వైద్య విద్య విభాగంలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. డీఎంఈ, అడిషనల్ డీఎంఈ, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ పోస్టులకు సంబంధించిన వయో పరిమితిని 61 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచే బిల్లును గవర్నర్ తిరస్కరించడమే ఇందుకు కారణం. దీనివల్ల డీఎంఈ సహా ఆయా పోస్టుల వయో పరిమితి 61 ఏళ్లకే పరిమితం కానుండగా.. మరోవైపు మెడికల్ కాలేజీల ప్రొఫెసర్ల వయో పరిమితి 65 ఏళ్లుగా కొనసాగనుంది.
ఇలా ఒకే విభాగంలో రెండు రకాల వయో పరిమితి కొనసాగనుండటంతో గందరగోళం ఏర్పడుతోంది. వాస్తవానికి మెడికల్ కాలేజీల్లోని ప్రొఫెసర్ల సీనియారిటీ ఆధారంగానే.. వారిలో కొందరిని డీఎంఈ, అడిషనల్ డీఎంఈ, ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్లుగా పోస్టింగ్ ఇస్తారు. అయితే ఈ పోస్టింగులు పొందిన తర్వాత వయో పరిమితి తగ్గిపోనుండటం సంక్షోభానికి దారితీస్తోంది.
డీఎంఈల వయో పరిమితి పెంచకపోవడంతో..
ప్రస్తుతం వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ)గా డాక్టర్ రమేష్రెడ్డి ఉన్నారు. డీఎంఈ కార్యాలయంలో ముగ్గురు అదనపు డీఎంఈలుగా పని చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లు, అనుబంధ ఆసుపత్రుల్లో సూపరింటెండెంట్లు పనిచేస్తున్నారు. అయితే నరసింహన్ గవర్నర్‌గా ఉన్న సమయంలో ప్రభుత్వం ప్రొఫెసర్ల వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచింది. కానీ అప్పట్లో డీఎంఈ తదితర పోస్టుల వయో పరిమితి పెంపు మాత్రం జరగలేదు.
ఆ పోస్టులకు ముందుకొచ్చేదెవరు?
గవర్నర్ తాజా నిర్ణయంతో ఆయా పోస్టుల్లో పనిచేసే 61 ఏళ్లు పైబడినవారు అనర్హులవుతారు. ప్రస్తుతం డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డి సహా ఎనిమిది మంది ఇప్పటికిప్పుడు రిటైర్ కావలసి వస్తుంది. అంతేకాదు వచ్చే ఏడాదిలోగా మరో ఏడెనిమిది మంది కూడా పదవీ విరమణ పొందాల్సి ఉంటుంది. గవర్నర్ నిర్ణయం ఇకముందు కూడా అమలైతే ప్రస్తుతం పనిచేసే ప్రొఫెసర్లలో ఎంతమంది.. అడిషనల్ డీఎంఈలు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లుగా పని చేసేందుకు ముందుకు వస్తారు?, ప్రొఫెసర్‌గా 65 ఏళ్ల వరకు కొనసాగే అవకాశాన్ని వదులుకుని 61 ఏళ్ల వయో పరిమితి ఉన్న పోస్టులకు ఎందుకు వెళతారు? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
ఒకవేళ అక్కడ 61 ఏళ్ల వరకు ఉండి, తిరిగి ప్రొఫెసర్‌గా కాలేజీల్లో 65 ఏళ్ల వరకు కొనసా గే అవకాశం ఉన్నా బాగుండేదని, కానీ ఆ చాన్స్ లేదని అంటున్నారు. పైగా జిల్లాల్లోని మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపాల్‌గా వెళ్లడం కంటే హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా 65 ఏళ్ల వరకు పనిచేసుకోవడమే మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
తక్షణ కర్తవ్యం ఏమిటి?
వయో పరిమితి పెంపు బిల్లును గవర్నర్ తిరస్కరించడంతో, భవిష్యత్ కార్యాచరణపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. గవర్నర్ నిర్ణయాన్ని అమలు చేయడమా? లేక బిల్లును మరోసారి అసెంబ్లీలో పాస్ చేసి తిరిగి పంపడమా? అనేది తేలాల్సి ఉంది. దీనిపై ఏదో ఒకటి తేలేవరకు...ఆయా పోస్టుల్లో 61 ఏళ్లు దాటిన వారు దిగిపోవాలా? లేదా కొనసాగాలా? అన్నది కూడా తేల్చాల్సి ఉంది. ఒకవేళ వారిని తొలగిస్తే ఆయా పోస్టుల్లో ఉన్నవారు కోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రొఫెసర్ పోస్టుకు 65 ఏళ్లుండగా, ప్రొఫెసర్ పోస్టులు వదులుకుని వచ్చే అడిషనల్ డీఎంఈలు, ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్ల వయో పరిమితిని 61 ఏళ్లకే పరిమితం చేయడం ఏమేరకు కరెక్ట్ అనే వాదనతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
ఈ ఏడాది కొత్త మెడికల్ కాలేజీలతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయి. వాటిల్లో ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లు కలిపి మొత్తం 52 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం 18 మంది ప్రిన్సిపాళ్లుగా, సూపరింటెండెంట్లుగా ఉన్నారు. కొందరికి పోస్టింగ్‌లు ఇచ్చినా చేరలేదు. దీంతో అక్కడ సీనియర్లను ఇన్‌చార్జిలుగా కొనసాగిస్తున్నారు.
చదవండి: నిరుపేదల ఉపాధిపై రాబందులు వాలిపోయే..'దళితబంధు విందాయే'!
Comments
Please login to add a commentAdd a comment