
నేడు రంజాన్ పర్వదినం
ఈదుల్ ఫిత్ర్ లేక రంజాన్ పర్వదినం ప్రపంచంలోని ముస్లిం సమాజానికి అత్యంత పవిత్రమైన, ఆనందకరమైన వేడుక. అత్యంత ఉత్సాహంగా, ఆనందంగా వారు ఈవేడుకను జరుపుకుంటారు. ఈ పర్వదినాన్ని ‘ఈద్’ అని కూడా పిలుస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ ను అనుసరించి రంజాన్ నెల ముగిసిన మరునాడు దీన్ని జరుపుకుంటారు.
రంజాన్, ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల. ఇది ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంలో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నెలలో ముస్లింలు ప్రత్యేకంగా ఉపవాసం (సియామ్) పాటిస్తారు, అంటే ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు భోజనం, పానీయాలు, ఇతర శరీర సంబంధిత అవసరాలన్నీ త్యజిస్తారు.
ఉపవాసం ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఒక శుద్ధి ప్రక్రియగా భావించ బడుతుంది, ఇది స్వీయ నియంత్రణ, ప్రేమ, దయ, జాలి, క్షమ, సహనం, పరోపకారం, త్యాగం లాంటి అనేక సుగుణాలను పెంపొందించడానికి సహాయపడుతుంది. ఈ సందర్భంగా వారు వారి దైనందిన సేవాకార్యక్రమాలను మరింత విస్తరించుకొని, నైతికంగా, ఆధ్యాత్మికంగా తమ వ్యక్తిత్వాలను నిర్మించుకొని దేవుని కృపా కటాక్షాలు పొందడానికి ప్రయత్నిస్తారు.
ఈదుల్ ఫిత్ర్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని, సమాజంలో పేదరికాన్ని తొలగించే ప్రయత్నం కూడా ఎంతోకొంత జరుగుతుంది. దాతృత్వం, సామాజిక సేవలకుప్రాధాన్యం ఇవ్వడం ఈ పండుగ ప్రధాన లక్ష్యం. ప్రతి ఒక్కరూ తమ తోటి సోదరులకు సహకరిస్తూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోడానికి ప్రయత్నిస్తారు. సదఖ, ఫిత్రా, జకాత్ ల ద్వారా అర్హులైన అవసరార్థులకు ఆర్థిక సహాయం అందిస్తారు.
ఈదుల్ ఫిత్ర్ పర్వదినం సమస్త మానవాళి, సర్వ సృష్టిరాశి సుఖ సంతోషాలను కాంక్షించే రోజు. ఆనందం, శాంతి, సంతోషం, సమానత్వం, క్షమ, దయ, జాలి, పరోపకారం, సామాజిక బాధ్యతలను ప్రతిబింబించే ప్రత్యేకమైన రోజు. ఇది కేవలం ఒక ఆథ్యాత్మిక క్రతువు కాదు. సమాజంలో ప్రేమ, సహకారం, పరస్పర మైత్రి, బాధ్యత, ఆనందాలను పంచుకునే వేడుక. రంజాన్ నెల రోజుల శిక్షణ ద్వారానూ, ఈద్ పండుగ ద్వారానూ సమాజం ఆధ్యాత్మికతను, మానవతా విలువలను పునరుద్ధరించుకుంటుంది.
పండగ తర్వాత కూడా...
ఈద్ తో రోజాలకు వీడ్కోలు పలికినప్పటికీ, నెలరోజులపాటు అది ఇచ్చినటువంటి తర్ఫీదు అనంతర కాలంలోనూ తొణికిస లాడాలి. పవిత్ర రంజాన్ లో పొందిన దైవభీతి శిక్షణ, దయాగుణం, సహనం, సోదరభావం, పరస్పర సహకార, సామరస్య భావన, ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలు పంచుకునే గుణం, పరమత సహనం, సర్వ మానవ సమానత్వం లాంటి అనేక సదాచార సుగుణాలకు సంబంధించిన తర్ఫీదు ప్రభావం మిగతా పదకొండు నెలలకూ విస్తరించి, తద్వారా భావి జీవితమంతా మానవీయ విలువలే ప్రతిబింబించాలి. సమస్త మానవాళికీ సన్మార్గభాగ్యం ప్రాప్తమై, ఎలాంటి వివక్ష, అసమానతలులేని, దైవభీతి, మానవీయ విలువల పునాదులపై ఓ సుందర సమ సమాజం, సత్సమాజ నిర్మాణం జరగాలి. ఇహపర లోకాల్లో అందరూ సాఫల్యం పొందాలి. ఇదే రంజాన్ ధ్యేయం.
ఈ రోజు ముస్లింలు ఉదయాన్నే నిద్రలేచి పరిశుభ్రతను పొందుతారు. ఈద్ నమాజ్ /ప్రార్థన ఆచరించి కుటుంబంతో, స్నేహితులతో కలిసి పండుగను జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ ఈ రోజున వారి వారిస్థోమత మేరకు కొత్త దుస్తులు ధరించి, పలు రకాల తీపి వంటకాలు ముఖ్యంగా సేమియా/షీర్ ఖుర్మా తీసుకుంటారు. ఈదుల్ ఫిత్ర్ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, సమాజంలో నైతిక, ఆధ్యాత్మిక, మానవీయ సుగుణాలను పునరుధ్ధరించే మహత్తరమైన రోజు. ఈ పండుగ రోజున ముస్లిం సమాజం జకాతుల్ ఫిత్ర్ అనే దానం కూడా ఇస్తారు. పేదసాదలను గుర్తించి వారికి ఫిత్రా దానాలు చెల్లించడం ద్వారా తమ దాతృత్వాన్ని చాటుకోవడం కాకుండా తమ బాధ్యతను నెరవేర్చామని భావిస్తారు.
రంజాన్ నెల ముగియగానే, షవ్వాల్ నెల మొదటి రోజు ముస్లిం సోదరులు ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినం జరుపుకుంటారు. ‘ఫిత్ర్’ అంటే దానం, పవిత్రత లేదా శుద్ధి అని కూడా అంటారు. ఇది ఉపవాసం,ప్రార్థనల ధార్మిక విధిని పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దైవానికి కృతజ్ఞతలు తెలుపుకునే అపురూప సందర్భం.
– మదీహా అర్జుమంద్