
సాక్షి, అమరావతి : రాజధాని పరిధిలోని శాఖమూరు ప్రాంతంలో ప్రతిపాదిత ఐటీ సిటీలో ఐటీ టవర్ నిర్మించాలని రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రుల కోసం అమరావతిలో ఈ టవర్ నిర్మాణం చేపట్టాలని ఆ సంస్థ భావిస్తోంది. ఇందుకు అవసరమైన అనుమతులు కూడా వచ్చినట్లు సమాచారం. అమెరికాలోని తెలుగు వారికి చెందిన 45 ఐటీ కంపెనీలు అమరావతికి వచ్చేందుకు సుముఖత వ్యక్తంచేశాయని, ఇందుకు సంబంధించి ఆ కంపెనీల ప్రతినిధులు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి మధ్య సంతకాలు కూడా జరిగాయని సీఆర్‌డీఏ పేర్కొంది.
10లక్షల చదరపు అడుగుల్లో..
కాగా, అమరావతిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో.. రూ.284కోట్ల నిర్మాణ వ్యయం అంచనాతో పది లక్షల చదరపు అడుగుల్లో ఐటీ టవర్ నిర్మిస్తారు. దీంతో ప్లగ్ అండ్ ప్లే ఐటీ సంస్థలు ఐటీ మౌలిక వసతులను సంయుక్తం గా వినియోగించుకోవడం, బ్రాడ్‌బాండ్ కనెక్టివిటీ, నిరంతరం విద్యుత్ సరఫరా, ఐటీ ఆఫీసులకు ఉద్యోగులు నడిచి వెళ్లి వచ్చేలా అందుబాటు ధరల్లో గృహాలు, సోషల్ రిక్రియేషన్ సౌకర్యాలు కల్పించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది.
ఐటీ టవర్‌లోకి 45 ఐటీ కంపెనీలతో పాటు వాటి అనుబంధ కంపెనీలు రావ డం ద్వారా 8000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని, దాంతోపాటు ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని సీఆర్‌డీఏ పేర్కొంది. తొలుత ఐదు లక్షల చదరపు అడుగుల్లో, ఆ తర్వాత మరో 5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించాలని నిర్ణయించారు. వీటి నిర్మాణం పూర్తయ్యాక ఐటీ స్పేస్‌ను విక్రయించడం, దీర్ఘకాలిక లీజుకూ ఇస్తారు. దీని ద్వారా సీఆర్‌డీఏకు రూ.90. 64 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. రైతుల నుంచి భూములు తీసుకుని వ్యాపార ధోరణి అవలంబిస్తున్న సీఆర్‌డీఏ తీరుపై విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment