
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో క్షయ వ్యాధి రోజురోజుకూ విజృంభిస్తోంది. గతంలో కొంతమేర తగ్గిందనుకున్న ఈ వ్యాధి మళ్లీ పంజా విసురుతోంది. దేశంలోనే ఇది ప్రబలంగా పెరుగుతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మందులకు లొంగకపోవడం, దీనిపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబర్చకపోవడం తదితర కారణాలతో ఈ వ్యాధి మరింత విస్తరిస్తోందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో క్షయ వ్యాధిపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ‘ఇండియన్ టీబీ రిపోర్టు–2019’ను తాజాగా విడుదల చేసింది.
దీని ప్రకారం తెలంగాణలో 2017లో 44,644 టీబీ కేసులను గుర్తిస్తే, 2018లో ఆ సంఖ్య ఏకంగా 52,139కి చేరింది. ఏడాది కాలంలోనే రాష్ట్రంలో ఏకంగా 7,495 కేసులు పెరిగాయి. దేశవ్యాప్తంగా 27 లక్షల టీబీ కేసులున్నట్లు నివేదిక తెలిపింది. కేసుల్లో మూడింట రెండొంతుల మంది పురుషులే ఉండటం గమనార్హం. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 4.2 లక్షల మంది క్షయ వ్యాధితో బాధపడుతున్నారు. దేశంలో ఆ రాష్ట్రం టీబీలో టాప్‌లో ఉండగా, తెలంగాణ 14వ స్థానంలో నిలిచింది. 2017తో పోలిస్తే 2018లో దేశంలో 16 శాతం కేసులు పెరిగాయని నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment