ప్రమాదకరంగా పెరుగుతున్న టీబీ | Growing TB as dangerous | Sakshi
Sakshi News home page

ప్రమాదకరంగా పెరుగుతున్న టీబీ

Published Sat, Sep 16 2017 3:15 AM | Last Updated on Tue, Sep 19 2017 4:36 PM

ప్రమాదకరంగా పెరుగుతున్న టీబీ

ప్రమాదకరంగా పెరుగుతున్న టీబీ

- రాష్ట్రంలో ఏటా 2,500 మంది వరకు మృతి
గతేడాది 45 వేల కేసుల గుర్తింపు.. ఈ ఏడాది ఇప్పటికే 23 వేల మందికి సోకిన వ్యాధి
 
సాక్షి, హైదరాబాద్‌: క్షయ (టీబీ) వ్యాధి మానవాళికి పెద్ద సవాలుగా మారుతోంది. దశాబ్దం క్రితం అంతరించిపోయిందనుకున్న ఈ వ్యాధి మళ్లీ విజృంభిస్తోంది. మారిన వాతావరణ పరిస్థితులతో ప్రపంచ వ్యాప్తంగా టీబీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. మన రాష్ట్రంలో ఏటా 40 వేల మంది కొత్తగా టీబీ బారిన పడుతున్నారు. 2017లో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 23,128 మందికి కొత్తగా టీబీ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారించారు. టీబీ నియంత్రణ కోసం ఏటా రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రాణనష్టం మాత్రం తగ్గడంలేదు. టీబీతో ప్రాణాలు కోల్పోతున్న వారు ఏటా 2,500 వరకు ఉంటున్నారు.

ఆరోగ్య శాఖ అంచనాల ప్రకారం ఒక లక్ష మందిలో 217 మందికి టీబీ వస్తోంది. టీబీ ప్రమాదకరమైన అంటు వ్యాధి కావడంతో కుటుంబంలో ఒకరికి ఉంటే మిగిలిన వారికి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెచ్‌ఐవీ కేసులు పెరుగుతుండడం కూడా టీబీ రోగుల సంఖ్య పెరగడానికి కారణమవుతోంది. ప్రతి 10 మంది హెచ్‌ఐవీ బాధితులలో ఆరుగురికి టీబీ సోకుతోంది. 
 
ఏళ్లు గడుస్తున్నా...
సుదీర్ఘకాలంగా టీబీ నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఆధునిక చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చినా ఈ వ్యాధి నిర్మూలన, నియంత్రణ మాత్రం ఆశించిన స్థాయిలో జరగడంలేదు. పైగా దశాబ్దం క్రితంతో పోల్చితే ప్రస్తుతం టీబీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. టీబీ నియంత్రణ కోసం వైద్య, ఆరోగ్య శాఖ ఆశించిన మేరకు పని చేయడంలేదనే విమర్శలు వస్తున్నాయి. టీబీ నిర్మూలన కోసం వైద్య శాఖలో ప్రత్యేకంగా ఒక విభాగం పని చేస్తోంది. సిబ్బంది కొరత ఈ విభాగం పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. టీబీ నిర్మూలన కార్యక్రమం ప్రత్యేక విభాగానికి రాష్ట్ర స్థాయిలో 24 పోస్టులు ఉన్నాయి.

ప్రస్తుతం ఏడుగురు మాత్రమే పని చేస్తున్నారు. ఈ కార్యక్రమం అమలు కోసం జిల్లా స్థాయిలో 657 పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం 426 మంది మాత్రమే పని చేస్తున్నారు. పర్యవేక్షణ అధికారులు లేకపోవడం, క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది తక్కువగా ఉండడంతో టీబీ రోగులకు సరైన సమయంలో చికిత్స అందడంలేదు. దీంతో వ్యాధితో చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది. టీబీ అంటువ్యాధి కావడం, నిర్మూలన కార్యక్రమంలో లోపాల కారణంగా ఎక్కువ మందికి కొత్తగా సోకుతోంది. 
 
వెంటనే పరీక్షలు చేయిస్తే మంచిది..
క్షయ వ్యాధిని చికిత్సతోనే నిర్మూలించగలం. క్షయ వ్యాధి ఉన్న వారు క్రమం తప్పకుండా చికిత్స పొందడం వల్ల వారికి తగ్గుతుంది. అలాగే కొత్త వారికి ఈ వ్యాధి సోకదు. క్షయ వ్యాధిపై అవగాహన పెంచడం కోసం రాష్ట్ర స్థాయిలో కొత్తగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. రెండు వారాల కంటే ఎక్కువగా దగ్గు ఉండడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, ఛాతినొప్పి, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది వంటివి టీబీ లక్షణాలుగా ఉంటాయి. వెంటనే పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాధిని గుర్తించవచ్చు.
–డాక్టర్‌ సూర్యప్రకాశ్, టీబీ నిర్మూలన కార్యక్రమం రాష్ట్ర అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement