Cheruvugattu Temple
-
ఓం నమః శివాయ.. శంభో శంకర (ఫొటోలు)
-
చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి
సాక్షి, నల్లగొండ : గత నాలుగు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో మంగళవారం అపశ్రుతి చోటు చేసుకుంది. అగ్నిగుండాల కార్యక్రమంలో భక్తులు అందరూ నిప్పులపై నడిచివస్తుండగా ఓ మహిళ అదుపుతప్పి నిప్పుల్లో పడిపోయింది. వెంటనే అక్కడి సిబ్బంది ఆమెను బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. సిబ్బంది అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పిందని భక్తులు పేర్కొన్నారు. నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిపై కొలువై ఉన్న శ్రీపార్వతి జడల రామలింగేశ్వరస్వామివారి బ్రహోత్సవాలు ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సోవాలు ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శివసత్తుల ఆందోళన గత నాలుగు రోజులుగా చెరువుగట్టులో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేలాది భక్తులు తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం జరిగిన అగ్నిగుండాల కార్యక్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ తదితర జిల్లాలను నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అగ్నిగుండాల కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శివసత్తులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో శివసత్తులు ఆందోళనకు దిగారు. శివసత్తులకు ప్రత్యేక లైను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. -
భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలి
నార్కట్‌పల్లి(నకిరేకల్): బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గౌరల్ ఉప్పల్ ఆదేశించారు. గట్టుపైన, కింద ఏర్పాట్లను శుక్రవారం ఎస్పీ శ్రీనివాసరావు, జేసీ నారాయణరెడ్డితో కలసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుతో మాట్లాడుతూ అసంపూర్తి పనులను త్వరలో పూర్తిచేయాలని సూచించారు. వృద్ధులు, చిన్నారులు గట్టుపైకి వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పా టు చేయాలని సూచించారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ 500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 58 సీసీ కెమెరాలు, 3 కంట్రోల్ రూంలు, షీటీమ్, అగ్నిమాపక కేంద్రం, ఆరోగ్య సిబ్బందిని నియమించినట్టు చెప్పారు. ఆర్డీఓ వెంకటాచారి, డీఎస్పీ సుధాకర్ పర్యవేక్షణలో సిబ్బంది విధులు నిర్వహిం చాలన్నారు. అనంతరం జిల్లా జడ్జి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చిన ప్రజలకు ప్రభుత్వ పథకాల అమలును వివరించాలని అధికారులకు సూచించారు. ప్రొజెక్టర్ ద్వారా ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఖీమ్యానాయక్, జెడ్పీసీఈఓ హనుమానాయక్, పీడీ రాజ్‌కుమార్, ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, చైర్మన్ నల్ల వెంకన్న, తహసీల్దార్ విజయలక్ష్మి, సీఐ క్యాస్ట్రోరెడ్డి ఎంపీడీఓ గుర్రం సురేశ్, ఈఓ అంజనారెడ్డి, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ, సర్పంచ్ మల్గ రమణాబాలకృష్ణ, ఎంపీటీసీ అనితవెంకన్న, సూపరింటెండెంట్ తిరుపతిరెడ్డి ఉన్నారు. జాన్‌పహాడ్ ఉర్సు ఏర్పాట్ల పరిశీలన నేరేడుచర్ల(హుజూర్నగర్): ఈ నెల 25,26,27 తేదీలలో నిర్వహించనున్న జాన్‌పహాడ్ ఉర్సు ఏర్పాట్లను శుక్రవారం హుజుర్నగర్ సీఐ నర్సింహారెడ్డి, మిర్యాలగూడ డిపో మేనేజర్ సుధాకర్‌రావు దర్గా పరిసర ప్రాంతాలు, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. వారి వెంట దర్గా కాంట్రాక్టర్ సుబ్బారావు, వర్క్ ఇన్స్పెక్టర్ ఫయాజ్, నాయకులు శ్రీను, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
శివ.. శివా!
సాక్షిప్రతినిధి, నల్లగొండ :వాడిన టికెట్నే మళ్లీ మళ్లీ వాడడం.. అంటే రీసైక్లింగ్... దర్శనానికి వెళ్లే భక్తులకు ఇచ్చిన టికెట్లనే అటు తిప్పి ఇటు తిప్పి అంటగడుతున్నారు. ఫలితం దేవాలయానికి రావాల్సిన ఆదాయం రాకుండా పోతోంది. నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు దేవస్థానంలో జరిగే వ్యవహారాల గురించి తెలుసుకుంటే ఔరా! అని ముక్కున వేలేసుకోకతప్పదు. భక్తుల తాకిడితో సంబంధం లేకుండా దర్శనం టికెట్ల రీసైక్లింగ్ జరుగుతోంది. సాధారణ రోజుల్లో దర్శనం టికెట్ ధర రూ.10 కాగా, అమావాస్య రోజు మాత్రం రూ.50 వసూలు చేస్తున్నారు. అదీ రూ.20 అని ముద్రించి ఉన్న టికెట్లపైనే యాబై రూపాయల స్టాంప్ వేస్తున్నారు. ఒక భక్తుడికి ఇచ్చిన టికెట్నే కనీసం ముగ్గురు నలుగురి చేతులు మారేలా రీ సైక్లింగ్ చేస్తుండడంతో ఆలయానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నా యి. డబ్బులు చేతులు మారడంతో ఎలాంటి ప్రకటన లేకుండానే ముగ్గురు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారని సమాచారం. ఒక పూజారి, మరో ఇద్దరిని ఆఫీసు స్టాఫ్‌గా ఉద్యోగంలోకి తీసుకున్నారని చెబుతున్నారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న వీరిని రెగ్యులరైజ్ చేసే సమయంలో ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ప్రధాన ఆల యం కాకుండా ‘మూడు గుండ్లు’ వద్ద కూడా పూజారులు ఉండాలి. కానీ, ఇక్కడ పూజారులు ఉండకుండా పిల్లలనే పెడుతున్నారని తెలుస్తోంది. ఇక, లడ్డూ ప్రసాదం తయారీ వద్ద ఇద్దరు బాలకార్మికులను నిబంధనలకు విరుద్ధంగా పనిలోకి తీసుకున్నారని తెలిసింది. ఆదాయపరంగా చెర్వుగట్టు జిల్లాలో యాదగిరిగుట్ట తర్వాత రెండో స్థానంలో ఉంటోంది. కేవలం తలనీలాల టెండరు ద్వారానే ఏటా రూ. 1.50కోట్లు, కిరాణం షాపుల ద్వారా రూ.16లక్షలు, కొబ్బరి చిప్పల ద్వారా రూ.30లక్షల ఆదాయం సమకూరుతోంది. ఇక, ప్రతినెలా కనీసం రూ. 20లక్షలు హుండీ ద్వారానే సమకూరుతోంది. సోమ, శుక్రవారాలతోపాటు ప్రతినెలా ఆమావాస్య రోజు చెర్వుగట్టుకు భక్తులు పోటెత్తుతారు. ఒక్క అమావాస్య రోజు రమారమి 2లక్షల మంది భక్తులు నిద్ర చేయడానికి వస్తున్నారని, ఈ ఆదాయం అంతా ఎటుపోతుందో తెలియడం లేదని పేర్కొంటున్నారు. అర్చన, అభిషేకం టికెట్లలోనూ.. దర్శనం టికెట్ల రీసైక్లింగ్‌తోపాటు అర్చన, అభిషేకం టికెట్ల విషయంలోనూ మాయాజాలం నడుస్తోందని సమాచారం. సాధారణంగా అభిషేకానికి రూ.200 వసూలు చేస్తుండగా, అదే ఉదయం వేళలో ఏకంగా రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. మొత్తంగా ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం ఉన్న చెర్వుగట్టు ఆలయంపై చేతివాటం ప్రదర్శిస్తున్న అధికారులు, ఉద్యోగులు తమ ఆదాయం పెంచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ జిల్లా దేవాదాయ శాఖ అధికారులకు తెలిసినా, వారు పట్టించుకోని కారణంగానే చెర్వుగట్టుపై అనైతిక వ్యవహారాల జోరు పెరిగిందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.