సాక్షి, నల్లగొండ : గత నాలుగు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో మంగళవారం అపశ్రుతి చోటు చేసుకుంది. అగ్నిగుండాల కార్యక్రమంలో భక్తులు అందరూ నిప్పులపై నడిచివస్తుండగా ఓ మహిళ అదుపుతప్పి నిప్పుల్లో పడిపోయింది. వెంటనే అక్కడి సిబ్బంది ఆమెను బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. సిబ్బంది అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పిందని భక్తులు పేర్కొన్నారు.
నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిపై కొలువై ఉన్న శ్రీపార్వతి జడల రామలింగేశ్వరస్వామివారి బ్రహోత్సవాలు ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సోవాలు ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శివసత్తుల ఆందోళన
గత నాలుగు రోజులుగా చెరువుగట్టులో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేలాది భక్తులు తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం జరిగిన అగ్నిగుండాల కార్యక్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ తదితర జిల్లాలను నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అగ్నిగుండాల కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శివసత్తులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో శివసత్తులు ఆందోళనకు దిగారు. శివసత్తులకు ప్రత్యేక లైను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment