ఆ విద్యార్థులకు మరో కౌన్సెలింగ్?
ఇంజనీరింగ్‌లో ఆప్షన్లు సరిగా ఇవ్వకుండా నష్టపోయిన విద్యార్థులపై సర్కారు తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు సరిగ్గా ఇచ్చుకోకుండా నష్టపోయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పించే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. సోమవారం డిప్యూటీ సీఎం, ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి దీనిపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అయితే భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్‌లో సీటు వచ్చినా ఫీజు చెల్లించకుండా చివరి విడత ప్రవేశాల కోసం వేచి చూసి.. ఆప్షన్లు సరిగ్గా ఇవ్వని కారణంగా కొందరు విద్యార్థులు ఉన్న సీటును కోల్పోయారు.
ఆప్షన్ల ప్రాధాన్య క్రమాన్ని సరిగ్గా ఇవ్వలేక, మొదటి, తుది విడత కౌన్సెలింగ్‌లలో ఎందులోనూ సీటు దక్కనివారూ ఉన్నారు. ఇలా నష్టపోయిన విద్యార్థులు దాదాపు 3,430 దాకా ఉన్నట్లు తేల్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తేనే ఇంజనీరింగ్ చదవగలమని, నిరుపేద కుటుంబాలకు చెందిన తమకు న్యాయం చేయాలని అనేక మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరో కౌన్సెలింగ్ నిర్వహించకుండా.. స్పాట్‌లో యాజమాన్యాలే మిగిలిన సీట్లను భర్తీ చేస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దూరమవుతామని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. వీరికి ఎలా న్యాయం చేయాలన్న అంశంపై మంత్రి కడియం శ్రీహరి.. ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తదితరులు సమావేశమై చర్చించారు.
న్యాయ నిపుణులతో చర్చించాకే..!
స్పాట్ ద్వారా యాజమాన్యాలే ఆ విద్యార్థులను భర్తీ చేస్తే రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలా..? ఒకవేళ అలా చేస్తే యాజమాన్యాలు తప్పిదాలకు పాల్పడే అవకాశం ఉంటుందా అన్న అంశాలపై భేటీలో చర్చించారు. ఇలా కాకుండా మరో కౌన్సెలింగ్‌ను నిర్వహించాలన్న ఆలోచన కూడా చేశారు. అయితే అందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు అడ్డంకిగా మారొచ్చని అభిప్రాయపడ్డారు. నిర్ణీత గడువులోనే మొదటి దశ ప్రవేశాలను పూర్తి చేసి, తరగతులు ప్రారంభించినందున.. ఆ సమస్య ఉండకపోవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది.
ఏదేమైనా మరోసారి అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం తీసుకొని ముందుకు సాగాలని నిర్ణయించారు. భేటీ అనంతరం ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, ఇతర అధికారులు అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని కలిసి చర్చించినట్లు తెలిసింది. అయితే ఆయన కూడా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. సుప్రీంకోర్టు అడ్వొకేట్, అక్కడి న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుందామన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.