Computer Science Engineering
-
సీఎస్ఈ సీట్లు పెంచాల్సిందే
సాక్షి, హైదరాబాద్ : కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో సీట్లు పెంచాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతించిందని, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ (కోర్) బ్రాంచీల్లో సీట్లు తగ్గించైనా, సీఎస్ఈ సహా అనుబంధ కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు ఉన్నా ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వ పెద్దలను కలిసిన కొన్ని యాజమాన్యాలు.. అధికారులు ఉద్దేశపూర్వకంగా సీట్లు పెంచేందుకు అడ్డుపడుతున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి కోర్సులకు ఏటా డిమాండ్ పెరుగుతోందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినట్టు సమాచారం. రాష్ట్రంలోని దాదాపు 125 కాలేజీలు సీట్ల పెంపు ప్రతిపాదన తెచ్చాయి. సీట్లు తగ్గిస్తే అవి కనుమరుగే..కంప్యూటర్ అనుబంధ కోర్సుల్లో సీట్ల పెంపుపై అధికారులు అభ్యంతరం చెప్పకపోయినా.. కోర్ గ్రూప్ కోర్సులకు కోత పెట్టడాన్ని అంగీకరించడం లేదు. దీనివల్ల ఈ కోర్సులు అసలుకే తెరమరుగయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. భవిష్యత్‌లో ఈ కోర్సులకు మళ్లీ డిమాండ్ ఉంటుందని అంటున్నారు. మరోవైపు బోధన ప్రణాళికను మారుస్తున్నారని, కోర్ గ్రూపులో జాయిన్ అయినా, సాఫ్ట్వేర్ వైపు వెళ్ళే వీలుందని వివరిస్తున్నారు. ఇందుకోసం ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయని పేర్కొంటున్నారు. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. గత ఏడాది తగ్గిన చేరికలుగత ఏడాది 58 శాతం విద్యార్థులు సీఎస్సీ, అనుబంధ కోర్సుల్లోనే చేరారు. సివిల్, మెకానికల్ ఈఈఈ కోర్సుల్లో 12,751 సీట్లు ఉంటే, కేవలం 5,838 మంది మాత్రమే (45.78 శాతం) చేరారు. ఈఈఈలో 5,051 సీట్లు ఉంటే 2,777 సీట్లు, సివిల్‌లో 4,043 సీట్లు ఉంటే 1,761 సీట్లు, మెకానికల్‌లో 3,657 సీట్లు ఉంటే, 1,300 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు. ఆయా కోర్సులను మరింత బలహీనపరిచే ప్రైవేటు కాలేజీల ఆలోచన సరికాదని స్పష్టం చేస్తున్నారు. కాగా ప్రైవేటు కాలేజీల విజ్ఞప్తిని అంగీకరిస్తే ఈ ఏడాది కంప్యూటర్ కోర్సుల్లో దాదాపు 21 వేల సీట్లు పెరిగే వీలుంది. అదే సమయంలో కోర్ గ్రూపుల్లో దాదాపు 5 వేల సీట్లు తగ్గే అవకాశం కన్పిస్తోందని అంటున్నారు.రీయింబర్స్మెంట్ వద్దు..రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో అన్ని బ్రాంచీలకు కలిపి గత ఏడాది లెక్కల ప్రకారం 1.22 లక్షల సీట్లున్నాయి. ఇందులో 82 వేల సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. మిగతావి మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు. కన్వీనర్ కోటా కింద భర్తీ చేసే సీట్లలో చాలావరకూ ఫీజును ప్రభుత్వం రీయింబర్స్మెంట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. దీంతో సీట్లు పెంచితే ఎక్కువ నిధులు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణంగానే సీట్ల పెంపునకు కొన్నేళ్ళుగా ప్రభుత్వం పెద్దగా అనుమతించడం లేదు. అయితే డిమాండ్ లేని కోర్సుల్లో తగ్గించుకుని, డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకునేందుకు ఏఐసీటీఈ రెండేళ్ల క్రితం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే సంబంధిత యూనివర్సిటీలు కూడా ఇందుకు అనుమతించాల్సి ఉంటుంది. కానీ సీట్లు పెంచడం వల్ల ఫీజు రీయింబర్స్మెంట్ బడ్జెట్ పెరగడంతో పాటు కొత్తగా అందుబాటులోకి వచ్చే కోర్సులకు ఫ్యాకల్టీ కొరత ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్‌కు మరో నాలుగేళ్ళ పాటు సరైన బోధనా సిబ్బంది దొరకడం కష్టమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే నాన్ రీయింబర్స్మెంట్ సీట్ల పెంపు చేపట్టాలంటూ కాలేజీల యాజమాన్యాలు కొత్త ప్రతిపాదన తెరపైకి తెస్తున్నాయి. అంటే పెరిగిన సీట్లకు ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయించిన మేరకు విద్యార్థే ఫీజు చెల్లించాలన్న మాట. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేయదు. ప్రస్తుతం కొన్ని కాలేజీల్లో ఈ తరహాలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు నడుస్తున్నాయి. ఈ విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. -
లక్షకు చేరువలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రి య తుదిదశకు చేరుకుంది. ప్రత్యేక కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టు చేసే గడువు బుధవారంతో ముగిసింది. కన్వినర్‌కోటా కింద మొత్తం 75 వేలమంది సీట్లు పొందినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. యాజమాన్యకోటా కింద మరో 25 వేలకుపైగా సీట్లు భర్తీ అయినట్టు తెలిసింది. అయితే పూర్తి గణాంకాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. 58 శాతానికిపైగా కంప్యూటర్‌సైన్స్ ఇంజనీరింగ్, దాని అనుబంధ కోర్సుల్లోనే భర్తీ అయినట్టు అధికారులు తెలిపారు. సెపె్టంబర్ 1 నుంచి కాలేజీల్లో ఇంటర్నల్ స్లైడింగ్ చేపడుతున్నారు. ఒక బ్రాంచ్ నుంచి వేరొక బ్రాంచ్‌కు మారేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు. కాలేజీల్లో మిగిలిన సీట్ల వివరాలు ప్రతీ కాలేజీ సెప్టెంబర్ 1న వెల్లడించాలని సాంకేతికవిద్య కమిషనరేట్ ఆదేశించింది 3,4 తేదీల్లో స్పాట్ అడ్మిషన్ల ద్వారా ఖాళీలు భర్తీ చేస్తారు. ఎంసెట్ అర్హులు నేరుగా కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు పొందే వీలుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 18,815 సీట్లు మిగిలిపోయే వీలుందని అధికారులు అంచనా వేశారు. -
JNTU Vizianagaram: చదువు+ ఉద్యోగం= జేఎన్టీయూ
జేఎన్టీయూ గురజాడ విజయనగరం యూనివర్సిటీ... చక్కని చదువుల నిలయం. ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న వర్సిటీ.. విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తోంది. ప్రమాణాలతో కూడిన ఇంజినీరింగ్ విద్యను బోధిస్తోంది. నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తోంది. ఉద్యోగ సాధనకు తోడ్పడుతోంది. పారిశ్రామిక వేత్తలుగా మలుస్తోంది. వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతోంది. వర్సిటీలో అమలుచేస్తున్న నూతన విద్యావిధానం, నిర్వహిస్తున్న కోర్సులు, ఉపాధికల్పనకు ‘సాక్షి’ అక్షరరూపం. విజయనగరం అర్బన్: విజయనగరం పట్టణానికి సమీపంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో 2007వ సంవత్సరంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడింది. ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి కృషితో కళాశాల కాస్త వర్సిటీగా రూపాంతరం చెందింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న వర్సిటీ ఇంజినీరింగ్ చదువులకు నిలయంగా మారింది. విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించేలా.. వారిలో నైపుణ్యాలను పెంపొందించేలా ఈ ఏడాది మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ కోర్సుల్లో ఆనర్స్, మైనర్ పేరుతో విస్తరణ డిగ్రీలను ప్రవేశపెట్టింది. జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రూపొందించిన నూతన సిలబస్, బోధనా విధానాన్ని అమలు లోకి తెచ్చింది. మొత్తం 8 సెమిస్టర్స్‌లో తొలి మూడు మినహా మిగిలిన ఐదు సెమిస్టర్స్తోపాటు 10 నెలల ఇంటెర్న్షిప్ చేయిస్తారు. ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ఈ, ఐటీ, మెకానికల్ డిగ్రీలలో 66 సీట్ల చొప్పున, సివిల్, మెటలడ్జికల్ సబ్జెక్టు బీటెక్ డిగ్రీలలో 33 సీట్ల చొప్పున వర్సిటీలో బోధన సాగుతోంది. ఇంజినీరింగ్ ఆనర్స్ డిగ్రీ విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలకు అనుగుణంగా ఇంజినీరింగ్ డిగ్రీని మూడు విధాలుగా విభజించారు. ఎప్పటి మాదిరిగా ఇచ్చిన కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు యథావిధిగా సాధారణ బీటెక్ డిగ్రీ వస్తుంది. డిగ్రీ సిలబస్‌తోపాటు ఇతర (డిగ్రీ సబ్జెక్టులకు సంబంధం లేని) అదనపు ప్రతిభాంశాలను ఉన్నట్లు నిర్ధారించుకున్న వారికి ఆనర్ డిగ్రీ ఇస్తారు. దీనికోసం మొత్తం ఎనిమిది సెమిస్టర్స్లోనూ 80 శాతం ఉత్తీర్ణతను చూపాల్సి ఉంటుంది. తొలుత రెండో సంవత్సరం మొదటి సెమిస్టర్ ఫలితాలలో అప్పటికి పూర్తయిన మూడు సెమిస్ట్లో 80 శాతంతో చూపిన ఫలితాల (ఒకే సారి ఉత్తీర్ణత పొందాలి) ఆధారంగా రిజస్టర్ అయిన విద్యార్థిని ఆనర్ డిగ్రీ విభాగంలోకి తీసుకుంటారు. అప్పటి నుంచి చివరి సెమిస్టర్ వరకు కనీసం 160 క్రెడిట్ పాయింట్లతో పాటు అదనపు నైపుణ్యాలపై మరో 20 క్రెడిట్ పాయింట్లు తెచ్చుకోవాలి. 1,075 మందికి ప్లేస్మెంట్ కళాశాలలో ఏడు కోర్సులలో బీటెక్ డిగ్రీని విద్యార్థులకు అందిస్తోంది. ఇప్పటివరకు 1,079 మంది విద్యార్థులు వివిధ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు. 11.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరికొందరు పారిశ్రామిక వేత్తలుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న విద్యాసంవత్సరం నాలుగో సంవత్సర విద్యార్థులు ఇప్పటివరకు 75 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. రానున్న రెండు నెలల్లో మరో 10 కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్టు వర్సిటీ వర్గాలు తెలిపాయి. 26 కంపెనీలతో వర్సిటీ ఎంఓయూ చేసుకున్నట్టు వెల్లడించాయి. ఇంజినీరింగ్ మైనర్ డిగ్రీ బీటెక్ కోర్సులో చేరే విద్యార్థులు ప్రధాన సబ్జెక్టుతోపాటు ఇతర ఇంజినీరింగ్ కోర్సుల్లో మరో సబ్జెక్టులో కూడా ప్రతిభ చూపాలనుకునే వారికి ఈ డిగ్రీ రూపంలో అవకాశాన్నిచ్చారు. మొదటి మూడు సెమిస్టర్ ఫలితాలలో 80 శాతం పాయింట్లను తెచ్చుకున్న వారికి మైనర్ డిగ్రీ కోర్సులకు రిజిస్టర్ చేయిస్తారు. నైపుణ్యం సాధించేలా బోధన అమెజాన్ సుపోర్టు ఇంజినీరింగ్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. వార్షిక వేతనం రూ.11 లక్షలుగా నిర్ణయించారు. చాలా ఆనందంగా ఉంది. కళాశాలలో నైపుణ్యాభివృద్ధికి అనుగుణంగా అందించే బోధనలు వల్లే ఉద్యోగం సాధించగలిగాను. ఇంజినీరింగ్ సబ్జెక్టులతోపాటు ఉద్యోగావకాశాల అదనపు అంశాల్లో అందించిన గైడెన్స్ బాగుంది. – పి.సాహితి జ్యోత్స్న, సీఎస్ఈ విద్యార్థిని, జేఎన్టీయూ విజయనగరం ఉద్యోగ కల్పనే లక్ష్యంగా... ఉద్యోగ కల్పనే లక్ష్యంగా విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపరిచే ప్రణాళికలను రూపొందించాం. దేశ, అంతర్జాతీయ స్థాయిలోని 26 ప్రతిష్టాత్మకంగా కంపెనీలతో ఉద్యోగ నియామక ఒప్పందాలు పెట్టుకున్నాం. ఇంజినీరింగ్ కోర్సులపై అత్యాధునిక బోధనా విధానాన్ని అనుసరించడంతో పాటు విద్యార్థుల్లో ఉన్న అభిరుచికి అనుగుణంగా వారిలోని నైపుణ్యాలను వెలికితీస్తాం. దీనికోసం జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. గత ఏడాది మొదటి సంవత్సరం నుంచి నూతన విద్యావిధానాన్ని అమలుచేస్తున్నాం. – ప్రొఫెసర్ శ్రీకుమార్, ప్రిన్సిపాల్, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, విజయనగరం చక్కని శిక్షణ టీసీఎప్ డిజిటల్ సంస్థలో 7.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సాధించాను. ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలో ఇంజినీరింగ్ సబ్జెక్టు అంశాలతో పాటు ఆ సంస్థకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యాలను పరీక్షించారు. కళాశాలలో ప్రత్యేకించి ఉన్న ప్లేస్మెంట్ విభాగం ఆ దిశగా అందించిన శిక్షణ వల్ల ఉద్యోగం సాధించగలిగాను. – ఎం.జాహ్నవి, సీఎస్ఈ, జేఎన్టీయూ, విజయనగరం -
కొత్త సీట్ల సంగతి తేలేదెప్పుడో?
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్ ఇంజనీరింగ్ అదనపు సీట్లపై సస్పెన్స్ కొనసాగుతుండటంతో ఎంసెట్ రెండోదశ కౌన్సెలింగ్‌పై సాంకేతిక విద్యామండలి ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతోంది. మరోపక్క వచ్చేనెలాఖరులోగా ఇంజనీరింగ్ కాలేజీల్లో తరగతులు మొదలు పెట్టాలని అఖిలభారత విద్యామండలి పేర్కొంది. అయితే ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి అయితే తప్ప ఇది సాధ్యమయ్యే పరిస్థితిలేదు. వాస్తవానికి రెండోవిడత కౌన్సెలింగ్ ప్రక్రియను అక్టోబర్ మొదటివారంలోనే చేపట్టాలని అధికారులు తొలుత భావించారు. అయితే ఈలోగా కంప్యూటర్ సైన్స్ విభాగంలో కొత్త సీట్ల అనుమతిపై హైకోర్టు ప్రైవేటు కాలేజీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో మరో 3,500 సీట్లు పెరగవచ్చనే సంకేతాలు వెలువడ్డాయి. అదేవిధంగా ఇంకో 500 సీట్లను ఈడబ్ల్యూఎస్ కోటా కింద భర్తీ చేయాల్సి ఉం టుంది. అదేవిధంగా జేఈఈ ర్యాంకులను పరిగణ నలోనికి తీసుకోవాలని, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందేవారి వల్ల ఇక్కడ ఖాళీ అయ్యే సీట్లను భర్తీ చేయాలని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు. కన్వీనర్ కోటా కింద భర్తీ చేసే కొత్త సీట్ల ఫీజును ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల దాదాపు రూ.25 కోట్ల భారం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో రెండోదశ కౌన్సెలింగ్ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. కొత్త సీట్లు వస్తయో.. రావో.. తెలియకపోయినా వాటి కోసం కౌన్సెలింగ్ ఆపడం ఏమిటని ఉన్నత విద్యామండలి సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పెరిగే సీట్లకు ముందే బేరం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు పెరిగే సీట్లను ముందుగానే అమ్ముకుంటున్నాయి. హైకోర్టు తీర్పును చూపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రూ.లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తూ, సీటు రాని పక్షంలో తిరిగి ఇచ్చేస్తామని చెబుతున్నాయి. అయితే ఇన్ని లక్షలు చెల్లించి, తీరా సీటు రాకపోతే పరిస్థితి ఏమిటనే ఆందోళన తల్లిదండ్రుల్లో కన్పిస్తోంది. -
కంప్యూటర్ కోర్సులకే డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సులు హాట్ కేకుల్లా మారాయి. ఎంసెట్ మొదటి దశ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు ఎక్కువగా వీటినే ఎంచుకున్నారు. ఈ కోర్సుల్లో సీటు పొందిన వారిలో చాలా మంది సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 78,270 ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సీట్ల భర్తీకి ఉన్నత విద్యా మండలి తాజాగా తొలిదశ కౌన్సెలింగ్ నిర్వహించింది. అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షన్స్ ప్రకారం 61,169 సీట్లను కేటాయించింది. అయితే సీట్లు పొందిన అభ్యర్థుల సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు గురువారంతో ముగిసింది. మొత్తం 46,322 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్టు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఏఐ, డేటా సైన్స్‌కు పోటీ కొత్తగా ప్రవేశపెట్టిన కంప్యూటర్ సైన్స్ కృత్రిమ మేథ, కృత్రిమ మేథ మెకానికల్ లెర్నింగ్, డేటా సైన్స్ తదితర కోర్సుల కోసం పెద్ద ఎత్తున విద్యార్థులు పోటీ పడ్డారు. ఆప్షన్స్ ఇచ్చిన వారిలో 60 శాతం పైగా ఈ కోర్సులను ఎంచుకున్న వారే ఉన్నారు. ర్యాంకు ప్రకారం ఆయా కోర్సుల్లో సీట్లు దక్కించుకున్న వారు తిరిగి చూడకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. అయితే నచ్చిన కాలేజీలో సీటు రాని కొద్దిమంది రిపోర్టింగ్ చేయలేదు. వారంతా మెరుగైన కాలేజీ కోసం రెండో దశ కౌన్సెలింగ్‌కు సిద్ధమవుతున్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్సీ)లో 18,561 సీట్లు కేటాయిస్తే.. 13,942 మంది రిపోర్టింగ్ చేశారు. సైబర్ సెక్యూరిటీలో 1,634 సీట్లు ఉంటే, 1,192 మంది ప్రధాన కాలేజీల్లో సీట్లు ఖరారు చేసుకున్నారు. సివిల్‌లో 3,177 సీట్లు కేటాయిస్తే, 2,312 మంది, మెకానికల్‌లో 2,550 సీట్లకు 1,826 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. -
నల్లగొండ కుర్రాడికి మైక్రోసాఫ్ట్ ఆఫర్
రామగిరి (నల్లగొండ): బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అభ్యసిస్తున్న నల్లగొండ కుర్రాడు చింతరెడ్డి సాయి చరిత్రెడ్డికి సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చక్కని ఆఫర్ ఇచ్చింది. ఆఖరి సంవత్సరం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగా చరిత్‌రెడ్డి రూ.1.54 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాన్ని సాధించాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన చరిత్‌రెడ్డి 8వ తరగతి వరకు నల్లగొండలోని స్థానిక సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్లో, తరవాత ఇంటర్ వరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా 51వ ర్యాంకు సాధించి ఐఐటీ సీటు దక్కించుకున్నాడు. చరిత్ రెడ్డి తల్లిదండ్రుల స్వస్థలం మాడ్గులపల్లి మండలం ధర్మాపురం. తండ్రి సైదిరెడ్డి ఎంపీటీసీగా, తల్లి నాగసీత సర్పంచ్‌గా గతంలో పనిచేశారు. ప్రస్తుతం నల్లగొండలో ఉంటున్నారు. విశేషమేంటంటే తండ్రి సైదిరెడ్డి కూడా బీటెక్ చేశారు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయం బాట పట్టారు. తనయుల్లో పెద్దవాడైన సాయి చరిత్... తండ్రి ఆశయాలకు అనుగుణంగా చదివి మైక్రోసాఫ్ట్ ఆఫర్ దక్కించుకున్నాడు. కంప్యూటర్ సైన్స్ అంటే ఇష్టం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఎంపికయిన నేపథ్యంలో బుధవారం చరిత్‌రెడ్డి నల్లగొండకు చేరుకున్నాడు. తాజా ప్లేస్‌మెంట్స్‌లో మైక్రోసాఫ్ట్‌కు ఎంపికయిన ముగ్గురిలో దక్షిణాదికి చెందినది చరిత్‌రెడ్డి ఒక్కడే. క్యాంపస్‌లో ఓటీపీగా మైక్రోసాఫ్ట్‌లో పనిచేయడం, తద్వారా దాని ప్రాజెక్టుల్లో మంచి ప్రతిభ కనపర్చడం కూడా చరిత్‌కు ఆ సంస్థ నుంచి భారీ ఆఫర్ రావటానికి కారణమైంది. వాషింగ్టన్‌లోని రెడ్మండ్ క్యాంపస్‌లో జూలైలో విధుల్లో చేరాల్సి ఉందని ఈ సందర్భంగా చరిత్ చెప్పాడు. ‘‘నా సంతోషాన్ని మా అమ్మానాన్నలతో పంచుకుంటున్నా. నాకు చిన్నప్పటి నుంచీ కంప్యూటర్ సైన్స్ అంటే ఇష్టం దానికి తగ్గట్టే టీచర్ల మార్గదర్శకత్వంలో పక్కా ప్రణాళికతో చదివాను. అమ్మ సహకారం చాలా ఎక్కువ’’ అని వ్యాఖ్యానించాడు. చరిత్ తమ్ముడు అజిత్ రెడ్డి ప్రస్తుతం చైన్నె ఐఐటీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చాలా ఆనందంగా ఉంది: సైదిరెడ్డి, నాగసీత పిల్లలిద్దరూ చదువుల్లో చిన్నప్పటి నుంచీ ఫస్టే. ఇద్దరూ ఐఐటీ స్టూడెంట్స్ కావడం, పెద్ద కుమారుడు భారీ వేతన ప్యాకేజీతో ఉద్యోగం సాధించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. బాంబే ఐఐటీలో సీటు వచ్చినప్పుడే మంచి భవిష్యత్ ఉంటుందని ఊహించాం. -
దరఖాస్తు చేశారా?
నాగపూర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్సీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుకు చివరి తేది: మే 20 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో కన్సల్టెంట్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 27 ట్రిపుల్ ఐటీ -వడోదరలో ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో) ప్రవేశానికి దరఖాస్తుకు చివరి తేది: మే 27 సీఎస్ఐఆర్- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో గ్రూప్-3 (టెక్నికల్ ) పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: జూన్ 6