Advocate General
-
అక్రమ నిర్బంధాలపై ఏపీ హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సిబ్బంది అక్రమ నిర్బంధాలపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ మేరకు బాధిత కుటుంబాలు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ స్టేషన్ల నుంచి సీసీటీవీ ఫుటేజీలను సమర్పించాలంటూ ఆ ఆదేశాల్లో పేర్కొంది. పోలీస్ స్టేషన్ల నుంచి సీసీటీవీ ఫుటేజీలు ఇవ్వాలి. ఈ నెల 4 నుంచి ఇవాళ్టి వరకు సీసీ ఫుటేజీలను స్థానిక మెజిస్ట్రేలకు సమర్పించాలి. పౌరస్వేచ్ఛను కాపాడడంలో ఈ కోర్టుకు బాధ్యత ఉంది. చట్టానికి లోబడి వ్యవహరిస్తున్నారా? లేదా?. ప్రొసీజర్ ఫాలో కాకపోతే.. భవిష్యత్తులో ఏం చేయాలో చూస్తాం అంటూ ప్రభుత్వానికి ధర్మాసనం హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం.. హెబియస్ కార్పస్ పిటిషన్లను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఇన్నేసి పిటిషన్లు దాఖలు కావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో అసలేం జరుగుతోందంటూ ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. మధ్యాహ్నాం భోజన విరామం తర్వాత తిరిగి విచారణ ప్రారంభం కాగా.. ఇవన్నీ తప్పుడు పిటిషన్లని, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ధర్మాసనాన్ని అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. అయితే ఇవన్నీ నిజమైన పిటిషనలేనని, బాధిత కుటుంబ సభ్యులే వీటిని వేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో..ఏజీ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. అదే టైంలో.. పిటిషన్లు వేసిన వాళ్లందరినీ పోలీసులు వదిలేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు బెంచ్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ వాదనపై న్యాయమూర్తులు అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘మీ మాటలు మేము ఎలా నమ్మాలి. మీరు వదిలేశారు అనడానికి ఆధారాలు ఏంటి?’’ అని ప్రశ్నిస్తూ.. ఆ ఆరుగురు ఎక్కడ ఉన్నారో వెంటనే కనుక్కుని చెప్పాలి’’ని ప్రభుత్వం తరఫున న్యాయవాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే టైంలో పీఎస్‌ల సీసీటీవీ ఫుటేజీలను సమర్పించాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను సోమవారానికి(11వ తేదీకి) వాయిదా వేసింది. -
ఏపీ అడ్వొకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్
సాక్షి, అమరావతి: అందరూ ఊహించిన విధంగానే రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులు కానున్నారు. ఆయన నియామకానికి సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఏజీగా దమ్మాలపాటిని నియమించాలన్నది చంద్రబాబు అభిలాష అని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరబ్ కుమార్ ప్రసాద్‌ను కోరారు. దీంతో సీఎస్ ఏజీ నియామక ఫైల్‌ను గవర్నర్ ఆమోదం కోసం పంపారు. గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే, దమ్మాలపాటి నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడుతాయి. రెండోసారి ఏజీగా దమ్మాలపాటి ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులు కావడం ఇది రెండోసారి. 2016లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఆయన ఏజీగా సేవలందించారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన∙వెంటనే సీనియర్ న్యాయవాది పి.వేణుగోపాల్ అడ్వొకేట్ జనరల్ అయ్యారు. , దమ్మాలపాటి అదనపు ఏజీగా నియమితులయ్యారు. 2016లో వేణుగోపాల్ ఏజీ పదవికి రాజీనామా చేశారు. దీంతో 2016 మే 28న దమ్మాలపాటి శ్రీనివాస్ అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి 2019లో చంద్రబాబు అధికారం కోల్పోయేంత వరకు ఏజీగా కొనసాగారు. దమ్మాలపాటికే పూర్తి స్వేచ్ఛ ఏజీ నియామకం కొలిక్కి రావడంతో అదనపు ఏజీ (ఏఏజీ), ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులు (ఎస్‌జీపీ), ప్రభుత్వ న్యాయవాదులు (జీపీ), సహాయ ప్రభుత్వ న్యాయవాదుల (ఏజీపీ) పోస్టులను త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉంది. అదనపు ఏజీ పోస్టు భర్తీ చేస్తారా లేక గతంలోలా ఆ పోస్టును భర్తీ చేయకుండా వదిలేస్తారా అన్న దానిపై న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఒకవేళ ఏఏజీ పోస్టును భర్తీ చేస్తే జనసేన లేదా బీజేపీల్లో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. అదనపు ఏజీ పోస్టు ఒకటా లేక రెండు ఉంటాయా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఒక అదనపు ఏజీ పోస్టు మాత్రమే భర్తీ చేస్తే జనసేనకే అవకాశం ఉంది. రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) నియామకం కొంత సుదీర్ఘ ప్రక్రియ. హైకోర్టును సంప్రదించిన తరువాతే పీపీని నియమించాలి. అందువల్ల పీపీ నియామకం అలస్యమవుతుంది. టీడీపీ నుంచి ఎవరిని జీపీలు, ఏజీపీలు చేయాలన్న విషయంపై ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. జీపీలు, ఏజీపీలతో పాటు స్టాండింగ్ కౌన్సిల్స్ నియామకాల్లో గతంలోలానే దమ్మాలపాటి శ్రీనివాస్‌కు చంద్రబాబు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు తెలిసింది. శ్రీరామ్ తదితరుల రాజీనామాలకు ఆమోదం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అడ్వొకేట్ జనరల్‌గా పనిచేసిన శ్రీరామ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగిరెడ్డి రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులిచ్చి0ది. దమ్మాలపాటి వైపే చంద్రబాబు మొగ్గు తాజాగా ఏజీ పోస్టుకి పలువురి పేర్లు వినిపించాయి. సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు సహా పలువురి పేర్లు చర్చకు వచ్చాయి. అయితే చంద్రబాబు చివరకు దమ్మాలపాటి వైపే మొగ్గు చూపారు. గతంలో ఏజీగా పనిచేసి ఉండటం, పలు విపత్కర పరిస్థితుల నుంచి చంద్రబాబుతో సహా పార్టీ ఇతర నేతలను బయటపడేయడం, పార్టీలో అందరికీ అందుబాటులో ఉండటం వంటివి దమ్మలపాటికి కలసి వచ్చాయి. న్యాయవ్యవస్థలో దమ్మాలపాటికి మంచిపట్టు ఉండటం కూడా ఆయనకు సానుకూల అంశంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నంతకాలం ఆయన ఏజీ పదవిలో కొనసాగుతారు. -
అమాయకుడేమి కాదు..రఘురామకు హైకోర్టు చురకలు
-
AP: ఆ పిటిషన్‌కు అర్హతే లేదన్న ఏజీ
సాక్షి, గుంటూరు: విశాఖకు క్యాంపు కార్యాలయాల తరలింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ పిటిషన్ విచారణ అర్హతే లేదని.. పైగా పిటిషనర్లు అమరావతిలో భూముల్ని కలిగి ఉన్నారనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్. ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ, సమీక్ష కోసం.. కాబోయే పాలనా రాజధాని విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు కోసం ఏపీ ప్రభుత్వం నవంబర్ 22వ తేదీన జీవో నెంబర్ 2283 జారీ చేసింది. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తిస్తూ ఐఏఎస్‌ల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ జీవో రిలీజ్ చేసింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ ఓ రిట్ పిటిషన్ దాఖలైంది. అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని ప్రాంత రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. జీవో అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు వేయాలని కోర్టును పిటిషన్ ద్వారా కోరారు వాళ్లు. అయితే ఇవాళ్టి విచారణలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) రూపేనా కోర్టు ముందుకు రావాలే తప్ప రిట్ రూపంలో కాదని ఏజీ శ్రీరామ్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ‘‘ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాల్సిన అంశాన్ని రిట్ పిటిషన్‌గా దాఖలు చేశారు. రాజధానితో ముడిపడి ఉన్న అంశం చీఫ్ జస్టిస్ బెంచ్ లేదంటే ఫుల్ బెంచ్ ముందుకు మాత్రమే రావాల్సి ఉంటుంది. కానీ పిటిషనర్లు కావాలనే రిట్ వేశారు. పైగా పిటిషనర్లు అమరావతిలో భూములు కలిగి ఉన్నారు. కాబట్టి ఇది ఫోరమ్ షాపింగ్ కిందకు వస్తుందన్నారు (ఫోరమ్ షాపింగ్‌పై పలు తీర్పులను న్యాయస్థానానికి వివరించారాయన.. ). ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. ఇదీ చదవండి: విశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలు గుర్తింపు -
రింగ్ రోడ్ మార్గంలో లింగమనేనికి భారీగా భూములు: ఏజీ
-
బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్: మనోహర్ రెడ్డి
-
అమరావతి R-5 జోన్..ఇది పేదల విజయం
-
బండి సంజయ్ తన ఫోన్ ఇవ్వలేదన్న ఏజీ.. హైకోర్టు స్పందన ఇదే..
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పేపర్ లీక్ కేసు బండి సంజయ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన రిమాండ్‌ను సవాల్ చేస్తూ సంజయ్ పిటిషన్ వేశారు. ఇందులో భాగంగా హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా సంజయ్ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును అడ్వకేట్ జనరల్(ఏజీ) కోరారు. ఇక, విచారణకు బండి సంజయ్ సహకరించట్లేదని ఏజీ.. హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సంజయ్ తన ఫోన్‌ను అప్పగించలేదని ఏజీ తెలిపారు. దీంతో, ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది. అనంతరం, తదుపరి విచారణను ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఇది కూడా చదవండి: పేపర్ లీక్ కేసు.. బండి సంజయ్ సంచలన నిర్ణయం -
జీవో నంబర్-1పై హైకోర్టులో విచారణ.. వాదనలు వినిపించిన ఏజీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జీవో నంబర్-1పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సీపీఐ రామకృష్ణ కోర్టును కోరారు. ఈ క్రమంలో ఈ పిటిషన్‌ను అత్యవసరంగా తీసుకోనక్కర్లేదని ఏజీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న చెంచ్‌కు పిల్‌ను విచారించే అధికారం లేదని ఏజీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పిల్‌ను తామే అత్యవసరంగా విచారిస్తామని వెకేషన్ కోర్టు తెలిపింది. కాగా, హైకోర్టులో విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. పిల్‌పై ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదన్నారు. నిబంధనల ప్రకారం ఈ కేసు రోస్టర్‌లో రావడానికి ఆస్కారం లేదు. వెకేషన్ బెంచ్ విధాన నిర్ణయాల కేసులను విచారించకూడదు. జడ్జీలను ఎంపిక చేసుకోవడంలో భాగంగా ఒక రాజకీయ పార్టీ దీన్ని ఉపయోగించుకుంటోంది అని స్పష్టం చేశారు. -
కామారెడ్డి మాస్టర్‌ప్లాన్.. ఏజీకి హైకోర్టు కీలక ఆదేశాలు!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, మాస్టర్‌ప్లాన్‌పై రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, రిట్ పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. రైతుల తరఫున న్యాయవాది సృజన్ రెడ్డి.. మాస్టర్ ప్లాన్‌ను కోర్టుకు సమర్పించారు. రైతులను పక్కనపెట్టి రీక్రియేషన్ జోన్‌గా ప్రకటించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయంతో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని తెలిపారు. దీంతో, మాస్టర్ ప్లాన్‌పై ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించాలని హైకోర్టు ఆదేశించింది. తర్వాత పిటిషన్‌ను హైకోర్టు పాస్ ఓవర్ చేసింది. -
రాజాసింగ్‌పై వందకుపైగా క్రిమినల్ కేసులు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వందకుపైగా క్రిమినల్ కేసులున్నాయని, అందులో ఒక హత్య కేసు కూడా ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గతంలో ఆయనపై నమోదైన రౌడీషీట్ ఇంకా కొనసాగుతోందని వెల్లడించింది. రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య టి. ఉషాభాయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి, జస్టిస్ జె.శ్రీదేవి ధర్మాసనం బుధవారం కూడా విచారణను కొనసాగించింది. ప్రభుత్వ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ హాజరై వాదనలు వినిపించారు. 1860లో ఏర్ప డిన ఉత్తరప్రదేశ్‌లోని ఇస్లామిక సెమినరీ ప్రకారం.. ‘ఆకా’‘మౌలా’అనే పదాలు ప్రవక్తను చూచి స్తాయని చెప్పారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడిన వీడియో సీడీని కోర్టు అందజేశారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగానే మూడు క్రిమినల్ కేసుల ఆధారంగా రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు. అనంతరం ధర్మాసనం.. విచారణను గురువారానికి వాయిదా వేసింది. చదవండి: నన్ను చంపి బతికి బట్ట కట్టగలమని అనుకుంటున్నారా?.. ఈటల హెచ్చరిక -
ఆ యాత్ర ఉద్దేశమే వేరు
సాక్షి, అమరావతి: అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ పాదయాత్ర చేపట్టిన రైతులు.. ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలను రెచ్చగొడుతూ, వారి మనోభావాలను దెబ్బ తీస్తున్నారని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. హైకోర్టు విధించిన షరతులను అమరావతి రైతులు ఉల్లంఘిస్తున్నందున వారి యాత్రకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరుతూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి.. యాత్రలో 600 మంది రైతులు మాత్రమే ఉండాలని, సంఘీభావం పేరుతో ఇతరులెవ్వరూ యాత్రలో పాల్గొనడానికి వీల్లేదంటూ ఇచ్చిన ఆదేశాలను సవరించాలని రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు శుక్రవారం విచారణ జరిపారు. అది ముమ్మాటికీ రాజకీయ యాత్రే పోలీసుల తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ‘యాత్రలో పాల్గొనే 600 మంది రైతులకు పోలీసులు గుర్తింపు కార్డులు సిద్ధం చేశారు. వాటిని జారీ చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశాం. అయితే కొద్ది మంది మాత్రమే గుర్తింపు కార్డులు తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు గుర్తింపు కార్డులు చూపాలని పోలీసులు అడిగితే, కోర్టు విధించిన షరతులను సడలించాలని వారు అడుగుతున్నారు. యాత్ర వెంట నాలుగు వాహనాలకు బదులుగా 200 వాహనాలు వెంట ఉన్నాయి. అసలు అమరావతి రైతులు తలపెట్టిన యాత్ర ఉద్దేశమే వేరు. ఇటీవల గుడివాడలో అక్కడి ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి.. గుడివాడ వచ్చాం.. తేల్చుకుందాం రా అంటూ తొడలు కొడుతూ తీవ్రంగా రెచ్చగొట్టారు. వారికి కోర్టు ఉత్తర్వులంటే గౌరవం లేదు. దైవ దర్శనం కోసం వెళుతున్నామని చెప్పి రాజకీయ యాత్రగా మార్చేశారు. అందువల్ల అమరావతి టు అరసవల్లి పాదయాత్రకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలి’ అని ఆయన కోర్టును అభ్యర్థించారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజారుస్తున్నారు.. మంత్రులు గుడివాడ అమర్నాథ్, కారుమూరి నాగేశ్వరరావు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాదులు కేజీ కృష్ణమూర్తి, ఆర్.ఎన్.హేమేంద్రనాథ్‌రెడ్డి, చిత్తరవు రఘు, వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. కొందరు రైతులు న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తుల ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం, టీవీల్లో చర్చలు పెట్టడం చేస్తున్నారని తెలిపారు. మంత్రులపై పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటికి కౌంటర్ రూపంలో సమాధానం ఇస్తామన్నారు. రైతుల తరఫు న్యాయవాదులు ఉన్నం మురళీధరరావు, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. సంఘీభావం పేరుతో యాత్రలో ఇతరులు పాల్గొనడానికి వీల్లేదన్న ఆదేశాలు యాత్రలో పాల్గొనాలనుకుంటున్న వారి హక్కులను హరించేలా ఉన్నాయన్నారు. గుర్తింపు కార్డులు పొందిన వారే కాకుండా ఇతరులు కూడా యాత్రలో పాల్గొంటారని, రొటేషన్ పద్దతిలో యాత్రను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అవేం మాటలు? రైతులు దాఖలు చేసిన పిటిషన్లో ఉపయోగించిన భాషపై న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాదయాత్ర చేస్తున్నది జంతువుల్లా అలా నడుచుకుంటూ వెళ్లడానికి కాదంటూ పిటిషన్లో పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టును శాసించేలా పదజాలం ఉపయోగించడంపై కూడా మండిపడ్డారు. దీంతో రైతుల తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు క్షమాపణలు కోరారు. -
రివ్యూనా.. ఎస్ఎల్పీనా.. పరిశీలిస్తున్నాం
సాక్షి, అమరావతి: రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరునెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ హైకోర్టు ముందు రివ్యూ పిటిషన్ లేదా సుప్రీంకోర్టు ముందు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలుచేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్లు వెల్లడించారు. హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు కొందరు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ పెండింగ్‌లో ఉండగా రాజధాని వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాల్లో తాము విచారణ జరపడం సమంజసం కాదని స్పష్టం చేసింది. కింది కోర్టు తీర్పులపై ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు కోర్టు ధిక్కారమన్న ప్రశ్న తలెత్తదని చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో తదుపరి విచారణను అక్టోబర్ 17కి వాయిదా వేసింది. ఈలోపు పిటిషనర్లు దాఖలు చేసిన అప్పీళ్లపై సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూద్దామంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరునెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును సీఎం, మంత్రులు, అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని, వారిచర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి శిక్షించాలంటూ రాజధాని రైతులు దోనె సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు దాఖలు చేసిన కోర్టుధిక్కార పిటిషన్లు మంగళవారం మరోసారి విచారణకు వచ్చాయి. వీటితోపాటు రాజధాని అంశంపై వ్యాజ్యాలు కూడా విచారణకు వచ్చాయి. వీటన్నింటిని సీజే ధర్మాసనం విచారించింది. -
హైకోర్టులో జీపీలు, ఏజీపీల నియామకం
సాక్షి, అమరావతి: హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకుగాను పలువురిని ప్రభుత్వ న్యాయవాదులు(జీపీ), ప్రభుత్వ సహాయ న్యాయవాదులు(ఏజీపీ)గా నియమిస్తూ అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. జీపీగా నియమితులైన వారిలో గోడ రాజాబాబు, ఎల్వీఎస్ నాగరాజు, టీఎంకే చైతన్య, వేగి కొండయ్య నాయుడు, జీఎల్.నర్సింహారెడ్డి ఉన్నారు. వీరిలో టీఎంకే చైతన్య సీఐడీ స్టాండింగ్ కౌన్సిల్‌గా, రాజాబాబు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. జీఎల్ నర్సింహారెడ్డి ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పనిచేయగా, ఆయనకు ఇప్పుడు జీపీ పోస్టు ఇచ్చారు. ఏజీపీలుగా నియమితులైన వారిలో కుంచె ఆనందరావు, బొల్లవరపు సత్యేంద్ర మణికుమార్, గటల రాజశ్రీ, టి.రాధారాణి, కరగంజి హేమంత్ కుమార్, వై.సుబ్బారావు, బి.ధరణీ కుమార్, షేక్ ఆసిఫ్, తాయి లక్ష్మీ పద్మజ, జి. ప్రశాంతి, విశ్వనాధ శక్తిధార్, వేలూరి భరత్ సురేందర్‌రెడ్డి ఉన్నారు. వీరు మూడేళ్ల పాటు ఆయా పోస్టుల్లో కొనసాగుతారు. జీపీలకు నెలకు రూ.1 లక్ష, ఏజీపీలకు రూ.44 వేలు గౌరవ వేతనంగా చెల్లిస్తారు. కాగా, జీపీలకు శాఖలను కేటాయిస్తూ ఏజీ ఎస్.శ్రీరామ్ బుధవారం అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో రెవెన్యూ, హోం శాఖలను రెండుగా విభజించారు. కొన్ని జిల్లాలకు చెందిన హోం శాఖ కేసులను మహేశ్వర్‌రెడ్డికి, మరికొన్ని జిల్లాలను చైతన్యకు అప్పగించారు. రెవెన్యూ అసైన్మెంట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆంధ్ర ప్రాంతం నాగేశ్వరరావుకు, రాయలసీమ ప్రాంతాన్ని నర్సింహారెడ్డికి కేటాయించారు. రెవెన్యూ జనరల్ ఆంధ్ర ప్రాంతాన్ని సుభాష్‌కు, రాయలసీమ ప్రాంతాన్ని బాలస్వామికి అప్పగించారు. వేగి కొండయ్యనాయుడికి వ్యవసాయం, సహకార శాఖ, రాజాబాబుకు గ్రామ, వార్డు సచివాలయాలు, నాగరాజుకు పాఠశాల విద్యాశాఖను కేటాయించారు. -
నూతన జిల్లాలకు కొత్త జెడ్పీ చైర్మన్లు
సాక్షి, అమరావతి: జిల్లాల పునర్విభజన పూర్తయిన వెంటనే ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్ (జెడ్పీ)లను 26 జెడ్పీలుగా విభజించి, కొత్తగా ఏర్పాట య్యే జిల్లాలకు వేరుగా జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ దిశగా కసరత్తు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న జిల్లాల ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరిగి ఐదు నెలలైంది. 13 జిల్లాల్లో ఒక్కో జెడ్పీ చైర్మన్, ఇద్దరేసి వైస్ చైర్మన్ల చొప్పున గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆయా పదవులకు ఎన్నికైన వారు మరో నాలుగున్నర ఏళ్లకు పైనే ఆ పదవుల్లో కొనసాగాల్సి ఉంది. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా సుదీర్ఘ కాలం పాటు పాత జిల్లా ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్లను కొనసాగించడం మంచిది కాదనే అభిప్రాయంతో ప్రభుత్వం కొత్త జెడ్పీల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోందని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. అప్పట్లో తెలంగాణలో భిన్న పరిస్థితులు మన పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత కూడా అప్పటికే ఉన్న జెడ్పీ చైర్మన్లే పదవీ కాలం ముగిసే వరకు ఆయా పదవుల్లో కొనసాగారు. ఆ రాష్ట్రంలో 2016 దసరా రోజున కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. అంతకు ముందు 10 జిల్లాలుగా ఉండే తెలంగాణ రాష్ట్రం జిల్లాల పునర్విభజన తర్వాత 33 జిల్లాలుగా మారిపోయింది. 2014లో ఉమ్మడి జిల్లాల వారీగా ఎన్నికైన జెడ్పీ చైర్మన్లే 2019లో వారి పూర్తి పదవీ కాలం ముగిసే వరకు ఆయా పదవుల్లో కొనసాగారు. అయితే రాజకీయంగా ఆ రాష్ట్రానికి, మన రాష్ట్రానికి మధ్య చాలా తేడా ఉందని, ఈ దృష్ట్యా కొత్త జిల్లాల వారీగా జెడ్పీల విభజన ప్రక్రియకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పట్లో తెలంగాణలో కొత్త జిల్లాలకు అనుగుణంగా వెంటనే జెడ్పీల విభజన చేపట్టడానికి పలు చోట్ల టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లేదనేది ఒక కారణం అని తెలుస్తోంది. అప్పట్లో తెలంగాణలో జిల్లాల పునర్విభజన తర్వాత 33 జిల్లాల్లో జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరిగితే అన్నిచోట్ల కచ్చితంగా అధికార టీఆర్ఎస్ వారే చైర్మన్లుగా గెలుస్తారో లేదో అన్న సంశయంతో పాత జెడ్పీలనే కొనసాగించారని విశ్లేషకులు చెబుతున్నారు. దానికి తోడు జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం అప్పటికి మరో రెండేళ్లు మాత్రమే మిగిలి ఉండడం వల్ల కూడా జెడ్పీల విభజన జోలికి పోలేదని సమాచారం. అయితే మన రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత కూడా 26 జిల్లాల ప్రాతిపదికన జెడ్పీలను విభజిస్తే అన్ని చోట్ల అధికార పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉందనే విషయాన్ని గమనించాలని పలువురు స్పష్టం చేస్తున్నారు. ఈ దృష్ట్యా కొత్త జిల్లాల ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహణకే ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఏజీకి లేఖ.. ప్రస్తుత జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం మధ్యలో కొత్త జిల్లాల వారీగా జెడ్పీల విభజన ప్రక్రియలో న్యాయ పరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా.. అని నిర్ధారించుకోవడానికి పంచాయతీ రాజ్ శాఖ న్యాయ సలహాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌కు లేఖ రాశారు. మరోవైపు జిల్లాల పునర్విభజన జరిగిన వెంటనే కొత్త జిల్లాల వారీగా జెడ్పీలను విభజిస్తే.. జెడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారి వంటి అదనపు పోస్టుల కల్పనకు కూడా పంచాయతీ రాజ్ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. -
పరిస్థితికి తగ్గ చర్యలు
సాక్షి, అమరావతి: కొత్త వేతన సవరణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఏ రూపంలో ఉన్నా, వాటిని ప్రభుత్వం నియంత్రిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. పరిస్థితికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడం రాజ్యాంగ వ్యతిరేకమే కాక, సర్వీసు నిబంధనలకు కూడా విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల సమ్మె నోటీసును రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ విశాఖపట్నంకు చెందిన విశ్రాంత ప్రొఫెసర్ నాదెండ్ల సాంబశివరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం కోర్టు విచారణ మొదలు కాగానే సాంబశివరావు తరఫు న్యాయవాది ఎస్.శరత్ కుమార్ తమ పిల్ గురించి న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ కుంభజడల మన్మధరావుల ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. ఈ నెల 6వ తేదీ రాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెకు వెళుతున్నారని, అందువల్ల ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా లంచ్ మోషన్ రూపంలో విచారణ జరపాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించి ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. ప్రభుత్వాన్ని సవాలు చేస్తున్నారు.. ఈ సందర్భంగా శరత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. పీఆర్సీ సాధన సమితి పేరుతో ఉద్యోగులు ఆందోళనలు చేస్తూ ప్రభుత్వాన్ని సవాలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారాన్నే ప్రశ్నిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఘర్షణ ఉండకూడదన్నారు. చర్చలు, ఏకాభిప్రాయం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తున్నా, ఉద్యోగులు మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని వివరించారు. ఉద్యోగులు మూకుమ్మడిగా సమ్మెకు వెళితే పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ తీవ్రంగా ప్రభావితమవుతాయన్నారు. ‘ఛలో విజయవాడ’ పేరుతో భారీ సంఖ్యలో ఉద్యోగులందరూ ఓ చోట చేరారని, ప్రస్తుత కోవిడ్ థర్డ్‌వేవ్ పరిస్థితుల్లో ఇది చాలా ప్రమాదకరమని చెప్పారు. ఓ రకంగా రాష్ట్రాన్ని కోవిడ్ ప్రమాదంలోకి నెట్టడమే అవుతుందని తెలిపారు. అందుకే సమ్మెను నిషేధించాలని కోరుతున్నామని తెలిపారు. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విన్నవించారు. రాజకీయ పార్టీల మద్దతుతో ఉద్యోగులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ఉద్యోగులు ప్రస్తుతం సమ్మె చేయడం లేదు కదా? అని ప్రశ్నించింది. పెన్‌డౌన్ మొదలు పెట్టారని శరత్ చెప్పగా, పెన్‌డౌన్ సమ్మె కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోవిడ్ ఉండగా ఎలా అనుమతి ఇచ్చారు? ఈ వ్యవహారంలో మీ స్పందన ఏమిటని ధర్మాసనం అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్‌ను అడిగింది. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవడం లేదన్న వాదన సరికాదని శ్రీరామ్ చెప్పారు. మరి గురువారం ఏం జరిగింది? కోవిడ్ వ్యాప్తి ఉన్నా అనుమతులు ఎలా ఇచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. గురువారం ఛలో విజయవాడ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని శ్రీరామ్ తెలిపారు. 5 వేల మంది రావాల్సిన చోట 35 వేల నుంచి 40 వేల మంది వరకు వచ్చారని తెలిపారు. కోవిడ్ దృష్ట్యా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమ్మె చేయడం సర్వీసు నిబంధనలకు విరుద్ధమని శ్రీరామ్ చెప్పారు. సుప్రీంకోర్టు కూడా టీకే రంగరాజన్ కేసులో ఇదే చెప్పిందన్నారు. కాబట్టి సమ్మె చేస్తున్న వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. అలా అయితే ప్రభుత్వం కోవిడ్‌ను నియంత్రించేందుకు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగులు సైతం కరోనా మహమ్మారి ఇతరులపై కూడా ప్రభావం చూపుతుందన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలంది. ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ, చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం తాము ఆ అంశం జోలికి వెళ్లడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సమయంలో శరత్ స్పందిస్తూ, సమ్మెకు వెళ్లకుండా ఉద్యోగులను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. రానున్న రోజుల్లో పరిణామాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో తెలియదని చెప్పింది. ఉద్యోగుల వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉందని, అందువల్ల ఈ వ్యాజ్యంపై ఈ నెల 10న విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. చదవండి: (సీఎం వైఎస్ జగన్ సమక్షంలో మంత్రుల కీలక చర్చ) -
అమరావతిపై వ్యాజ్యాలన్నీ నిరర్థకమే
సాక్షి, అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకుంటూ చట్టాలు వచ్చిన నేపథ్యంలో వాటిని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్థకమే అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్, సీఆర్డీఏ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్‌రెడ్డి, శాసన మండలి తరఫున సీనియర్ న్యాయవాది సర్వ సత్యనారాయణ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు. ఆ వ్యాజ్యాల్లో విచారించడానికి ఏమీలేదని వివరించారు. ఈ ముగ్గురి వాదనలతో పాటు కేంద్ర ప్రభుత్వ వాదనలు సైతం ముగిసిన నేపథ్యంలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తిరుగు సమాధానం ఇచ్చేందుకు వీలుగా తదుపరి విచారణను ఈ నెల 4కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులందరూ 4వ తేదీన అర్థగంటలో తమ వాదనలు ముగించాలని ధర్మాసనం స్పష్టంచేసింది. చట్టాలను ఉపసంహరిస్తూ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో.. ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాల్లో ఏఏ అభ్యర్థనలు మనుగడలో ఉంటాయి? ఏవి నిరర్థకమయ్యాయి? అన్న పిటిషనర్ల వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం విచారణ జరుపుతోంది. తాజాగా.. బుధవారం మరోసారి వీటిపై విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు పూర్తిచేసిన నేపథ్యంలో ఏజీ ఎస్. శ్రీరామ్, సీనియర్ న్యాయవాదులు ఎస్. నిరంజన్‌రెడ్డి, ఎస్.సత్యనారాయణ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఆ అంశం తేలిస్తే ఇది కూడా తేల్చండి.. ముందుగా ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. అమరావతిని రాజధానిగా మార్చకుండా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరుతున్నారని, ఆ అంశంపై కోర్టు తేలిస్తే, అసలు అమరావతిని పునర్విభజన చట్ట నిబంధనల ప్రకారమే రాజధానిగా నిర్ణయించారా? అన్న అంశాన్ని కూడా తేల్చాల్సి ఉంటుందన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటుచేసిందన్నారు. అలాగే, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రభుత్వం బోస్టస్ కమిటీ, జీఎన్ రావు కమిటీలను ఏర్పాటుచేసిందని, ఇవి నిజ నిర్ధారణ కమిటీల వంటివని శ్రీరామ్ వివరించారు. ఈ నివేదికలపై న్యాయ సమీక్ష చేయడానికి లేదా వాటిని రద్దు చేయడానికీ వీల్లేదన్నారు. ఆ చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత కూడా వాటిపై దాఖలైన వ్యాజ్యాలను విచారించాలని ఎలా కోరతారని ప్రశ్నించారు. ఏ రకంగా చూసినా అవన్నీ నిరర్థకమయ్యాయని శ్రీరామ్ తెలిపారు. సీఆర్డీఏ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. తర్వాత నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఏ చట్టం చేయాలి.. ఆ చట్టం ఎలా ఉండాలన్నది ప్రభుత్వ, శాసన వ్యవస్థ పరిధిలోని అంశమన్నారు. ఆ చట్టం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉందా? లేదా? అన్నది మాత్రమే కోర్టులు చూడాల్సి ఉంటుందని తెలిపారు. సీఆర్డీఏ ప్రాంతాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో వెనక్కివెళ్లే ఉద్దేశంలేదన్నారు. అయితే.. నిధుల కొరతే ప్రధాన సమస్య అన్నారు. మాస్టర్ ప్లాన్‌ను అమలుచేసేందుకు రూ.1.09 లక్షల కోట్ల వ్యయం అవుతుందని, ఇప్పుడు అది రూ.2 లక్షల కోట్లకు చేరవచ్చునని వివరించారు. ప్రాధాన్యతల ఆధారంగా కీలక మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. మరో సీనియర్ న్యాయవాది సర్వ సత్యనారాయణ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం భవిష్యత్తులో ఏ చట్టం చేస్తుంది? అందులో ఏముంటాయి తదితర విషయాలు కోర్టుకు సంబంధంలేదన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలా? లేక మరేదైనా రాజధానిగా ఉండాలా? వంటి అంశాలను న్యాయస్థానాలను తేల్చజాలవన్నారు. ఇందుకు సంబంధించి న్యాయస్థానాలు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు. పాలనా కేంద్రం ఎంపిక రాష్ట్రం ఇష్టం అనంతరం.. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్. హరినాథ్ వాదనలు వినిపిస్తూ, రాజధాని విషయంలో తమ పాత్ర ఏమీ ఉండదన్నారు. పాలనా కేంద్రం ఎక్కడ ఉండాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమని తెలిపారు. దీంతో ప్రతివాదుల తరఫున వాదనలన్నీ పూర్తి కావడంతో ఈ వాదనలకు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తిరుగు సమాధానమివ్వడం మొదలుపెట్టారు. అప్పటికి కోర్టు సమయం ముగియడంతో మరికొందరి తిరుగు సమాధానం కోసం ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 4కి వాయిదా వేసింది. ఆ రోజున అందరి వాదనలు పూర్తయితే, ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తుంది. -
పీఆర్సీ వ్యాజ్యం మళ్లీ మొదటికి..
సాక్షి, అమరావతి : ప్రభుత్వోద్యోగుల కొత్త వేతన సవరణపై దాఖలైన వ్యాజ్యం విషయంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా మరోసారి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిం ది. ఈ వ్యాజ్యాన్ని ఎవరికి కేటాయించాలన్న దాని పై సీజే తీసుకునే పరిపాలనాపరమైన నిర్ణయాన్ని బట్టి ఈ కేసు విచారణ ఆధారపడి ఉంటుంది. కొత్త వేతన సవరణకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల ను సవాలుచేస్తూ ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య దాఖలు చేసిన వ్యాజ్యాన్ని రోస్టర్ ప్రకారం తాము విచారించలేమని జస్టిస్ అమానుల్లా ధర్మాసనం రెండ్రోజుల క్రితం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యాజ్యాన్ని ఎవరికి కేటాయించాలన్న దానిపై సీజే పరిపాలనా పరమైన నిర్ణయం తీసుకుని, దాన్ని సింగిల్ జడ్జి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తికి కేటాయించారు. దీంతో ఆ వ్యాజ్యం శుక్రవారం జస్టిస్ సత్యనారాయణమూర్తి ముందు విచారణకు వచ్చిం ది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ స్పందిస్తూ.. ఈ వ్యాజ్యం లో పిటిషనర్ రాజ్యాంగంలోని అధికరణ 309 కింద ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట నిబంధనలను సవాలు చేశారని తెలిపారు. హైకోర్టు రిట్ రూల్స్ ప్రకారం.. దీనిని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనమే విచా రించాల్సి ఉందంటూ సంబంధిత రూల్‌ను చదివి వినిపించారు. అధికరణ 309 కింద ఉద్యోగులకు సంబంధించిన నిబంధనలపై దాఖలయ్యే వ్యాజ్యా లను సాధారణంగా మొదటి కోర్టు ముందే విచారణకు వస్తాయని శ్రీరామ్ వివరించారు. దీనిపై న్యాయమూర్తి పిటిషనర్ న్యాయవాది రవితేజ స్పందన కోరారు. ఇది ఓ ఉద్యోగి స్వతంత్రంగా వేసిన సర్వీ సు పిటిషన్ మాత్రమేనని రవితేజ తెలిపారు. తాని చ్చిన వినతులను పరిగణ నలోకి తీసుకోకుండా వేతన సవరణ చేయడంవల్ల తనకు అన్యాయం జరి గిందంటూ వ్యక్తిగతంగా పిటిషన్ వేశారని ఆయన వివరించారు. మీ వ్యాజ్యంలో మీ అభ్యర్థన ఏమిట ని రవితేజను న్యాయమూర్తి ప్రశ్నించారు. అభ్యర్థన ను స్వయంగా చదివిన న్యాయమూర్తి, ఈ వ్యాజ్యం ధర్మాసనం ముందుకే వెళ్లాలంటూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ వ్యాజ్యం ఎవరికి కేటాయించాలన్న దానిపై తగిన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఈ వ్యాజ్యం తాలుకు ఫైళ్లను సీజే ముందుంచాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ రెండు తీర్పులనూ పరిగణనలోకి తీసుకోండి.. ఇక గత విచారణ సమయంలో జస్టిస్ అమానుల్లా ధర్మాసనం ఉద్యోగుల జీతం ఏ విధంగా తగ్గుతుందో వివరించాలని పలుమార్లు అడిగిన నేపథ్యంలో, పిటిషనర్ కేవీ కృష్ణయ్య ఆ వివరాలతో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. 2015 పీఆర్సీ ఆధారంగా తనకు ఎంత జీతం వస్తోంది, 2022 పీఆర్సీ ఆధారంగా ఎంత వస్తుందో ఆయన వివరించారు. అలాగే, 2015 డీఏ ఆధారంగా వచ్చే జీతం, 2022 డీఏ ఆధారంగా వచ్చే జీతం వివరాలను కూడా ఆయన పొందుపరిచారు. మొత్తం మీద తనకు 2022 పీఆర్సీవల్ల రూ.6,072 మేర తగ్గుదల ఉందన్నారు. ఈ అనుబంధ పిటిషన్‌తో పాటు ఆయన రాష్ట్ర విభజన సందర్భంగా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన రహస్య నివేదికను బహిర్గతం చేయాలంటూ 2011లో అప్పటి న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి ఇచ్చిన తీర్పును జతచేశారు. ఈ తీర్పు ఆధారంగా పీఆర్సీ విషయంలో అశుతోష్ మిశ్రా సిఫారసుల నివేదికను బహిర్గతం చేయాలని కోరారు. అంతేకాక.. కోవిడ్‌వల్ల ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్లలో 50 శాతం వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపడుతూ జీతాలు, పెన్షన్లను 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలంటూ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి 2020లో ఇచ్చిన తీర్పునూ జతచేశారు. తన వ్యాజ్యాన్ని తేల్చేటప్పుడు ఈ రెండు తీర్పులనూ పరిగణనలోకి తీసుకోవాలని కృష్ణయ్య తన పిటిషన్లో కోర్టును కోరారు. -
సినిమా టికెట్ల ఖరారుకు కమిటీ వేశాం
సాక్షి, అమరావతి: సినిమా టికెట్ రేట్ల ఖరారుకు హైకోర్టు ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ కమిటీ ఇప్పటికే ఓసారి సమావేశమైందని, త్వరలో మరోసారి సమావేశమవుతుందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఫిబ్రవరి మొదటి వారంలో రేట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందున, విచారణను అప్పటికి వాయిదా వేయాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. సినిమా టికెట్ రేట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 35తో సంబంధం లేకుండా, అంతకు ముందున్న విధంగానే ధరలు ఖరారు చేసుకోవచ్చంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై గత వారం విచారణ జరిపిన సీజే ధర్మాసనం జాయింట్ కలెక్టర్లను సంప్రదించిన తరువాతే టికెట్ ధరలను ఖరారు చేసుకోవాలని థియేటర్ల యాజమాన్యాలను ఆదేశించింది. సోమవారం ఈ అప్పీళ్లపై ధర్మాసనం మరోసారి విచారణ జరపగా.. ఏజీ శ్రీరామ్ టికెట్ రేట్ల ఖరారుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు ధర్మాసనానికి తెలిపారు. జాయింట్ కలెక్టర్లను సంప్రదించిన తరువాత టికెట్ ధరలను ఖరారు చేసుకోవాలన్న కోర్టు ఆదేశాలు అమలు కావడం లేదని న్యాయవాది వీవీ సతీష్ చెప్పగా.. దరఖాస్తులు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్లకు సూచిస్తామని ఏజీ బదులిచ్చారు. -
ఆ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది: ఏపీ అడ్వొకేట్ జనరల్
సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకుంటూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ సోమవారం ఏపీ హైకోర్టుకు నివేదించారు. ఉపసంహరణ బిల్లును ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రవేశ పెట్టారని వివరిం చారు. ఆ బిల్లును ఎందుకు తీసుకొచ్చారు, ఆ బిల్లు ఉద్దే శాలు ఏమిటి తదితర వివరాలతో మెమో దాఖలు చేస్తా మని చెప్పారు. బిల్లు కాపీని సైతం కోర్టు ముందుంచు తామన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు శుక్రవారానికల్లా మెమో దాఖలు చేయాలని ఏజీకి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. తదుపరి కార్యాచరణను ఆ రోజు నిర్ణయిస్తామని మౌఖికంగా తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమ యాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై గత 5 రోజులుగా విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. -
Navjot Singh Sidhu: పంజాబ్‌లో పంతం నెగ్గించుకున్న సిద్ధూ
Punjab Advocate General Who Sidhu Wanted Out Resigns: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నేత నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ తన పంతం నెగ్గించుకున్నారు. సిద్ధూ డిమాండ్లకు ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీ తలొగ్గారు. ఎట్టకేలకు అడ్వకేట్ జనరల్ (ఏజీ) రాజీనామాను ఆమోదించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని నియమించాలనే నిర్ణయాన్ని ప్రకటించడంతో పంజాబ్ కాంగ్రెస్‌లో ప్రతిష్టంభన ముగిసినట్లు కనిపిస్తోంది. ఈ విషయంపై చున్నీ మాట్లాడుతూ.. ఏజీ కొన్ని రోజుల క్రితం రాజీనామా చేశారు. ఇవాళ కేబినెట్ ఆమోదించింది. గవర్నర్ ఆమోదం కోసం పంపుతున్నాము. ఈరోజు ఆమోదం పొందితే రేపు కొత్త ఏజీని నియమిస్తామన్నారు. అంతేకాకుండా డీజీపీ పోస్టుకు చట్టప్రకారం 30 ఏళ్ల సర్వీసు ఉన్నవారి ప్యానెల్‌కు పంపి.. కొత్త డీజీపీని కూడా నియమిస్తాం' అని తెలిపారు. కాగా, పంజాబ్ అడ్వకేట్ జనరల్ పదవికి ఏపీఎస్ డియోల్, డీజీపీగా ఇక్బాల్ ప్రీత్‌సింగ్ సహోటా రాజీనామా చేసే వరకు పీసీసీ బాధ్యతలు స్వీకరించబోనని సిద్ధూ మొండికేసిన సంగతి తెలిసిందే. -
TS High Court: దసరా వరకు ఆపుతారా.. లేదా?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని సర్వే నంబర్ 301, 303, 327ల్లోని 18 ఎకరాల భూమి హక్కులపై వివాదం నెలకొన్న నేపథ్యంలో.. దసరా సెలవుల వరకు ఈ భూమి వేలం వేయకుండా ఆపుతారో.. లేదో.. ప్రభుత్వాన్ని అడిగి చెప్పాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను హైకోర్టు ఆదే శించింది. ఈ భూమిపై తమకు హక్కు లున్నాయని పలువురు దాఖలు చేసిన పిటిషన్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌ల ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ భూములపై పిటిషనర్లకు హక్కులు ఉన్నాయని, వేలం ప్రక్రియ నిలిపివేయాలని పిటిషన్ల తరఫు న్యాయవాది అభ్యర్థించారు. ఈ భూములపై పిటిషనర్లకు హక్కులు ఉన్నాయని పేర్కొనేందుకు ఆధారాలు లేవని ఏజీ వెల్లడించారు. దీనికి స్పందించిన ధర్మాసనం... లోతుగా విచారణ చేయాల్సి ఉందని, వేలం ఆపే అవకాశం ఉందో.. లేదో.. గురువారంలోగా చెప్పాలని ఏజీకి సూచిస్తూ విచారణను 16కు వాయిదా వేసింది. చదవండి: ‘మంత్రి కేటీఆర్ ఒక అజ్ఞాని’.. ఆయన సవాల్ నేను స్వీకరించడమేంటీ.. -
నిష్ణాతులైన వారే నియామకం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి సలహాదారుల నియామకంలో ఎలాంటి నిబంధనలు లేవని, ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని, పరిపాలన వ్యవహారాల్లో విశేష అనుభవం ఉన్న వారిని సలహాదారులుగా నియమించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. సలహాదారులు నిర్వర్తించాల్సిన విధులను వారి నియామక జీవోల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటుందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ కోర్టుకు వివరించారు. వారి నియామకం తాత్కాలికమైనదని తెలిపారు. ఆ నియామకాలపై ఏ చట్టంలోనూ నిషేధం లేదని, ప్రభుత్వ అవసరాలను బట్టి వారి నియామకం ఉంటుందన్నారు. వీరి నియామకాన్ని ప్రజాధనం వృథా అనే కోణంలో చూడటానికి వీల్లేదని తెలిపారు. న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ స్పందిస్తూ.. సలహాదారులను నియమించే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్నారా? వారు మీడియాతో మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. గతంలో ఎవరూ మీడియాతో మాట్లాడలేదన్నారు. ఏజీ వాదనలు వినిపిస్తూ.. గతంలో సలహాదారులు మీడియాతో మాట్లాడారని తెలిపారు. సాహ్ని నియామకం సరైనదే.. పాలనా వ్యవహారాల్లో విశేష అనుభవం ఉండటం వల్ల ఐఏఎస్ అధికారులుగా పనిచేసిన వారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నియమించడం సంప్రదాయంగా వస్తోందని శ్రీరామ్ కోర్టుకు వివరించారు. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం విషయంలో గవర్నర్‌కు ముఖ్యమంత్రి ఏ రకమైన సలహాలు ఇవ్వలేదని, సిఫారసు చేయలేదని తెలిపారు. ఒకవేళ సలహా ఇచ్చినా, సిఫారసు చేసినా దానికి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నారు. పరిపాలనలో సమర్థత కలిగిన వారి పేర్లను ముఖ్యమంత్రి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారని, అంతిమంగా గవర్నర్ తన విచక్షణాధికారం మేరకే నీలం సాహ్నిని నియమించారని వివరించారు. ముఖ్యమంత్రి సలహాదారు పదవికి రాజీనామా చేసిన తర్వాతే ఆమె ఎస్ఈసీగా నియమితులయ్యారని చెప్పారు. ఆమె నియామకం విషయంలో నిబంధనల ఉల్లంఘన జరగలేదన్నారు. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కో వారెంటో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫున న్యాయవాది బి.శశిభూషణ్‌రావు శుక్రవారం వాదనలు వినిపిస్తూ.. నీలం సాహ్ని ముఖ్యమంత్రి సలహాదారుగా వ్యవహరించారని, ఆమె పేరును గవర్నర్‌కు సీఎం సిఫారసు చేశారని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, ఎస్ఈసీగా ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులే నియమితులు కావాలని నిబంధనలు చెబుతున్నప్పుడు, వారికి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఎస్ఈసీ నియామకం, పిటిషనర్ విచారణార్హత తదితరాలపై గవర్నర్ ముఖ్య కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనల నిమిత్తం హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. -
మాజీ ఏజీ దమ్మాలపాటి కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
సాక్షి, ఢిల్లీ: మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి కేసుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ తన వాదనలు వినిపించారు. దర్యాప్తును సీబీఐ లేదా రిటైర్డ్ జడ్జి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసును లోతైన విచారణ జరిపేందుకు హైకోర్టుకు పంపాలని రాజీవ్ ధావన్ కోరారు. వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది. -
తప్పుకోమనడానికి కారణాలేంటి: హైకోర్టు ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగం, విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో 34ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ నుంచి తనను తప్పుకోవాలని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ అభ్యర్థించడంపై జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సరైన కారణాలు చెప్పకుండా విచారణ నుంచి తప్పుకోవాలనడం ఫోరం హంటింగ్ (అనుకూలమైన న్యాయమూర్తులు) చేయడమేనని మండిపడింది. ఇటువంటి పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుందని, ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను అక్కడికి పంపాలని ఏజీ కోరారు. అయితే ఈ పిటిషన్‌ను తామే విచారించాలని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేస్తూ ఇప్పుడే తమకు సమాచారం ఇచ్చారని జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు తెలిపారు. ఈ కేసును అత్యవసరంగా విచారణకు స్వీకరించిన తీరుపై తమకు అభ్యంతరం ఉందని, ఈ నేపథ్యంలో విచారణ నుంచి మీకు మీరుగా తప్పుకోవాలని ప్రసాద్ మళ్లీ కోరారు. ‘విచారణ నుంచి ఎందుకు తప్పుకోవాలి. ఏజీస్థాయి వ్యక్తి నుంచి ఇటువంటి అసమంజసమైన అభ్యర్థన రావడం సరికాదు. సహేతుకమైన కారణాలు లేకుండా ఇటువంటి అభ్యర్థన చేయడం ధర్మాసనంపై దాడిగా పరిగణించాల్సి ఉంటుంది. అత్యవసరంగా ఈ పిటిషన్‌ను విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఉదయం కోర్టు ప్రారంభ సమయంలో కోరారు. కనీసం నేను కేసుకు సంబంధించిన పేపర్లను కూడా చూడలేదు, మా ముందు ఉంచనూ లేదు. భోజనం విరామం తర్వాత విచారణ చేస్తామని స్పష్టం చేశాం. తర్వాత ఈ కేసుకు సంబంధించిన పేపర్లను ప్రధాన న్యాయమూర్తి (సీజే) ముందు రిజిస్ట్రీ అధికారులు ఉంచారు. మా ధర్మాసనాన్ని విచారించాలని సీజే సూచించారు. తమకు అనుకూలమైన ధర్మాసనం కోసం తెలంగాణ ప్రభుత్వం (ఫోరం హంటింగ్) ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఏజీ కార్యాలయం ఇటువంటి ట్యాక్టిక్స్ కోసం పాకులాడదని భావిస్తున్నాం. నన్ను తప్పుకోవాలనేందుకు సరైన కారణాలు చూపనందున ఏజీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం. పిటిషన్‌ను విచారిస్తాం’అని ధర్మాసనం స్పష్టం చేసింది. అభ్యంతరం వ్యక్తం చేసిన ఏఏజీ ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ.. జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోర్టు ప్రారంభ సమయంలో అభ్యర్థించారు. అయితే ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మాత్రమే ఈ తరహా పిటిషన్లను విచారించాల్సి ఉందని, ఈ ధర్మాసనం విచారించడానికి లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచందర్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాలు ప్రతివాదులుగా ఉన్న పిటిషన్లను విచారించే పరిధి ఈ ధర్మాసనానికి మాత్రమే ఉందని వెంకటరమణ నివేదించారు. ఈ పిటిషన్‌ను భోజన విరామం తర్వాత విచారిస్తామని, అభ్యంతరాలుంటే అప్పుడు తెలియజేయాలని జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు స్పష్టం చేశారు. దీంతో వెంటనే జె.రామచందర్‌రావు.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ముందు హాజరై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసుల విచారణ రోస్టర్‌కు విరుద్ధంగా జస్టిస్ రామచందర్‌రావు నేతృత్వంలోని ధర్మాసనం ఓ పిటిషన్‌ను భోజన విరామం తర్వాత విచారించేందుకు అనుమతి ఇచ్చిందని, ప్రస్తుత కేసుల విచారణ రోస్టర్ ప్రకారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం మాత్రమే ఆ పిటిషన్‌ను విచారించాలని తెలిపారు. అయితే ఇదే విషయాన్ని జస్టిస్ రామచందర్‌రావు నేతృత్వంలోని ధర్మాసనం ముందు చెప్పాలని సీజే స్పష్టం చేస్తూ ఏఏజీ అభ్యర్థనను తోసిపుచ్చారు. అంతర్రాష్ట్ర జల వివాదాల్లో ఈ పిటిషన్ ఎలా విచారణార్హం? అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్స్ ఉన్నప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టులు జలవివాదాలపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి వీల్లేదని రాజోలిబండ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని.. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగం ఆపాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ఎలా విచారణార్హమని హైకోర్టు ప్రశ్నించింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 100 శాతం విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో 34ను సవాల్ చేస్తూ కృష్ణా జిల్లాకు చెందిన రైతులు శివరామకృష్ణ ప్రసాద్‌తోపాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం భోజన విరామం తర్వాత అత్యవసరంగా విచారించింది. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం సెక్షన్ 11 కింద ఈ పిటిషన్ ఎలా విచారణార్హం అని ధర్మాసనం వెంకటరమణను ప్రశ్నించింది. ఇటువంటి వివాదాల్లో ట్రిబ్యునల్స్ మినహా హైకోర్టు, సుప్రీంకోర్టులు పిటిషన్లను విచారించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని పేర్కొంది. ఈ సమయంలో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) రామచందర్‌రావు ఏదో చెప్పేందుకు ప్రయత్నించగా.. ఈ కేసులో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హాజరై వాదన లు వినిపిస్తున్నారని, ఆయనకు గౌరవం ఇవ్వాల ని ధర్మాసనం ఏఏజీకి సూచించింది. ‘రాజోలిబండ’కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించి రావాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది, ఇరు రాష్ట్రాల ఏజీలకు సూచిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.