
నిధానపల్లి మల్లన్నగుట్ట (చిన్న శ్రీశైలం)
కోరిన కోర్కెలు తీర్చే స్వామివారు
రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిధానపల్లి (Nidhanapalle) గ్రామ శివారులోని మల్లన్నగుట్ట (mallanna gutta) చిన్న శ్రీశైలంగా పేరొందింది. గుట్టపై ఉన్న ప్రధాన దేవాలయంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి కొలువై ఉన్నాడు. క్షేత్రం ఎగువభాగంలోని గుహాంతరాళమున మహామునుల తపో స్థలములు, స్వామివారి పుట్టులింగములు ఉండటం మల్లన్నగుట్ట ప్రత్యేకత. మునుల తపస్సు చేత ప్రసిద్ధి చెందిన గుట్టపై కొలువై ఉన్న మల్లికార్జునస్వామి భక్తుల కొంగుబంగారమై కోరిన కోర్కెలు తీరుస్తాడని ప్రజల నమ్మకం. ప్రతీ సంవత్సరం మాఘమాసం బహుళ త్రయోదశి నుంచి పాల్గుణమాసం విదియ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను కనుల పండువగా నిర్వహిస్తారు.
గుట్టపై నిద్రిస్తే రోగాలు మాయం
మల్లన్నగుట్టపై సువిశాలమైన మైదానం ఉంది. హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. పరిసర గ్రామాల ప్రజలు వివిధ పర్వదినములలో స్వామివారి దర్శనం కోసం పరితపిస్తుంటారు. నూతన కార్యక్రమాలను గుట్టపై గల దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రారంభిస్తారు. ఎంతటి క్లిష్టమైన ఆపదల నుంచైనా భగవంతుడు తమను రక్షిస్తాడని భక్తుల ప్రగాఢమైన నమ్మకం. గుట్టపై నిద్రచేస్తే ఆయురారోగ్యములు, భోగ భాగ్యాలు పొందుతామని ప్రజలు విశ్వసిస్తారు.
కోనేరు నీటితో సకల శుభాలు గుట్టపైకి వెళ్లేమార్గంలో సహజ సిద్ధమైన కోనేరు ఉంది. కోనేటిలో ఏడాది పొడవునా నీరు ఉంటుంది. కోనేటి నీటిని ప్రజలు పరమ పవిత్రంగా భావిస్తారు. కోనేటిలోని నీటిని తీసుకెళ్లి పంటలపై చల్లితే చీడపీడలు తొలగి పంటలు సమృద్ధిగా పండుతాయని, పశువులపై చల్లితే పుష్కలంగా పాలు ఇస్తాయని, రోగాలు మాయమవుతాయని ప్రజల విశ్వాసం.
మెరుగైన రోడ్డు సౌకర్యం
నిధానపల్లి మల్లన్నగుట్ట(చిన్న శ్రీశైలం) చిట్యాల– భువనగిరి రోడ్డుకు సమీపంలో ఉంటుంది. గుట్టపైకి వాహనాలు వెళ్లడానికి ఘాట్‌రోడ్డు ఉంది. వాహనాల పార్కింగ్‌కు విశాలమైన మైదానం ఉంది. గత ఏడాది మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన సొంత డబ్బులతో ప్రధాన దేవాలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేయడానికి బండరాళ్లను తొలగింపజేశారు.
ఈ ఏడాది జరిగే బ్రహ్మోత్సవాల వివరాలు
ఈనెల 26న గణపతి పూజ, స్వస్తివాచనము, అంకురార్పణ, బ్రహ్మకలశ స్థాపనలు, ధ్వజారోహణం, ఉత్సవాల విగ్రహాలు గుట్టపైకి వేం చేయుట
27న స్వామివారి ఆర్జిత సేవలు, ప్రభోత్సవం, షావలు, రాత్రి కల్యాణ మహోత్సవం
28న రుద్ర చండీహవనం, అన్న ప్రసాద వితరణ, వీరభద్రేశ్వరస్వామి పూజ, ఖడ్గాలు, ప్రభల ఊరేగింపు, భద్రకాళి అమ్మవారి పూజ తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవం 29న గెలుపు, మహదాశీర్వచనములు ఉంటాయి.
చదవండి: కనువిందు.. ఇందూరు చిందు
అత్యంత మహిమాన్వితుడు
మల్లన్నగుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి పట్ల పరిసర ప్రాంత ప్రజలకు అపారమైన నమ్మకం. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారు అత్యంత మహిమాన్వితుడు. బాధల నుంచి విముక్తి కలిగించే దైవమని భక్తుల నమ్మకం. ఏటా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
–బేతోజు సత్యనారాయణశాస్త్రి, ప్రధానార్చకుడు
Comments
Please login to add a commentAdd a comment