కరీంనగర్‌లో ఐటీ టవర్‌ సిద్ధం | IT Tower Opening On December 30 In Karimnagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో ఐటీ టవర్‌ సిద్ధం

Published Sat, Dec 21 2019 8:40 AM | Last Updated on Sat, Dec 21 2019 8:40 AM

IT Tower Opening On December 30 In Karimnagar - Sakshi

ఐటీ టవర్‌ను పరిశీలిస్తున్న మంత్రి గంగుల

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌కు మణిహారంగా మారుతున్న ఐటీటవర్‌ నిర్మాణ పనులు పూర్తయి, ఈనెల 30న ప్రారంభించనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఐటీ టవర్‌ తుదిదశ పనులను శుక్రవారం పరిశీలించారు. ఐదో అంతస్తు వరకు పూర్తిచేసిన పనులను చూసి, అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ లక్ష్యానికి అనుగుణంగా, కరీంనగర్‌లో ఐటీటవర్‌ ఏర్పాటు చేశారన్నారు. స్థానికయువత ఇతర ప్రాంతాలకు వలసవెళ్లకుండా ఇంటి నుంచే ఐటీ జాబ్‌లు చేసుకునే అవకాశం ఉందన్నారు.

చిన్నచిన్న పనులు మిగిలి ఉన్నాయని, ఈనెల 28 వరకు పూర్తి చేస్తామన్నారు. ఈ టవర్‌ తన పూర్తి కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత రెండోఐటీ టవర్‌ ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్‌ హమీ ఇచ్చారని, ఇతర దేశాల నుంచి వచ్చే కంపెనీల డిమాండ్‌ను బట్టి మరో టవర్‌ నిర్మించడానికి చర్యలు చేపడుతామని తెలిపారు.

రెండో అతిపెద్ద ఐటీ టవర్‌ 
మూడెకరాల స్థలంలో 7అంతస్తులతో తెలంగాణలోనే ఇది రెండో అతిపెద్ద టవర్‌ అని మంత్రి తెలిపారు. రెండు సెల్లార్లు, మొదటి అంతస్తులో రిసెప్షన్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్, క్యాంటిన్, రెండోఅంతస్తు నుంచి ఏడోఅంతస్తు వరకు కార్యాలయం కోసం నిర్మించామన్నారు. ప్రతిషిప్ట్‌లో 12వందల చొప్పున 3600మంది ఉద్యోగం చేసేలా సౌకర్యాలు కల్పించామన్నారు. 60నుంచి 70కార్లు పార్కింగ్‌ చేయడానికి భవనంలోనే ఏర్పాట్లున్నాయని తెలిపారు.

ఇప్పటికే 11కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని, మరో మూడు కంపెనీలతో రెండురోజుల్లోనే ఒప్పందం చేసుకుంటామన్నారు. సాధ్యమైనంత వరకు 80శాతం స్థానికులకే ఉద్యోగఅవకాశం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

30న ఘనంగా ప్రారంభం 
ఈనెల 30న ఐటీ టవర్‌ ప్రారంభోత్సవానికి మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, ఇతర నాయకులను ఆహ్వానిస్తున్నట్లు  గంగుల కమలాకర్‌ తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్ల రమేశ్, నాయకులు కట్ల సతీష్, ఎడ్ల అశోక్, డిండిగాల మహేశ్, చల్లా హరిశంకర్, కల్వకుంట్ల ప్రమోద్‌రావు, సంపత్‌రావు, అజిత్‌రావు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement