
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి కూడా ఇళ్లస్థలాలు కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టాన్ని సవరించడంపై రాజధాని రైతుపరిరక్షణ సమితి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. ఇదే అంశంపై దాఖలైన మరో వ్యాజ్యాన్ని ప్రస్తుత వ్యాజ్యానికి జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. తాజా సవరణ చట్టం ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉందన్నారు.
అందువల్ల మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని, వీలైనంత త్వరగా ఈ వ్యాజ్యంపై విచారణ జరపాలని కోరారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ.. ఇదే అంశంపై మరో వ్యాజ్యం దాఖలైందని తెలిపారు. దాన్ని కూడా ప్రస్తుత వ్యాజ్యంతో జతచేయాలని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది.