సాక్షి, అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకుంటూ చట్టాలు వచ్చిన నేపథ్యంలో వాటిని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్థకమే అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్, సీఆర్‌డీఏ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్‌రెడ్డి, శాసన మండలి తరఫున సీనియర్ న్యాయవాది సర్వ సత్యనారాయణ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు. ఆ వ్యాజ్యాల్లో విచారించడానికి ఏమీలేదని వివరించారు. ఈ ముగ్గురి వాదనలతో పాటు కేంద్ర ప్రభుత్వ వాదనలు సైతం ముగిసిన నేపథ్యంలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తిరుగు సమాధానం ఇచ్చేందుకు వీలుగా తదుపరి విచారణను ఈ నెల 4కి వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజుల త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులందరూ 4వ తేదీన అర్థగంటలో తమ వాదనలు ముగించాలని ధర్మాసనం స్పష్టంచేసింది. చట్టాలను ఉపసంహరిస్తూ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో.. ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాల్లో ఏఏ అభ్యర్థనలు మనుగడలో ఉంటాయి? ఏవి నిరర్థకమయ్యాయి? అన్న పిటిషనర్ల వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం విచారణ జరుపుతోంది. తాజాగా.. బుధవారం మరోసారి వీటిపై విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు పూర్తిచేసిన నేపథ్యంలో ఏజీ ఎస్. శ్రీరామ్, సీనియర్ న్యాయవాదులు ఎస్. నిరంజన్‌రెడ్డి, ఎస్.సత్యనారాయణ ప్రసాద్ వాదనలు వినిపించారు.
ఆ అంశం తేలిస్తే ఇది కూడా తేల్చండి..
ముందుగా ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. అమరావతిని రాజధానిగా మార్చకుండా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరుతున్నారని, ఆ అంశంపై కోర్టు తేలిస్తే, అసలు అమరావతిని పునర్విభజన చట్ట నిబంధనల ప్రకారమే రాజధానిగా నిర్ణయించారా? అన్న అంశాన్ని కూడా తేల్చాల్సి ఉంటుందన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటుచేసిందన్నారు. అలాగే, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రభుత్వం బోస్టస్ కమిటీ, జీఎన్ రావు కమిటీలను ఏర్పాటుచేసిందని, ఇవి నిజ నిర్ధారణ కమిటీల వంటివని శ్రీరామ్ వివరించారు. ఈ నివేదికలపై న్యాయ సమీక్ష చేయడానికి లేదా వాటిని రద్దు చేయడానికీ వీల్లేదన్నారు. ఆ చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత కూడా వాటిపై దాఖలైన వ్యాజ్యాలను విచారించాలని ఎలా కోరతారని ప్రశ్నించారు. ఏ రకంగా చూసినా అవన్నీ నిరర్థకమయ్యాయని శ్రీరామ్ తెలిపారు.
సీఆర్‌డీఏ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
తర్వాత నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఏ చట్టం చేయాలి.. ఆ చట్టం ఎలా ఉండాలన్నది ప్రభుత్వ, శాసన వ్యవస్థ పరిధిలోని అంశమన్నారు. ఆ చట్టం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉందా? లేదా? అన్నది మాత్రమే కోర్టులు చూడాల్సి ఉంటుందని తెలిపారు. సీఆర్‌డీఏ ప్రాంతాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో వెనక్కివెళ్లే ఉద్దేశంలేదన్నారు. అయితే.. నిధుల కొరతే ప్రధాన సమస్య అన్నారు. మాస్టర్ ప్లాన్‌ను అమలుచేసేందుకు రూ.1.09 లక్షల కోట్ల వ్యయం అవుతుందని, ఇప్పుడు అది రూ.2 లక్షల కోట్లకు చేరవచ్చునని వివరించారు. ప్రాధాన్యతల ఆధారంగా కీలక మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. మరో సీనియర్ న్యాయవాది సర్వ సత్యనారాయణ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం భవిష్యత్తులో ఏ చట్టం చేస్తుంది? అందులో ఏముంటాయి తదితర విషయాలు కోర్టుకు సంబంధంలేదన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలా? లేక మరేదైనా రాజధానిగా ఉండాలా? వంటి అంశాలను న్యాయస్థానాలను తేల్చజాలవన్నారు. ఇందుకు సంబంధించి న్యాయస్థానాలు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు.
పాలనా కేంద్రం ఎంపిక రాష్ట్రం ఇష్టం
అనంతరం.. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎన్. హరినాథ్ వాదనలు వినిపిస్తూ, రాజధాని విషయంలో తమ పాత్ర ఏమీ ఉండదన్నారు. పాలనా కేంద్రం ఎక్కడ ఉండాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమని తెలిపారు. దీంతో ప్రతివాదుల తరఫున వాదనలన్నీ పూర్తి కావడంతో ఈ వాదనలకు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తిరుగు సమాధానమివ్వడం మొదలుపెట్టారు. అప్పటికి కోర్టు సమయం ముగియడంతో మరికొందరి తిరుగు సమాధానం కోసం ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 4కి వాయిదా వేసింది. ఆ రోజున అందరి వాదనలు పూర్తయితే, ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment