
అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
సందర్భం
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ తొలి రోజున తీసుకున్న అనేక నిర్ణయాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి వైదొలగడం ఒకటి. దీని ప్రభావం కేవలం అమెరికాకే పరిమితం కాదు. ప్రపంచ ఆరోగ్య భద్రతపై కూడా తీవ్రంగానే ఉండనుంది. కోవిడ్–19 పరిస్థితులను సక్రమంగా నియంత్రించలేకపోవడం, అత్యవసరమైన సంస్కరణలను చేపట్టడంలో విఫలమైన కారణంగా తామీ నిర్ణయం తీసుకుంటున్నట్లు ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తెలిపింది. సభ్యదేశాల అనవసర రాజకీయ జోక్యాన్ని నివారించడంలోనూ డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది. అమెరికా ఇతర దేశాలతో పోలిస్తే, మరీ ముఖ్యంగా చైనా కంటే ఎక్కువగా డబ్ల్యూహెచ్‌ఓకు మద్దతిస్తోందనీ, 140 కోట్లకు పైగా జనాభా ఉన్న చైనా చాలా చిన్న మొత్తం మాత్రమే తన వంతుగా ఇస్తోందనీ కూడా ఈ ఆర్డర్‌లో పేర్కొన్నారు.
డబ్ల్యూహెచ్‌ఓ చేసింది ఎంతో!
ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌ఓ మొత్తం బడ్జెట్‌లో 18 శాతం అమెరికా నుంచే వస్తోంది. 2024, 2025 సంవత్సరాలకుగాను ఈ సంస్థ బడ్జెట్ సుమా రుగా 680 కోట్ల డాలర్లు! రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, వ్యాధి సంబంధిత విషయాలను పర్యవేక్షించేందుకుగాను ఐక్యరాజ్య సమితి ప్రత్యేక విభాగంగా డబ్ల్యూహెచ్‌ఓ ఏర్పాటైంది. అంతర్జాతీయంగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, ఆరోగ్య సంబంధిత విధానాలను రూపొందించేవారి నెట్‌వర్క్‌గా, ఒక టెక్నికల్ ఏజెన్సీగా వ్యవహరించాలన్నది దీని ఏర్పాటు లక్ష్యం. అలాగే పేద దేశాలకు సాంకేతిక పరి జ్ఞానానికి సంబంధించి సహకారం అందించడం; తద్వారా ఆ యా దేశాలు ఆరోగ్య సమస్యలను సొంతంగా ఎదుర్కొనేందుకు తగిన మానవ వనరులు, సామర్థ్యాలను సంపాదించుకునేలా చేయడం మరో లక్ష్యం.
కొన్ని దశాబ్దాల కాలంలో ఈ సంస్థ మశూచితో పాటు, యాస్(చర్మరోగం), ఎల్లో ఫీవర్, కుష్టు, పోలియో వంటి ఎన్నో మహ మ్మారులను సమర్థంగా కట్టడి చేయగలిగింది. యూఎన్ ఎయిడ్స్ ద్వారా హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌పై అంతర్జాతీయ స్థాయి పోరు సాగించింది. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టి మొత్తం క్షయ వ్యాధి నిర్మూలనపై ఉంది. అయితే, సార్స్ వంటి కొత్త వ్యాధులు పుట్టుకొచ్చినప్పుడు, పాత వ్యాధులు తిరగబెట్టిన సందర్భాల్లోనూ ఈ సంస్థ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
అమెరికాకూ నష్టమే!
డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలగడం వల్ల సభ్యదేశాలకు అందించే వ్యాధుల సమాచారం అమెరికాకు అందకుండా పోతుంది. ‘డబ్ల్యూహెచ్‌ఓ పాండెమిక్ ఇన్ ఫ్లుయెంజా ప్రిపేర్డ్‌నెస్ ఫ్రేమ్‌వర్క్’ ఆధారంగానే పలు అమెరికన్ ఫార్మా కంపెనీలు టీకా తయారీకి సంబంధించి కొత్త రకం వైరస్ నమూనాలు పొందుతూంటాయి. ఇకపై ఈ వివరాలు అందకపోవడం వల్ల ఫ్లూ వైరస్ నిరోధక టీకాపై ప్రభావం పడనుంది. కోవిడ్ లాంటి మహమ్మారుల నియంత్రణకు చేపట్టాల్సిన అంశాలపై ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ చర్చల నుంచి కూడా అమెరికా వైదొలిగే అవకాశం ఉంది. అలాగే ఇప్పటివరకూ డబ్ల్యూహెచ్‌ఓలో పని చేస్తున్న పలువురు అమెరికన్ నిపుణులను వెనక్కి పిలిపిస్తారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, నేషనల్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ అనే రెండు అమెరికన్ సంస్థలతో డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పటి వరకూ ఏర్పాటు చేసుకున్న భాగస్వామ్యం ఇకపై ఉండదు. ఇది ఇరువర్గాలకూ చేటు చేసేదే.
షరతుల విరాళాలతో సమస్య
అమెరికా నిర్ణయం వల్ల డబ్ల్యూహెచ్‌ఓకు జరిగే నష్టం గురించి ఆలోచిస్తే... ఆర్థికంగా ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఇతర సభ్యదేశాలు ఇస్తున్న మొత్తాలు కూడా తక్కువైపోతున్న తరుణంలో అతిపెద్ద దాత వైదొలగడం గమనార్హం. అమెరికా తరువాత అంత పెద్ద స్థాయిలో ఆర్థిక సాయం అందించే దేశం జర్మనీ మాత్రమే. డబ్ల్యూహెచ్‌ఓ వార్షిక బడ్జెట్‌లో సుమారు మూడు శాతాన్ని ఈ దేశం భరిస్తోంది. అయితే ప్రభుత్వాలకు అతీతంగా అందుతున్న విరాళాలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరగడం కొంత ఊరటనిచ్చే అంశం.
ఉదాహరణకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ , యూరోపియన్ కమిషన్ , ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలు భారీ మొత్తాలను అందిస్తున్నాయి. గేట్స్ ఫౌండేషన్ ప్రధానంగా పోలియో నిర్మూలన, టీకా తయారీలకు మద్దతిస్తోంది. అమెరికా వైదొలగుతున్న నేపథ్యంలో ఆర్థిక వనరుల కోసం గేట్స్ ఫౌండేషన్ వంటి వాటిపై డబ్ల్యూహెచ్‌ఓ ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. స్వతంత్రంగా పనిచేయాల్సిన ఐక్యరాజ్య సమితి విభాగానికి ఇలాంటి పరిస్థితి రావడం ఏమంత శ్రేయస్కరమైంది కాదు. ప్రైవేట్ సంస్థలు ఇచ్చే విరాళాలు కొన్ని షరతులతో వస్తాయని, ఇవి కాస్తా ఆరోగ్య అజెండాపై ప్రభావం చూపుతాయని విమర్శకుల వాదన.
డబ్ల్యూహెచ్‌ఓ మరింత సమర్థంగా, పారదర్శకంగా పనిచేసేందుకు తగిన సంస్కరణలు చేపట్టా లన్న వాదన సబబే. కోవిడ్ సమయంలో భారత్ కూడా జీ20, బ్రిక్స్ వంటి వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తింది. కొన్ని ఇతర దేశాలు కూడా డబ్ల్యూహెచ్‌ఓ సంస్కరణలపై డిమాండ్ చేశాయి. అయితే ఈ రకమైన విమర్శలపై చర్చకు సంస్థ కూడా సిద్ధంగా ఉంది. అయితే నిధులు నిలిపివేయడం, తప్పు కోవడం పరిష్కారం కాదన్నది అమెరికా గుర్తిస్తే మేలు.
దినేశ్ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)