ఐదేళ్లలో 8 లక్షల ఐటీ ఉద్యోగాలు
ఐదేళ్లలో 8 లక్షల ఐటీ ఉద్యోగాలు
Published Fri, Jun 2 2017 3:29 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
ఐటీ రంగం పురోగతి నివేదిక ఆవిష్కరణలో కేటీఆర్
- 2022 నాటికి ఏటా రూ.1.20 లక్షల కోట్ల ఐటీ ఉత్పత్తులు
- 2016–17లో 13.85 శాతం వృద్ధితో ఈ రంగం దూకుడు
- 24,506 కొత్త ఉద్యోగులతో 4,31,891కి పెరిగిన ఉద్యోగుల సంఖ్య
- నగదు రహిత లావాదేవీల కోసం టీ–వాలెట్‌ను ఆవిష్కరించిన మంత్రి
సాక్షి, హైదరాబాద్: మూడేళ్ల కింద ఎన్నో అనుమానాలతో ప్రారంభమైన తెలంగాణ పారిశ్రామిక, ఐటీ రంగ ప్రస్థానం.. దిగ్విజయంగా, అప్రతిహతంగా ముందుకు సాగుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. 2022 నాటికి రాష్ట్ర ఐటీ ఉత్పత్తుల ఎగుమతులను రూ.1.20 లక్షల కోట్లకు పెంచుతామని.. 8 లక్షల కొత్త ఐటీ కొలువులు సృష్టిస్తామని ప్రకటించారు. మూడేళ్ల కిందే తాను ఈ లక్ష్యాన్ని ప్రకటించానని.. ఆ దిశగా రాష్ట్ర ఐటీ రంగం పురోగమిస్తోందని తెలిపారు. గురు వారం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ రంగ పురోగతి వార్షిక నివేదికను కేటీఆర్ విడుదల చేశారు. అనంతరం నగదు రహిత లావాదేవీ లను ప్రోత్సహించేందుకు రూపొందించిన ‘టీ–వ్యాలెట్’ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించి, ప్రసంగించారు.
జాతీయ సగటును మించి..
2013–14లో రూ.57,258 కోట్లుగా ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు 2014–15లో రూ.66, 276 కోట్లకు, 2015–16లో రూ.75,070 కోట్లకు చేరాయని కేటీఆర్ చెప్పారు. 2016– 17లో రూ.85,470 కోట్లకు పెరిగి, 13.85 శాతం వృద్ధి సాధించిందని.. ఇది జాతీయ సగటు కంటే 4% అధికమని చెప్పారు. మూడే ళ్లుగా రాష్ట్రం ఐటీ దిగుమతుల్లో జాతీయ వృద్ధి రేటును మించిన గణాంకాలు సాధిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో గతేడాది కొత్తగా 24,506 మందికి ఐటీ కొలువులు లభించాయని, దీంతో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 4,31,891కు పెరిగిందని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాలకు ఐటీ
ఐటీ, అనుబంధ రంగాలను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరింపజేసేందుకు గ్రామీణ సాంకేతిక విధానాన్ని ప్రకటించామని కేటీఆర్ తెలిపారు. వరంగల్, జనగామ, హుజూరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో ఐటీ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటు న్నామని చెప్పారు. త్వరలో ఖమ్మంలో ఐటీ పార్కును ప్రారంభిస్తామన్నారు.టీ–హబ్ విజయగాథ నీతి ఆయోగ్‌తోపాటు 12 రాష్ట్రాల ప్రభుత్వాలు, ఉబర్ సీఈవో, ఆస్కార్ అవార్డు గ్రహీతలు ఏఆర్ రహ్మాన్, రసూల్ ఫుకుట్టీ తదితర ప్రముఖుల నుంచి ప్రశంసలు అందాయని కేటీఆర్ పేర్కొన్నారు. టీ–హబ్‌లో ప్రస్తుతం 250 స్టార్టప్స్ ఉన్నాయని, ఏడాదిన్నర కాలంలో రూ.100 కోట్ల ఆదాయాన్ని గడించాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు బాల్క సుమన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐటీ–పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు.
భారీ సంఖ్యలో కంపెనీల క్యూ
ఏడాది కాలంలో అమెజాన్, సేల్‌ఫోర్స్, జేఎఫ్, సింక్రోనీ ఫైనాన్షియల్, ఉబర్, డీబీఎస్, ఫ్‌లైదుబాయ్, నావిజ్ అనాలిక్స్ వంటి పెద్ద కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని కేటీఆర్ చెప్పారు. మహేశ్వరం, శంషాబాద్‌లలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పార్కులను ఏర్పాటు చేస్తున్నామని.. ఎల్‌ఈడీలు, స్మార్ట్‌ఫోన్ల తయారీ పరిశ్రమలను రాష్ట్రానికి తీసు కొస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో హవా కొనసాగిస్తున్న డేటా అనాలి టిక్స్, ఓపెన్ డేటా రంగాలను ప్రోత్సహించేం దుకు ప్రత్యేక పాలసీలు తీసుకొచ్చామన్నారు. టీ–ఫైబర్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని కోటి ఇళ్లకు ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. జూన్ నాటికి హైదరాబాద్‌లోని 1,000 ప్రాంతాల్లో వైఫై సదుపాయం కల్పించామని, మరో 2,500 హాట్‌స్పాట్‌లను గుర్తించామని చెప్పారు. ట్వీటర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలతో అనుసంధానమై సమస్యలు పరిష్కారించాలని జిల్లా కలెక్టర్లకు సూచించామన్నారు.
చార్జీల భారం లేకుండా ‘టీ–వాలెట్’
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘టీ–వాలెట్’ను రూపొందించిందని.. దాని ద్వారా లావాదేవీలకు చార్జీలూ ఉండవని కేటీఆర్ తెలిపారు. ఈ– గవర్నెన్స్, ఎం– గవర్నెన్స్ (మొబైల్– గవర్నెన్స్)ను ప్రోత్సహిం చేందుకు ఈ యాప్‌ను ప్రవేశపెట్టామ న్నారు. అన్నిరకాలుగా పరీక్షించిన అనంతరం టీ–వాలెట్ యాప్‌ను ఆవిష్కరించామని, ఇందులో ఎలాంటి భద్రతా లోపాలకు తావు లేదని చెప్పారు. ప్రభుత్వం–ప్రజల మధ్య పరస్పర లావాదేవీల కోసం ఈ యాప్ ఉపయోగపడుతుందని.. పెన్షన్లు, స్కాలర్‌షిప్‌లు, పన్నుల చెల్లింపు వంటి వాటికి ఉపయోగకరమని తెలిపారు.
Advertisement
Advertisement