
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో ప్రజలు తక్షణమే బూస్టర్ డోస్ టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్‌కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ చేపట్టింది. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో అన్ని జిల్లా కేంద్రాల్లో బూస్టర్ డోస్ పంపిణీ చేపడతారు. అందుకు సంబంధించి జిల్లాలకు ఆదేశాలు జారీచేశారు.
మొత్తం 1,571 కేంద్రాలలో ప్రత్యేకంగా బూస్టర్‌డోసు ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. రద్దీ ప్రాంతాల్లో మొబైల్‌వ్యాక్సినేషన్‌జరగనుంది. మార్కెట్లు, షాపింగ్‌మాల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ఇతర కేంద్రాల వద్ద ప్రత్యేక వాహనాల్లో టీకాల పంపిణీ చేస్తారు. 50 మందికి మించి, ముందస్తు విజ్ఞప్తి చేస్తే, వారికి ఆ మేరకు బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు.
ప్రస్తుతం మన రాష్ట్రంలో 1.60 కోట్ల మంది బూస్టర్ డోస్ వేసుకోవాల్సి ఉంది. అలాగే 9 లక్షల మంది రెండో డోస్ టీకా వేసుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిదిన్నర లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా రెండో డోసు, బూస్టర్ డోసు వ్యాక్సిన్ వేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పెద్దఎత్తున ప్రజలు తరలివస్తే ప్రస్తుతం ఉన్న టీకాలు సరిపోయే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో తక్షణమే కరోనా టీకాలు సరఫరా చేయాలని ఇటీవల కేంద్రానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విన్నవించిన సంగతి తెలిసిందే.
కొత్తగా 12 కరోనా కేసులు
రాష్ట్రంలో సోమవారం నిర్వహించిన 4,367 కరోనా నిర్ధారణ పరీక్షల్లో 12 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో కరోనా నుంచి ఆరుగురు కోలుకోగా, ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 65 యాక్టివ్ కేసులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment