సాక్షి, అమరావతి: తమకు వార్షిక కౌలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీసీఆర్‌డీఏలను ఆదేశించాలని కోరుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ముందు అమరావతి రాజధాని రైతు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే తమ ముందు ఆ సంఘాలు అప్పీల్ దాఖలు చేయడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. కోరిన విధంగా సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదన్న కారణంతో అప్పీల్ దాఖలు చేయడం ఎంత వరకు సబబని పిటిషనర్లను ధర్మాసనం ప్రశ్నించింది.
మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదన్న కారణంతో అప్పీళ్ల దాఖలుకు అనుమతినిస్తే, ఇకపై అలా దాఖలయ్యే అప్పీళ్లకు అంతూ పొంతూ ఉండదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నోటీసు దశలో దాఖలయ్యే అప్పీళ్లు ప్రస్తుతం హైకోర్టు కొనసాగిస్తున్న సంప్రదాయ విధి విధానాలకు భంగం కలిగించినట్లు అవుతుందని తెలిపింది. అప్పీల్ దాఖలు చేసి అత్యవసరంగా విచారించాల్సినంత అవసరం ఇందులో ఏముందని, ఇదేమీ ఇళ్ల కూల్చివేత వ్యవహరం కాదు అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే సమయంలో సీఆర్‌డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి సైతం ఈ అప్పీల్‌ను వ్యతిరేకించారు.
ఈ అప్పీల్‌కే కాక, సింగిల్ జడ్జి ముందు దాఖలు చేసిన పిటిషన్‌కు సైతం విచారణార్హత లేదన్నారు. వార్షిక కౌలు చెల్లించాల్సింది రైతులకే తప్ప, రైతు సంఘాలకు కాదని ఆయన వివరించారు. సీఆర్‌డీఏ ఒప్పందాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రైతు సంఘాల తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందిస్తూ, నోటీసు దశలో అప్పీల్ దాఖలు చేయవచ్చునన్నారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులున్నాయని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కౌలు చెల్లించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని సీఆర్‌డీఏను ఆదేశించింది.
తదుపరి విచారణను ఈనెల 12కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ వడ్డిబోయన సుజాతలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమకు చెల్లించాల్సిన వార్షిక కౌలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఆర్‌డీఏలను ఆదేశించాలని కోరుతూ అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశాయి. సీఆర్‌డీఏ అధికారులు అభ్యర్థించిన విధంగా వార్షిక కౌలు చెల్లింపుల మొత్తాలను ఆమోదించేలా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరాయి.
దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ప్రభుత్వానికి, సీఆర్‌డీఏకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. తాము కోరిన విధంగా సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో, రైతు సంఘాలు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశాయి. ఈ అప్పీల్ గురించి ఉన్నం మురళీధరరావు గత వారమే సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. సీజే సైతం నోటీసుల దశలో అప్పీల్ దాఖలుపై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
నోటీసుల దశలో అప్పీల్ ఏంటి?
Published Tue, Sep 5 2023 6:39 AM | Last Updated on Tue, Sep 5 2023 6:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment