశురాముడు 108 క్షేత్రాల్లో స్వయంగా ప్రతిష్టించిన శివలింగాలలో ఇది చివరిదిగా ప్రతీతి. పశ్చిమాభిముఖంతో శివుడు కొలువై ఉండడం ఈ క్షేత్రం ప్రత్యేకత.పూర్వం హైహయ వంశ మూల పురుషుడు, కార్తవీర్జార్జునుడు వేటకోసం దండకారణ్యానికి వెళతాడు. అవిశ్రాంతంగా వేటాడిన పిదప బడలికకు గురైన చక్రవర్తి సపరివారంగా సమీపంలోని జమదగ్ని ఆశ్రమానికి వెళతాడు. అప్పుడు జమదగ్ని మహర్షి తన దగ్గరున్న కామధేనువు సహాయంతో అందరికి భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ ధేనువు మహత్తును మహర్షి దగ్గర అడిగి తెలుసుకున్న కార్తవీర్యార్జునుడు తనకు ఆ ధేనువును ఇవ్వాలని అడుగుతాడు. అందుకు మహర్షి తిరస్కరించడంతో కోపోద్రిక్తుడైన కార్తవీర్యార్జునుడు, జమదగ్నిని సంహరించి కామధేనువును తీసుకువెళతాడు. ఆ సమయంలో బయటకు వెళ్లి వచ్చిన పరశురాముడు జరిగిన విషయం తెలుసుకొని తన తండ్రిని చంపిన కార్తవీర్యార్జునుని పరశువు (గొడ్డలి) తో సంహరిస్తాడు. అంతేకాదు రాజులపై కోపంతో భూప్రదక్షిణం చేసి క్షత్రియ సంహారం చేస్తాడు. అనంతరం పాప పరిహారార్థం దేశం నలుమూలలా 108 శివలింగాలను ప్రతిష్టించి, ఒక్కొక్క లింగం చెంత వేల సంవత్సరాలు తపస్సు చేసి, ఆ తపోఫలాన్ని ఆ క్షేత్రానికి ధారపోసి మానవ కల్యాణానికి పాటుపడతాడు. అలా చివరగా ప్రతిష్టించిన 108వ శివ లింగం వద్ద ఎంత తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో, కోపగించుకున్న పరశురాముడు తన గడ్డలితో శివలింగం ఊర్ధ్వభాగంపై ఒక దెబ్బ వేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఇంతకాలం నువ్వు తపస్సు చేసిన ప్రాంతం, ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతుందని, కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులను అనుగ్రహి స్తుంటానని చెబుతారు. అనంతరం పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతి పొంది శివైక్యం పొందారని స్థల పురాణం చెబుతోంది. మూడు గుండ్ల ఆకర్షణఆలయం పక్కనే మూడు గుండ్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. వాటిల్లో మొదటి రెండింటినీ ఎక్కి మూడో దాన్ని చేరితే అక్కడ ఓ శివలింగం దర్శనమిస్తుంది. అయితే ఈ రాళ్లను ఎక్కేదారి క్లిష్టంగా ఉంటుంది. రాయి నుంచి రాయిని చేరే మధ్యలో ఉండే సందు చాలా ఇరుకుగా ఒక బక్కపల్చటి మనిషి అతి కష్టం మీద దాటే దారిలా కనిపిస్తుంది. ఎంత శరీరం ఉన్నవారైనా శివ నామస్మరణచేస్తూ వెళితే అందులోనుంచి అవతలికి సులభంగా చేరగలగటం శివుని మహిమకు తార్కాణంగా చెబుతారు. అయితే ప్రసుత్తం మూడు గుండ్లపైకి అందరూ వెళ్లి దర్శనం చేసుకునేందుకు ఇనప మెట్లను ఇరువైపులా ఏర్పాటు చేశారు. ఎల్లమ్మకు బోనాలుకొండపైకి కాలినడకన వెళ్లవచ్చు. మెట్లదారిలో వెళ్లే భక్తులు కాలబైరవుని దర్శనం చేసుకుంటారు. అనంతరం కోనేరుకు చేరుకొని స్నానం చేసి భక్తులు ముడుపుల గట్టు వద్దకు వెళ్లి అక్కడి చెట్టుకింద చెక్కతో చేసిన స్వామి పాదుకలను తమ శరీరం మీద ఉంచుకుని మొక్కుతారు. అనంతరం రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ఆంజనేయుడు, ఎల్లమ్మ, పరశురాములని దర్శించుకుంటారు. ఇక్కడ ఎల్లమ్మ దేవతకు బోనం తయారు చేసి నైవేద్యం సమర్పిస్తారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. శివశక్తులు నాట్యాలు చేస్తుంటారు.అనంతరం భక్తులు గట్టు కింద ఉన్న పార్వతీ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. కోరికలు నెరవేరిన వారు పల్లకి సేవ, వాహన సేవ, కోడెలు కడతారు. త్వరలో శివరాత్రికి ఇక్కడ జరగనున్న విశేష పూజలకు ముస్తాబవుతోంది ఆలయం. ఆ పేరెలా వచ్చిందంటే...రామలింగేశ్వరుని ఊర్ధ్వభాగాన పరశురాముడు గండ్ర గొడ్డలితో దెబ్బవేసిన చోట జడల వంటి రేఖలు ఉండటం వల్ల స్వామిని జడల రామలింగేశ్వరస్వామి అంటారు. చెరువు గట్టున ఉండటంతో చెరువుగట్టు జడల రామలింగేశ్వరాలయం అంటారు. కొండ దిగువన పార్వతీదేవి కొలువై ఉండటంతో పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంగా ప్రసిద్ధి కెక్కింది. కొండపై జడల రామలింగేశ్వరునికి 12వ శతాబ్దానికి చెందిన కాకతీయ గణపతిదేవ చక్రవర్తి గుహాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో తొలి ఏకాదశినాడు, కార్తీక సోమవారాల్లో, పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాలలో కడువైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. అలాగే ప్రతి ఏటా అమావాస్యనాడు అన్నదానం చేస్తాం. – పోతలపాటి రామలింగేశ్వర శర్మ, ప్రధాన అర్చకులు – చింతకింది గణేష్, సాక్షి ప్రతినిధి, నల్లగొండ -
ఈవారం కథ: 'తరలి వచ్చిన వసంతం'!
ఆమె నన్ను ఎప్పటికీ క్షమించదు : రమాకాంత్ సెప్టెంబర్ 3.. 2023 సంవత్సరం.. సాయంత్రం నాలుగు గంటలు. ఆసుపత్రి నుంచి డిశ్చారై్జ నేటికి మూడోరోజు. రియల్లీ సర్ప్రైయిజింగ్. భూమ్మీద నాకింకా నూకలున్నందుకు ఆనందించాలో.. విచారించాలో తెలియడం లేదు. నాలో ఇప్పుడు ఎలాంటి ఆశలు గానీ అసంతృప్తులు గానీ లేవు. డాక్టర్ నోటి వెంట వచ్చిన ఆ మూడుముక్కలు నా చెవిన పడ్డాక మనసు తేలికైంది. ఇక ఏ గొడవా లేదు. రోజులు లెక్కపెట్టుకుంటూ కాలం గడిపేయాల్సిందే. చివరిరోజుల్లో మనిషికి.. తనకు బాగా దగ్గరైన మిత్రులు గానీ, శత్రువులు గానీ గుర్తొస్తుంటారట. అందుకనేమో నాలో ఇప్పుడీ ఆలోచనలు.. ఏభైఆరేళ్ల నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు. వందల చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బహుభాషా చిత్రాల్లో నటించాను. అవార్డులెన్నో గెలుచుకున్నాను. పేరు, గౌరవం, డబ్బు, సెలబ్రిటీ స్టేటస్.. ఇవేవీ నాకు తెలియనివి కావు. వేషాల కోసం ప్రొడక్షన్ హౌస్‌ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాను. వెన్ను తట్టి ప్రోత్సహించిన వాళ్లకంటే తిరస్కరించిన వాళ్ళే ఎక్కువ. తర్వాత వాళ్ళే నా డేట్స్ కోసం నా ఇంటిచుట్టూ తిరగడం నేనెరుగుదును. దానికి నేనేం గర్వంగా ఫీలవ్వను. ఎందుకంటే ఎవరి టైమ్ ఎప్పుడొస్తుందో చెప్పలేం గదా! కానీ ప్రతినాయక పాత్రల్లో ఆదరించి నన్నో స్టార్‌ని చేసిన ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రం ఎప్పటికీ మరచిపోను. అందుచేత కృతజ్ఞతలు చెప్పాల్సివస్తే అది మొదట ప్రేక్షకులకే. తర్వాత సినీ రంగానికి! పరిశ్రమలోని ఎందరో ప్రముఖులు.. వారితో గల స్నేహాలూ, నైట్ పార్టీలూ నాకో కొత్త ఫిలాసఫీని పరిచయం చేశాయి. చివరకు అదే నా జీవితాన్ని తల్లకిందులు చేసింది. లోపలకు ఎవరో వచ్చినట్టున్నారు.. మంచంపై నిస్తేజంగా పడున్న నేను కళ్ళు తెరచి చూశాను. నా భార్య లత..ఆమెతో పాటు ఎవరో ఇద్దరు పరిచయస్తులు. నా అచేతనావస్థను చూసి సన్నగా వాళ్లలో గుసగుసలు.. ‘ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు? ప్చ్.. అంతా అతని కర్మ!’ ‘అతని కర్మ కాదు.. ఆమె చేసిన కర్మ!’ ‘ష్.. అవన్నీ ఇప్పుడెందుకులే..’ మాటలు ఆగిపోయాయి. లతకు ధైర్యం చెప్పి వాళ్ళ మానాన వాళ్ళు వెళ్లిపోయారు. వారి సంభాషణలో దొర్లిన ‘ఆమె’ మాత్రం ఈమె కాదు. ఆమె ఒకప్పటి నా కలల ప్రపంచం. నా జీవన మాధుర్యం. పాతికేళ్ళనాటి ఆమె జ్ఞాపకాలు ఒక్కటొక్కటిగా నాలో.. తన తమిళ చిత్రంలోని హీరోయిన్ పాత్ర కోసం నాట్యం తెలిసిన అమ్మాయి గురించి నా దర్శక మిత్రుడొకడు అన్వేషిస్తున్న కాలమది. అంతకు మునుపు రవీంద్రభారతిలో నాట్య ప్రదర్శనతో అమితంగా ఆకట్టుకున్న ఓ అమ్మాయి చప్పున గుర్తొచ్చింది. ఆమె పేరు మధురిమ. ఆమె వివరాలను కనుక్కొని అతనికి పంపించాను. ఆమె హీరోయిన్గా సెలెక్టయ్యి నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ కృతజ్ఞతాభావంతో ఓ రోజు ట్రీట్ ఇస్తానని రెస్టారెంట్‌కు ఆహ్వానించడంతో వెళ్లాను. ఒకే టేబుల్‌పై ఎదురెదురుగా కూర్చొని దగ్గరగా అలా చూడటం అదే తొలిసారి. విరిసిన మందారంలా.. స్వచ్ఛంగా.. ముగ్ధమనోహరంగా ఉందామె. ‘చెప్పండి.. ఏం తీసుకుంటారు?’ తేనెలొలుకుతున్నట్టు మధురంగా వినిపించిందామె గొంతు. ‘ఏదైనా చెప్పండి.. నో ప్రాబ్లెమ్’ అన్నాను. ‘ఐతే.. నాకిష్టమైనవన్నీ చెప్పేస్తా. ఫర్వాలేదా?’ అంది. సమ్మోహనమైన ఆమె నవ్వు నాలోని సీరియస్‌నెస్‌ను బద్దలు కొట్టింది. నవ్వాను తొలిసారి మనసు నిండుగా. ఆర్డర్ చేసినవి వచ్చాయి. తింటున్నంతసేపూ వసపిట్టలా మాట్లాడుతూనే ఉందామె. సొట్టబుగ్గల నడుమ ఆమె నవ్వు ముత్యాలహారంలా తళుక్కుమంటోంది. కలువకళ్ళ ఆమె ఓరచూపు ఆయస్కాంతంలా ఆకర్షిస్తూనే ఉంది. ఆమెతో గడిపిన ప్రతీక్షణం.. అద్భుత ఊహాలోకంలో హాయిగా విహరిస్తోన్న ఆనందపరవశం. ప్రేమిస్తున్నానని చెప్పేశాను ఒకరోజు ఆమోదించిందామె. ప్రపంచానికి చక్రవర్తినైనంత సంబరం నాలో! ఫోన్ కబుర్లూ.. షికార్లూ.. లాంగ్డ్రైవ్ల ద్వారా ఒకరి సాన్నిహిత్యాన్ని ఒకరం ఇష్టపడేవాళ్ళం. అప్పటికే పరిశ్రమలో మాపై రకరకాల కథనాలు ఇద్దరి ఇళ్ల వరకూ పాకాయి. అభ్యంతరాలేవి ఎటువైపు నుంచీ లేవు. కానీ ఆమెకు నామీద ఒకే ఒక్క విషయంపై అభ్యంతరమో.. ఆగ్రహమోగానీ తీవ్రంగా ఉండేది. ఎన్నోసార్లు దాన్ని బహిరంగంగా ప్రదర్శించింది. నన్ను మార్చాలని చూసింది. సున్నితంగా హెచ్చరించింది. మగాణ్ణి కదా.. అహం. గ్రహించలేకపోయాను. ఆ రోజు కార్తీక పౌర్ణమి. తన పుట్టిన రోజు. టెర్రస్ నుంచి విశాఖసాగర తీరం ఉరకలేస్తూ కనిపించసాగింది. పండు వెన్నెల వెలుగుల్లో ఇసుక తిన్నెలు బంగారు వర్ణంతో మెరుస్తున్నాయి. వీటన్నిటి సమక్షంలో తన పుట్టినరోజు వేడుక ఒక మధుర స్మృతిలా జరుపుకోవాలనేది మధు చిరకాల కోరిక. అది నెరవేరేసరికి రాత్రి తొమ్మిదయ్యింది. టేబుల్‌పై డిన్నర్ ఐటమ్స్ వున్నాయి. ‘మధూ.. ఇక భోంచేద్దామా’ అదుపు తప్పి తడబడిన మాటకు నా వైపు దూరం నుంచి సీరియస్‌గా చూసిందామె. ‘ఆకలిగా లేదు. నువ్వు భోంచెయ్’ అయిష్టంగానే అంది. ‘ఏం..ఎందుకని?’ ‘తినాలని లేదు’ ముఖంలోని గాంభీర్యం గొంతులో చేరి కఠినంగా వినిపించింది. ‘పోనీ.. నేను తినిపించనా?’ ‘ఎందుకు? నీ నోటి నుంచి వచ్చే వాసన భరించి తినడం కన్నా ఖాళీ కడుపుతో పడుకోవడం బెటర్.’ విసిరిన ఈటెలా వచ్చిపడిన ఆమె సమాధానానికి మత్తు దిగిపోయింది. కిందకు వెళ్లి సాయంత్రం నేను చేసిన ఘనకార్యమేమిటో గుర్తొచ్చింది. ‘సారీ మధు..’ అన్నాను. ‘మందు మానేస్తానని చేసిన ప్రామిస్ చేసిన సంగతి గుర్తుందా?’ ఆవేశంగా అంది. ‘ఉంది..కానీ ఈరోజు నీ పుట్టిన రోజు కదా అని..’ నసిగాను. ‘నీకెన్నిసార్లు చెప్పాలి.. డ్రంకర్డ్స్ అంటే నాకసహ్యమని! ఐనా నువ్వు మారడంలేదు. మారతావనే నమ్మకం కూడా లేదు. నీలాంటివాణ్ణి ప్రేమించినందుకు సిగ్గు పడుతున్నా.’ కళ్ళల్లో చేరిన సన్నటి కన్నీటిపొరను మునివేళ్ళతో తుడుచుకుంటూ అంది. ‘మధూ.. ఈ ఒక్కసారికి నమ్ము.. ప్లీజ్’ చిన్న పిల్లాడిలా అభ్యర్థించాను. ‘లేదు రమా.. ఈ రోజునుంచి మందు మానేస్తానని ఇదే లాస్ట్ ప్రామిస్ అని చెప్పి మరీ ఈ పని చేశావంటే నిన్నెలా నమ్మేది? ఇదిగో.. నువ్విచ్చిన గొలుసు. నాకవసరం లేదు. గుడ్ బై!’ గొలుసును నా చేతిలో పెట్టి రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకుంది. ఎంతసేపు పిల్చినా.. బతిమాలినా స్పందన లేదు. ఉండుండి వినిపిస్తోన్న ఆమె ఏడుపు తప్ప! ఉదయాన్నే రూమ్ ఖాళీ చేసి నాకంటే ముందు వెళ్ళిపోయింది. ఇక అప్పటినుంచి నన్ను కలవడానికి గానీ, మాట్లాడానికి గానీ ఇష్టపడలేదు. సెట్లో కనిపించినా ‘మనిద్దరి ఆలోచనలు వేరు. మనస్తత్వాలు వేరు. అవి కలవవు. మరిచిపో నన్ను’ అని కటువుగా చెప్పేసి దూరం పెట్టేసింది. నిర్వీర్యుడినయ్యాను. నాలో సగభాగం తెగిపడినట్టుగా కుంగిపోయాను. నిజమే. తప్పు నాదే. తన ఇష్టాయిష్టాలను ఏమాత్రం పట్టించుకోని అబ్బాయిని ఏ అమ్మాయైనా ఎందుకు ఇష్టపడాలి? డిప్రెషన్లో కూరుకుపోయాను. పెళ్ళయితే నాలో మార్పు వస్తుందని భావించిన అమ్మ పెళ్లి చేసుకోమంది. ఆమె సంతోషం కోసం పెళ్లి చేసుకున్నాను. మూడేళ్లకు నాకో కొడుకు. మధురిమ గురించిన సమాచారం పత్రికల ద్వారా కొన్నాళ్లకు తెలిసింది. హీరో అభిజిత్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనీ.. అతని భార్యగా జూబ్లీహిల్స్‌లోని ఖరీదైన భవంతిలో మహారాణిలా ఉంటోందని! విన్నాక నాకేం బాధనిపించలేదు. తనపై కోపం కూడా రాలేదు. జీవితం తనది.. దాన్ని ఎప్పుడు ఎవరితో ఎలా పంచుకోవాలో నిర్ణయించుకునే హక్కు ఆమెది. తనేం చిన్నపిల్ల కాదు గదా. కానీ ఎంతో ఇష్టంగా ప్రేమించిన మధురిమ జ్ఞాపకాల్ని ఎన్నాళ్ళైనా వదులుకోలేక పోయాను. ఆమెతో పంచుకున్న ప్రేమకబుర్లు చేసే గాయాల నుంచి తప్పించుకోలేకపోయాను. అదే నా పొరపాటు. నటనలో ఏకాగ్రత పోయింది. షూటింగ్‌లకు గైర్హాజరయ్యేవాడిని. రోజులు కాదు.. నెలలు. కొత్త తరంతో పోటీలో వెనకబడి పోయాను. అవకాశాలు కరువైపోయాయి. పార్టీలు ఎక్కువయ్యాయి. తాగుడికి బానిసనైపోయాను. భరించలేక మంచం పట్టి చనిపోయింది అమ్మ. లివరు పూర్తిగా, కిడ్నీలు పాక్షికంగా దెబ్బతిన్నాయని నేనిక బతకడం కష్టమని డాక్టర్లు తేల్చేశారు. వారంరోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. అందరూ వచ్చి చూసి పోతున్నారు. చనిపోయేలోగా మధునొకసారి చూడాలనీ వీలైతే మాట్లాడాలనీ ఎక్కడో మనసు మూలల్లో కోరిక ప్రబలంగా ఉంది. ఐనా నా పిచ్చి గానీ తనిక్కడికి వస్తుందా.. మనసారా మాట్లాడుతుందా.. ఇది జరిగే పనేనా? నా భార్య లత చాలా మంచిది. నా గురించి, మధురిమతో నాకున్న ఎఫైర్ గురించి తెలిసే పెళ్ళికి సిద్ధపడింది. ఎప్పటికైనా ఈ వ్యసనం నుంచి బయటపడి మారతాననేది ఆమె నమ్మకం. వమ్ము కావడానికి ఎంతో కాలం పట్టలేదు. ఐనా సరే.. నన్నామె ఏనాడూ తక్కువగా చూడలేదు. నా అభిమానిగా అదామె గొప్పతనం. అందుకు సదా ఆమెకు రుణపడి వుంటాను. స్వతహాగా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆ సంపాదనతోనే కుటుంబ బాధ్యతను తన నెత్తికెత్తుకుంది. కొడుకును చదివించింది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో దర్శకత్వ శిక్షణ నిప్పించింది. వాడి ప్రయత్నాలేవో సాగుతున్నాయి. ఎప్పటికైనా వాడిని దర్శకుడిగా చూడాలనేది మా ఇద్దరి కల. అది ఎప్పటికి నెరవేరుతుందో.. మా ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో, నా ప్రాణం ఎంతవరకు నిలుస్తుందో కాలమే సమాధానం చెప్పాలి. నిజాయితీ లోపించిన ప్రేమ ఎప్పటికీ సఫలం కాదు : మధురిమ సెప్టెంబర్ 20.. 2023 సంవత్సరం.. ఉదయం పన్నెండు గంటలు.. ‘హలో మధూ..’ ‘చెప్పండి..’ ‘నీకీ విషయం తెల్సా ..’ ‘ఏంటి?’ ‘రమాకాంత్ చనిపోయాడట..’ ‘ఈజ్ ఇట్ ట్రూ?’ ‘యస్.’ ‘ఎప్పుడు?’ ‘నిన్న సాయంత్రం నాలుగు గంటలకు.. వాళ్లింట్లోనే..’ ‘మై గాడ్.. ఎంత ఘోరం..’ ‘కంట్రోల్.. ఐ కెన్ అండర్ స్టాండ్ యువర్ పెయిన్. ఎంతైనా నీ మాజీ లవర్ కదా!’ ఎప్పటిలాగే సూదుల్లా గుచ్చే అతని మాటలు. బాధనిపించలేదు. నాకివి మామూలే. ‘అంతేకాదు. ఒకప్పుడతను మన కోస్టార్. అది మరిచిపోకు. మనసు రాయి చేసుకుని ఉండలేం కదా నీలాగ!’ నావైపు కౌంటర్ ఇచ్చి ఫోన్ పెట్టేశాను. టీవీ ఆన్ చేశాను. రమాకాంత్ మరణవార్త ప్రసారమవుతోంది. కృష్ణానగర్‌లోని అతనింట్లో ఫ్రీజర్‌లో ఎముకల పోగులా అతని శరీరం.. చుట్టూ అతని బంధుమిత్రులు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎలా ఉండేవాడు రమాకాంత్.. ఆరడుగుల ఎత్తుతో బలిష్టమైన దేహం.. చురుకైన కళ్ళతో.. ఎలాంటి పాత్రనైనా కొట్టి పిండి చేయగల సత్తాతో! అతని వెరైటీ విలనిజానికి ప్రత్యేక అభిమానవర్గం ఉండేది. సినిమాల్లో ఎంత క్రూరంగా ఉంటాడో బయట అంత సౌమ్యుడు. శత్రువుకైనా సాయం చేసే మనస్తత్వం! చిన్నప్పటినుంచి నాకు డాన్ ్స అంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే ఐదేళ్లు కష్టపడి కూచిపూడి నేర్చుకుని ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాను. ఒక డాన్స్ ప్రోగ్రామ్‌లో నన్ను చూసిన రమాకాంత్ ఓ తమిళ సినిమాలో హీరోయిన్ పాత్రకోసం సంప్రదించారు. అమ్మకు ఇష్టంలేకపోయినా నా బలవంతమ్మీద సరేనంది. ఆ సినిమా సక్సెసయ్యి సుమారు పాతిక సినిమాల్లో నటించాను. రమాకాంత్‌తో ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఎక్కడకు వెళ్లాలన్నా ఏ ఫంక్షన్‌కు హాజరవ్వాలన్నా కలిసి వెళ్లి.. కలిసే వచ్చేవాళ్ళం. ఆ చనువును ఎప్పుడూ ఆసరగా లేదు. అమ్మకూ అతనంటే అభిమానమే. అందుకే అతన్ని పెళ్లిచేసుకునేందుకు సిద్ధపడ్డాను. కానీ అతనికి ఒకే ఒక బలహీనత ఆల్కహాల్. ఏమాత్రం ఖాళీ దొరికినా స్నేహితులతో మందు పార్టీకే తొలి ప్రాధాన్యత. మానెయ్యమని ఎన్నోసార్లు చెప్పాను. బతిమాలాను. ‘పరిశ్రమలో మనుగడ సాగించాలంటే అందరితో టచ్‌లో ఉండాలి. కలిసి మెలిసి తిరగాలి. కనుక పార్టీలు తప్పవు’ అనే ఒక విచిత్రవాదనను వినిపించేవాడెప్పుడూ. ‘అదే నిజమైతే సినిమాలు మానేయ్. సంపాదించిన దాంతో ఏదైనా బిజినెస్ మొదలుపెట్టు. జీవితాంతం నేన్నీకు తోడుంటాను’ అని చాలాసార్లు హామీ నిచ్చాను. అతను పట్టించుకోలేదు. అమ్మ బెంగాలీ. నాన్నది ఇక్కడే. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. డాడీకున్న తాగుడు వ్యసనం వలన అమ్మ ఎంత బాధ పడిందో.. ఎన్ని ఇబ్బందులు.. అవమానాలు ఎదుర్కొందో నాకు తెలుసు. అందుకే తాగేవాళ్లంటే భయం. అసహ్యం. మందు మానేస్తానని ఎన్నోసార్లు రమాకాంత్ మాటిచ్చాడు. కానీ కట్టుబడిలేడు. అందుకే అతన్ని పూర్తిగా నమ్మలేకపోయాను. ఎక్కడైనా నమ్మకమూ, ప్రేమా ఉన్నచోటే గదా అభిమానం, ఆరాధన ఉండేవి. వాళ్ళమ్మ కూడా ఈ విషయంలో చేసేదేంలేదని చేతులెత్తేసింది. నా మనసు విరిగిపోయింది. నా నిర్ణయాన్ని అతనితో కరాఖండీగా చెప్పేశాను అదీ నా పుట్టిన రోజునాడే. అలా చెప్పడానికి నాలో నేనెంత వేదన పడ్డానో! మరచిపోవడం అతనికే కాదు. నాకూ కష్టమే! కానీ తప్పదు. నేను చాలా ప్రాక్టికల్. ప్రేమ పేరిట భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేంత పిచ్చితనం నాలో లేదు. ఆ తర్వాత అతను ఇల్లు ఎక్కడికో మార్చాడట. అదెక్కడో కూడా నాకు తెలియదు. కొన్నాళ్లకు హీరో అభిజిత్ లవ్ ప్రపోజల్ తెచ్చాడు.అతన్ని పెళ్లి చేసుకున్నాను. మరో ఏడాదికి అబ్బాయి పుట్టాడు. వాడిప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. నా భర్త చెడ్డవాడు కాదు. అలాగని మంచివాడూ కాదు. అతనొక మగాడు. అంతే! రమాకాంత్‌తో నా ప్రేమవ్యవహారాన్ని ముల్లులా గుచ్చుతూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు.. అమ్మాయిలతో అతనికిగల సంబంధాల్ని ప్రశ్నించినపుడల్లా! రమాకాంత్ పూర్తిగా మద్యానికి బానిసయ్యాడనీ, భార్య సంపాదనతోనే ఇల్లు నడుస్తోందని తెల్సి చాలా బాధపడ్డాను. చేయి దాటిన పరిస్థితిని ఎవరు మాత్రం చక్కదిద్దగలరు? కేవలం సానుభూతి చూపించడం తప్ప. అతనలా మారడానికి కారణం నేనేనని ఎక్కడెక్కడో విని ఎన్నో రోజులు కుమిలిపోయాను. అతనికా వ్యసనం నా మూలంగా అబ్బలేదు. దాన్ని నేను ప్రోత్సహించనూ లేదు. అలాంటపుడు నన్నెలా నిందిస్తారు? మనుషులు గానీ, బంధాలు గానీ దక్కనపుడు కలిగే దుఃఖాన్ని భరించగలిగే మానసిక స్థితి లేదని తెలిసినపుడు మనిషి ఎంత జాగ్రత్తగా ఉండాలి? సంబంధాల్ని ఎంత సున్నితంగా నెరపగలగాలి? ఒక పక్క భర్త ప్రవర్తనకూ మరోపక్క లోకం అపవాదుకూ మధ్యన నలిగిపోతూ ఎన్నో నిద్రలేని రాత్రుళ్ళు గడిపాను. ఆ మానసిక ఒత్తిడి నుంచి త్వరగా బయటపడి నగరంలోని ఒక రిచెస్ట్ ఏరియాలో డాన్ ్స స్కూల్ పెట్టాను. డాన్స్ చేస్తూ.. చూస్తూ.. నేర్పిస్తూ.. ఏళ్లుగా కోల్పోయిన నన్ను నేను అక్కడ పొందుతున్నాను. వారం క్రితం మేమిద్దరం నటించిన తొలి చిత్రాన్ని పాతికేళ్ళు నిండిన సందర్బంగా రీరిలీజ్ చేశారు. ఐమాక్స్ థియేటర్లో మళ్ళీ ఆ సినిమా చూసి నాటిæ షూటింగ్ అనుభూతుల్ని.. మధురస్మృతుల్ని ప్రెస్ మీట్ పెట్టి అందరం పంచుకున్నాం. మెయిన్ విలన్ ఒక్క రమాకాంత్ తప్ప. అతను తీవ్ర అనారోగ్యంతో బయటకురాలేని స్థితిలో ఉన్నాడనీ.. తెలిసి హృదయం ద్రవించింది. అతని చిరునామా ఎలాగోలా తెలుసుకొని చూసి రావాలనిపించింది. అంతలోనే హఠాత్తుగా ఈరోజు మరణ వార్త.. ‘రమాకాంత్ సర్ వాళ్లింటి దగ్గరకు వచ్చేశామమ్మా..’ డ్రైవర్ అన్నమాటతో ఈ లోకంలోకి వచ్చాను. కారు దిగి చుట్టూ చూశాను. జనంతో రద్దీగా వుంది. అభిజిత్‌కు కాల్ చేశాను. రమాకాంత్ చివరిచూపు కోసం వెళ్తున్నానీ.. రావడం లేటవుతుందనీ చెప్పి కాల్ కట్ చేశాను. లేకపోతే అటు నుంచి ఏం జవాబొస్తుందో నాకు తెలుసు. అది వినడం ఇష్టం లేదు. జనాల్ని తప్పించుకుంటూ లోపలకు నడిచాను. ఇంటి బయట టెంట్ వేసి ఉంది. రమాకాంత్ అంతిమ సంస్కారం పూర్తయినట్టుంది. బాధనిపించింది. గది మూలన అతని ఫొటో, దాని కింద దీపం వెలుగుతూ ఉంది. లీలగా వినిపిస్తోన్న బంధువుల రోదనలు తప్ప ఇల్లంతా ప్రశాంతం. నన్ను చూడగానే వచ్చారా అన్నట్టుగా చూసిందతని భార్య. బాగా తెలిసినవాడిలా కుర్రాడొకడు నన్ను లోపలకు తీసుకెళ్ళాడు. విశాలమైన రూమ్‌లో.. షెల్ఫ్‌లో షీల్డులూ, ఫొటోలూ, సన్మాన పత్రాల మెమెంటోలూ, కొన్ని పెయింటింగ్స్ కొలువుదీరి ఉన్నాయి. మరోపక్క నా బస్ట్ సైజ్ రూపం వాటర్ పెయింట్ ఒకటి గోడపై ఉంది. పుట్టిన రోజున నేను తిరిగిచ్చిన గోల్డ్ చైన్ పూదండలా దానిపై వేలాడుతోంది. ‘అదృష్టం ఒక్కసారే తలుపు తడుపుతుంది. దురదృష్టం తలుపు తీసేవరకూ తడుతూనే ఉంటుందట. ఆ అదృష్టం నేను చేజార్చుకున్న నీ సాహచర్యం. దురదృష్టం నన్ను కౌగిలించుకున్న ఈ వ్యసనం. మధూ.. క్షమించానని ఒక్క మాట చెప్పవూ..’ అని పెయింటింగ్ కింద రాసి ఉంది. చదివేసరికి గుండెను పిండేసినట్టయింది. కనుకొలకుల్లో నీళ్లు. ‘స్వఛ్చమైన, నిర్మోహమైన ప్రేమ కోసం జీవితపర్యంతం పరితపించి ప్రాణాలొదిలిన ప్రియ సఖుడా.. ఇదే నా కన్నీటి నివాళి. మనస్ఫూర్తిగా మన్నించా! వెళ్లి రా.. ప్రియనేస్తమా.. వేచి ఉంటా.. మరుజన్మలో నీ కోసం!’ నా మనసు ఆర్తిగా రోదించింది. ‘డాడీ ఎప్పుడూ మీ గురించే చెప్తుండే వారండీ.. యు ఆర్ ఏ వండర్ఫుల్ యాక్ట్రెస్ అంటూ!’ అన్నాడా కుర్రాడు. ఆ కుర్రాడెవరో అప్పుడర్థమైంది. కళ్ళు తుడుచుకొని నిశితంగా అతన్ని చూశాను. యుక్త వయసు రమాకాంత్ కనిపించాడు. పేరు హరీష్ అని చెప్పాడు. అతనితో చాలాసేపు మాట్లాడాను. మూగగా ఏడుస్తున్న రమాకాంత్ భార్య దగ్గరకు వెళ్లాను. ‘చనిపోయారనే వార్త ఈరోజు ఉదయమే తెల్సింది. అసలు రమాకాంత్ పరిస్థితి విషమంగా ఉందని ఈ మధ్యే విన్నాను. వద్దామని అనుకునేలోపే ఇలా.. ఆఖరికి చివరిచూపు కూడా దక్కలేదు’ వేదనగా అన్నాను. నా వైపే నిశ్చలంగా చూస్తూ వింటోందామె. ‘ఆయన ఉన్నప్పుడు కలిసుంటే బావుండేదండీ’ ముక్తసరిగా అందామె. కళ్లు దించుకున్నాను. ఇద్దరి మధ్యా కాసేపు నిశ్శబ్దం. తర్వాత ఆమెతో మాట్లాడాను. ఈలోపు కాఫీ తెచ్చిచ్చాడు హరీష్. తాగడం మొదలుపెట్టాను. ‘హరీష్.. నీకో గుడ్ న్యూస్. ఇందాకే మేడమ్ చెప్పారు’ అందామె. తెలుసన్నట్టు చిన్నగా నవ్వాడతను. తల్లీ కొడుకుల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. ఆ వెలుగు నాలో కూడా కొంత ప్రసరించింది. స్తబ్ధత, నైరాశ్యం ఒక్కసారిగా మాయమై రీలీఫ్గా అనిపించింది. లేచి నిలబడ్డాను. ‘రేపు ఆఫీస్‌లోనే ఉంటాను. హరీష్‌ను పంపించండి. అతనిదే ఆలస్యం. మా బ్యానర్లోనే.. నేనే ప్రొడ్యూసర్ని. అతన్ని దర్శకుణ్ణి చేసే బాధ్యత నాది. సరేనా?’ అన్నాను.. అంతకుముందు ఇద్దరితో చెప్పిన మాటను మళ్లీ ఒక్కసారి నిర్ధారిస్తున్నట్టుగా. ఆమె నా రెండు చేతుల్ని తన గుప్పిట్లోకి తీసుకొని కళ్ళకు అద్దుకుంటూ ‘థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్’ అంది.. ఆమె గొంతు సన్నగా వణికింది. కారెక్కి కూర్చొని చూస్తే ఆమె చెంపల పైనే కాదు నా రెండు చేతుల పైన కూడా ఆమె కన్నీటి బొట్లే! ఇవి చదవండి: నిజాలతో నిమిత్తం లేని.. 'అదొక అబద్ధాల అట్టహాసం'! -
ఆయన ‘ఉప్పే’ తింటున్నాం
కరోనా కారణంగా కొత్త పదాలు, ఔషధాలు, సంస్థలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అందులో ఒకటి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎం ఆర్). ఈ సంస్థే మన దేశా నికి సంబంధించిన సూచనలు ఇస్తోంది. అటువంటి సంస్థకు నాలుగు దశాబ్దాల క్రితమే ఒక తెలుగు తేజం తొలిసారి నాయకత్వం వహించింది. ఆయనే డాక్టర్ వి.రామలింగస్వామి. ‘పద్మభూషణ్’, ‘పద్మ విభూషణ్’ ఉలిమిరి రామలింగస్వామి. ఆయన 1921 ఆగస్టు 8న శ్రీకాకుళంలో జన్మిం చారు. విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కళాశాలలో వైద్యపట్టా సాధించారు. 1946లో అక్కడి నుంచే సర్వప్రథముడిగా ఎం.డి. పొందారు. విశాఖ నుంచి సొంత క్లినిక్‌కు కాకుండా ఊటీ దగ్గరి కూనూరు వెళ్ళారు. ఎందుకు? అక్కడ పాశ్చర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రఖ్యాతమైంది. ఇక్కడే మనదేశపు ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌కు అవసరమైన డి.పి.టి., రేబిస్ వ్యాక్సిన్లు తయారవుతాయి. ఇది లూయీస్ పాశ్చర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సదరన్ ఇండియాగా పిలువబడి, 1907లో పాశ్చర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాగా మారింది. ఇందులోనే 1918లో ఒక గదిలో బెరిబెరి వ్యాధి గురించి శోధించడానికి బెరిబెరి ఎంక్వైరీ యూనిట్ మొదలైంది. దీనికి మూలకారకులు రాబర్ట్ మేక్కారిసన్. ఈ సంస్థ కొంతకాలం ఆర్థిక కారణాలతో కుంటుపడి 1925లో డిఫిషియన్సీ డిసీజ్ ఎంక్వైరీగా పునః ప్రారంభమైంది. 1928–29లో న్యూట్రిషన్ రీసెర్చి ల్యాబొరేటరీగా మారింది. రాబర్ట్ మేక్ కారిసన్ మొదటి డైరెక్టర్‌గా కొనసాగారు. గాంధీజీతో ఈ దేశపు తిండిఅలవాట్లు, సమస్యల గురించి చర్చించే వారు. ఈ సంస్థకు గొప్ప జాతీయ భావనలు ఉన్నాయి. ఇది 1958లో హైదరాబాద్‌కు తరలి వచ్చింది. 1969లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌గా మారింది. దేశంలోనే ఎక్కువ కాలం సేవలందిస్తున్న వైద్య సంస్థలలో ఒకటి. రామలింగస్వామి కూనూరులో ఆహారంలో మాంసకృత్తుల లోపం కారణంగా కలిగే శారీరక రుగ్మతల గురించి పరిశోధనలు జరిపారు. వైద్య శాస్త్రంలో కీలకమైన పాథాలజీ (తెలుగులో రోగ నిర్ణయ శాస్త్రం అంటారు) విభాగంలో కృషి చేసి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందారు. తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో మరింత పరి శోధన కొనసాగించి 1954లో దేశానికి తిరిగి వచ్చారు. ప్రత్యేక ప్రతిపత్తి గల సంస్థగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభమైనప్పుడు పాథాలజీ ప్రొఫెసర్‌గా చేరారు. 1969లో దానికి డైరెక్టర్ అయ్యారు. ఇండి యన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐ.సి. ఎం.ఆర్.) డైరెక్టర్ జనరల్‌గా 1979–1986 దాకా వైద్యపరిశోధనకు, సేవలకు దిశానిర్దేశం చేశారు. కాలేయం, క్యాన్సర్, ఇంకా అనుబంధ అంశాలలో పరిశోధనలు చేశారు. ఆయన ప్రఖ్యాతమైన పరిశోధనా అంశం ఏమిటో తెలుసా! అయోడిన్ లోపాన్ని పూరించడానికి మామూలు ఉప్పు (సోడియం క్లోరైడ్) బదులు పొటాషియం అయో డేట్ ఇవ్వడం. దీని ఆధారంగానే నేష నల్ అయోడిన్ డెఫిషి యన్సీ కంట్రోల్ ప్రోగ్రామ్ రూపొం దింది. కశ్మీర్ కాంగ్రా లోయలో థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన గాయిటర్ వ్యాధిపై పరిశోధన చేశారు. నాన్ సిర్రోటిక్ పోర్టల్ ఫైబ్రోసిస్, ఇండియన్ చైల్డ్ సిర్రో సిస్‌కు సంబంధించిన ఆయన ఆవిష్కరణలు విశేష మైనవి. పలుచగా, చలాకీగా, నవ్వుతూ ఉండే రామ లింగస్వామి ప్రసంగాలు ఛలోక్తులతో ఆకట్టుకుం టాయని పేరు. లలితకళలు అంటే అభిమానం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీకి అధ్య క్షుడిగా, ప్రపంచ ఆరోగ్య సంస్థకు సలహాదారుగా, ఇంటర్నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఆన్ హెల్త్ రీసెర్చ్ ఫర్ డెవలప్మెంట్(జెనీవా)కు అధ్యక్షుడిగా సేవలందిం చారు. రష్యన్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ సభ్యులుగా ఎంపిక య్యారు. ఏ ఎయిమ్స్‌కు డైరెక్టర్‌గా పనిచేశారో అక్కడే క్యాన్సర్ కారణంగా చేరి, 80 ఏళ్ల వయసులో 2001 మే 28న కన్నుమూశారు. ఆయన సేవలకు గుర్తుగా న్యూఢిల్లీలోని అన్సారీనగర్లో వుండే ఐ.సి. ఎం.ఆర్. భవనానికి ఆయన పేరు పెట్టారు. (నేడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్–ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఉలిమిరి రామలింగస్వామి వర్ధంతి) వ్యాసకర్త : డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, సైన్స్ రచయిత, వర్తమాన అంశాల వ్యాఖ్యాత మొబైల్: 94407 32392 -
చట్టానికి తలవంచిన తల్లి ప్రేమ!
శ్రీకాకుళం క్రైం: పెంచిన ప్రేమను చట్టం కాదంది. అనధికార దత్తత చెల్లదంటూ ఓ బిడ్డను పెంపుడు తల్లి నుంచి వేరుచేసి కన్నతల్లి చెంతకు చేర్చింది. ఎల్.ఎన్.పేటలోని రోటరీనగర్‌లో నివాసముంటున్న ప్రసాదం గోపాలం, అనసూయ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించే ఆ దంపతులు వంశోద్ధారకుడి కోసం ఎదురుచూశారు. నాలుగో సంతానంగా ఈ నెల 15న ఆడపిల్లే జన్మించడంతో నలుగురిని ఎలా పెంచగలమని ఆవేదన చెందారు. శ్రీకాకుళం శివారు వాంబే కాలనీలో నివాసముంటున్న దూరపు బంధువులు బి.రామలింగస్వామి, మహేశ్వరి దంపతులకు పిల్లలు లేరని తెలుసుకున్నారు. ఎవరినైనా పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలియటంతో వారితో మాట్లాడారు. వారు ఇష్టపడడంతో అప్పుడే పుట్టిన శిశువును అప్పగించేశారు. ఐదు రోజులుగా రామలింగస్వామి దంపతులు ఆ బిడ్డను ప్రేమతో సాకుతున్నారు. పిల్లలు లేని లోటు తీరిందని ఆనందంగా గడుపుతున్నారు. అవిరైపోయిన ఆనందం.. ఇంతలోనే ఆ ఆనందం ఆవిరైపోయింది. గుర్తు తెలియని వ్యక్తి చైల్డ్‌లైన్ సిబ్బందికి ఫోన్ చేసి రామలింగస్వామి దంపతులు శిశువును అనధికారికంగా దత్తత తీసుకున్న విషయమై ఫిర్యాదు చేశారు. దీంతో చైల్డ్‌లైన్ అధికారులు విచారణ జరిపి వాస్తవం తెలుసుకున్నారు. చైల్డ్‌లైన్ సభ్యురాలు ఎస్.గీత, రామలింగస్వామి దంపతులకు చట్టం గురించి వివరించి శిశువును ఐసీడీఎస్ కార్యాలయానికి అప్పగించారు. ఐసీడీఎస్ అధికారులు శిశువు కన్నవారిని పిలిపించారు. పాపను అనధికారికంగా దత్తత ఇవ్వటం సరికాదని, పెంచలేకపోతే శిశువిహార్‌కు అప్పగించాలని సూచించారు. పాప తల్లిదండ్రులు ప్రసాదం గోపాలం, అనసూయలు మాట్లాడుతూ పాపను రామలింగందంపతులకే అప్పగిస్తామని, లేకుంటే తామే పెంచుకుంటామని తేల్చిచెప్పారు. శిశువును వేరొకరికి కిచ్చేందుకు అంగీకరించేదిలేదని తేల్చి చెప్పారు. దీంతో శిశువును శిశువిహార్‌లో ఉంచి ఈ నెల 27న రమ్మని ఐసీడీఎస్ అధికారులు సూచించారు. శిశువును శిశు విహార్‌లో ఉంచటమేమిటంటూ అక్కడకు చేరుకున్న సాక్షి ఛానల్ ప్రతినిధి అధికారులను నిలదీయడంతో కన్న తల్లిదండ్రులకు అప్పగించి పంపారు. ఈ నెల 27న హాజరు కావాలని ఇరువురు దంపతులకు ఐసీడీఎస్ ఏపీడీ పి.భవాని సూచించారు. కాగా ఐసీడీఎస్ అధికారులు చట్టం పేరుతో తమకు అన్యాయం చేశారంటూ రామలింగస్వామి దంపతులు వాపోయారు. వీరితో వచ్చిన స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.