Tuberculosis (TB) disease
-
క్షయ నిర్మూలన ఓ అత్యవసరం!
క్షయ (టీబీ) వ్యాధిని పూర్తిగా నిర్మూలించే వ్యూహంలో భాగంగా డిసెంబర్ 7న మరో పరివర్తనాత్మక కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ వ్యాధిపై పోరాటాన్ని వేగవంతం చేసేందుకు, వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న 347 జిల్లాలను కలుపుకొని ప్రభుత్వం జాతీయ స్థాయిలో 100 రోజుల విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. టీబీ నిర్మూలనలో మన దేశం రోగ నిర్ధారణ వ్యవస్థలను విస్తరించేందుకు, రోగులు పూర్తిగా కోలుకునేందుకు తోడ్పడటానికి పోషకాహార సహాయ పథకం ‘ని–క్షయ పోషణ యోజన’ (ఎన్‌పీవై)ని అమలుచేస్తోంది. ఔషధాలకు లొంగని వేరియంట్ సోకిన రోగులకు చికిత్సలో ఎదురయ్యే సవాళ్లను పరిగణించి, స్వల్పకాలిక చికిత్సా విధానమైన బీపీఏఎల్ఎంకూ అనుమతి ఇవ్వడం విశేషం.దేశం నుంచి క్షయ (టీబీ)ని పారదోలాలని గౌరవ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. ఆయన నాయకత్వంలో టీబీని నిర్మూలించేందుకు వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్సల్లో మార్పు తీసుకువచ్చేందుకు గత కొన్నేళ్లుగా వినూత్న విధానాలను భారత్ అవలంబిస్తోంది. డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసిన ‘ప్రపంచ టీబీ నివేదిక – 2024’లో ఇప్పటి వరకు దేశంలో అవలంబిస్తున్న విధానాలను ప్రస్తావించింది. దేశంలో 2015 నుంచి 2023 వరకు 17.7 శాతం మేర టీబీ వ్యాప్తి తగ్గింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే వ్యాధి క్షీణత రేటు విషయంలో ఇది రెట్టింపు. అలాగే దేశ వ్యాప్తంగా 25.1 లక్షల మంది టీబీ రోగులను గుర్తించారు. ఫలితంగా ఈ వ్యాధికి చికిత్స తీసుకునేవారి శాతం 2015లో ఉన్న 59 నుంచి 2023 నాటికి 85 గణనీయంగా పెరిగింది. ప్రధానమంత్రి దార్శనిక స్ఫూర్తితో టీబీని పూర్తిగా నిర్మూలించే వ్యూహంలో భాగంగా డిసెంబర్ 7న మరో పరివర్తనాత్మక కార్యక్రమం భారత్‌లో ప్రారంభమైంది. క్షయపై పోరాటాన్ని వేగవంతం చేసేందుకు, ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న 347 జిల్లాలను కలుపుకొని ప్రభుత్వం జాతీయ స్థాయిలో 100 రోజుల విస్తృత ప్రచార కార్య క్రమాన్ని పంచకుల నుంచి ప్రారంభించింది. వ్యాధి తొలిదశలో ఉండగానే క్షయ రోగులందరినీ గుర్తించి వారికి సకాలంలో అవస రమైన, నాణ్యమైన చికిత్సను అందించాలనే మా సంకల్పాన్ని ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేస్తుంది. ‘జన్ భగీదారి’ స్ఫూర్తితో మనమంతా– ప్రజాప్రతినిధులు, ఆరోగ్య నిపుణులు, పౌరసమాజం, కార్పొరేట్ సంస్థలు, సంఘాల–సంయుక్తంగా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేద్దాం.భారత్ నుంచి టీబీని తరిమేసే ప్రయాణంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అందిస్తున్న చురుకైన భాగస్వామ్యం... ఈ కార్యక్రమం మరో మైలురాయిగా నిలుస్తుందనే భరోసాను ఇచ్చింది. టీబీ నిర్మూలనలో మన దేశ సామాజిక విధానం రోగ నిర్ధారణ వ్యవస్థలను విస్తరించేందుకు, టీబీ రోగులు పూర్తిగా కోలుకొనేందుకు తోడ్పడటానికి పోషకాహార సహాయ పథకం... ‘ని–క్షయ పోషణ యోజన’ (ఎన్‌పీవై)ని భారత్ అమలుచేస్తోంది. ఏప్రిల్ 2018 నుంచి 1.16 కోట్ల మంది లబ్ధి దారులకు ఎన్‌పీవై పథకం ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో రూ. 3,295 కోట్లు అందించారు. ఈ పథకం ద్వారా నెలవారీగా అందించే ఆర్థిక సాయం గత నవంబర్ నుంచి రూ. 500 నుంచి రూ. 1000కి పెంచడం క్షయ నిర్మూలనలో భారత్ నిబద్ధతను సూచించే మరో అంశం.మరో కీలక అంశం... పోషకాహర సమస్యను పరిష్కరించడంతో పాటు సమాజ భాగస్వామ్యం పెరిగేలా ‘టీబీ ముక్త భారత్ అభియాన్’ తోడ్పడింది. అలాగే సమాజంలో వివిధ వర్గాలను ఏకం చేసి అవగాహన పెంచడానికి, టీబీ రోగులకు పోషకాహారం, వృత్తిపరంగా, మానసికంగా సాయం అందించే దిశగా సామూహిక ఉద్య మాన్ని సృష్టించింది. జన్ భగీదారి స్ఫూర్తితో ప్రభుత్వ – పౌర భాగ స్వామ్యంతో చేపట్టిన ఈ ఉద్యమం 1.75 లక్షల మంది ని–క్షయ మిత్రల ద్వారా దేశవ్యాప్తంగా 21 లక్షల ఆహార కిట్లను సరఫరా చేసేందుకు స్ఫూర్తినిచ్చింది.టీబీని రూపుమాపడానికి వినూత్న విధానంఅనేక సంవత్సరాలుగా చికిత్స సఫలతా రేటును పెంపొందించేందుకు బెడాక్విలైన్, డెలామనిడ్ వంటి సరికొత్త ఔషధాలను భారత్ ప్రవేశపెట్టింది. ఔషధాలకు లొంగని వేరియంట్ సోకిన రోగులకు చికిత్సలో ఎదురయ్యే సవాళ్లను పరిగణించి స్వల్ప కాలిక చికిత్సా విధానమైన బీపీఏఎల్ఎంకు అనుమతి నిచ్చాం. ఇప్పటికే ఉన్న చికిత్సా విధానాలతో పోలిస్తే ఇది మరింత ప్రభావ వంతంగా ఉంటుంది. ప్రస్తుతం మనకు 19 నుంచి 20 నెలల పాటు సాగే సంప్రదాయ చికిత్సా విధానంతో పాటు 9 నుంచి 11 నెలల పాటు సాగే చికిత్సా విధానం కూడా మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ బీపీఏఎల్ఎమ్ విధానంతో రోగులు ఆరు నెలల్లోనే చికిత్సను పూర్తి చేసుకోవచ్చు. క్షేత్ర స్థాయిలో రోగులందరినీ గుర్తించి సత్వరమే చికిత్స అందించడడానికి వీలుగా అందుబాటులో అధునాతన పరికరాలు ఉండేలా నిరంతర కృషి చేస్తున్నాం. దీని కోసమే సమర్థవంతమైన, కచ్చితమైన పరీక్షా పద్ధతులను ప్రవేశపెట్టాం. అవే జీవ పరమాణు పరీక్షలు (మాలిక్యులర్ టెస్ట్స్). 2014 –15లో కొన్ని వందల సంఖ్యలో మాత్రమే ఉన్న వ్యాధి నిర్ధారణ పరికరాల సంఖ్య ప్రస్తుతం 8,293 కు చేరుకున్నాయి. ఈ పరికరాలు అన్ని జిల్లాల్లోనూ అందుబాటులో ఉన్నాయి.‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ స్ఫూర్తితో స్వదేశీ జీవ పరమాణు పరీక్షలను క్షేత్రస్థాయిలో పరీక్షించి రూపొందించిన పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. తద్వారా జిల్లా, బ్లాకు స్థాయిల్లో టీబీ నిర్ధారణకు వెచ్చించే సమయాన్ని తగ్గించడంతో పాటు రోగ నిర్ధారణ పరీక్షలు, చికిత్సకు అయ్యే ఖర్చును తగ్గించగలిగాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన మన స్వదేశీ మాలిక్యులర్ పరీక్షలను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ఈ కార్యక్రమాలు టీబీ నిర్మూలనలో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపాయి.2018 నుంచి టీబీ పరిశోధనలపై అధికంగా నిధులు వెచ్చిస్తున్న అగ్ర సంస్థల్లో ఒకటిగా భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) స్థిరంగా నిలవడం మనందరికీ గర్వకారణం. రోగులకు అతి చేరువలోనే సమర్థవంతమైన వ్యాధి నిర్ధారణ సౌకర్యాలతో సహా మరిన్ని నూతన సాధనాలను త్వరిత గతిన అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు కొనసాగిస్తాం. భవిష్యత్తు వైపు దృష్టి సారిస్తూ...వివిధ రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడం, నిరూపి తమైన సాంకేతికతలను వేగంగా అందుబాటులోకి తీసుకురావడం... టీబీ నిర్మూలనా దిశలో భారత్ నాయకత్వానికి నిదర్శనాలు. అధు నాతన రోగ నిర్ధారణ, చికిత్సలకు దారితీసే మార్గదర్శక పరిశోధనల నుంచి సార్వత్రిక సామాజిక తోడ్పాటును అందించే నియమాలను ప్రవేశ పెట్టేవరకూ... టీబీని పారదోలడంలో మన దేశం ముందంజలో ఉంది. టీబీని గుర్తించడం, నిర్ధారించడం, చికిత్స, నివారణలో సామాన్య ప్రజలను భాగస్వాములను చేయడం ఈ సమయంలో అత్యవసరం. 100 రోజుల పాటు ఉద్ధృతంగా సాగే ప్రచారం టీబీని రూపుమాపడంలో సామూహిక నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. గౌరవనీయులైన ప్రధానమంత్రి నాయకత్వంలో అందరి భాగస్వా మ్యంతో, మానవాళికి పెద్ద శత్రువుగా ఉన్న టీబీని ఓడించి, ఆరోగ్య కరమైన భవిష్యత్తును కల్పిస్తామని నేను విశ్వసిస్తున్నాను.జగత్ ప్రకాశ్ నడ్డా వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి -
ఆ వ్యాధితో గతేడాది కోటిన్నర మంది మృతి.. కరోనా ఎంతపని చేసింది..?
దాదాపుగా దశాబ్ధం తర్వాత మొదటిసారి క్షయ (టీబీ) మరణాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురువారం విడుదలచేసిన గ్లోబల్ టీబీ - 2021 నివేదికలో వెల్లడించింది. చదవండి: ఛీ! యాక్!! మూడేళ్లగా పచ్చిమాంసం మాత్రమే తింటున్నాడు.. ఒక్క రోజు కూడా.. 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా క్షయ వ్యాధికి చికిత్స అందించడంలో తీవ్ర అంతరాయం కలిగింది. మహమ్మారి మూలంగా అనేక మంది రోగులు కనీసం వ్యాధి నిర్ధారణకు కూడా నోచుకోలేదు. గణాంకాల ప్రకారం 2019లో 7.1 కోట్ల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా, 2020లో ఆ సంఖ్య 5.8 కోట్లకు పడిపోయింది. అందుకు బారీ మూల్యమే చెల్లించవలసి వచ్చింది. గత యేడాది మనదేశంతో సహా దాదాపుగా 30 దేశాల్లో సమారు కోటిన్నర మంది (2,14,000 మంది హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తులతో కలిపి) క్షయతో మరణించారని డబ్యూహెచ్‌వో తన నివేదికలో తెలియజేసింది. ఐతే 2021-22లో టీబీ మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను హెచ్చరించింది. సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ చేయడం, చికిత్స అందించడంలోని సవాళ్లను అధిగమిస్తే దీనినుంచి బయటపడొచ్చని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాధుల కారణంగా అనారోగ్యంతో బాధపడేవారికి కోవిడ్ సమయంలో చికిత్స అందించడంలో తీవ్ర అంతరాయం కలిగింది. దాని పర్యవసానమే ఈ మృత్యుఘోష!! చదవండి: అప్పుడు కన్నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు.. ఇప్పుడు ఎందరికో ఆసరా..! -
క్షయ పంజా : 24.04 లక్షలకు చేరిన బాధితులు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో క్షయ(టీబీ) వ్యాధి పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా 24.04 లక్షల మంది టీబీ బారిన పడ్డారు. 2018తో పోలిస్తే ఇది 14శాతం మేర పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశంలో క్షయ వ్యాధిపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ‘ఇండియన్ టీబీ రిపోర్టు–2020’ బుధవారం విడుదల చేసింది. వర్చువల్ ఈవెంట్ ద్వారా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2025 నాటికి టీబీ రహిత దేశమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి పేర్కొన్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు దేశ వ్యాప్తంగా 24.04లక్షల టీబీతో బాధపడుతున్నారు. 2018తో పోలిస్తే ఈ ఏడాది 14 శాతం పెరిగింది. 2.9లక్షల మంది రోగుల వివరాలు తెలియరాలేదు. 2017లో 10 లక్షల మంది వివరాలు తెలియరాలేదు. ప్రైవేట్ సెక్టార్లలో నమోదు సంఖ్య 35 శాతం పెరగడంతో ఈ ఏడాది కొత్తగా 6.78 లక్షల రోగులను గుర్తించారు. టీబీతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య 8 శాతం పెరిగింది. క్షయ వ్యాధిగ్రస్థులకు హెచ్ఐవీ టెస్టులు నిర్వహించే సంఖ్య 81 శాతం పెరిగింది. చికిత్స సేవల విస్తరణ 12 శాతం పెరిగింది. 4.5 లక్షలకు పైగా డాట్ సెంటర్లు ఏర్పాటు చేసి దాదాపు ప్రతి గ్రామానికి చికిత్స అందిస్తున్నాయి. నిక్షయ్ పోషణ్ యోజన పథకాన్ని మరింత విస్తరిస్తూ క్షయ నిర్మూలనకు కృషి చేయడం క్షయ నివారణలో ఏపీకి రెండో స్థానం టీబీ నివారణ పోగ్రాంలో 2019 ఏడాదికి గాను దేశంలో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం దక్కింది. 50 లక్షలకు పైబడిన రాష్ట్రాల కేటగిరిలో ఏపీకి ప్రశంస పత్రం అందింది. జాతీయ క్షయ నిర్మూలన విభాగం బుధవారం ఢిల్లీలో నిర్వహించిన సదబ్బులో ‘ఇండియా టీబీ రిపోర్ట్ 2020’ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా 2019 అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రాష్ట్రాలకు మంత్రి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. క్షయ నిర్మూలకు తీవ్రంగా కృషి చేస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు. కాగా, టీబీ నివారణ పోగ్రాంలో గుజరాత్ మొదటి స్థానం, ఏపీ రెండో స్థానంలో నిలవగా, హిమాచల్ ప్రదేశ్ 3వ స్థానం దక్కించుకుంది. -
ఆ దేశాలకు కరోనా ముప్పు తక్కువేనా!?
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 80 వేల మందికి పైగా పొట్టనబెట్టుకున్న మహమ్మారి కరోనాపై పోరాటంలో తాజాగా బయటికొచ్చిన ఓ అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. క్షయ వ్యాధి నివారణలో కీలకంగా పనిచేసే బాసిల్ కాల్మెట్-గురిన్ (బీసీజీ) వ్యాక్సిన్ కోవిడ్-19 బాధితులు కోలుకునేందుకు చక్కగా పనిచేస్తున్నట్టు ‘కరోనా ఇన్ఫెక్షన్- బీసీజీ వ్యాక్సినేషన్ దేశాల్లో పరిస్థితి’ అంశంపై స్టడీ చేస్తున్న వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు సంభవించిన కరోనా మరణాల్లో బీసీజీ వ్యాక్సినేషన్ జరిగిన దేశాల్లో మృతుల సంఖ్య తక్కువగా ఉందని తెలిపారు. కోవిడ్-19 సోకిన బాధితుల్లో శ్వాస సంబంధ ఇబ్బందులను ఎదుర్కొనేందుకు బీసీజీ టీకా రోగ నిరోధక శక్తి పెంచుతోందా అనే దిశగా వారి పరిశోధనలు కొనసాగుతున్నాయి. కాగా, క్షయ వ్యాధి నివారణకు బీసీజీ టీకాను 1920లో ప్రవేశపెట్టారు. ప్రపంచంలోనే అత్యధిక మంది క్షయ బారినపడ్డ దేశంగా పేరు తెచ్చుకున్న భారత్‌లో అది 1948లో అందుబాటులోకి వచ్చింది. బీసీజీ కారణంగా క్షయ వ్యాధి బారినపపడ్డ ఎంతో మంది ప్రాణాలు నిలిచాయని.. అధ్యయన బృందంలో సభ్యుడు, హూస్టన్‌లోని యూరలోజిక్ అంకోలజీ అండ్ క్యాన్సర్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ ఆశిష్ కామత్ చెప్పారు. ఇక బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగిన దేశాల్లో కరోనా మృతుల రేటు ఒక మిలియన్‌కు 4.28 ఉండగా.. వ్యాక్సినేషన్ జరగని దేశాల్లో మరణాల రేటు ఒక మిలియన్‌కు 40గా ఉందని స్టడీ వెల్లడించింది. సార్వత్రిక, దీర్ఘకాలిక బీసీజీ విధానాలతో ఉన్న దేశాలతో పోల్చితే .. బీసీజీ టీకా విధానాలు లేని అమెరికా, ఇటలీ, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని తెలిపింది. ఇక కరోనాపై యుద్ధంలో బీసీజీ వ్యాక్సినేషన్ అనేది భారత్‌కు కలిసొచ్చే అంశమే అయినప్పటికీ.. అంతటితో సంతృప్తి చెందకూడదని కామత్ స్పష్టం చేశారు. అయితే, పెద్ద ఎత్తున ఎపిడెమియోలాజికల్ అధ్యయనాలు జరగనిదే.. బీసీజీ టీకాపై నిశ్చిత అభిప్రాయానికి రావడం తొందరపాటే అవుతుందని భారత్‌లోని వైద్యులు చెప్తున్నారు. -
తెలంగాణలో క్షయ విజృంభణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో క్షయ వ్యాధి రోజురోజుకూ విజృంభిస్తోంది. గతంలో కొంతమేర తగ్గిందనుకున్న ఈ వ్యాధి మళ్లీ పంజా విసురుతోంది. దేశంలోనే ఇది ప్రబలంగా పెరుగుతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మందులకు లొంగకపోవడం, దీనిపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబర్చకపోవడం తదితర కారణాలతో ఈ వ్యాధి మరింత విస్తరిస్తోందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో క్షయ వ్యాధిపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ‘ఇండియన్ టీబీ రిపోర్టు–2019’ను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం తెలంగాణలో 2017లో 44,644 టీబీ కేసులను గుర్తిస్తే, 2018లో ఆ సంఖ్య ఏకంగా 52,139కి చేరింది. ఏడాది కాలంలోనే రాష్ట్రంలో ఏకంగా 7,495 కేసులు పెరిగాయి. దేశవ్యాప్తంగా 27 లక్షల టీబీ కేసులున్నట్లు నివేదిక తెలిపింది. కేసుల్లో మూడింట రెండొంతుల మంది పురుషులే ఉండటం గమనార్హం. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 4.2 లక్షల మంది క్షయ వ్యాధితో బాధపడుతున్నారు. దేశంలో ఆ రాష్ట్రం టీబీలో టాప్‌లో ఉండగా, తెలంగాణ 14వ స్థానంలో నిలిచింది. 2017తో పోలిస్తే 2018లో దేశంలో 16 శాతం కేసులు పెరిగాయని నివేదిక తెలిపింది. -
ప్రమాదకరంగా పెరుగుతున్న టీబీ
- రాష్ట్రంలో ఏటా 2,500 మంది వరకు మృతి - గతేడాది 45 వేల కేసుల గుర్తింపు.. ఈ ఏడాది ఇప్పటికే 23 వేల మందికి సోకిన వ్యాధి సాక్షి, హైదరాబాద్: క్షయ (టీబీ) వ్యాధి మానవాళికి పెద్ద సవాలుగా మారుతోంది. దశాబ్దం క్రితం అంతరించిపోయిందనుకున్న ఈ వ్యాధి మళ్లీ విజృంభిస్తోంది. మారిన వాతావరణ పరిస్థితులతో ప్రపంచ వ్యాప్తంగా టీబీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. మన రాష్ట్రంలో ఏటా 40 వేల మంది కొత్తగా టీబీ బారిన పడుతున్నారు. 2017లో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 23,128 మందికి కొత్తగా టీబీ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారించారు. టీబీ నియంత్రణ కోసం ఏటా రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రాణనష్టం మాత్రం తగ్గడంలేదు. టీబీతో ప్రాణాలు కోల్పోతున్న వారు ఏటా 2,500 వరకు ఉంటున్నారు. ఆరోగ్య శాఖ అంచనాల ప్రకారం ఒక లక్ష మందిలో 217 మందికి టీబీ వస్తోంది. టీబీ ప్రమాదకరమైన అంటు వ్యాధి కావడంతో కుటుంబంలో ఒకరికి ఉంటే మిగిలిన వారికి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెచ్ఐవీ కేసులు పెరుగుతుండడం కూడా టీబీ రోగుల సంఖ్య పెరగడానికి కారణమవుతోంది. ప్రతి 10 మంది హెచ్ఐవీ బాధితులలో ఆరుగురికి టీబీ సోకుతోంది. ఏళ్లు గడుస్తున్నా... సుదీర్ఘకాలంగా టీబీ నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఆధునిక చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చినా ఈ వ్యాధి నిర్మూలన, నియంత్రణ మాత్రం ఆశించిన స్థాయిలో జరగడంలేదు. పైగా దశాబ్దం క్రితంతో పోల్చితే ప్రస్తుతం టీబీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. టీబీ నియంత్రణ కోసం వైద్య, ఆరోగ్య శాఖ ఆశించిన మేరకు పని చేయడంలేదనే విమర్శలు వస్తున్నాయి. టీబీ నిర్మూలన కోసం వైద్య శాఖలో ప్రత్యేకంగా ఒక విభాగం పని చేస్తోంది. సిబ్బంది కొరత ఈ విభాగం పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. టీబీ నిర్మూలన కార్యక్రమం ప్రత్యేక విభాగానికి రాష్ట్ర స్థాయిలో 24 పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఏడుగురు మాత్రమే పని చేస్తున్నారు. ఈ కార్యక్రమం అమలు కోసం జిల్లా స్థాయిలో 657 పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం 426 మంది మాత్రమే పని చేస్తున్నారు. పర్యవేక్షణ అధికారులు లేకపోవడం, క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది తక్కువగా ఉండడంతో టీబీ రోగులకు సరైన సమయంలో చికిత్స అందడంలేదు. దీంతో వ్యాధితో చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది. టీబీ అంటువ్యాధి కావడం, నిర్మూలన కార్యక్రమంలో లోపాల కారణంగా ఎక్కువ మందికి కొత్తగా సోకుతోంది. వెంటనే పరీక్షలు చేయిస్తే మంచిది.. క్షయ వ్యాధిని చికిత్సతోనే నిర్మూలించగలం. క్షయ వ్యాధి ఉన్న వారు క్రమం తప్పకుండా చికిత్స పొందడం వల్ల వారికి తగ్గుతుంది. అలాగే కొత్త వారికి ఈ వ్యాధి సోకదు. క్షయ వ్యాధిపై అవగాహన పెంచడం కోసం రాష్ట్ర స్థాయిలో కొత్తగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. రెండు వారాల కంటే ఎక్కువగా దగ్గు ఉండడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, ఛాతినొప్పి, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది వంటివి టీబీ లక్షణాలుగా ఉంటాయి. వెంటనే పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాధిని గుర్తించవచ్చు. –డాక్టర్ సూర్యప్రకాశ్, టీబీ నిర్మూలన కార్యక్రమం రాష్ట్ర అధికారి