భారతదేశం కరోనా దెబ్బకు విలవిలలాడిపోవడానికి ఆరోగ్యరంగానికి బడ్జెట్ కేటాయింపు చాలా తక్కువగా ఉండటం కూడా కారణమే. పైగా కేంద్రం, రాష్ట్రాల మీద పెత్తనాన్ని ప్రదర్శించింది. ఇది తాను ఏమీ చేయలేక మరొకరిని నిందించడమే తప్ప మరొకటి కాదు. అందువల్ల కరోనా అనంతరం ప్రభు త్వాలు సంపూర్ణ ఆరోగ్య వ్యవస్థను, మనకు ఉన్న మౌలిక సదుపాయాలను పూర్తిగా సమీక్షించుకోవాలి. మరోవైపున కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కోట్లాదిమందిని పేదవాళ్ల జాబితాలోకి తోసేసింది. ఇక ఎంతమాత్రం కూడా ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు లక్షలు చెల్లించే స్థితి లేదు. ఇప్పుడు దేశం ముందు రెండే దారులున్నాయి. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య బాధ్యతను తీసుకోవడమా? లేదా ప్రజలు మూకుమ్మడిగా ప్రాణాలు కోల్పోవడమా?
మన పొరుగున ఉన్న చైనా, మనకన్నా అధిక జనాభా ఉన్న దేశం.. మలేరియా రహితదేశంగా మారిపోయింది. బుధవారం అంటే నిన్న ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికే ప్రకటించిన 40 దేశాల్లో చైనా చేరిపోయింది. అంతేకాకుండా, మనకన్నా చిన్నదేశం, అన్ని రంగాల్లో ఇప్పుడిప్పుడే ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్న శ్రీలంక కూడా మలేరియా రహిత దేశమైపోయింది. సెప్టెంబర్ 5, 2016న ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇట్లా 40 దేశాలు తమ గడ్డమీదినుంచి మలేరియాను తరిమి కొట్టాయి. ఇవేకాక అల్జీ రియా, మారిషస్, జోర్డాన్, లిబియా, మొరాకో, అల్బేనియా నుంచి బ్రిటన్ దాకా యూరప్ దేశాల్లో చాలా మలేరియా నుంచి విముక్తి అయ్యాయి. అంతేకాకుండా, దక్షిణ అమెరికా దేశాలైన అర్జెంటీనా, చిలీ, జమైకా, క్యూబా, ఉరుగ్వే లాంటి దేశాలు ఈ జాబితాలో చేరి పోయాయి. కానీ మనదేశంలో మాత్రం ఇంకా మలేరియా విలయ తాండవం చేస్తూనే ఉంది.
మారుమూల ప్రాంతాలైన అడవుల్లో నివసించే ఆదివాసులు ప్రతి సంవత్సరం లెక్కలకు అందనంత మంది మలేరియా ద్వారా ప్రాణాలు కోల్పోతున్నారు. రాబోయే పది సంవత్సరాలలో భారత్‌ని మలేరియా రహితదేశంగా చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు చేసి నట్టు చెబుతున్నారు. అయితే మనదేశంలో ఉన్న ఆదివాసుల జీవన పరిస్థితులు, స్థితిగతులను పరిశీలిస్తే ఇది సాధ్యమయ్యే పనేనా అనే అనుమానం రాక మానదు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్థిక, సామాజిక పరిస్థితులు కొనసాగుతున్న వ్యత్యాసాలు ప్రజల ఆరోగ్య స్థితిగతులపై తీవ్ర ప్రభావాన్ని కలుగజేస్తున్నాయి.
మలేరియాతోపాటు, మరొక ముఖ్యమైన సమస్య క్షయ వ్యాధి. ఇది కూడా ప్రజలలో చాలా తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇండియా క్షయ వ్యాధి నివేదిక–2020 ప్రకారం 26.9 లక్షల కేసులు నమోదు కాగా, 79,144 మంది మరణించారు. 2019లో 24.04 లక్షల కేసులు నమోదు అయ్యాయి. అంటే 2019 కన్నా 2020లో 14 శాతం అధి కంగా కేసులు నమోదయ్యాయి. అయితే అనధికార లెక్కలు ఇంకా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో అంటే 2025 నాటికి టి.బి. రహిత దేశంగా భారతదేశాన్ని తయారుచేస్తామని, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించక మానదు.
ప్రతి సంవత్సరం సరాసరి 4,36,000 మంది టి.బి. వల్ల మరణి స్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా 2019లో పదిలక్షల 40వేల మంది క్షయవల్ల మరణిస్తే, మొత్తంగా 20 లక్షల 64 వేలమంది ఆ వ్యాధి బారిన పడ్డారు. ఇందులో మహిళలు 34శాతం కాగా, 59శాతం పురుషులు, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో అధిక సంఖ్యలో క్షయవ్యాధి బారిన పడుతున్నారు. క్షయవ్యాధిలో ఇండియా, మొదటిస్థానంలో ఉండగా, ఇండోనేషియా, పాకిస్తాన్, నైజీరియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా దేశాలు తర్వాత స్థానంలో ఉన్నాయి.
దీనితోపాటు పోషకాహార లోపం మరొక ప్రధాన ఆరోగ్య సమస్య. ప్రజలు అనారోగ్యం పాలు కావడానికి 50 శాతం వరకు పోషకాహార లోపమే ప్రధాన కారణమనే విషయాన్ని న్యూట్రిషన్ వరల్డ్–2020 నివేదిక బయటపెట్టింది. పిల్లల్లో పోషకాహారలోపం చాలా ఎక్కువగా ఉంటోందనీ, దాదాపు 50 శాతం మంది పిల్లల్లో ఎముకల ఎదుగుదల లేదని కూడా ఆ నివేదిక స్పష్టం చేసింది. ఇందులో కూడా ఆదివాసీ, దళితుల శాతం అధికం. పోషకాహార లోపంతోపాటు, రక్తహీనత కూడా వీరిలో అధికం. ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. దళితుల్లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 48 శాతం దళితుల్లోని బాల, బాలికలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.
పరిస్థితులు ఇలా ఉండగా, కరోనాలాంటి వ్యాధి ప్రబలితే ఎటు వంటి పరిస్థితులను మనం చవిచూశామో తెలుసు. ఇంకా కరోనా ప్రభావం ఎంత దుష్ప్రభావాన్ని మిగిల్చిందో, మిగులుస్తుందో లెక్కలు తేలాల్సి ఉంది. అంతేకాకుండా, జీవనశైలి మీద ఆధారపడిన మధుమేహం, రక్తపోటు వంటి సమస్యల వల్ల కరోనా బారిన పడిన వారు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి లెక్కలు లేవు. ఇవన్నీపోనూ.. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజల ఆరోగ్య సమస్యను ప్రాధాన్యత లేని సమస్యగా చూస్తున్నాయి. ఇది తీవ్రంగా కలచివేసే సమస్య. మనం రోజురోజుకూ ఎంతో పురోగమిస్తున్నామని చెప్పుకుంటున్నాం. కానీ ఎటువంటి దూరదృష్టి లేదు. ప్రజల ప్రాణాలు, భద్రత, ఇతర సమస్యల కేంద్రంగా ఈ అంశాన్ని ఆలో చించడం మానేశాం.
మన ఆరోగ్య సూచికలన్నీ ప్రపంచ దేశాలన్నింటిలో తిరోగామి స్థాయిలో ఉన్నాయి. దీనికి కారణం మనకు ఒక కచ్చితమైన ఆరోగ్య విధానం లేదు. పేరుకు హెల్త్ పాలసీలు తయారు చేసుకుంటాం. కానీ అది కూడా ఎక్కడో పాత కాలమైతే అల్మారాలో, ఇప్పుడైతే కంప్యూటర్ సర్వర్‌లో దాగి ఉంటుంది. అటువంటిదే 2017 జాతీయ హెల్త్ పాలసీ, అంతకుముందు రెండుసార్లు హెల్త్ పాలసీలు తయారు చేశారు. కానీ అవి ఆచరణకు నోచుకోలేదు. 2017లో రూపొందించిన పాలసీ కూడా అటువంటిదే. అందులో అన్ని సాంకేతికపరమైన సమస్యలే తప్ప, ఎక్కడా నిర్దిష్టమైన కార్యాచరణ లేదు. పైగా ఆ నివేదికలోనే చెప్పిన విషయం విస్మయం కలిగించక మానదు. ‘కొంతమంది ఆరోగ్య విషయాన్ని, ప్రాథమిక హక్కుగా ప్రకటించాలని అంటున్నారు. కానీ, మన దేశంలో ఆరోగ్య రంగానికి సంబంధించిన మౌలిక సదుపా యాలు అటువంటి స్థితిలో లేవు’ అని స్పష్టంగా చెప్పారు.
అంతేకాకుండా, ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపు స్థూల జాతీయోత్పత్తిలో 1.26 శాతంగా ఉందని, అది 2.5 శాతం పెరిగితే తప్ప ఎటువంటి నూతన సౌకర్యాలు సాధ్యంకావని తేల్చిచెప్పారు. ప్రపంచంలోని చాలా దేశాలు మనకన్నా అదనంగా ఆరోగ్యంమీద ఖర్చు పెడుతున్నాయి. అమెరికా 17 శాతం, బ్రెజిల్ 9.2 శాతం, డెన్మార్క్ 10.1 శాతం, కెనడా 10.7 శాతం జాతీయ స్థూల ఉత్పత్తిలో ఖర్చు చేస్తున్నాయి. కాబట్టే ఆ దేశాలు ఆరోగ్య రంగంలో వచ్చే ఎటు వంటి సమస్యలనైనా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నాయి. భారత్ కరోనా దెబ్బకు విలవిలలాడి పోవడానికి ఈ బడ్జెట్ లేమి కూడా కారణం. కేంద్ర, రాష్ట్రాల మీద పెత్తనాన్ని ప్రదర్శించింది. ఇది తాను ఏమీ చేయలేక మరొకరిని నిందించడమే తప్ప మరొకటి కాదు. అందువల్ల కరోనా అనంతరం ప్రభుత్వాలు సంపూర్ణ ఆరోగ్య వ్యవ స్థను, మన మౌలిక సదుపాయాలను పూర్తిగా సమీక్షించుకోవాలి.
అంతేకాకుండా, హెల్త్ పాలసీ–2017 స్థానంలో మరొక సమ గ్రమైన, నూతనమైన ఆరోగ్య విధానం రూపకల్పన చేసుకోవాలి. అందులో చాలా స్పష్టంగా కేంద్ర, రాష్ట్రాల విధులను, బాధ్యతలను ప్రత్యేకంగా పేర్కొనాలి. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కరోనాను దృష్టిలో పెట్టుకొని, ఇకపై ప్రజల మీద భారం వేయకుండా ప్రభు త్వమే ఆరోగ్య బాధ్యతను వహించాలి. సార్వజనీన ఆరోగ్య రక్షణకు అంటే ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యాన్ని అందించే విధానాన్ని తయారు చేసుకోవాలి. కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కోట్లాదిమందిని పేదవాళ్ల జాబితాలోకి తోసేసింది. ఇక ఎంతమాత్రం కూడా ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు లక్షలు చెల్లించే స్థితి లేదు. ఇప్పుడు దేశం ముందు రెండే దారులున్నాయి. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య బాధ్యతను తీసుకోవడమా? లేదా ప్రజలు మూకుమ్మడిగా ప్రాణాలు కోల్పోవ డమా?
మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
‘ మొబైల్ : 81063 22077
Comments
Please login to add a commentAdd a comment