హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
రాజధాని రైతులకు కౌలు చెల్లించాలని సీఆర్‌డీఏ చట్టంలో లేదు
విచారణ 2 వారాలకు వాయిదా
సాక్షి, అమరావతి : రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతులకు వార్షిక కౌలును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలన్న సీఆర్‌డీఏ చట్ట నిబంధనను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లింపు నిమిత్తం రూ.240 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం గతేడాది మే 5న జారీ చేసిన జీవో 286 అమలును నిలిపేయాలని కోరుతూ విశాఖపటా్ననికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ యునైటెడ్ ఫ్రంట్ నార్త్ ఆంధ్రా జిల్లాల అధ్యక్షుడు పాక సత్యనారాయణ ఈ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ.. ఏపీ క్యాపిటల్ సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీం (ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్) రూల్స్ 2015, ఏపీ ల్యాండ్ డెవలప్‌మెంట్ రూల్స్ 2017ను శాసనసభ ఆమోదం లేకుండానే అప్పటి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఈ నిబంధనలను రాజధాని కోసం భూములిచ్చిన రైతులను ఆదుకునేందుకు తెచ్చారని తెలిపారు. అయితే వీటిని శాసనసభ ముందు ప్రవేశపెట్టనందున ఇవి చట్ట విరుద్ధమవుతాయన్నారు.
వాస్తవానికి సీఆర్‌డీఏ 2014 చట్టంలో ఎక్కడా రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని లేదని, అందువల్ల రాష్ట్ర ఖజానా నుంచి వార్షిక కౌలు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదని వివరించారు. సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్ 53(1)(డీ) ప్రకారం మొత్తం భూమిలో 5 శాతం భూమిని పేదల నివాసం కోసం గత ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా కేటాయించలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ చట్టం తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అందులో రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు రక్షణ కల్పించిందని గుర్తు చేసింది.
అయితే ఆ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఉపసంహరించుకుందని వీఆర్ రెడ్డి తెలిపారు. అలా అయితే ఉపసంహరణ వల్ల చట్ట నిబంధనలు ఏ విధంగా ప్రభావితం అవుతాయో తెలియజేయాలని వీఆర్ రెడ్డికి ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. రైతుల తరఫున ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసేందుకు ధర్మాసనం అంగీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment