సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ఉపసంహరిస్తూ ప్రభుత్వం తాజాగా తెచ్చిన బిల్లులను గవర్నర్ ఆమోదించేవరకు ఆ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు పూర్తిగా నిరర్థకం అవుతాయా? కొంత భాగమే నిరర్థకం అవుతాయా? అన్న విషయాలను తేల్చడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. పాలన వికేంద్రీరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాల ఉపసంహరణకు ముందున్న కార్యకలాపాలు, అభివృద్ధిని చట్టప్రకారం కొనసాగించేందుకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై యథాతథస్థితి (స్టేటస్‌కో)ని కొనసాగించాలంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అడ్డంకి కాదని తెలిపింది. ఈ వ్యాజ్యాల్లో జారీ చేసిన ఇతర మధ్యంతర ఉత్తర్వులన్నీ తదుపరి విచారణ వరకు కొనసాగుతాయని చెప్పింది.
తదుపరి విచారణను డిసెంబర్ 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై దాఖలైన వ్యాజ్యాలపై త్రిసభ్య ధర్మాసనం తాజాగా సోమవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, తాజా బిల్లులపై అఫిడవిట్ వేశామని చెప్పారు. బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపామన్నారు. గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వం ఏం చేసింది, తదుపరి ఏం చేయబోతోంది తదితర వివరాలతో మెమో దాఖలు చేస్తామని, ఇందుకు నాలుగు వారాల గడువు కావాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది.
మా వ్యాజ్యాలపై విచారణను కొనసాగించండి
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్, పీబీ సురేశ్ తదితరులు వాదనలు వినిపిస్తూ, బిల్లులు ఇంకా చట్ట రూపం దాల్చలేదన్నారు. ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వం ఒక వైపు పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ఉపసంహరిస్తూ బిల్లులు తెచ్చిందని, మరో వైపు మూడు రాజధానుల కోసం బిల్లులు తెస్తామని చెబుతోందన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలన్నదే తమ ప్రధాన వాదన అని తెలిపారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌ను అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థన కూడా ముఖ్యమైనదని వివరించారు. అందువల్ల తాజా బిల్లులతో సంబంధం లేకుండా విచారణ కొనసాగించాలని ధర్మాసనాన్ని కోరారు.
అమరావతిలో అభివృద్ధి ఆగిపోవడాన్ని మేం కోరుకోవడం లేదు
ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, గతంలో ఇచ్చిన యథాతథస్థితి ఉత్తర్వుల వల్ల అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోవడాన్ని తాము కోరుకోడం లేదంది. అభివృద్ధి కార్యకలాపాలకు యథాతథస్థితి ఉత్తర్వులు అడ్డంకి కాదని తెలిపింది. న్యాయస్థానం ఆదేశాలతో అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందన్న భావన ప్రజల్లో కలగకూడదంది. ప్రతీ ప్రభుత్వ నిర్ణయాన్ని అనుమానించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలను చట్టాలు చేయకుండా నిరోధించడం సాధ్యం కాదని, అవి నిబంధనల మేర ఉన్నాయో లేదో మాత్రమే చూస్తామని తెలిపింది. అనంతరం పిటిషనర్ల తరఫున పలువురు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యాజ్యాలు పూర్తిగా నిరర్థకం అవుతాయా? కొంత భాగమే నిరర్థకం అవుతాయా? అన్న అంశాన్ని బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేసేంత వరకు తేల్చడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment