సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రక్రియ విద్యార్థులను అయోమయంలో పడేస్తోంది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఉదయం నుంచే ఆప్షన్ల ప్రక్రియ మొదలవ్వాలి. కడపటి వార్తలు అందే సమయం వరకూ ఇది ప్రారంభం కాలేదు. కౌన్సెలింగ్‌లో పాల్గొనే కాలేజీల జాబితా అందకపోవడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తవ్వనందునే కాలేజీల జాబితా సకాలంలో ఇవ్వలేదని యూనివర్సిటీలు అంటున్నాయి.
అఫిలియేషన్ ఇవ్వకపోయినా, గత ఏడాది ఏ కాలేజీలున్నాయో వాటినే కౌన్సెలింగ్ జాబితాలో చేరుస్తామని సాంకేతిక విద్య ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు, ఫీజుల వ్యవహారంపైనా దోబూచులాట కొనసాగుతోంది. ఇన్ని అస్పష్టతల మధ్య ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఈసారి ఎలా ఉంటుందోనని విద్యార్థులు గందరగోళంలో ఉన్నారు.
కౌన్సెలింగ్‌లో ఏ కాలేజీలు?
ఈ ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్‌లో 1,26,140 మంది అర్హత పొందారు. వీరిలో ఇప్పటివరకు 40 వేల మంది కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 8 వేల మంది సర్టిఫికెట్ల ధ్రువీకరణ పూర్తిచేశారు. మంగళవారం నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. కానీ అధికారులు ఈ ప్రక్రియకు అవకాశం ఇవ్వలేదు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తవ్వలేదు. 145 కాలేజీలున్న జేఎన్‌టీయూహెచ్ మూడు రోజుల్లో తనిఖీలు నిర్వహించినా, గుర్తింపు ఇచ్చిన కాలేజీల జాబితాను ఉన్నత విద్యామండలికి ఇవ్వలేదు.
ఉస్మానియా సహా మిగతా వర్సిటీలూ ఇదే బాటలో ఉన్నాయి. దీంతో ఉన్నత విద్యామండలి అధికారులు గుర్తింపు విషయాన్ని పక్కనబెట్టి, గత ఏడాది కౌన్సెలింగ్‌లో పాల్గొన్న 175 కాలేజీలను ఆప్షన్ల జాబితాలోకి తేవాలని నిర్ణయించారు. ఒకవేళ గుర్తింపు రాని పక్షంలో ఆ కాలేజీలను తొలగించి, ఆ కాలేజీల్లో సీట్లు వచ్చిన వారికి రెండో విడత కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు.
ఫీజులపై పీటముడి
ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారంలోనూ ఇంతవరకూ స్పష్టత రాలేదు. పాత ఫీజులే ఈ ఏడాది వర్తించేలా రాష్ట్ర ఫీజుల నియంత్రణ కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనిపై ఇంకా జీవో విడుదల కాలేదు. ఈలోగానే ప్రైవేటు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. కమిటీ తొలుత అనుమతించిన పెంపు ఫీజునే కాలేజీలు వసూలు చేసుకునేలా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే, తుది నిర్ణయం వెలువడిన తర్వాత నిర్ధారిత ఫీజుకన్నా ఎక్కువ ఉంటే దాన్ని విద్యార్థులకు ఇవ్వాలని షరతు పెట్టింది. ఈ లెక్కన ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుంది? రీఎంబర్స్‌మెంట్‌కు అనుమతించేది ఎంత? అనే గందరగోళం వెంటాడుతోంది. సెప్టెంబర్ 6న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు వచ్చిన వాళ్లు అదే నెల 13కల్లా ఫీజులు చెల్లించి, కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. అప్పటివరకైనా క్లారిటీ వస్తుందా అనే సందేహాలు అభ్యర్థులను వేధిస్తున్నాయి.
ఏ కోర్సులు? ఎన్ని సీట్లు?
వెబ్ ఆప్షన్ల వరకూ కౌన్సెలింగ్ ప్రక్రియ చేరుకున్నా.. ఏ కాలేజీలో ఏ కోర్సులుంటాయో తెలియదు. గత ఏడాది లెక్క ప్రకారం ప్రస్తుతం 67 వేల సీట్లను కౌన్సెలింగ్‌లో చేరుస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఈ సంవత్సరం చాలా కాలేజీలు సివిల్, మెకానికల్ సీట్లు రద్దు చేసుకుని కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు అనుమతులు తెచ్చుకున్నాయి.
ఈ సీట్ల వివరాలేంటో ఆప్షన్ల సమయంలో విద్యార్థులకు తెలిసే అవకాశం కల్పించడం లేదు. అఫిలియేషన్ తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. కానీ గత ఏడాది ఉన్న కోర్సుల లెక్కనే చూపించడం వల్ల నచ్చిన కోర్సులో సీటు పొందినా... ఆఖరులో అది ఉంటుందో? ఉండదో? తెలియక విద్యార్థులు అయోమయపడుతున్నారు. అధికారులు మాత్రం రెండో విడత కౌన్సెలింగ్‌కు సీట్లపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment