రాష్ట్రంలో డిజిటల్ విప్లవం
- ఐటీ, డిజిటల్ టెక్నాలజీలపై ప్రభుత్వ దృష్టి: కేటీఆర్
- హైదరాబాద్‌లో ఐసీటీ 4డీ అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం డిజిటల్ విప్లవం ముంగిట్లో ఉందని మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని, నెలకు 20 కోట్ల లావాదేవీలతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. సోమవారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో తొమ్మిదో ‘ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫర్ డెవలప్‌మెంట్ (ఐసీటీ 4డీ)’అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. దాదాపు 74 దేశాలకు చెందిన 800 మంది ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సదస్సులో వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో డిజిటల్ టెక్నాలజీ విస్తృత వినియోగంపై చర్చలు జరుగనున్నాయి.
సోమవారం ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం ఐటీ, డిజిటల్ టెక్నాలజీలపై దృష్టి పెట్టిందని చెప్పారు. ఇంటింటికీ ఇంటర్నెట్‌ను అందించేందుకు టీ–ఫైబర్ ప్రాజెక్టు చేపట్టామని, దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు చెందిన 600 సేవలను ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచామని వివరించారు. ప్రభుత్వ సేవలన్నింటినీ మొబైల్ అప్లికేషన్ల ద్వారా కూడా అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద ఐటీ ఇంక్యుబేటరైన టీ–హబ్‌లో ప్రస్తుతం రెండు వందలకుపైగా స్టార్టప్‌లు ఏర్పాటయ్యాయని వెల్లడించారు.
ఐటీలో మాంద్యం..భారత్‌కు పెద్ద అవకాశం
ఐటీ రంగంలో నెలకొన్న మాంద్యం పరిస్థితులను భారతదేశం గొప్ప అవకాశంగా మలుచుకోవాలని, తద్వారా కొత్త ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి అంతర్జాతీయ సంస్థలను నడిపే సామర్థ్యం భారతీయులకు ఉన్నప్పుడు.. ఆ స్థాయిలో ఐటీ ఉత్పత్తులను తయారు చేయగల శక్తిసామరా>్థ్యలూ ఉన్నాయన్నది తన విశ్వాసమని పేర్కొన్నారు. తెలంగాణలో ఐటీ రంగం జాతీయ సగటు కంటే ఎక్కువ వృద్ధి సాధించిందని, ఈ వివరాలను జూన్ ఒకటిన వార్షిక నివేదికలో తెలియజేస్తామని చెప్పారు. కాగా.. ఈ కార్యక్రమంలో కాథలిక్ రిలీఫ్ సర్వీసెస్ ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ ష్కూలైర్ థోర్ప్ మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు భారతదేశం డిజిటల్ టెక్నాలజీలను మెరుగైన రీతిలో ఉపయోగించుకుంటోందని కొనియాడారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డేవిడ్ బెర్గ్‌విన్సన్, నాస్కామ్ చైర్మన్ బి.వి.ఆర్. మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.