సాక్షి, అమరావతి: రాజధానిలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తే తమ భూముల ధరలు అమాంతం పడిపోతాయని అమరావతి కోసం భూములిచ్చిన వ్యక్తుల తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు హైకోర్టుకు నివేదించారు. రాజధాని ప్రాంతంలో పేదలకు 5 శాతం భూములిస్తూ చట్టం చేసేందుకు తాము గతంలో ఎంతమాత్రం అంగీకరించలేదన్నారు. ప్రపంచ స్థాయి రాజధానిని నాశనం చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లను కూడా నిర్మించి ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రికి పేదలపై అంత ప్రేమ ఉంటే రాజధాని ప్రాంతంలో కాకుండా కడపలో ఇళ్ల స్థలాలు ఇచ్చుకోవాలన్నారు.
ఎల్రక్టానిక్ సిటీకి కేటాయించిన భూముల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పారు. రాజధానికి ఆదాయాన్ని సమకూర్చే ఎల్రక్టానిక్ సిటీ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే చుట్టుపక్కల తమ భూముల ధరలు దారుణంగా పడిపోతాయన్నారు. రాజధాని వెలుపల పెద్ద సంఖ్యలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చుకోవచ్చని పునరుద్ఘాటించారు. రాజధాని భూముల విషయంలో సీఆర్‌డీఏ, రైతులకు మధ్య ఉన్నది వ్యాపార ఒప్పందమన్నారు.
రైతుల అనుమతి లేకుండా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు... పట్టాల మంజూరు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసిందన్నారు. అందువల్ల పట్టాల మంజూరు వ్యవహారం తేలకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టడం తగదన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం హడావుడిగా ఏర్పాట్లు చేస్తోందని, గృహ నిర్మాణాలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు.
రాజధాని భూములపై సీఆర్‌డీఏకు పూర్తిస్థాయి యాజమాన్యపు హక్కులు లేవని, కేవలం షరతులతో కూడిన హక్కులు మాత్రమే ఉన్నాయని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన దమ్మాలపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. భూ సమీకరణ కింద తీసుకున్న భూములను ఇతరులకు ఇవ్వడానికి వీల్లేదన్నారు. ల్యాండ్ పూలింగ్ స్కీం బాధ్యతలన్నింటినీ పూర్తి చేసిన తరువాతే రాజధాని భూములపై సీఆర్‌డీఏకు హక్కులు వస్తాయని పిటిషనర్ల తరఫున మరో న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదించారు.
మా నినాదమే.. పేదలందరికీ ఇళ్లు
ఈ వాదనలను రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ, రెవెన్యూ శాఖల తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, కాసా జగన్‌మోహన్‌రెడ్డి, పోతిరెడ్డి సుభాష్ తోసిపుచ్చారు. ఏ ప్రభుత్వమైనా ఇళ్ల పట్టాలు ఇచ్చేది ఇళ్లను నిరి్మంచుకోవడానికేనన్నారు. ఇళ్లు నిర్మాణం లేనప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రయోజనం ఏముంటుందన్నారు. ప్రభుత్వ నినాదమే ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ అని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు సైతం తన ఉత్తర్వుల్లో ఎక్కడా ఇళ్లు నిర్మించవద్దని చెప్పలేదన్నారు.
ఈ విషయంలో స్పష్టత కావాలనుకుంటే పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చన్నారు. ఎల్రక్టానిక్ సిటీకి మరో చోట భూమి కేటాయిస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో మొత్తం భూమిలో 5 శాతం పేదల ఇళ్ల కోసం కేటాయించాలని సీఆర్‌డీఏ చట్టం చెబుతోందన్నారు. చట్ట నిబంధనలకు లోబడి చేసే పనిని ఏ కోర్టు కూడా తప్పుబట్టడానికి వీల్లేదన్నారు. రాజధాని కోసం రైతులు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా 14 వేల ఎకరాలను ఇచ్చిందని రెవిన్యూ శాఖ తరఫు న్యాయవాది సుభాష్ తెలిపారు. అందులో 1,400 ఎకరాలు పేదలకిస్తే పిటిషనర్లు రాద్దాంతం చేస్తున్నారన్నారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇళ్ల నిర్మాణంపై తన నిర్ణయాన్ని రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా చట్ట సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని, తదనుగుణంగా జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ పలువురి చేత టీడీపీ పిటిషన్లను దాఖలు చేయించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment