రాష్ట్రాభివృద్ధికి కలసి రండి
తెలంగాణ ఎన్నారైలకు మంత్రి కేటీఆర్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధికి తెలంగాణ ఎన్నారైలు కలసి రావాలని ఎన్నారైల శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనకు సహకరించిన ఎన్నారైలు, సాధించుకున్న సొంత రాష్ట్రాభివృద్ధిలో అదే స్ఫూర్తితో భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం చేస్తు న్న ప్రయత్నాలతో కలసి రావాలని, ఇందుకోసం తాము పుట్టిన గ్రామాల అవసరాలను తీర్చేందుకు సహకరించాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఇండి యా డెవలప్‌మెంట్ ఫండ్(ఐడీఎఫ్) ద్వారా ప్రవా సులు ఇచ్చే ప్రతి రూపాయి నేరుగా అభివృద్ధి కార్యక్రమాలకు పోతుందన్నారు.
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పలువురు ఎన్నారైలు ఐడీఎఫ్ ద్వారా తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. గ్రామాల్లోని పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలు, లైబ్రరీల అభివృద్ధికి ఎన్నారైలు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా సహకారం అందిస్తామన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా కేటీఆర్ సోమవారం కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాక్రమెంటో పట్టణంలో రాష్ట్ర ఎన్నారైలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను ఎన్నారైలకు వివరించారు. అనంతరం ఎన్నారైలతో ముఖాముఖిగా మాట్లాడి పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతాయని, సంక్షేమం, అభివృద్ధి రంగాలకు ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి శీల, పురోగమన శీల రాష్ట్రంగా మారిందని, ఇతర రాష్ట్రాలు, నీతి ఆయోగ్ వంటి సంస్థలు పలు సందర్భాల్లో రాష్ట్రాన్ని మెచ్చుకున్నాయన్నారు.
విపక్షాలవి అడ్డగోలు విమర్శలు..
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు జాతీ య స్థాయి గుర్తింపు లభించిందని, విద్యుత్, సాగునీటి రంగాల్లో దీర్ఘకాలిక ప్రాజెక్టులు చేపట్టామన్నా రు. ఇవి పూర్తయితే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలతో ఏం చేయాలో పాలుపోని ప్రతిపక్షాలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నాయన్నారు. 60 ఏళ్లు ఏలిన ప్రతిపక్షాలు సాధించలేనిది,తమ ప్రభుత్వం మూడేళ్లలో సాధించిందన్నారు.
ఖమ్మంలో ఐటీ టవర్
పురపాలక శాఖ మంత్రిగా హైదరాబాద్ నగరాభివృద్ధికి చేస్తున్న కృషిని మంత్రి కేటీఆర్ ఎన్నారైలకు వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా ఐటీ పరిశ్రమ సాధిస్తున్న ప్రగతిని.. ఐటీ రంగంలోని డాటా అనలిటిక్స్, డాటా సెక్యూరిటీస్ వంటి నూతన రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ చొరవతో పలువురు ఎన్నారైలు ఖమ్మంలో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చారని, ఇలాంటి ప్రయత్నానికి మద్దతు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐటీ టవర్ నిర్మించబోతోందని తెలిపారు. ఐటీ రంగ విస్తరణలో ప్రవాసులు చొరవ చూపాలని కోరారు.