సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పుణే వంటి నగరాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమ ఇప్పుడు కరీంనగర్‌కూ వస్తోంది. ఇప్పటికే స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకుని దేశంలోని 100 నగరాల సరసన నిలిచిన కరీంనగర్ ఇప్పుడు ఐటీ పరిశ్రమల ఏర్పాటుతో ప్రపంచస్థాయి గుర్తింపును అందుకోనుంది. ప్రతిపాదిత ఐటీ టవర్ నిర్మాణం పూర్తయితే కరీంనగర్‌కు మహర్దశ పట్టనుంది. ద్వితీయ శ్రేణి నగరమైన కరీంనగర్ ఐటీతో కొత్త ఖ్యాతి సంపాదించుకోనుంది.
మంత్రి కేటీఆర్‌చే శంకుస్థాపన..
50 వేల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మాణం తలపెట్టిన ఐటీ టవర్‌కు సోమవారం ఉదయం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడే భారీ బ హిరంగ సభ నిర్వహించనున్నారు. నగరంలోని అన్ని డివిజన్‌ల కార్పొరేటర్లతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్‌లు సమావేశమై ప్రజ లను పెద్ద సంఖ్యలో తరలించే బాధ్యతలను అప్పగించారు. అదే విధంగా కళాశాలల విద్యార్థులను కూడా పెద్ద సంఖ్యలో బహిరంగ సభకు తరలించి విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఐటీ హబ్‌గా ఏర్పాటు...
ప్రధాన నగరాలకే పరిమితమైన ఐటీ సెక్టార్‌ను ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విస్తరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నగరాన్ని ఐటీ హబ్‌గా మార్చేందుకు ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. 9 నెలల్లో దీనిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఐటీ టవర్‌లో 10కి పైగా అమెరికా, ఆస్ట్రేలియాలకు చెందిన బడా కంపెనీల శాఖలను ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా రాయితీలు ఇవ్వనున్నారు. ఉత్తర తెలంగాణ నిరుద్యోగులకు ఐటీ ఉద్యోగాలే లక్ష్యంగా ఏర్పాటుచేస్తున్న ఈ ఐటీ టవర్స్‌తో సుమారు 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
ఉత్తర తెలంగాణ కేంద్ర బిందువు...
ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువుగా ఉన్న కరీంనగర్ విద్య, వైద్యం, ప్రాజెక్టుల రంగాల్లో దూసుకుపోతోంది. మానేరు డ్యామ్ ఒడ్డున ప్రకృతి ఒడిలో ప్రశాంత వాతావరణంలో బైపాస్ రోడ్డును ఆనుకొని 3 ఎకరాల స్థలాన్ని ఐటీ టవర్‌కు కేటాయించారు. రూ.25 కోట్లతో జీ+5 అంతస్తులతో భవనాన్ని నిర్మించేందుకు డిజైన్‌లు సిద్ధం చేశారు. టవర్ నిర్మాణానికి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ) టెండర్ల ప్రక్రియను పూర్తిచేసింది. హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టు ఎజెన్సీకి పనులు అప్పగించారు. 50 వేల చదరపు అడుగుల వైశాల్యంతో అత్యాధునిక హంగులతో భవన నిర్మాణం పూర్తయితే ప్లగ్ అండ్ ప్లే విధానంతో నిరంతర విద్యుత్ సరఫరా, హైరేంజ్ వైఫై సేవలు, ఇతర సౌకర్యాలన్నీ కల్పించనున్నారు. పెద్ద ఐటీ కంపెనీలను ఆకర్షించేలా రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని సౌకర్యాలతో నిర్మాణం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment