డాక్టర్ రామలింగస్వామి
కరోనా కారణంగా కొత్త పదాలు, ఔషధాలు, సంస్థలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అందులో ఒకటి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎం ఆర్). ఈ సంస్థే మన దేశా నికి సంబంధించిన సూచనలు ఇస్తోంది. అటువంటి సంస్థకు నాలుగు దశాబ్దాల క్రితమే ఒక తెలుగు తేజం తొలిసారి నాయకత్వం వహించింది. ఆయనే డాక్టర్ వి.రామలింగస్వామి. ‘పద్మభూషణ్’, ‘పద్మ విభూషణ్’ ఉలిమిరి రామలింగస్వామి.
ఆయన 1921 ఆగస్టు 8న శ్రీకాకుళంలో జన్మిం చారు. విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కళాశాలలో వైద్యపట్టా సాధించారు. 1946లో అక్కడి నుంచే సర్వప్రథముడిగా ఎం.డి. పొందారు. విశాఖ నుంచి సొంత క్లినిక్‌కు కాకుండా ఊటీ దగ్గరి కూనూరు వెళ్ళారు. ఎందుకు? అక్కడ పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రఖ్యాతమైంది. ఇక్కడే మనదేశపు ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌కు అవసరమైన డి.పి.టి., రేబిస్ వ్యాక్సిన్లు తయారవుతాయి. ఇది లూయీస్ పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సదరన్ ఇండియాగా పిలువబడి, 1907లో పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాగా మారింది. ఇందులోనే 1918లో ఒక గదిలో బెరిబెరి వ్యాధి గురించి శోధించడానికి బెరిబెరి ఎంక్వైరీ యూనిట్ మొదలైంది. దీనికి మూలకారకులు రాబర్ట్ మేక్‌కారిసన్. ఈ సంస్థ కొంతకాలం ఆర్థిక కారణాలతో కుంటుపడి 1925లో డిఫిషియన్సీ డిసీజ్ ఎంక్వైరీగా పునః ప్రారంభమైంది. 1928–29లో న్యూట్రిషన్ రీసెర్చి ల్యాబొరేటరీగా మారింది. రాబర్ట్ మేక్ కారిసన్ మొదటి డైరెక్టర్‌గా కొనసాగారు. గాంధీజీతో ఈ దేశపు తిండిఅలవాట్లు, సమస్యల గురించి చర్చించే వారు. ఈ సంస్థకు గొప్ప జాతీయ భావనలు ఉన్నాయి. ఇది 1958లో హైదరాబాద్‌కు తరలి వచ్చింది. 1969లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌గా మారింది. దేశంలోనే ఎక్కువ కాలం సేవలందిస్తున్న వైద్య సంస్థలలో ఒకటి.
రామలింగస్వామి కూనూరులో ఆహారంలో మాంసకృత్తుల లోపం కారణంగా కలిగే శారీరక రుగ్మతల గురించి పరిశోధనలు జరిపారు. వైద్య శాస్త్రంలో కీలకమైన పాథాలజీ (తెలుగులో రోగ నిర్ణయ శాస్త్రం అంటారు) విభాగంలో కృషి చేసి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పొందారు. తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో మరింత పరి శోధన కొనసాగించి 1954లో దేశానికి తిరిగి వచ్చారు. ప్రత్యేక ప్రతిపత్తి గల సంస్థగా ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభమైనప్పుడు పాథాలజీ ప్రొఫెసర్‌గా చేరారు. 1969లో దానికి డైరెక్టర్ అయ్యారు. ఇండి యన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐ.సి. ఎం.ఆర్.) డైరెక్టర్ జనరల్‌గా 1979–1986 దాకా వైద్యపరిశోధనకు, సేవలకు దిశానిర్దేశం చేశారు. కాలేయం, క్యాన్సర్, ఇంకా అనుబంధ అంశాలలో పరిశోధనలు చేశారు. ఆయన ప్రఖ్యాతమైన పరిశోధనా అంశం ఏమిటో తెలుసా! అయోడిన్ లోపాన్ని పూరించడానికి మామూలు ఉప్పు (సోడియం క్లోరైడ్) బదులు పొటాషియం అయో డేట్ ఇవ్వడం. దీని ఆధారంగానే నేష నల్ అయోడిన్ డెఫిషి యన్సీ కంట్రోల్ ప్రోగ్రామ్ రూపొం దింది. కశ్మీర్ కాంగ్రా లోయలో థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన గాయిటర్ వ్యాధిపై పరిశోధన చేశారు. నాన్ సిర్రోటిక్ పోర్టల్ ఫైబ్రోసిస్, ఇండియన్ చైల్డ్ సిర్రో సిస్‌కు సంబంధించిన ఆయన ఆవిష్కరణలు విశేష మైనవి.
పలుచగా, చలాకీగా, నవ్వుతూ ఉండే రామ లింగస్వామి ప్రసంగాలు ఛలోక్తులతో ఆకట్టుకుం టాయని పేరు. లలితకళలు అంటే అభిమానం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీకి అధ్య క్షుడిగా, ప్రపంచ ఆరోగ్య సంస్థకు సలహాదారుగా, ఇంటర్నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఆన్ హెల్త్ రీసెర్చ్ ఫర్ డెవలప్‌మెంట్(జెనీవా)కు అధ్యక్షుడిగా సేవలందిం చారు. రష్యన్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ సభ్యులుగా ఎంపిక య్యారు. ఏ ఎయిమ్స్‌కు డైరెక్టర్‌గా పనిచేశారో అక్కడే క్యాన్సర్ కారణంగా చేరి, 80 ఏళ్ల వయసులో 2001 మే 28న కన్నుమూశారు. ఆయన సేవలకు గుర్తుగా న్యూఢిల్లీలోని అన్సారీనగర్‌లో వుండే ఐ.సి. ఎం.ఆర్. భవనానికి ఆయన పేరు పెట్టారు.
(నేడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్–ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఉలిమిరి రామలింగస్వామి వర్ధంతి)
వ్యాసకర్త : డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, సైన్స్ రచయిత, వర్తమాన అంశాల వ్యాఖ్యాత
మొబైల్: 94407 32392
Comments
Please login to add a commentAdd a comment