సందర్భం
క్షయ (టీబీ) వ్యాధిని పూర్తిగా నిర్మూలించే వ్యూహంలో భాగంగా డిసెంబర్ 7న మరో పరివర్తనాత్మక కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ వ్యాధిపై పోరాటాన్ని వేగవంతం చేసేందుకు, వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న 347 జిల్లాలను కలుపుకొని ప్రభుత్వం జాతీయ స్థాయిలో 100 రోజుల విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. టీబీ నిర్మూలనలో మన దేశం రోగ నిర్ధారణ వ్యవస్థలను విస్తరించేందుకు, రోగులు పూర్తిగా కోలుకునేందుకు తోడ్పడటానికి పోషకాహార సహాయ పథకం ‘ని–క్షయ పోషణ యోజన’ (ఎన్‌పీవై)ని అమలుచేస్తోంది. ఔషధాలకు లొంగని వేరియంట్ సోకిన రోగులకు చికిత్సలో ఎదురయ్యే సవాళ్లను పరిగణించి, స్వల్పకాలిక చికిత్సా విధానమైన బీపీఏఎల్‌ఎంకూ అనుమతి ఇవ్వడం విశేషం.
దేశం నుంచి క్షయ (టీబీ)ని పారదోలాలని గౌరవ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. ఆయన నాయకత్వంలో టీబీని నిర్మూలించేందుకు వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్సల్లో మార్పు తీసుకువచ్చేందుకు గత కొన్నేళ్లుగా వినూత్న విధానాలను భారత్ అవలంబిస్తోంది. డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసిన ‘ప్రపంచ టీబీ నివేదిక – 2024’లో ఇప్పటి వరకు దేశంలో అవలంబిస్తున్న విధానాలను ప్రస్తావించింది.
దేశంలో 2015 నుంచి 2023 వరకు 17.7 శాతం మేర టీబీ వ్యాప్తి తగ్గింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే వ్యాధి క్షీణత రేటు విషయంలో ఇది రెట్టింపు. అలాగే దేశ వ్యాప్తంగా 25.1 లక్షల మంది టీబీ రోగులను గుర్తించారు. ఫలితంగా ఈ వ్యాధికి చికిత్స తీసుకునేవారి శాతం 2015లో ఉన్న 59 నుంచి 2023 నాటికి 85 గణనీయంగా పెరిగింది.
ప్రధానమంత్రి దార్శనిక స్ఫూర్తితో టీబీని పూర్తిగా నిర్మూలించే వ్యూహంలో భాగంగా డిసెంబర్ 7న మరో పరివర్తనాత్మక కార్యక్రమం భారత్‌లో ప్రారంభమైంది. క్షయపై పోరాటాన్ని వేగవంతం చేసేందుకు, ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న 347 జిల్లాలను కలుపుకొని ప్రభుత్వం జాతీయ స్థాయిలో 100 రోజుల విస్తృత ప్రచార కార్య క్రమాన్ని పంచకుల నుంచి ప్రారంభించింది.
వ్యాధి తొలిదశలో ఉండగానే క్షయ రోగులందరినీ గుర్తించి వారికి సకాలంలో అవస రమైన, నాణ్యమైన చికిత్సను అందించాలనే మా సంకల్పాన్ని ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేస్తుంది. ‘జన్ భగీదారి’ స్ఫూర్తితో మనమంతా– ప్రజాప్రతినిధులు, ఆరోగ్య నిపుణులు, పౌరసమాజం, కార్పొరేట్ సంస్థలు, సంఘాల–సంయుక్తంగా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేద్దాం.
భారత్ నుంచి టీబీని తరిమేసే ప్రయాణంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అందిస్తున్న చురుకైన భాగస్వామ్యం... ఈ కార్యక్రమం మరో మైలురాయిగా నిలుస్తుందనే భరోసాను ఇచ్చింది.
టీబీ నిర్మూలనలో మన దేశ సామాజిక విధానం
రోగ నిర్ధారణ వ్యవస్థలను విస్తరించేందుకు, టీబీ రోగులు పూర్తిగా కోలుకొనేందుకు తోడ్పడటానికి పోషకాహార సహాయ పథకం... ‘ని–క్షయ పోషణ యోజన’ (ఎన్‌పీవై)ని భారత్ అమలుచేస్తోంది. ఏప్రిల్ 2018 నుంచి 1.16 కోట్ల మంది లబ్ధి దారులకు ఎన్‌పీవై పథకం ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో రూ. 3,295 కోట్లు అందించారు. ఈ పథకం ద్వారా నెలవారీగా అందించే ఆర్థిక సాయం గత నవంబర్ నుంచి రూ. 500 నుంచి రూ. 1000కి పెంచడం క్షయ నిర్మూలనలో భారత్ నిబద్ధతను సూచించే మరో అంశం.
మరో కీలక అంశం... పోషకాహర సమస్యను పరిష్కరించడంతో పాటు సమాజ భాగస్వామ్యం పెరిగేలా ‘టీబీ ముక్త భారత్ అభియాన్’ తోడ్పడింది. అలాగే సమాజంలో వివిధ వర్గాలను ఏకం చేసి అవగాహన పెంచడానికి, టీబీ రోగులకు పోషకాహారం, వృత్తిపరంగా, మానసికంగా సాయం అందించే దిశగా సామూహిక ఉద్య మాన్ని సృష్టించింది. జన్ భగీదారి స్ఫూర్తితో ప్రభుత్వ – పౌర భాగ స్వామ్యంతో చేపట్టిన ఈ ఉద్యమం 1.75 లక్షల మంది ని–క్షయ మిత్రల ద్వారా దేశవ్యాప్తంగా 21 లక్షల ఆహార కిట్లను సరఫరా చేసేందుకు స్ఫూర్తినిచ్చింది.
టీబీని రూపుమాపడానికి వినూత్న విధానం
అనేక సంవత్సరాలుగా చికిత్స సఫలతా రేటును పెంపొందించేందుకు బెడాక్విలైన్, డెలామనిడ్ వంటి సరికొత్త ఔషధాలను భారత్ ప్రవేశపెట్టింది. ఔషధాలకు లొంగని వేరియంట్ సోకిన రోగులకు చికిత్సలో ఎదురయ్యే సవాళ్లను పరిగణించి స్వల్ప కాలిక చికిత్సా విధానమైన బీపీఏఎల్‌ఎంకు అనుమతి నిచ్చాం. ఇప్పటికే ఉన్న చికిత్సా విధానాలతో పోలిస్తే ఇది మరింత ప్రభావ వంతంగా ఉంటుంది. ప్రస్తుతం మనకు 19 నుంచి 20 నెలల పాటు సాగే సంప్రదాయ చికిత్సా విధానంతో పాటు 9 నుంచి 11 నెలల పాటు సాగే చికిత్సా విధానం కూడా మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ బీపీఏఎల్‌ఎమ్ విధానంతో రోగులు ఆరు నెలల్లోనే చికిత్సను పూర్తి చేసుకోవచ్చు.
క్షేత్ర స్థాయిలో రోగులందరినీ గుర్తించి సత్వరమే చికిత్స అందించడడానికి వీలుగా అందుబాటులో అధునాతన పరికరాలు ఉండేలా నిరంతర కృషి చేస్తున్నాం. దీని కోసమే సమర్థవంతమైన, కచ్చితమైన పరీక్షా పద్ధతులను ప్రవేశపెట్టాం. అవే జీవ పరమాణు పరీక్షలు (మాలిక్యులర్ టెస్ట్స్). 2014 –15లో కొన్ని వందల సంఖ్యలో మాత్రమే ఉన్న వ్యాధి నిర్ధారణ పరికరాల సంఖ్య ప్రస్తుతం 8,293 కు చేరుకున్నాయి. ఈ పరికరాలు అన్ని జిల్లాల్లోనూ అందుబాటులో ఉన్నాయి.
‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ స్ఫూర్తితో స్వదేశీ జీవ పరమాణు పరీక్షలను క్షేత్రస్థాయిలో పరీక్షించి రూపొందించిన పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. తద్వారా జిల్లా, బ్లాకు స్థాయిల్లో టీబీ నిర్ధారణకు వెచ్చించే సమయాన్ని తగ్గించడంతో పాటు రోగ నిర్ధారణ పరీక్షలు, చికిత్సకు అయ్యే ఖర్చును తగ్గించగలిగాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన మన స్వదేశీ మాలిక్యులర్ పరీక్షలను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ఈ కార్యక్రమాలు టీబీ నిర్మూలనలో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపాయి.
2018 నుంచి టీబీ పరిశోధనలపై అధికంగా నిధులు వెచ్చిస్తున్న అగ్ర సంస్థల్లో ఒకటిగా భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) స్థిరంగా నిలవడం మనందరికీ గర్వకారణం. రోగులకు అతి చేరువలోనే సమర్థవంతమైన వ్యాధి నిర్ధారణ సౌకర్యాలతో సహా మరిన్ని నూతన సాధనాలను త్వరిత గతిన అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు కొనసాగిస్తాం.
భవిష్యత్తు వైపు దృష్టి సారిస్తూ...
వివిధ రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడం, నిరూపి తమైన సాంకేతికతలను వేగంగా అందుబాటులోకి తీసుకురావడం... టీబీ నిర్మూలనా దిశలో భారత్ నాయకత్వానికి నిదర్శనాలు. అధు నాతన రోగ నిర్ధారణ, చికిత్సలకు దారితీసే మార్గదర్శక పరిశోధనల నుంచి సార్వత్రిక సామాజిక తోడ్పాటును అందించే నియమాలను ప్రవేశ పెట్టేవరకూ... టీబీని పారదోలడంలో మన దేశం ముందంజలో ఉంది.
టీబీని గుర్తించడం, నిర్ధారించడం, చికిత్స, నివారణలో సామాన్య ప్రజలను భాగస్వాములను చేయడం ఈ సమయంలో అత్యవసరం. 100 రోజుల పాటు ఉద్ధృతంగా సాగే ప్రచారం టీబీని రూపుమాపడంలో సామూహిక నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. గౌరవనీయులైన ప్రధానమంత్రి నాయకత్వంలో అందరి భాగస్వా మ్యంతో, మానవాళికి పెద్ద శత్రువుగా ఉన్న టీబీని ఓడించి, ఆరోగ్య కరమైన భవిష్యత్తును కల్పిస్తామని నేను విశ్వసిస్తున్నాను.
జగత్ ప్రకాశ్ నడ్డా
వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment