కొత్త సీట్ల సంగతి తేలేదెప్పుడో? | Computer Engineering Extra Seats Suspension In TS | Sakshi
Sakshi News home page

కొత్త సీట్ల సంగతి తేలేదెప్పుడో?

Published Thu, Oct 28 2021 4:29 AM | Last Updated on Thu, Oct 28 2021 4:30 AM

Computer Engineering Extra Seats Suspension In TS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ అదనపు సీట్లపై సస్పెన్స్‌ కొనసాగుతుండటంతో ఎంసెట్‌ రెండోదశ కౌన్సెలింగ్‌పై సాంకేతిక విద్యామండలి ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతోంది. మరోపక్క వచ్చేనెలాఖరులోగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో తరగతులు మొదలు పెట్టాలని అఖిలభారత విద్యామండలి పేర్కొంది. అయితే ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి అయితే తప్ప ఇది సాధ్యమయ్యే పరిస్థితిలేదు. వాస్తవానికి రెండోవిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియను అక్టోబర్‌ మొదటివారంలోనే చేపట్టాలని అధికారులు తొలుత భావించారు. అయితే ఈలోగా కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో కొత్త సీట్ల అనుమతిపై హైకోర్టు ప్రైవేటు కాలేజీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో మరో 3,500 సీట్లు పెరగవచ్చనే సంకేతాలు వెలువడ్డాయి.

అదేవిధంగా ఇంకో 500 సీట్లను ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద భర్తీ చేయాల్సి ఉం టుంది. అదేవిధంగా జేఈఈ ర్యాంకులను పరిగణ నలోనికి తీసుకోవాలని, జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లు పొందేవారి వల్ల ఇక్కడ ఖాళీ అయ్యే సీట్లను భర్తీ చేయాలని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు. కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేసే కొత్త సీట్ల ఫీజును ప్రభుత్వం రీయింబర్స్‌ చేయాల్సి ఉంటుంది.

దీనివల్ల దాదాపు రూ.25 కోట్ల భారం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో రెండోదశ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. కొత్త సీట్లు వస్తయో.. రావో.. తెలియకపోయినా వాటి కోసం కౌన్సెలింగ్‌ ఆపడం ఏమిటని ఉన్నత విద్యామండలి సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 

పెరిగే సీట్లకు ముందే బేరం
ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు పెరిగే సీట్లను ముందుగానే అమ్ముకుంటున్నాయి. హైకోర్టు తీర్పును చూపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రూ.లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తూ, సీటు రాని పక్షంలో తిరిగి ఇచ్చేస్తామని చెబుతున్నాయి. అయితే ఇన్ని లక్షలు చెల్లించి, తీరా సీటు రాకపోతే పరిస్థితి ఏమిటనే ఆందోళన తల్లిదండ్రుల్లో కన్పిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement