సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలతోపాటు రాజధాని తరలింపునకు సంబంధించి అన్ని వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు అక్టోబర్ 5కు వాయిదా వేసింది. తాజాగా కొందరు పిటిషనర్లు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలపై సమాధానమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదిగా ఉన్న అన్ని కేసుల్లో వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేయడమా? లేక ఇప్పటికే దాఖలు చేసిన కౌంటర్లను ఆ వ్యాజ్యాలకు అన్వయించడమా? అనే అంశంపై ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఒకవేళ ఇప్పటికే దాఖలు చేసిన కౌంటర్లను అన్ని వ్యాజ్యాలకు అన్వయింప చేయదలిస్తే అదే విషయాన్ని తెలియజేయాలని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాలపై విచారణను ఏ విధానంలో చేపట్టాలనే అంశాన్ని తదుపరి విచారణ సమయంలో తేలుస్తామని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చారు.
► పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలతోపాటు ఇతర అంశాలను సవాలు చేస్తూ హైకోర్టులో దాదాపు 94 వ్యాజ్యాలు దాఖలవడం తెలిసిందే. వీటిపై జస్టిస్ రాకేశ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. విశాఖలో అతిథి గృహం నిర్మాణానికి సంబంధించి ధర్మాసనం ఇచ్చిన యథాతథ స్థితి ఉత్తర్వులపై ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయలేదని పిటిషనర్ల న్యాయవాది నిదేష్ పేర్కొన్నారు. తాజాగా తాము అనుబంధ పిటిషన్లు దాఖలు చేశామన్నారు.
అతిథి గృహానికి, రాజధానికి సంబంధం లేదు: ఏజీ శ్రీరామ్
► అతిథిగృహం విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌంటర్ సిద్ధంగా ఉందని, త్వరలో కోర్టు ముందుంచుతామని ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. విశాఖలో నిర్మించ తలపెట్టిన అతిథిగృహానికి, రాజధానికి సంబంధం లేదన్నారు. అనుబంధ వ్యాజ్యాలపై వారంలోగా కౌంటర్లు దాఖలు చేస్తామన్నారు.
► రాజధాని శంకుస్థాపనకు ప్రధాని స్వయంగా వచ్చి పునాదిరాయి వేశారని, రాజధానితో తమకు సంబంధం లేదని కేంద్రం చెప్పడం సరికాదని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్ పేర్కొన్నారు. అన్ని వ్యాజ్యాలపై కేంద్రం, ప్రధాని కార్యాలయం కౌంటర్లు దాఖలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని తామెలా బలవంతం చేస్తామని ప్రశ్నించింది. కేంద్రం తరఫున ఏఎస్‌జీ హరినాథ్ స్పందిస్తూ కొన్ని వ్యాజ్యాల్లో కౌంటర్లు దాఖలు చేశామని, వీటినే మిగిలిన వాటికీ అన్వయింపజేస్తామన్నారు.
రాజధాని వ్యాజ్యాలపై విచారణ 5కి వాయిదా
Published Tue, Sep 22 2020 3:50 AM | Last Updated on Tue, Sep 22 2020 3:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment