సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సులు హాట్ కేకుల్లా మారాయి. ఎంసెట్ మొదటి దశ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు ఎక్కువగా వీటినే ఎంచుకున్నారు. ఈ కోర్సుల్లో సీటు పొందిన వారిలో చాలా మంది సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 78,270 ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సీట్ల భర్తీకి ఉన్నత విద్యా మండలి తాజాగా తొలిదశ కౌన్సెలింగ్ నిర్వహించింది.
అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షన్స్ ప్రకారం 61,169 సీట్లను కేటాయించింది. అయితే సీట్లు పొందిన అభ్యర్థుల సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు గురువారంతో ముగిసింది. మొత్తం 46,322 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్టు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.
ఏఐ, డేటా సైన్స్‌కు పోటీ
కొత్తగా ప్రవేశపెట్టిన కంప్యూటర్ సైన్స్ కృత్రిమ మేథ, కృత్రిమ మేథ మెకానికల్ లెర్నింగ్, డేటా సైన్స్ తదితర కోర్సుల కోసం పెద్ద ఎత్తున విద్యార్థులు పోటీ పడ్డారు. ఆప్షన్స్ ఇచ్చిన వారిలో 60 శాతం పైగా ఈ కోర్సులను ఎంచుకున్న వారే ఉన్నారు. ర్యాంకు ప్రకారం ఆయా కోర్సుల్లో సీట్లు దక్కించుకున్న వారు తిరిగి చూడకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. అయితే నచ్చిన కాలేజీలో సీటు రాని కొద్దిమంది రిపోర్టింగ్ చేయలేదు. వారంతా మెరుగైన కాలేజీ కోసం రెండో దశ కౌన్సెలింగ్‌కు సిద్ధమవుతున్నారు.
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్సీ)లో 18,561 సీట్లు కేటాయిస్తే.. 13,942 మంది రిపోర్టింగ్ చేశారు. సైబర్ సెక్యూరిటీలో 1,634 సీట్లు ఉంటే, 1,192 మంది ప్రధాన కాలేజీల్లో సీట్లు ఖరారు చేసుకున్నారు. సివిల్‌లో 3,177 సీట్లు కేటాయిస్తే, 2,312 మంది, మెకానికల్‌లో 2,550 సీట్లకు 1,826 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment